సాక్షి, హైదరాబాద్: మునుపెన్నడూ లేనివిధంగా పొగాకు పండించే రైతు కూడా ఆత్మహత్య చేసుకునేంతగా రాష్ట్రంలో వ్యవసాయరంగం పరిస్థితులు దారుణంగా మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఒంగోలు ఎంపీ, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలే లేవని.. ఈ ఏడాది మాత్రం పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే పరిస్థితి లేక ఇప్పటికే నలుగురు రైతులు మృత్యువాత పడ్డారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్లే పొగాకు రైతులు ఇంతటి విపరీత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ‘‘రాష్ట్రంలో రైతులు గతేడాది 178 మిలియన్ టన్నుల పొగాకును పండించారు. ఏటా సెప్టెంబర్ నాటికి రైతులనుంచి పంట కొనుగోళ్లు పూర్తవడం ఆనవాయితీ.
కానీ ఈ ఏడాది ఇప్పటికి కేవలం 132 మిలియన్ టన్నుల పంటనే కొనుగోలు చేశారు. అధికారికంగా పండించిన లెక్కలప్రకారమే 40-50 మిలియన్ టన్నులు రైతులవద్ద ఉంది. అనధికారంగా పండించిన పంట మరికొంత ఉండొచ్చు. అయితే గిట్టుబాటు ధరకు కొనకపోయినా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, వ్యాపారులమధ్య జరిగిన ఒప్పందంలో నిర్ణయించిన ధరకు సైతం కొనడానికి వ్యాపారులు ముందుకు రావట్లేదు’’ అని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పొగాకుకు గిట్టుబాటుధర రాని పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలకు, రైతు సంఘాలకు రుణాలిచ్చి మంచిధరకు రైతులనుంచి పొగాకు కొనుగోలు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు.
పొగాకు బోర్డు చైర్మన్ వైఖరి దారుణం..: రైతులకు న్యాయం చేయడానికి ఏర్పాటు చేసిన పొగాకు బోర్డు చైర్మన్ రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిస్తూ తక్కువధరకు పంట అమ్ముకునేలా ప్రకటన చేస్తుండడం దారుణమని వైవీ అన్నారు. చైర్మన్ వైఖరిపై తాను ఆగస్టులో కేంద్రమంత్రికి లేఖరాసినా స్పందన లేదన్నారు.
పంటను కొనిపించాలి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కేంద్రమంత్రి సమక్షంలో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా తక్కువ గ్రేడ్ రకం పంటను కూడా కిలో రూ.62-67కు కొనుగోలు చేయించాలని వైవీ డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన, గుండెపోటుతో మర ణించిన పొగాకు రైతులకు రాష్ట్రప్రభుత్వం రూ.5 లక్షలు, పొగాకు బోర్డు మరో రూ.5 లక్షల పరిహారం అందజేయాలన్నారు.
రాష్ట్రంలో దారుణ పరిస్థితులు: వైవీ
Published Sun, Sep 13 2015 1:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement