sarva shiksha abhiyan
-
శ్రమదోపిడీకి గురవుతున్నాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: విద్యాభివృద్ధి కోసం ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తాము శ్రమదోపిడీకి గురవుతున్నామని సర్వశిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేత నం కూడా లేకుండా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయా లని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన సమ్మె బాట పట్టా రు. రాష్ట్రవ్యాప్తంగా 19,325 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకమైనప్పటి కీ మెరిట్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంలోనే నియమితులయ్యామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతో తాము ఉద్యోగ భద్రతకు అర్హత కలిగి ఉన్నామని, వెంటనే తమ ఉద్యోగాలను క్రమబదీ్ధకరించాలని కోరుతున్నారు. కనీస వేతనాలు సైతం కరువు.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు సైతం అమలు చేయడంలేదని సర్వశిక్ష ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టమ్ అనలిస్ట్‌లు, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్స్, డీఎల్‌ఎంటీ, మెసెంజర్స్, మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఐఈఆర్‌పీఎస్, మెసెంజర్స్, సీజీవీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో స్పెషల్ ఆఫీసర్లు (పీజీ హెచ్ఎం హోదా), కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్స్ (స్కూల్ అసిస్టెంట్ హోదా), పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్స్, క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, కుక్స్, వాచ్ఉమెన్స్, స్వీపర్లు, స్కావెంజర్లు, పాఠశాల స్థాయిలో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్స్(ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్), భవిత కేంద్రాల్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్లుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వీరికి కేవలం రెగ్యులర్ ఉద్యోగుల వేతనాల్లో నాలుగోవంతు జీతం మాత్రమే ఇస్తున్నారు. మెసెంజర్లకు రూ.11వేలు, సీఆర్పీలకు రూ.19,350 (ఏపీలో మాత్రం రూ.26వేలు), పీజీ హెచ్ఎం స్థాయిలో ఉన్న స్పెషల్ ఆఫీసర్లకు రూ.32 వేలు వేతనంగా ఇస్తున్నారు. టీఏ, డీఏలు ఇవ్వడంలేదు. పైగా ఏడాదిలో 10 నెలలు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. సర్వ శిక్షలో ఇప్పటివరకు 119 మంది మరణిస్తే కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. తమను రెగ్యులరైజ్ చేయాలని, రూ.10 లక్షల బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని, మహి ళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 ప్రసూతి సెలవులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం, 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ. 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. -
వస్త్రోత్పత్తిపై కరోనా పడగ
