ఏది న్యాయం?
► రుణమాఫీ, పింఛన్లపై నిరసనలు పట్టని టీడీపీ
►భూములు అమ్మేసిన రైతుల్ని రెచ్చగొట్టి ఆందోళనలు
►హెరిటేజ్, ‘రామోజీ’ భూముల్ని వెనక్కిచ్చేస్తారా?
►విపక్ష నేతనే టార్గెట్ చేసుకుని కదులుతున్న తీరు
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఒకవైపు కోస్తా జిల్లాల్ని తుపాను భయపెడుతోంది. మరోవైపు నాలుగు నెలలు గడిచినా అతీగతీ లేని రుణమాఫీ కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కుతున్నారు. గతనెల వరకూ అందించిన పింఛన్లు ఉన్నట్టుండి ఆగిపోవటంతో వితంతువులు, వృద్ధులు గ్రామసభల్లో నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుండగా వీటన్నిటి నుంచీ జనాన్ని పక్కదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ కొత్త డ్రామాలు మొదలెట్టింది. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష నేతను లక్ష్యంగా చేసుకుని ఆయన కుటుంబీకులకు చెందిన ‘సరస్వతీ సిమెంట్స్’ను వేధిస్తోంది. ఆరేడేళ్ల కిందట ఈ సిమెంట్స్‌కు భూములు విక్రయించిన రైతుల్ని రెచ్చగొట్టి, సంస్థ ఇప్పటిదాకా ప్లాంటు పెట్టలేదు కాబట్టి ఆ భూముల్ని తిరిగి రైతులకిచ్చేయాలంటూ ఆందోళనలు చేయిస్తోంది.
సంస్థకు 2009లో ఇచ్చిన సున్నపురాయి గనుల లీజును కూడా రద్దు చేసింది. అసలు ప్లాంటు పెట్టాలంటే అనుమతులుండాలి కదా? వాటి కోసం ఐదేళ్ల కిందట చేసిన దరఖాస్తుల్ని ఇప్పటికీ పరిష్కరించకుండా, నీటి వసతి కోసం పెట్టిన దరఖాస్తును నేరుగా సీఎం కార్యాలయంలోనే అట్టిపెట్టుకుని... మరోవైపు ప్లాంటు పెట్టలేదు కాబట్టి లీజు రద్దు చేశామనటాన్ని ఏమనుకోవాలి? ప్లాంటు రాలేదు కనుక కొనుగోలు చేసిన భూముల్ని రైతులకిచ్చేయాలని చేస్తున్న డిమాండ్లను ఏమనుకోవాలి?
ఫిలిం సిటీ కోసం రామోజీరావు ఎకరాకు లక్షకు మించి ఎక్కడా వెచ్చించలేదు.
మరిపుడు ఆయన భవనాలు నిర్మించిన ఐదారు ఎకరాల్ని వదిలేసి మిగిలిన 1900 పైచిలుకు ఎకరాలనూ తిరిగి రైతులకిచ్చేయాలని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయటం లేదు? తన హెరిటేజ్ సంస్థ కోసం కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల్ని తిరిగి రైతులకు ఎందుకు అప్పగించటం లేదు? సిమెంట్ కంపెనీ కోసమని కొనుగోలు చేసి నిరుపయోగంగా వదిలిపెట్టిన టీడీపీ నేత జేసీ దివాకరరెడ్డి భూములపై ఎందుకు రాద్ధాంతం చేయటం లేదు?సరస్వతీ సిమెంట్స్ సమీపంలోనే సంఘీ సంస్థ సేకరించిన 2000 పైచిలుకు ఎకరాల్లో గానీ, గుజరాత్ అంబుజా, ఆంధ్రా సిమెంట్స్ సంస్థలు సేకరించిన భూముల్లో ఇప్పటిదాకా పనులు మొదలుపెట్టలేదే! వాటిని వెనక్కి ఇచ్చేయాలని ఎందుకు ధర్నాలు చేయించటం లేదు? లీజుల్ని ఎందుకు రద్దు చేయలేదు? మరీ ఇంత దిగజారుడు వ్యవహారమా? ఒకవైపు రుణమాఫీ చేయనందుకు రైతులకు మొహం చూపించలేని పరిస్థితుల్లో ఉన్న బాబు... రైతులకు న్యాయం చేస్తామంటూ తమ వర్గానికి చెందిన కొందరిని జగన్‌మోహన్‌రెడ్డిపైకి రెచ్చగొడుతుండటాన్ని ఏమనుకోవాలి?
కొనుగోలు చేసిందీ అధిక ధరకే...
నిజానికి 2008. 2009లో సరస్వతీ సిమెంట్స్ రైతుల నుంచి భూములు కొన్నపుడు గుంటూరు జిల్లా తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో ధర ఎకరాకు రకాన్ని బట్టి రూ.1-3 లక్షల మధ్య ఉంది. రైతులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో సరస్వతీ సంస్థ ఎకరాకు కనిష్టంగా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.8.5 ల క్షలు చెల్లించింది. అందుకేఒక్క రైతు కూడా తనకు అన్యాయం జరిగిందనలేదు. ఇపుడు టీడీపీకి చెందిన వారిని రెచ్చగొట్టి ఆ భూముల్లో ఘర్షణలకు దిగుతూ... అడ్డుకున్న సరస్వతీ సంస్థ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం ప్రభుత్వ పెద్దలే పెట్టిస్తున్నారంటే ఏమనుకోవాలి? ఎందుకీ దిగజారుడు రాజకీయాలు?
ప్రజా సమస్యలొదిలి ఇదేం రాద్ధాంతం?
Published Sun, Oct 12 2014 1:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement