హామీ మేరకే రుణాలు మాఫీ
- మంత్రి కొల్లు రవీంద్ర
కోనేరుసెంటర్ (సుల్తానగరం) : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేశారని రాష్ట్ర బీసీసంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం మండల పరిధిలోని సుల్తానగరంలో రైతులు, డ్వాక్రా మహిళలతో ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబానికి రూ. 1లక్షా50వేలతో పాటు డ్వాక్రా గ్రూపులకు లక్ష రూపాయల రుణాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారని చెప్పారు. నూతన రాజధాని విషయంలో ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.
216 జాతీయ రహదారి నాలుగు లైన్లు అభివృద్ధి, మచిలీపట్నం - రేపల్లె రైలు మార్గం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బందరు పోర్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి పోర్టును అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, గ్రంథాలయ మాజీచైర్మన్ గొర్రిపాటి గోపీచంద్, గ్రామ సర్పంచి మట్టా వెంకటదాసు, ఎంపీటీసీ మురాల దేవి, మండల పార్టీ అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పాల్గొన్నారు.
మోడల్‌గా గిలకలదిండి ఫిషింగ్ హార్బర్...
గిలకలదిండి ఫిషింగ్ హార్బర్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్‌ను ఆయన సందర్శించారు. కోల్డు స్టోరేజి తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం మత్స్యశాఖ, పోర్టు అధికారులు, బోటు యజమానులు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అత్యధికంగా విదేశీ మారకద్రవ్యం మత్స్యరంగంలోనే లభిస్తుందన్నారు.
హార్బర్‌లో ఎంపెడా ఆధ్వర్యంలో రూ. 60 లక్షల నిధులతో ఐస్‌ప్లాంట్ ఏర్పాటు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల్లో దీనిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపెడా అధికారి హనుమంతరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం,బోటు యజమానుల సంఘం అధ్యక్షుడు తమ్ము ఏడుకొండలు, మత్స్యశాఖ ఏడి సురేష్, మునిసిపల్‌చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ పాల్గొన్నారు.
డ్వాక్రా మహిళలను మోసం చేశారు....
డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇవ్వటంతో తాము రుణాలు చెల్లించలేదని అయితే డ్వాక్రాగ్రూపునకు లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వటంతో తమపై అదనపు భారం పడుతోందని పలువురు డ్వాక్రా మహిళలు మంత్రి కొల్లు రవీంద్ర వద్ద వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోకున్నా డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయల వరకు రుణం రద్దయ్యేలా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారని మంత్రి వివరించారు.