సిరిసిల్ల: ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ఉంది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి’. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు వివిధ పథకాల్లో వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తోంది. ఈ మేరకు బట్ట ఉత్పత్తి చేస్తూ.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పిస్తూ.. వస్త్రోత్పత్తి రంగం ముందుకు సాగుతోంది. అంతా సాఫీగానే సాగుతుందని భావిస్తున్న తరుణంలో కోవిడ్–19 మహమ్మారి వస్త్రోత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలిస్టర్ బట్టను కొనేవారు లేక వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ప్రభుత్వం ఇచ్చిన సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు అందక వస్త్రోత్పత్తిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్లకు మొత్తంగా రూ.150 కోట్ల మేరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది మూలకు పడిన రంజాన్ బట్ట రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు కానుకగా అందించేందుకు సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు 26.23 లక్షల మీటర్ల షర్టింగ్ బట్టకు ఆర్డర్లు ఇచ్చారు. 2020 జనవరి 3వ తేదీన ఆర్డర్లు ఇచ్చిన జౌళిశాఖ అధికారులు.. ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రంజాన్ బట్టను వస్త్రోత్పత్తిదారులు తయారు చేశారు. 10 లక్షల మీటర్ల బట్టను కొనుగోలు చేశారు. మరో 16.23 లక్షల మీటర్ల బట్ట కార్ఖానాల్లోనే ఉంది. ఈలోగా కరోనా లాక్డౌన్ రావడంతో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో ఉత్పత్తి చేసిన రంజాన్ బట్ట నిల్వలు పేరుకుపోయాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నూలు, కొనుగోలు చేసి, కార్మికులకు కూలి చెల్లించి అమ్మకానికి సిద్ధంగా ఉన్న బట్టను జౌళిశాఖ కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం రంజాన్ పండుగకు కొత్త బట్టలను పంపిణీ చేయలేదు. దీంతో సుమారు రూ.5.40 కోట్ల విలువైన నిల్వలు సిరిసిల్లలో ఉన్నాయి. ఎస్ఎస్ఏది అదే కథ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో 1.30 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చారు. వస్త్రోత్పత్తిదారులు ఆ మేరకు బట్ట ఉత్పత్తి చేశారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం భావించి ముందే ఆర్డర్లు ఇచ్చింది. దీంతో ఉత్సాహంగా ఎస్ఎస్ఏ బట్ట ఉత్పత్తి అయింది. రూ.50 కోట్ల విలువైన బట్ట ఉత్పత్తి చేశారు. ఆరు నెలల కిందట ఈ బట్టను కొనుగోలు చేసిన జౌళిశాఖ ఇటీవల రూ.30 కోట్ల మేరకు చెల్లించింది. ఇంకా రూ.20 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి బట్టల బిల్లులు సైతం రూ.3 కోట్ల మేరకు ఇలాగే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు బతుకమ్మ చీరల ఉత్పత్తి పెట్టుబడిగా వస్త్రోత్పత్తిదారులు అప్పులు చేయాల్సి వస్తుంది. సిరిసిల్లలో ఏడు కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్టకు ఆర్డర్లు ఇవ్వగా దీని విలువ రూ.350 కోట్లు. 25 వేల మరమగ్గాలు, వెయ్యి ఆధునిక ర్యాపియర్ మగ్గాలపై 225 రంగుల్లో బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. మంత్రి కేటీఆర్ వస్త్రోత్పత్తి ఆర్డర్ల బిల్లులు ఇప్పించాలని వస్త్రవ్యాపారులు కోరుతున్నారు. రూ. 30 కోట్లు ఇచ్చాం రంజాన్‌కు సంబంధించి కొనుగోలు చేసిన వస్త్రానికి ఇటీవల రూ.30 కోట్లు ఇచ్చాం. బతుకమ్మ చీరలను ఇప్పుడే సేకరిస్తున్నాం. దానికి ఎప్పటిలాగే పేమెంట్ ఇస్తాం. వస్త్రం క్వాలిటీ కంట్రోల్ నివేదిక వచ్చిన తరువాత గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి జీఎస్టీ బిల్లులను చూసి 10 శాతం బిల్లులను అందరికీ క్లియర్ చేస్తాం. బట్టను తీసుకున్న ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా బిల్లులు రావాల్సి ఉన్నాయి. అవి రాగానే అన్నింటినీ క్లియర్ చేస్తాం. –శైలజా రామయ్యర్, జౌళిశాఖ డైరెక్టర్ -
నిధులున్నా.. నిర్లక్ష్యమే...
