Kollam Ravindra
-
చేనేతల రుణమాఫీకి రూ.110 కోట్లు
రాష్ట్రంలో చేనేత కార్మికుల రుణమాఫీ కోసం వచ్చేనెలలో రూ.110 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో గురువారం ఉదయం ఆయన చేనేత, జౌళి శాఖ రాష్ట్ర కమిషనరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆప్కో కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చేనేత కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు మంగళగిరిలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
సంస్థానాల విలీనం ‘ఉక్కు’ సంకల్పం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా పటేల్ జయంతి భారీ ర్యాలీ పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కోనేరుసెంటర్(మచిలీపట్నం) : స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 554 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయించడంలో ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్‌పటేల్ ప్రధాన పాత్ర పోషించారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత గట్టాలను విద్యార్థులంతా తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆయన సూచించారు. సర్ధార్ వల్లభాయ్‌పటేల్ జయంతిని శుక్రవారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీలో బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జి.విజయ్‌కుమార్, ఏజేసీ బిఎల్.చెన్నకేశవులు, డీఆర్వో ప్రభావతి, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక లక్ష్మీటాకీస్సెంటర్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వల్లభాయ్‌పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి రవీంద్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పటేల్ జయంతిని ప్రధాని నరేంద్రమోడి రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా పాటించాలని నిర్ణయించడం ప్రశంసనీయమన్నారు. ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పటేల్ ఆనాటి ప్రధాని నెహ్రూ మంత్రివర్గంలో హోంమంత్రిగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన కారణంగా నేడు భారతదేశం శాంతిసామరస్యాలతో విరాజిల్లుతుందని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ మన రాష్ట్రంలో నిజాం ప్రభుత్వ ఆగడాలను అరికట్టి సైన్యాన్ని దింపి సంస్థానాలకు విలీనం చేయడంలో పటేల్ చేసిన సాహసం మాటలతో కొనియాడలేనిదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో పి.సాయిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బందరు డీఎస్పీ డాక్టర్ కెవి.శ్రీనివాసరావు, తహశీల్ధార్ బి.నారదముని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 4,000మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడలో రన్ ఫర్ యూనిటీ.... విజయవాడ : దేశ ఐక్యతా దిశగా కృషి చేసిన వ్యక్తిగా దేశ ప్రథమ ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. బెంజిసర్కిల్ వద్ద ఈ పరుగును డాక్టర్ కామినేని శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించగా, మూడు వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల, జాయింట్ కలెక్టర్ జె.మురళి, సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ప్రముఖులు తుర్లపాటి కుటుంబరావు, ఎంసీదాస్, డీఎస్డీవో రామకృష్ణతో పాటు, నలందా, బిషప్ అజరయ్య, మాంటిస్సోరి, నిర్మలా కాన్వెంట్, గౌతమ్ డిగ్రీ కళాశాలల విద్యార్ధులు హాజరయ్యారు. -
వాడీవేడిగా జెడ్పీ సమావేశం
ఎజెండా పత్రాలు ఇవ్వకపోవడంపై సభ్యుల ఆగ్రహం మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రులు ప్రొటోకాల్‌పై నిలదీసిన వైఎస్సార్ సీపీ ప్రతినిధులు మచిలీపట్నం : జిల్లా పరిషత్ అత్యవసర సర్వసభ్య సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు. కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో పాల్గొనాలని మంత్రి దేవినేని ఉమా సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సమావేశంలో కొద్దిసేపు ప్రసంగించి వెళ్లిపోయారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తమను మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ఏ హక్కుతో హాజరవుతున్నారంటూ కొన్ని మండలాల్లో ప్రశ్నిస్తున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీలు, మంత్రుల పర్యటనల వివరాలు తమకు తెలియజేయకుండానే ముగిస్తున్నారని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ చేసినట్లు చెబుతున్నారని, ఎంతమందికి చేశారు.. ఎంత మొత్తం చేశారు.. నియోజకవర్గాల వారీగా జాబితాలు ఉన్నాయా.. లేవా.. ఈ విషయంపై కలెక్టర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు. జిల్లాలో బెల్టుషాపులు యథావిధిగా కొనసాగుతున్నాయని, మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఇస్తున్నారని, వీటిని రద్దు చేస్తారా, లేదా.. అని కల్పన