బాబు మాట..ముళ్లబాట
‘నేను గద్దెనెక్కాక రద్దు చేసేస్తా.. రుణాలు కట్టకండి’ టీడీపీఅధినేత చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళల చెవినిల్లు కట్టుకుని ఊదరగొట్టిన వాగ్దానమిది. తొలి సంతకమే రుణమాఫీపై అని ప్రగల్భించిన ఆయన.. అధికారం చేపట్టి రెండునెలలు దాటినా..ఇచ్చిన మాటను ఇచ్చినట్టు అమలు చేయకుండా అయోమయాన్ని సృష్టించి, సాగదీశారు. ఇంతలో.. రుణాలపై వడ్డీ రాయితీ గడువు గురువారంతో ముగిసిపోయింది. ‘మబ్బును చూసి ముంతలో నీరు ఒలకబోసుకున్న’ వారి చందమైంది ఇప్పుడు అన్నదాతలు, ఆడపడుచుల పరిస్థితి.
సాక్షి, కాకినాడ :టీడీపీ అధినేత చంద్రబాబు మాటను పట్టుకుని రుణాలు చెల్లించకపోవడం ఇప్పుడు తమ పుట్టి ముంచిందని అన్నదాతలు, డ్వాక్రా మహిళలు గగ్గోలు పెడుతున్నారు. రుణ విముక్తులమవుతామన్న వారి ఆశలు ఆవిరైపోగా ఇప్పుడు.. వడ్డీ రాయితీ కోల్పోవడంతో భారం తడిసిమోపెడవుతోందని వాపోతున్నారు. మాఫీని నమ్మిన పాపానికి జిల్లాలో 2 లక్షల మంది రైతులతో పాటు 74 వేల డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ ఏడాది వడ్డీ రాయితీని కోల్పోవడమే కాక బకాయి పడ్డ రుణాలను 14 శాతం వడ్డీతో చెల్లించాల్సిన దుస్థితిలో చిక్కుకున్నారు.ఏదైనా పంటకాలంలో తీసుకున్న రుణాన్ని ఏడాది లోపు చెల్లిస్తే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. రూ.లక్ష లోపు వడ్డీ లేని రుణంగా పొందవచ్చు.
ఆ తర్వాత మరో రెండు లక్షల వరకు పావలా వడ్డీ వర్తిస్తుంది. వీటిని ఏడాదిలోగా చెల్లిస్తే వడ్డీ రాయితీని తిరిగి పొందవచ్చు. అంటే గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతు గరిష్టంగా రూ.50 వేల వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. స్వల్పకాలిక పంటరుణాలుగా నిర్దేశించిన లక్ష్యంలో 60 శాతం రుణాలను ఖరీఫ్‌లో, 40 శాతం రుణాలను రబీలో మంజూరు చేస్తుంటారు. జిల్లాలో 2013 ఖరీఫ్‌లో రూ.2,850 కోట్లు, రబీలో రూ.1,950కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా ఖరీఫ్‌లో 2.90 లక్షల మంది రైతులకు రూ.2,950 కోట్లు, రబీలో 2.50 లక్షల మందికి రూ.2,055 కోట్ల రుణాలందజేశారు.
చివరికిలా ముంచేశారు..
ఖరీఫ్ లక్ష్యంలో 85 శాతానికి (సుమారు రూ.2400 కోట్లు) పైగా రుణాలను గతేడాది జూన్/జూలై నెలల్లోనే మంజూరు చేశారు. ఈ రుణాలను 2014 జూన్/జూలై నెలాఖరులోగా చెల్లిస్తేనే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. సాధారణంగా 80 శాతం మంది రైతులు నిర్ణీత గడువులోగానే రుణాలు చెల్లిస్తుంటారు. అయితే చంద్రబాబు రుణమాఫీ వాగ్దానంతో రైతులు, మహిళలు గత ఆరేడు నెలలుగా రుణబకాయిలు చెల్లించడం మానేశారు. కానీ గద్దెనెక్కాక నైజాన్ని బయటపెట్టుకున్న చంద్రబాబు మాఫీపై గందరగోళం నెలకొనేలా చేశారు. కొత్త రుణాలు కావాలన్నా, వడ్డీ రాయితీ పొందాలన్నా.. జూలై 31లోగా పాత రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల ద్వారా నోటీసులు జారీ చేయించారు. ఒకేసారి బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించాల్సి రావడంతో రైతులు దిక్కులు చూశారు. అయినా గత వారం రోజులుగా తీవ్ర ఒత్తిడికి గురిచేసి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి రూ.200 కోట్లకు పైగా ముక్కుపిండి వసూలు చేశారు.
గత ఖరీఫ్‌లో జూలై నెలాఖరులోగా తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాల్లో వసూలైన మొత్తం మినహాయిస్తే ఇంకా సుమారు రూ.2,200 కోట్ల వరకు బకాయి ఉంది. దీన్ని సకాలంలో చెల్లించకపోవడం వలన వడ్డీ లేని రుణంగా పొందాల్సిన రూ.150 కోట్లు, పావలా వడ్డీ కింద మరో రూ.150 కోట్ల రాయితీని రైతులు కోల్పోతున్నారు. అంతే కాక ఆ రుణాల్ని 14 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉండడంతో మరో రూ.280 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఇక జిల్లాలో 74 వేల డ్వాక్రా సంఘాలకు రూ.1343 కోట్ల బకాయిలుంటే వాటిలో గతేడాది మంజూరు చేసిన రుణాలు రూ.958 కోట్ల వరకు ఉన్నాయి. గత ఆర్నెళ్లుగా నెలవారీ వాయిదాలు నిలిచిపోవడంతో ఆ మేరకు ప్రతి నెలా రావలసిన రూ.9 కోట్ల మేర వడ్డీ రాయితీ నిలిచిపోయింది. అంటే రూ.60 కోట్లకు పైగా వడ్డీ రాయితీని ఆయా సంఘాలు కోల్పోయాయి. అదే రీతిలో 14 శాతం వడ్డీ చొప్పున మరో వంద కోట్ల వరకు భారం మోయాల్సి వస్తోంది. మొత్తం మీద బాబు మాట.. రైతులను, డ్వాక్రా మహిళలను ‘ముళ్లబాట’లోకి నెట్టింది.
ఈ భారం బాబు పుణ్యమే..
ఎన్నికల ముందు రుణాలు కట్టొద్దన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై రోజుకో ప్రకటన చేస్తూ రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వడ్డీరాయితీ కోల్పోవడానికి నూరు శాతం చంద్రబాబే కారణం. ఆయన నాన్పుడుతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.
- జలగం కుమారస్వామి,
బీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రైతులు ఏమైనా అయితే బాధ్యత బాబుదే..
బాబు మాటను నమ్మినందుకు వడ్డీ రాయితీని కోల్పోవడమే కాక 14 శాతం వడ్డీతో చెల్లించాల్సి వస్తుంది. మాఫీ వర్తించినా ఈ భారం రైతులు భరించలేనిది. అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందుకు బాధ్యత చంద్రబాబుదే.
- ఉప్పుగంటి భాస్కరరావు,
రైతు సంఘ జిల్లా నాయకుడు, బండార్లంక
ఇదెక్కడి అన్యాయం?
మా సంఘం రూ.5 లక్షల రుణం తీసుకుంది. ఇంకా రూ.2.75 లక్షలు చెల్లించాలి. మాఫీ ఆశతో నాలుగు నెలలుగా చెల్లించలేదు. జూలై నెలాఖరులోగా చెల్లిస్తేనే వడ్డీ రాయితీ వర్తిస్తుందని మభ్యపెట్టినా చెల్లించలేకపోయాం. ఇప్పుడు రాయితీ వర్తించదంటున్నారు. ఇదేం అన్యాయం?
- ఆర్‌వీ లక్ష్మి, శ్రీనివాస్ స్వయం
సహాయక సంఘం అధ్యక్షురాలు, పెదపూడి