రుణ మాఫీ చేసితీరుతాం: అయ్యన్న
- మండలానికి 5 పంచాయతీల్లో మినరల్ వాటర్ పథకం
- ఉత్తరాంధ్రలో మూడు పంచాయతీలకొక డంపింగ్‌యార్డు
- ‘ఉపాధి హామీ’ పథకం వ్యవసాయంతో అనుసంధానిస్తాం
కోటవురట్ల : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి తీరుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. జల్లూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆదివారం హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణ మాఫీ కోసం విధివిధానాలను రూపొందిస్తున్నామని, మాఫీ జరగదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మినరల్ వాటర్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మొదటగా రాష్ట్రంలో 5 వేల పంచాయతీల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
మండలానికి ఐదు పంచాయతీల చొప్పున అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఇందుకు ప్రధాని మోడీ సెంట్రల్ పవర్‌స్టేషన్ నుంచి విద్యుత్ అందించడానికి అంగీకరించారని చెప్పారు. పారిశుధ్యం కోసం రాష్ట్రానికి రూ. 1,800 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని, దీంతో ఉత్తరాంధ్రలో ప్రతీ మూడు పంచాయతీలకు కలిపి ఐదెకరాల విస్తీర్ణంలో ఒక డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామని వివరించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తయారు చేయడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయనున్నట్టు చెప్పా రు. దీని ద్వారా ఏటా రైతులకు రూ. 6 వేలు ల బ్ధి చేకూరుతుందన్నారు. సామాజిక తనిఖీల్లో అవినీతి అక్రమాలు రుజువైన వీఆర్పీలను తొలగించి, కొత్తవారిని తీసుకుం టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, నాయకులు లాలం కాశీనాయుడు, పినపాత్రు ని బాబ్జీ, లాలం కొండబాబు, జనార్ధన్ పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ...
పాయకరావుపేట : గ్రామ పంచాయతీల్లో పరిపాలన పూర్తిస్థాయిలో జరిగేందుకు వీలుగా కార్యదర్శి పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2వేల కోట్లు స్థానిక సంస్థలకు విడుదలవుతున్నాయని చెప్పారు. నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆయన తుని రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు రూ. 200 కోట్లతో నీటివనరులను మెరుగుపర్చుతామని చెప్పారు.