నిలదీశారు. అనంతరం గూడూరు మండల పరిషత్ సమావేశంలో వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచిలు, ఎంపీటీసీ సభ్యులను మాట్లాడొద్దని అధికారులే హుకుం జారీ చేస్తున్నారని, ఈ పద్ధతిలో మార్పు రావాలని ఆ పార్టీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అజెండా కాపీలు అందలేదు.. జిల్లా పరిషత్ సమావేశం జరుగుతున్నా ఇంతవరకు సభ్యులకు ఎజెండా కాపీలను ఇవ్వలేదని, తాము ఏ అంశాలపై చర్చించాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించకూడదనే ఈ తరహాగా వ్యవహరిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. సామాజిక పింఛన్ల పంపిణీలోనూ ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో రుణాలు మంజూరు చేసేందుకు అన్ని అనుమతులు ఇచ్చిన లబ్ధిదారులకు కాకుండా వేరే జాబితాలను తయారు చేసి రుణాలు ఇప్పించేందుకు గ్రామకమిటీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక వ్యవహారంపై రగడ భూగర్భ గనుల శాఖపై జరిగిన సమీక్షలో ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగించటం, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయాన్ని గండికొట్టడం తదితర అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. గతంలో ఇసుక సీనరేజీ ద్వారా వచ్చే ఆదాయం నేరుగా జిల్లా పరిషత్‌కు జమ అయ్యేదని, ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలు సడలించి నిధులను తన ఖాతాలో వేసుకుంటోందని, మొక్కుబడిగా క్యూబిక్ మీటరుకు రూ.40లు మాత్రమే ఇస్తోందని తోట్లవల్లూరు ఎంపీపీ కె.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఇసుక రేవులు ఉన్న గ్రామాల పరిధిలో గృహనిర్మాణం కోసం ఎడ్లబండి, ట్రాక్టర్లపై ఇసుక తీసుకువెళుతున్నా పోలీసులు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు వాటిని సీజ్ చేసి రూ. 15వేలు జరిమానా విధిస్తున్నారని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో పాటు పలువురు సభ్యులు పేర్కొన్నారు. అయితే పెద్ద లారీల ద్వారా హైదరాబాదుకు తరలివెళుతున్న ఇసుకను అదుపు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. జిల్లా పరిషత్ సమావేశం జరిగే సమయంలో సభ్యులకు సరైన సమాచారం ఇవ్వటం లేదని, గత సమావేశంలో అడిగిన సమాచారాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యత పెరిగింది : బుద్ధప్రసాద్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం జిల్లా ప్రజలపై బాధ్యత పెరిగిందన్నారు. జిల్లా సరిహద్దులోనే రాజధాని ఏర్పడనున్న సమయంలో మనపై గురుతర బాధ్యత ఉందన్నారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ముందడుగు వేయాలన్నారు. ఇటీవల తాను అమెరికాలో పర్యటించానని, కృష్ణాజిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యానని చెప్పారు. తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారని తెలిపారు. కలెక్టర్ ఈ విషయంపై స్పందించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయటంతోపాటు ఎన్ఆర్ఐలు నగదు పంపేందుకు ప్రభుత్వం ద్వారానే ఒక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేయాలని కోరారు. తొలుత హుదూద్ తుపాను ప్రభావంతో మరణించిన వారు, ఇటీవల షిర్డీ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, ఆయా మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. నూతనంగా 41,814 మందికి పింఛన్లు : ఉమా సమావేశంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో జిల్లాలో 1.18 లక్షల మందికి రూ. 12.31 కోట్లను పింఛన్లుగా అందజేశామన్నారు. తొలుత జిల్లాలో 14వేల మంది పింఛన్లు పొందేందుకు అనర్హులుగా గుర్తించగా, వీటిని పునఃపరిశీలించి 7,936 మందికి పునరుద్ధరించినట్లు తెలిపారు. జిల్లాలో 33,878 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నవంబరులో జరిగే జన్మభూమిలో నూతన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. మండలాల్లో, జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని, అలా చేయని పక్షంలో సంబంధిత శాఖల అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో రెండో పంటకు సాగునీరు విడుదల చేసే విషయమై నవంబరులో సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతిపక్షం నిర్ణయాత్మక పాత్ర పోషించాలి : కొల్లు రవీంద్ర జిల్లా పరిషత్ సమావేశం జరిగే సమయంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ సభ్యులు నిర్ణయాత్మక పాత్రను పోషించాలని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రైతుసాధికార సంస్థను ఏర్పాటు చేసిందని, మొదటి విడతగా రూ. 5వేల కోట్లను విడుదల చేయటం జరిగిందన్నారు. జిల్లాలో వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో నందమూరి తారకరామారావు విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వసతి గృహాలు, ఆస్పత్రులపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ అవసరమన్నారు. బెల్టు షాపులు అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోంటుందని చెప్పారు. -
కదలిక లేని బందరు పోర్టు
మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం దోబూచులాడుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి మూడున్నర నెలలైనా పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఆరునెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మూడున్నర నెలల సమయం గడిచింది. పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థతో ఇప్పటి వరకు ప్రభుత్వం సంప్రదింపులే జరపలేదు. పోర్టు నిర్మాణానికి కీలకమైన భూసేకరణ ఉత్తర్వులు జారీ చేయలేదు. పోర్టు నిర్మాణం కోసం 5324 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. గతంలోనే కలెక్టర్ ప్రభుత్వభూమి, అసైన్డ్, పట్టాభూమి ఎక్కడెక్కడ ఉందోనన్న వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. నివేదికలన్నీ సిద్ధంగానే ఉన్నా పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం గమనార్హం. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తే కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత బందరు పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖను వివరాలు కోరారు. పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు ఇంకా ప్రభుత్వం చేపట్టలేదని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖ అసిస్టెంట్ సెక్రటరీ సమాధానమిచ్చారు. మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ 2013 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి అందజేసిన రివైజ్డ్ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (ఆర్డీపీఆర్) మాస్టర్ ప్లాన్ లేఅవుట్‌ను ప్రభుత్వం ఆమోదించిందా, లేదా, తీసుకున్న చర్యలేమిటి? ఆమోదిస్తే ఏ తేదీన ఆమోదించారన్న ప్రశ్నకు ఆర్డీపీఆర్, మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ప్రభుత్వ ఆమోదం పొందలేదని, పరిశీలనలో ఉందని సమాధానమిచ్చారు. కలెక్టర్ ఎం రఘునందన్‌రావు 2014 ఫిబ్రవరి 21వ తేదీన ప్రభుత్వానికి అందజేసిన ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్స్‌కు సంబంధించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించిందా, లేదా ప్రభుత్వ పరిశీలనలో ఉందా, భూసేకరణకు అవసరమైన రూ. 495.07 కోట్ల నిధులను మంజూరు చేశారా లేదా అన్న ప్రశ్నకు కలెక్టర్ పంపిన నివేదికపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కాకినాడకు చెందిన పోర్ట్ డెరైక్టర్‌ను కోరిందని సమాచారమిచ్చారు. భూసేకరణకు సంబంధించి ఇంకా నిధులు విడుదల చేయలేదని తెలిపారు. బందరు డీప్ వాటర్ పోర్ట్ నిర్మాణం కోసం కలెక్టర్‌కు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసిందా అన్న ప్రశ్నకు బందరు పోర్టు నిర్మాణం కోసం ప్రైవేటు భూముల గుర్తింపు కోసం రెవెన్యూ అధికారులతో సంప్రదించాల్సిందిగా కాకినాడ పోర్ట్ డెరైక్టర్‌కు సూచించామని సమాధానమిచ్చారు. పాలకుల వైఫల్యమే : బందరు పోర్టును నిర్మించాలని గతంలో ప్రస్తుత బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఉద్యమాలు చేపట్టారని, వారు అధికారంలోకి వచ్చినా పోర్టు నిర్మాణ పనుల ప్రారంభింపజేయడంలో విఫలమయ్యారని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. ఆరు నెలల్లో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని, వాగ్దానాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. -
‘ఆదరణ' దిశగా అడుగులు
కర్నూలు(అర్బన్): బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉండగా అమలు చేసిన ‘ఆదరణ పథకాన్నే తిరిగి అమలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. వాల్మీకి.. వడ్డెర.. నాయీ బ్రాహ్మణ.. భట్రాజు.. రజక.. ఉప్పర.. కుమ్మర.. క్రిష్ణబలిజ.. విశ్వ బ్రాహ్మణ.. మేదర కులాలకు చెందిన ఫెడరేషన్లకు అనుబంధ సొసైటీల సభ్యులకు కుల వృత్తులను అభివృద్ధి చేసుకునేందుకు కార్యాచరణను రూపొందిస్తుండటం అందుకు బలం చేకూరుస్తోంది. ఆధునిక సాంకేతిక పరికరాలను అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఈనెల 19న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేకంగా అన్ని జిల్లాలకు చెందిన బీసీ కార్పొరేషన్ ఈడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సమావేశానికి ఎన్నడూ లేనివిధంగా 10 బీసీ కులాలకు చెందిన సొసైటీల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులను ఆహ్వానించారు. బుధవారం స్థానిక బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లాలోని బీసీ కుల సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశమైన ఈడీ ఆ విషయాన్ని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కుల వృత్తులను అభివృద్ధి చేసుకునేందుకు ఆధునిక సాంకేతిక పరికరాల వాడకంపై సలహాలు, సూచనలు అందించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా ఈనెల చివరి వారంలో ఆధునిక సాంకేతిక పరికరాలపై విజయవాడలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు హుళక్కేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది నుంచి అష్టకష్టాలు పడి బ్యాంకులు.. మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు కానట్లేననే విషయం స్పష్టమవుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మొత్తం 4,861 మంది బీసీ వర్గాలకు ఆర్థిక చేయూతనందించేందుకు బీసీ కార్పొరేషన్ లక్ష్యంగా ఎంచుకుంది. ఆ మేరకు దరఖాస్తులు స్వీకరించినా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యమాలు, ఎన్నికల కారణంగా జాప్యం చోటు చేసుకుంది. తాజాగా టీడీపీ ప్రభుత్వ తీరు మొదటికే మోసం తీసుకొస్తోంది. -
సమన్వయంతో పనిచేద్దాం
వాడీవేడిగా జెడ్పీ తొలి సమావేశం జిల్లా అభివృద్ధికి కలిసి ముందుకు సాగుదాం ప్రజాప్రతినిధుల పిలుపు స్టాండింగ్ కమిటీల ఏర్పాటుపై దుమారం పిన్నమనేని, కేఎన్నార్, తంగిరాలలకు నివాళి మచిలీపట్నం : రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని, నూతన రాష్ట్రంలో కృష్ణా జిల్లా కీలకంగా మారనుందని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అభిప్రాయపడ్డారు. జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సమన్వయంతో కృషిచేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య ఆదివారం జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగింది. జెడ్పీ హాలులో జరిగిన ఈ సమావేశం సాదాసీదాగానే ప్రారంభమైనప్పటికీ స్టాండింగ్ కమిటీల ప్రకటన అనంతరం వేడెక్కింది. నందిగామ ఉప ఎన్నిక కారణంగా కోడ్ అమల్లో ఉండటంతో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, అధికారుల పరిచయ కార్యక్రమం, స్టాండింగ్ కమిటీల ఏర్పాటుతోనే ఈ సమావేశం ముగిసింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని రాష్ట్ర విభజన అనంతరం జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ ఏడు స్టాండింగ్ కమిటీల జాబితాలను ప్రకటించారు. స్టాండింగ్ కమిటీల ఎంపిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, పార్టీ పరంగా ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. స్టాండింగ్ కమిటీల నియామకాన్ని పునఃసమీక్షించాలని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కోరడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్య స్టాండింగ్ కమిటీల నియామకంపై కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగింది రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జెడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు తదితర పథకాలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అక్టోబరు రెండో తేదీ నుంచి నిరంతరాయంగా గృహ అవసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలను వేగంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో సాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. పులిచింతల, పోలవరం పూర్తి చేస్తామని, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ప్రకటించారు. బందరు పోర్టు అభివృద్ధితోపాటు జిల్లాలో జరిగే పారిశ్రామిక అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చించి తమకు నివేదిక అందజేస్తే ప్రధానమంత్రితో మాట్లాడి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) హామీ ఇచ్చారు. జెడ్పీ ఆదాయం వృద్ధికి కృషి : అనూరాధ జిల్లా పరిషత్ ఆదాయాన్ని పెంచి, ఆస్తులను పరిరక్షించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడదామని జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా సమావేశంలో ప్రజాసమస్యలపై సమీక్ష నిర్వహించలేకపోతున్నామని, మరో నెల రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీకి ఆస్తులు ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులపై ఉందన్నారు. జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని తెలిపారు. ఇసుక సీనరేజ్, జెడ్పీ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్‌కు చెందిన దుకాణ సముదాయాల అద్దెలు పెంచి పది సంవత్సరాలు గడిచిందని, వీటి పెంపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాలనలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో నైట్‌వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తామని ఆమె తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. అనంతరం నూతనంగా ఎంపికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా చేపట్టే పనులు, ఆదాయ వనరులు తదితర అంశాలపై అధికారులు వివరించారు. ఈ సమావేశంలో పెడన, నూజివీడు, తిరువూరు ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, మేకా ప్రతాప్ అప్పారావు, కె.రక్షణనిధి, ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కంచి రామారావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. మంత్రులు ఉమ, కామినేని గైర్హాజరు జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. మంత్రి కొల్లు రవీంద్ర ఒక్కరే హాజరయ్యారు. తొలుత ఇటీవల మరణించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు పిన్నమనేని కోటేశ్వరరావు, కుక్కల నాగేశ్వరరావుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు విడతలుగా మౌనం పాటించారు. -
పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం
మచిలీపట్నం : జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు పోర్టులను నిర్మించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, వాటిలో బందరు పోర్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మచిలీపట్నం పోర్టు తమకు అందుబాటులో ఉందని, వెంటనే దానిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారని పేర్కొన్నారు. మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఇటీవల కేంద్రంతో ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో టైటానియం నిక్షేపాలు ఉన్నాయని, వాటిని ఆధారంగా చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లావాసుల దాహార్తిని తీర్చేందుకు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లతో విజయవాడ నుంచి కరకట్ట వెంబడి మచిలీపట్నం వరకు పైప్‌లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. మచిలీపట్నంలో డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని, ఆ కాంట్రాక్టులను రద్దు చేసి రూ.95 కోట్ల నుంచి రూ.99 కోట్ల అంచనాలతో నూతనంగా డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వివరించారు. మచిలీపట్నంలో శ్మశానాలు, ఇతర ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అర్హులందరికీ త్వరలోనే ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలలు పంపిణీ చేస్తామని, గృహాలు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 80 రోజులు గడిచిందని, పారదర్శకమైన పాలనను అందిస్తున్నామన్నారు. విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తివేయటం జరిగిందన్నారు. రైతులకు రుణమాఫీ చేసే దిశగా ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీసీ సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.3వేల కోట్లు, చేనేత రుణమాఫీకి రూ.500 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ కాశీవిశ్వనాథం పాల్గొన్నారు. -
సీఎంకు సాదర స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గురువారం స్థానిక విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. విజయవాడలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 8.30 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్ రూమ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ వెళ్లారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీమోహన్, కాగిత వెంకట్రావ్, బొండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, కేఎస్ లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ జె.మురళీ, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి వెంకట బాలవర్దనరావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు. పూర్తిగా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి విమానాశ్రయం బయటకు వచ్చిన ముఖ్యమంత్రికి టీడీపీ నాయకులు ప్రత్యేకంగా తీసుకువచ్చిన రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో సన్మానం చేయించారు. సీఎంకు పుష్పగుచ్చాలు అందజేసిన పలువురు మహిళలు అభినందనలు తెలిపారు. ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం మేరకు రుణాలను పూర్తిగా మాఫీ చేసి తమను అదుకోవాలని పలువురు మహిళలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
మీట్ ది ప్రెస్‌లో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం : జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో శనివారం ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం జరిగింది. మంత్రి మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జిల్లాలో ఆయిల్ రిఫైనరీతోపాటు క్రాకర్ అనే సంస్థ ద్వారా పలు పరిశ్రమలు స్థాపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. కోస్తా తీరం వెంబడి రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 216వ నంబరు జాతీయ రహదారి విస్తరణకు, మచిలీపట్నం నుంచి రేపల్లె రైలు లింకు మార్గం నిర్మాణానికి ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి కృషి చేస్తానని చెప్పారు. మంగినపూడి బీచ్‌లో తొలి విడతగా రూ.20 లక్షలతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. చెన్నై బీచ్‌ల తరహాలో మంగినపూడి బీచ్లోనూ పార్కు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. బందరుపోర్టు నిర్మిస్తాం... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బందరుపోర్టు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారని మంత్రి తెలిపారు. బందరు పోర్టు అభివృద్ధి చేస్తే దానికి అనుబంధంగా జిల్లాలో 27 రకాల పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందన్నారు. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కంపెనీని మచిలీపట్నంలోనే విస్తరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బందరు పోర్టును గోగిలేరు ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రశ్నపై ఆయన సమాధానమిస్తూ బందరు పోర్టును బందరులోనే నిర్మిస్తామని తేల్చి చెప్పారు. బందరులో ఓపెన్ డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉందనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పనులను పూర్తి చేయించేందుకు రూ. 22 కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు. మచిలీపట్నంను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ఆగస్టు7వ తేదీ నుంచి లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల పేదలకు ఇళ్లస్థలాలుగా ఇచ్చిన భూములు కోర్టు కేసుల్లో ఉండి గృహనిర్మాణం జరగడం లేదన్నారు. దీని నుంచి బయటపడేందుకు జీ+1, జీ+2, జీ+3 తరహా గృహాలు నిర్మించి ఇంటిగ్రేటెడ్ గ్రామాలను అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రకృతి సహకరించాల్సిందే...! కృష్ణాడెల్టా రైతులకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని జూలై నెలాఖరు నాటికి కూడా నారుమడులు పోసుకోలేని పరిస్థితి ఉందని సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తాగునీటి అవసరాల నిమిత్తం డెల్టాకు నీటిని విడుదల చేశారన్నారు. ఆగస్టు నెలలో ప్రకృతి సహకరించి వర్షాలు కురిస్తే ఎగువ నుంచి సాగునీరు విడుదల అవుతుందని ఆశిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, బందరు మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకటబాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యకు విశేష ప్రాధాన్యత
‘బడి పిలుస్తోంది’లో మంత్రి కొల్లు రవీంద్ర చిలకలపూడి (మచిలీపట్నం) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం విద్యకు విశేష ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సర్వశిక్షా అభియాన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడి పిలుస్తోంది ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక హిందూ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. మంత్రి కొల్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసి ఎక్కువ నిధులను కేటాయించనుందని తెలిపారు. జిల్లాలో 1207 మంది బాలురు, 1016 మంది బాలికలను బడిబయట పిల్లలుగా గుర్తించినట్లు అధికారులు చెప్పారన్నారు. వీరిలో 901 మందిని బడిలో చేర్పించినట్లు చెబుతున్నారని, మిగిలిన 1323 మందినీ బడిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీలు కెఎస్.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్య తీరటంతో పాటు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకోవచ్చునన్నారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు ,బందరు ఆర్డీవో పి.సాయిబాబు, డీఈవో డి.దేవానందరెడ్డి,సర్వశిక్షా అభియాన్ పీవో డి.పుష్పమణి మాట్లాడుతూ బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయా మండలస్థాయిల్లో ఆగ స్టు2వ తేదీ వరకు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తొలుత మెదక్జిల్లాలో రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రూపొందించిన సీడీలను మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా అధ్యక్షత వహంచిన కార్యక్రమంలో బందరు జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, ఆయా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో చేనేత మెగా క్లస్టర్లు.... చల్లపల్లి : జిల్లాలో చేనేత మెగా క్లస్టర్ ఏర్పాటుచేసేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో చేనేత క్లస్టర్ల అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. రవీంద్ర మాట్లాడుతూ ఇప్పటికే ఒంగోలు, గుంటూరులో మెగా క్లస్టర్లు ఏర్పాటు చేశామని, జిల్లాలో ఇలాంటి క్లస్టర్లను ఏర్పాటు చేసి చేనేత రంగానికి జవసత్వాలు నింపేందుకు కృషిచేస్తామన్నారు. ఒక్కో మెగా క్లస్టర్‌కు రూ.70కోట్లు నిధులు కేటాయించి ప్రజలు మెచ్చే దుస్తులను తయారుచేసేలా ప్రత్యేక శిక్షణ, మార్కెట్ సదుపాయాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖర్ ప్రసాద్, చేనేత, జౌళిశాఖ జేడీ కె.శ్రీకాంత్ ప్రభాకర్, వీవర్స్ సర్వీసెంటర్ డీడీ విశేష్లోక్య, ఏడీ షేక్ జిలాని, ఆప్కో డీఎంవో వీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
చేనేత పరిశ్రమకు జవసత్వాలు
రాష్ట్రంలో 31 మినీ క్లస్టర్లు, రెండు మెగా క్లస్టర్లు క్లస్టరు ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు గూడూరు : చేనేత పరిశ్రమకు జవసత్వాలు కల్పించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని బీసీ సంక్షేమ, ఎక్సైజ్ చేనేత, జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం మండల పరిధిలోని రాయవరం గ్రామంలో ఇటీవల మంజూరైన చేనేత క్లస్టరు (సమగ్ర చేనేత అభివృద్ధి పథకం)ను మంత్రి ప్రారంభించారు. చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఎమ్మెల్యే కాగిత అధ్యక్షతన జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అత్యధికులు చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. చేనేత కార్మికుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు వారు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు మార్కెట్లో ఆదరణ కల్పించేందుకు ఈ సమగ్ర చేనేత అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా 31 మినీ క్లస్టర్లను ఒక్కొక్కటీ రూ. 70నుంచి60 లక్షలతో, రెండు మెగా క్లస్టర్లను ఒక్కొక్కటీ కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. జిల్లాలో పోలవరం, రాయవరం, కప్పలదొడ్డి, పెడన, చల్లపల్లి గ్రామాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చేనేత కార్మికుల హర్షధ్వానాల నడుమ మంత్రి ప్రకటించారు. సద్వినియోగం చేసుకోండి : కాగిత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చేనేత క్లస్టర్లను కార్మిక సోదరులు సద్వినియోగం చేసుకోవాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కోరారు. ఆధునిక డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మార్కెటింగ్ అవకాశం కల్పిస్తారని చెప్పారు. చేనేత, జౌళిశాఖ ఉపసంచాలకులు షేక్ జిలానీ, సర్పంచి తమ్మిశెట్టి వరలక్ష్మి, ఆప్కో డీఎంవో లక్ష్మణరావు, ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, గూడూరు, బందరు జెడ్పీటీసీలు గోపాలకృష్ణగోఖలే, లంకే నారాయణప్రసాద్, చేనేత, జౌళిశాఖ అభివృద్ధి అధికారులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
హామీ మేరకే రుణాలు మాఫీ
మంత్రి కొల్లు రవీంద్ర కోనేరుసెంటర్ (సుల్తానగరం) : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేశారని రాష్ట్ర బీసీసంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం మండల పరిధిలోని సుల్తానగరంలో రైతులు, డ్వాక్రా మహిళలతో ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబానికి రూ. 1లక్షా50వేలతో పాటు డ్వాక్రా గ్రూపులకు లక్ష రూపాయల రుణాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారని చెప్పారు. నూతన రాజధాని విషయంలో ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. 216 జాతీయ రహదారి నాలుగు లైన్లు అభివృద్ధి, మచిలీపట్నం - రేపల్లె రైలు మార్గం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బందరు పోర్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి పోర్టును అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, గ్రంథాలయ మాజీచైర్మన్ గొర్రిపాటి గోపీచంద్, గ్రామ సర్పంచి మట్టా వెంకటదాసు, ఎంపీటీసీ మురాల దేవి, మండల పార్టీ అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పాల్గొన్నారు. మోడల్‌గా గిలకలదిండి ఫిషింగ్ హార్బర్... గిలకలదిండి ఫిషింగ్ హార్బర్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్‌ను ఆయన సందర్శించారు. కోల్డు స్టోరేజి తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం మత్స్యశాఖ, పోర్టు అధికారులు, బోటు యజమానులు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అత్యధికంగా విదేశీ మారకద్రవ్యం మత్స్యరంగంలోనే లభిస్తుందన్నారు. హార్బర్లో ఎంపెడా ఆధ్వర్యంలో రూ. 60 లక్షల నిధులతో ఐస్‌ప్లాంట్ ఏర్పాటు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల్లో దీనిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపెడా అధికారి హనుమంతరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం,బోటు యజమానుల సంఘం అధ్యక్షుడు తమ్ము ఏడుకొండలు, మత్స్యశాఖ ఏడి సురేష్, మునిసిపల్‌చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు.... డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇవ్వటంతో తాము రుణాలు చెల్లించలేదని అయితే డ్వాక్రాగ్రూపునకు లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వటంతో తమపై అదనపు భారం పడుతోందని పలువురు డ్వాక్రా మహిళలు మంత్రి కొల్లు రవీంద్ర వద్ద వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోకున్నా డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయల వరకు రుణం రద్దయ్యేలా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారని మంత్రి వివరించారు.