ఒరిగిందేమీ లేదు 100 రోజులు పాలన | N. Chandrababu Naidu 100 days rule | Sakshi
Sakshi News home page

ఒరిగిందేమీ లేదు 100 రోజులు పాలన

Published Tue, Sep 16 2014 1:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

ఒరిగిందేమీ లేదు 100 రోజులు పాలన - Sakshi

ఒరిగిందేమీ లేదు 100 రోజులు పాలన

అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ‘మాయ’ చేశారు. జాబు కావాలంటే.. బాబు రావాలని ఎన్నికల ముందు తెలుగు తమ్ముళ్లు డాబుసరిగా ప్రచారం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలోని సుమారు 900 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపునకు రంగం సిద్ధంచేశారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాలు విడుదల చేయలేదు. పేదలకు అండగా ఉంటానని చెప్పారు. ఇందుకు విరుద్ధంగా ఆధార్ అనుసంధానం పేరుతో నిరుపేదలకు ఆసరాగా ఉన్న రేషన్‌కార్డులను తొలగిస్తున్నారు. ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇప్పటికే మొదలుపెట్టిన ఇళ్లకు బిల్లులు నిలిపివేశారు. బందరుపోర్టు నిర్మాణం.. గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి.. ఇలా ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఆయన అధికారంలోకి వచ్చి వంద రోజులవుతున్నా అమలుకు నోచుకోలేదు. కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు. దీంతో బాబు వంద రోజుల పాలనలో జిల్లాకు ఒరిగింది శూన్యమని ప్రజలు పెదవివిరుస్తున్నారు.
 
రుణమాఫీ బూటకమే..

ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి రావడానికి ముఖ్యకారణమైన రుణమాఫీ ప్రహసనంగా మారింది. ఎప్పటికి రుణాలు రద్దవుతాయో తెలియని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. డ్వాక్రా సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉంది. జిల్లాలో 6,29,086 మంది రైతులు రూ.9,137 కోట్ల మేర పంట రుణాలు బకాయి ఉన్నారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో రైతులు ఎవ్వరూ రుణాలు చెల్లించలేదు. కొంతకాలం రుణాలు రీషెడ్యూల్ చేస్తామని, అనంతరం రుణమాఫీ చేస్తామని చెబుతూ వస్తున్నారు. జిల్లాలో 1,89,587 మంది రైతులు రూ.2,352 కోట్ల వివిధ రుణాలు, 2,60,737 మంది రైతులు రూ.3,276 కోట్ల పంట రుణాలు, 45,914 మంది రైతులు రూ.650 కోట్ల షార్ట్‌టర్మ్ రుణాలు, 1,30,534 మంది రైతులు రూ.277 కోట్ల మధ్యంతర రుణాలు, 2,314 మంది రైతులు రూ.86కోట్ల ఇతర రుణాలు తీసుకున్నారు. రుణమాఫీకి  సంబంధించి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో జిల్లాకు చెందిన రైతులకు ఎంత మొత్తాన్ని రుణమాఫీ చేస్తారో తెలియని పరిస్థితి. రైతులకు ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షలు, ఒక్కో డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల  మేర రుణమాఫీ జరుగుతుందని చెబుతూ వస్తున్నారు. జిల్లాలో 56,808 డ్వాక్రా సంఘాలు ఉండగా, రూ.938 కోట్లుబకాయిలు ఉన్నాయి. ఒక్కో డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయలు అందజేస్తామని చెబుతూ ఈ నగదు రివాల్వింగ్ ఫండ్‌గానే జమ అవుతుందని చెప్పటం గమనార్హం.
    
ఖరీఫ్.. ఉఫ్..

జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా, సెప్టెంబరు వరకు కాలువలకు సాగునీరు విడుదల చేయలేదు. ఎగువన సాగునీటి ప్రాజెక్టులు నిండినా ముందుచూపులేని ప్రభుత్వం కృష్ణాడెల్టా రైతులకు సాగునీటిని విడుదల చేయటంలో తీవ్ర జాప్యం చేసింది. కాలువ శివారున ఉన్న కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి తదితర మండలాల్లో సెప్టెంబరులోనూ నారుమడులు పోసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. సెప్టెంబరులో వరినాట్లు పూర్తిచేస్తే పంటచేతికి వచ్చే నాటికి వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడులు తగ్గుతాని, రెండో పంట వేసుకునేందుకు సమయం చాలదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు జరగటం లేదు. 2002, 2003, 2004 వరుసగా సాగునీటి కొరతను ఎదుర్కొన్నామని, మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతోందని రైతులు ఆందోళనలో ఉన్నారు.
 
