ఇవి సర్కారీ హత్యలు | These are government murders | Sakshi
Sakshi News home page

ఇవి సర్కారీ హత్యలు

Published Wed, Aug 29 2018 3:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

These are government murders - Sakshi

రామయ్య(ఫైల్‌), వండ్రమ్మ(ఫైల్‌)

ఆలూరు /కర్నూలు సిటీ: సక్రమంగా అమలు కాని రుణమాఫీ రైతుల ఉసురు తీసుకుంటోంది. రుణం మాఫీ అవుతుందని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న కర్షకులకు మనోవేదనే మిగుల్చుతూ బలవన్మరణాలకు పాల్పడేలా చేస్తోంది. విడతల వారీగా అరకొరగా చేస్తున్న రుణ మాఫీ వడ్డీలకు కూడా సరిపోవడంలేదు. అప్పునకు వడ్డీ పెరిగిపోగా బ్యాంకు నోటీసులు పంపడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబళబీడు గ్రామంలో మంగళవారం ఇలాంటి దుర్ఘటనే చోటుచేసుకుంది. రుణమాఫీ సక్రమంగా కాక బ్యాంకు అప్పు పేరుకుపోవడంతో గ్రామానికి చెందిన బోయ నెరణికి రామయ్య (63), అతని భార్య వండ్రమ్మ (58) బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామయ్యకు 3.75 ఎకరాల పొలం ఉంది. ఇందులో బోరు తవ్వించుకొని మిరప, పత్తి సాగు చేస్తున్నారు. పంటల సాగు నిమిత్తం 2011లో ఆలూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జాయింట్‌ అకౌంట్‌లో (ఖాతా నంబర్‌ 19059135974) రూ.81 వేలు అప్పుగా తీసుకున్నారు.వడ్డీతో కలిపి 2014 నాటికి రూ.1,12,955 అయింది.  

అర్హత రావడంతో మొదటి విడత రూ.27,219, రెండో విడత రూ.23,900, మూడో విడత రూ.25,101 మాఫీ అయింది. మిగతా రెండు విడతల్లో రూ. 41,831 రైతు ఖాతాలోకి జమ కావాల్సి ఉంది. అయితే పంట సాగుకోసం 2015 సెప్టెంబర్‌లో రైతు రామయ్య రూ.41,831 చెల్లించి రూ.1,23,000 అప్పును రెన్యువల్‌ చేయించుకున్నారు. నాలుగేళ్లుగా పంటలు పండకపోవడంతో అప్పు చెల్లించలేపోయారు. దీంతో  అప్పు వడ్డీతో కలిపి రూ.1,54,000 అయింది. ఈ నేపథ్యంలో అప్పు చెల్లించాలని ఆగస్టు 17వ తేదీన లాయర్‌ ద్వారా రైతు రామయ్యకు ఏపీజీబీ అధికారులు నోటీసు పంపారు. ఈ ఏడాది పంటలు పండకపోవడంతో రైతు చేతిలో చిల్లగవ్వ లేదు. బ్యాంకు అధికారులు ఇంటికి తాళాలు వేస్తారేమోననిని మనస్తాపం చెంది.. దంపతులిద్దరు సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగారు. మంగళవారం ఉదయం విషయాన్ని గమనించి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుల బాధతోనే తమ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారని కుమారులు తిమ్మప్ప, లేపాక్షి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్‌ ఐపీసీ 174 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ దస్తగిరి బాబు తెలిపారు. రైతు దంపతుల ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు.   

రైతు దంపతుల ఆత్మహత్యపై విచారణ 
రైతు దంపతుల ఆత్మహత్యపై డివిజనల్‌ స్థాయి కమిటీతో విచారణ చేయించామని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుణ మాఫీ కింద మూడు విడతలు రైతు బ్యాంక్‌ఖాతాకు జమ అయిందన్నారు. మిగిలిన రెండు విడతలు రావాల్సి ఉండగా వారు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ దృష్టికి తీసుకపోయి ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  

అవి బాబు హత్యలు  
– కర్నూల్‌ జిల్లా రైతు దంపతులకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి 
– వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి 
సాక్షి, విశాఖపట్నం: రైతు రుణమాఫీ అమలు కాక... బ్యాంకుల నుంచి నోటీసులొస్తుంటే ఆత్మాభిమానం చంపుకోలేక రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనేందుకు యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లా తుమ్మల గుంట గ్రామానికి చెందిన రైతు రామయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితి అద్దంపడుతోందన్నారు. ఇవి ఆత్మహత్యలు కావు.. బాబు చేసిన హత్యలని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యలేనన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరపున ఒక్కటే హామీ ఇస్తున్నాం.. ఆర్నెల్లు ఓపిక పట్టండి.. మనందరి ప్రభుత్వం వస్తుంది.. జగన్‌ నాయకత్వంలో రైతులకు మళ్లీ సువర్ణయుగం వస్తుందన్నారు. కర్నూలులో ఆత్మహత్యకు పాల్పడిన రామయ్య దంపతుల కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, అనకాపల్లి పార్లమెంటు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సుంకర రుద్రి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement