విద్యకు విశేష ప్రాధాన్యత
- ‘బడి పిలుస్తోంది’లో మంత్రి కొల్లు రవీంద్ర
చిలకలపూడి (మచిలీపట్నం) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం విద్యకు విశేష ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సర్వశిక్షా అభియాన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడి పిలుస్తోంది ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక హిందూ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది.
మంత్రి కొల్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసి ఎక్కువ నిధులను కేటాయించనుందని తెలిపారు. జిల్లాలో 1207 మంది బాలురు, 1016 మంది బాలికలను బడిబయట పిల్లలుగా గుర్తించినట్లు అధికారులు చెప్పారన్నారు. వీరిలో 901 మందిని బడిలో చేర్పించినట్లు చెబుతున్నారని, మిగిలిన 1323 మందినీ బడిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఎమ్మెల్సీలు కెఎస్.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్య తీరటంతో పాటు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకోవచ్చునన్నారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు ,బందరు ఆర్డీవో పి.సాయిబాబు, డీఈవో డి.దేవానందరెడ్డి,సర్వశిక్షా అభియాన్ పీవో డి.పుష్పమణి మాట్లాడుతూ బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయా మండలస్థాయిల్లో ఆగ స్టు2వ తేదీ వరకు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తొలుత మెదక్‌జిల్లాలో రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రూపొందించిన సీడీలను మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా అధ్యక్షత వహంచిన కార్యక్రమంలో బందరు జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, ఆయా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లాలో చేనేత మెగా క్లస్టర్లు....
చల్లపల్లి : జిల్లాలో చేనేత మెగా క్లస్టర్ ఏర్పాటుచేసేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో చేనేత క్లస్టర్‌ల అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. రవీంద్ర మాట్లాడుతూ ఇప్పటికే ఒంగోలు, గుంటూరులో మెగా క్లస్టర్లు ఏర్పాటు చేశామని, జిల్లాలో ఇలాంటి క్లస్టర్లను ఏర్పాటు చేసి చేనేత రంగానికి జవసత్వాలు నింపేందుకు కృషిచేస్తామన్నారు.
ఒక్కో మెగా క్లస్టర్‌కు రూ.70కోట్లు నిధులు కేటాయించి ప్రజలు మెచ్చే దుస్తులను తయారుచేసేలా ప్రత్యేక శిక్షణ, మార్కెట్ సదుపాయాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖర్ ప్రసాద్, చేనేత, జౌళిశాఖ జేడీ కె.శ్రీకాంత్ ప్రభాకర్, వీవర్స్ సర్వీసెంటర్ డీడీ విశేష్‌లోక్య, ఏడీ షేక్ జిలాని, ఆప్కో డీఎంవో వీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.