నత్తనడకన డెల్టా ఆధునికీకరణ
 
కృష్ణాడెల్టాకు సాగునీరు సరఫరా చేసేందుకు 150 సంవత్సరాల క్రితం బ్రిటీష్ పాలకులు తవ్విన కాలువల ద్వారానే నేటికీ సాగునీరు సరఫరా జరుగుతోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులను రూ.4,573 కోట్లతో ప్రారంభించారు.  ఈ పనులను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తే వరికోతలు పూర్తయిన తరువాత పనులు ప్రారంభించే   అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పనులు ప్రారంభించాలి.
 
రేషన్.. పరేషాన్..

జిల్లాలో 11,23,944 తెలుపురంగు రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 37,10,501 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకు 31,37,710 మందికి ఆధార్  కార్డుల సీడింగ్ పూర్తిచేసి 5,36,102మందిని అనర్హులుగా గుర్తించారు. ఈనెలాఖరుకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయితే మరికొంతమందిని అనర్హులుగా గుర్తించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకునేందుకు ఆధార్ సీడింగ్ పేరుతో రేషన్‌లో కోత విధిస్తోందనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బియ్యం, పంచదార, కిరోసిన్‌ను నామమాత్రంగా ఇస్తున్నారు.
 
మూడు నెలల్లో పోర్టు పనయ్యేనా..

 
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో బందరు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే వందరోజుల పాలన పూర్తయ్యింది. ఈ వ్యవధిలో బందరు పోర్టు నిర్మాణానికి కీలకమైన భూసేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోర్టు నిర్మాణానికి 5,324 ఎకరాలు అవసరమని గతంలోనే జీవో నంబరు 11 ద్వారా నిర్ధారించారు. రెండువేల ఎకరాలైనా కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ ప్రతినిధులు చెబుతుండగా, ఇంతవరకు ఆ సంస్థతో ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు జరపకపోవటం గమనించదగ్గ అంశం. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆరు నెలల వ్యవధిలో మూడు నెలలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో మూడు నెలల వ్యవధిలోలప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, సాగదీత ధోరణితో వ్యవహరిస్తుందా.. అన్నది వేచి చూడాల్సిందే.
 
విల‘పింఛన్’లు..

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడు నెలల్లో ఒకటో తేదీన పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అక్టోబరు 2 నుంచి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. వికలాంగులకు రూ.1,500కు పెంచుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, 80 శాతం కన్నా మించి వైకల్యం ఉంటేనే నెలకు రూ.1,500 పెన్షన్‌కు అర్హులని మెలిక పెట్టారు. దీంతో ఎంతమంది వికలాంగులకు రూ.1,500 ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పింఛనుదారులకు ఆధార్ సీడింగ్ పేరుతో కొన్ని పేర్లను తొలగిస్తున్నారు. అక్టోబరు నుంచి ఎంతమందికి పింఛన్లు నిలిచిపోతాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 3,32,836 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి.
 
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏమైంది..?
 
జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 8,609 మంది విద్యార్థులకు రూ.2.13 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా 4,564 మంది విద్యార్థులకు రూ.11.34 కోట్లు, ఈబీసీ విద్యార్థులకు 6,559 మందికి రూ.19.42 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 31,029 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో రూ.46.07 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.37.70 కోట్లు గత ఏడాది ఖర్చు చేశారు. ఈ ఏడాది స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల జరుగుతుందా, లేదా అన్న అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి.
 
వ్యవసాయానికి కరెంట్ షాక్

జిల్లావ్యాప్తంగా దాదాపు 70వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ సరఫరాను సక్రమంగా చేస్తామని హామీ ఇచ్చినా అమలు జరగట్లేదు. 5 గంటలు కూడా వ్యవసాయ విద్యుత్ సరఫరా జరగట్లేదు. దీంతో అర్థరాత్రి, అపరాత్రి విద్యుత్ సరఫరా చేస్తుండటంతో జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాలను విద్యుత్ మోటార్ల ద్వారా సాగు చేస్తూ రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇటీవల వరకు గృహ విద్యుత్‌తో పాటు వ్యవసాయానికీ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించిన పాలకులు ఈ హామీ నుంచి వ్యవసాయ విద్యుత్‌ను మినహాయించినట్లు ప్రకటించటం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement