ఇదేనా రుణమాఫీ! | That waiver of the debt! | Sakshi
Sakshi News home page

ఇదేనా రుణమాఫీ!

Published Fri, Aug 8 2014 12:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

ఇదేనా రుణమాఫీ! - Sakshi

ఇదేనా రుణమాఫీ!

  • అప్పుల ఊబిలో అన్నదాతలు
  •  రోజు రోజుకూ పెరుగుతున్న వడ్డీ భారం
  •  రీషెడ్యూల్ విషయంలో మభ్యపెడుతున్న ప్రభుత్వం
  •  ప్రజల ఆగ్రహం
  • తాంబూలాలిచ్చేశాం.. తన్నుకుచావండి అన్నట్టుంది ప్రభుత్వం పరిస్థితి. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించేసి చేతులు దులుపు కుంది. ప్రకటనొచ్చి నెల రోజులు గడిచినా ఏ ఒక్కరి రుణమూ మాఫీ కాలేదు. కొత్త రుణాలకు అన్నదాతలు నోచుకోకపోగా వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి పెంచారు. నోటీసుల జారీతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు జిల్లాకు వస్తున్న సీఎంను నిలదీసేందుకు రైతులు, మహిళలు సిద్ధమవుతున్నారు.
     
    విశాఖ రూరల్/ చోడవరం: రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోగా రోజుకో తప్పుడు ప్రకటనతో రైతులను వంచించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ మాటలు నమ్మిన రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. రుణాల రీషెడ్యూల్ కూడా జరగలేదు. ఫలితంగా రైతులు ప్రైవేటు ఫైనాన్షియర్ల నుంచి అధిక వడ్డీకి అప్పులు చేసి ఖరీఫ్ పంటలకు మదుపులు పెడుతున్నారు. ప్రకృతి కూడా సహకరించకపోవడంతో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.
     
    అనేక అనుమానాలు
     
    జిల్లాలో గతేడాది అన్ని రకాల పంటలకు కలిపి రూ.1040 కోట్లు మేరకు రుణాలు ఇచ్చారు. గత ఖరీఫ్‌లో 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు అందజేశారు. రబీలో 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు రుణాలు మంజూరు చేశారు. గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హతకార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లలు మాత్రమే పంట రుణాలు కింద ఇచ్చారు. పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. అలాగే లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు. వీటితో పాటు రూ.150 కోట్లు వరకు బంగారంపై రుణాలు అందించారు. రుణా మాఫీ మొత్తంగా రూ.1040 కోట్లు కూడా రద్దవుతాయని రైతులు భావించారు. కాని మాఫీ కాకపోగా వాటిపై వడ్డీ భారాన్ని మోయాల్సిన పరిస్థితి నెలకొంది.
     
    డ్వాక్రా రుణాల పరిస్థితి అంతే
     
    జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లు ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో 18,500 మహిళా స్వయం సహాయ సంఘాలు రూ.260 కోట్లు మేర చెల్లించాల్సి ఉంది.  గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ పరిధిలో 37,634 మహిళా సంఘాలు రూ.593 కోట్లు బ్యాంకులకు బకాయి పడ్డాయి. ఇందులో లక్షలోపు రుణాలు పొందిన సంఘాలు కేవలం 9758 మాత్రమే ఉన్నాయి. మిగిలిన సంఘాలు మాత్రం రుణాలు చెల్లించాల్సి ఉంటుంది.

    తాజాగా కేవలం లక్షలోపు రుణం తీసుకున్న సంఘానికే రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడంతో మిగిలిన సంఘాలు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పాత రుణాలు చెల్లించేంత వరకు కొత్త రుణాలు మంజూరు చేసేది లేదని తేల్చి చెప్పాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా రుణాల కింద 3 వేల సంఘాలకు రూ.580 కోట్లు అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. వాస్తవానికి జూలై నెలాఖరు నాటికే రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ.30 కోట్లు మాత్రమే రుణాలు అందించారు.
     
    సీఎం స్పష్టత ఇవ్వాలి
    నాది బుచ్చెయ్యపేట మండలం. 2011లో భార్య నగలు తాకట్టు పెట్టి రాజాం బ్యాం కులో రూ. 35వేలు రుణం తీసుకున్నాను. లోన్ నంబరు 15938 4200 9672తో అసలు, వడ్డీ రూ.44, 356 కట్టాలని నోటీసు పంపారు.  రుణాలు మా ఫీ చేశామని సీఎం చెబుతున్నప్పటికీ  బ్యాం కులు నోటీసులు ఇవ్వడం ఏమిటో.
     - పోతి లక్ష్మణరావు
     
    అంతా అయోమయం
    నాది బుచ్చెయ్యపేట మండలం రాజాం.  మూడు ఎకరాల పొలం ఉంది. 2013లో రాజాం కెనరా బ్యాంకులో రూ.50 వేలు అప్పు తీసుకున్నాను. లోన్ కట్టాలని బ్యాంకు అధికారులు నోటీసు పంపారు. ఎన్నికలు ముందు నుంచి రుణాలు చెల్లించద్దని టీడీపీవారు చెప్పడంతో రుణం చెల్లించలేదు.  
     -కంఠంరెడ్డి శ్రీను
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement