రైతు ఆత్మహత్యల్లో 70 శాతం కౌల్దార్లే!
⇒ రాష్ట్రంలో కౌలు రైతుల కుటుంబాలు 32 లక్షలు
⇒ మొత్తం రుణ అర్హత కార్డులు 6.01 లక్షలు
⇒ లోన్లు ఇచ్చింది మాత్రం 72 వేల మందికే
⇒ ఓ మంత్రి కుటుంబానికి 300 ఎల్‌ఈసీ కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో 70 శాతం మంది కౌల్దార్లేనని శనివారం విజయవాడలో జరిగిన కౌల్దార్ల రైతు సదస్సు ప్రకటించింది. బడా పారిశ్రామిక వేత్తలకు రు.1.20 లక్ష కోట్లను మాఫీ చేసిన పాలకులు కౌలు రైతులకు పంట రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కౌలు రైతుల ఆత్మహత్యలు, పంట రుణాలు, రుణ అర్హత కార్డుల జారీ వంటి అంశాలను చర్చించేందుకు రైతు స్వరాజ్య వేదిక, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతు సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు సి.భానుజా, పీఎస్ అజయ్‌కుమార్, విస్సా కిరణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు జమలయ్య, వీకే రంగారావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సింహాద్రి రమేష్ (వైఎస్సార్‌సీపీ రైతు సంఘం), కేశవరావు (ఏపీ రైతు సంఘం), రైతు నాయకుడు ఎర్నేని నాగేందర్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, జాయింట్ డైరెక్టర్ శ్రీధర్, సీసీఎల్‌ఏ (రెవెన్యూ, భూ పరిపాలన) అసిస్టెంట్ సెక్రటరీ రమాదేవి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలందరూ కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ ఆర్. రాధాకృష్ణ అధ్యక్షతన ఏర్పడిన ఏపీ వ్యవసాయ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో రైతు కుటుంబాలు 42.43 లక్షలు కాగా వీరిలో 32 లక్షల కుటుంబాలు కౌలు రైతు కుటుంబాలున్నాయి. 2016–17లో సుమారు 11 లక్షల మందికి రుణ అర్హత కార్డులు (ఎల్‌ఈసీ) ఇవ్వాల్సి ఉంటే 6.01 లక్షల మందికే ఇచ్చారు. వీరిలోనూ కేవలం 72,094 మందికి రు.182.6 కోట్ల రుణాలు ఇచ్చారు. మొత్తం పంట రుణాల్లో ఇది కేవలం 0.3 శాతమేనని వక్తలు తెలిపారు.
అధికారపార్టీ వారికే సాయమట!
అధికారపార్టీ వారికైతేనే సాయం చేస్తాం... ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ రైతులు చచ్చిపోయినా సాయం ఇవ్వబోమని వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయాధికారులు తెగేసి చెబుతున్నారని వివిధ జిల్లాల ప్రతినిధులు చెప్పారు. అనంతపురం జిల్లాలో బలవన్మరణాలకు పాల్పడిన 30 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం సాయం నిరాకరించినట్టు ఓ సంస్థ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. ఓడీ చెరువు మండలంలో ఓ మంత్రి కుటుంబానికి 470 ఎకరాల భూమి ఉంటే 300 ఎల్‌ఈసీ కార్డులు ఆ మంత్రి కుటుంబ సభ్యులు, బంధువులకు ఇచ్చారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి 170 క్లస్టర్లను గుర్తిస్తే వైఎస్సార్ కడప జిల్లాకు కేవలం 9 క్లస్టర్లు ఇచ్చారని ఓ రైతు తెలిపారు. పంట రుణాల వ్యవహారం 2జీ స్పెక్ట్రమ్ కన్నా పెద్ద కుంభకోణమని పలువురు వక్తలు విమర్శించారు. కౌలు రైతుల ఇక్కట్లను తీర్చేలా కార్యాచరణను అమలు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఏరైతు ఏ సర్వే నెంబర్‌లో పంట రుణం తీసుకున్నారో వెంటనే తెలిసిపోయేలా సీసీఎల్‌ఏతో కలిసి త్వరలో ఓ మొబైల్ యాప్‌ను రూపొందించనున్నట్టు చెప్పారు. త్వరలో కౌలు రైతులపై అధికారికంగా సదస్సు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.