రుణమాఫీపై మాట తప్పుతారా..?
ఏపీ ప్రభుత్వంపై డ్వాక్రా మహిళల ఆగ్రహం
గుత్తి/బుక్కపట్నం: షరతులు లేని రుణ మాఫీ కోసం డ్వాక్రా మహిళలు సోమవారం ‘అనంత’లో ఉద్యమించారు. ఊబిచెర్లలోని 28 స్వయం సహా యక సంఘాల (డ్వాక్రా) మహిళలు గుత్తిలోని సిండికేట్ బ్యాంకును ముట్టడించారు. అనంతరం గాంధీ సర్కిల్‌లో రాస్తారోకో చేశారు. అక్కడి నుంచి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. రుణమాఫీ అమలు చేయకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ జానకంపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు బుక్కపట్నం మండల కేంద్రంలో ర్యాలీ గా వెళ్లి ఐకేపీ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. మహిళలు మాట్లాడుతూ రుణమాఫీ అవుతుందన్న నమ్మకంతో ఐదారు నెలలుగా కంతులు చెల్లించలేదన్నారు. ఇప్పుడేమో బకాయిలు చెల్లించాలని బ్యాంకు, ఐకేపీ అధికారులు హుకుం జారీ చేస్తున్నారన్నారు. ఒత్తిడికి గురి చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎన్నికల హామీని నెరవేర్చాలి
మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు, నగరం గ్రామాలకు చెందిన 40 డ్వాక్రా గ్రూపులకు చెందిన దాదాపు 300 మంది మహిళలు సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. వీరిలో టీడీపీ వారు కూడా ఉండడం గమనార్హం. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీడీఓ ధనలక్ష్మీదేవికి వినతిపత్రం ఇచ్చారు. టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు మొల్లేటి పార్వతి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మొల్లేటి అలివేలు మంగతో పాటు కంచి విజయలక్ష్మి, గుబ్బల వరలక్ష్మి, జక్కంపూడి శాంతమ్మ, కంచి లక్ష్మీకుమారి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఏజెన్సీలోని రాజవొమ్మంగిలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూడా మహిళలు రుణమాఫీ అమలు చేయాలని ధర్నా నిర్వహించారు.