సాక్షి, విజయనగరం అర్బన్: ఓ వైపు సర్కారు విద్యకు పెద్ద పీట వేస్తూ... అందులోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశిస్తుంటే... జిల్లా అధికారులు నిర్లక్ష్యం వల్ల కేజీబీవీ విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదరికంతో డ్రాపౌట్లుగా మారిన విద్యార్థినుల కోసం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను నెలకొల్పారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం మోపకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ జిల్లా అధికారుల నిర్వహణ లోపం వల్ల విద్యార్థినులే కాస్మొటిక్ చార్జీలు భరించాల్సి వస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థినులకు వసతితోపాటు స్టేషనరీ, కాస్మొటిక్ చార్జీలు వంటివాటిని యంత్రాంగం అందించాల్సి ఉంది. కానీ పాఠశాలలు పునఃప్రారంభమై నాలుగునెలలు కావస్తున్నా జిల్లా సర్వశిక్షాభియాన్ వాటిని అందివ్వలేదు. ఇందుకు సంబంధించిన నిధులు రెండు నెలల క్రితమే జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా... పర్చేజింగ్ టెండర్ చేపట్టడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సర్కారు చొరవ చూపుతున్నా... జిల్లాలో మొత్తం 33 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినికి రెండు జతల యూనిఫాం, పాదరక్షలు, స్టేషనరీ, వారికి అవసరమైన నోట్ పుస్తకాలు, ప్లేట్లు, పెట్టెలు, కాస్మొటిక్ వస్తువులు, పాఠ్యపుస్తకాలు వంటివి విద్యాలయాల్లోనే ఇవ్వాలి. తొలుత జిల్లా స్థాయిలోని పర్చేజింగ్ కమిటీల ద్వారానే కొనుగోలు చేసి జూన్ నెలలోనే వాటిని పంపిణీ చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రస్థాయిలో టెండర్లు వేసి అన్ని జిల్లాలకు పంపి ణీ చేశారు. దానివల్ల ఆలస్యం అవుతోందని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా స్థాయిలోనే పర్చేజ్ చేసుకోమని రెండు నెలల క్రితమే నిధులు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఒక్కో విద్యార్థినికి కాస్మొటిక్ వస్తువుల కోసం నెలకు రూ.125, శానిటరీ నాప్కిన్స్ కోసం నెలకు రూ.35లు ఇవ్వాలని ఆదేశించారు. కానీ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నాలుగునెలలవుతున్నా టెండర్ ఊసే లేదు. కనీసం డబ్బులు చెల్లించలేదు. విద్యార్ధినులు తమకు అవసరమైన వస్తువులను సొంత డబ్బు వెచ్చించి బయటే కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. విద్యార్థినులపై రూ. 41.6లక్షల భారం జిల్లాలో 33 కేజీబీవీల్లో 6,500 మంది విద్యార్థినులున్నారు. గడిచిన నాలుగు నెలల్లో వారు నెలకు కాస్మొటిక్ వస్తువులకోసం రూ.125, శానిటరీ నాప్కిన్స్కి రూ.35 వంతున రూ.41.6 లక్షల ఆర్థిక భారం మో యాల్సి వచ్చింది. కాస్మొటిక్ వస్తువులు పంపిణీ అయ్యేంతవరకు దుస్తులు శుభ్రపర్చుకోవడానికి నెలకు మూడు సబ్బులు, స్నానం సబ్బులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పేస్టులు, తలకు కొబ్బరి నూనె, ముఖానికి రాసుకునేందుకు పౌడర్ డబ్బాలు, షాంపూలు, బ్రష్‌లు కొనుగోలు చేయాలి. అయితే నాలుగునెలలుగా వీటికి డబ్బులు రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్చేజింగ్ టెండర్ దశలో ఉంది.. కాస్మొటిక్ కిట్స్ పర్చేజింగ్ బాధ్యత గతంలో రాష్ట్రస్థాయిలో ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పర్చేజింగ్ కమిటీకి అప్పగించిం ది. నిధులు వచ్చి రెండునెలలు అయింది. గిరిజన ఉత్పత్తులు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నాం. అందుకే ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం వాటి కొనుగోలుకు సంబంధించిన పర్చేజింగ్ టెండర్ దశలో ఉంది. – ఎం.కృష్ణమూర్తినాయుడు, పీఓ, ఎస్ఎస్ఏ బయట షాపుల్లో కొని తెచ్చుకుంటున్నాం కాస్మొటిక్ వస్తువులు ఇవ్వడంలేదు. పాఠశాల ప్రారంభం నుంచి ఆ వస్తువులను ఇంటిదగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని బయట కొనుక్కుంటున్నాను. కొందరికి డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. త్వరగా ఇస్తే బాగుంటుంది. – బి.వి.లక్ష్మి, 9వ తరగతి, విజయనగరం కేజీబీవీ. -
సర్కారు బడులకు స్వర్ణయుగం
సాక్షి, విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నూతన ప్రభుత్వం వచ్చాక భవనాలు, సౌకర్యాల పరిస్థితులను పాఠశాలల నుంచి నేరుగా ఛాయాచిత్రాల ద్వారా తీసుకొనే ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసింది. వాటిని సమకూర్చే ప్రణాళికలు ఒకవైపు జరుగుతుండగా మరో వైపు గత ప్రభుత్వం విస్మరించిన అభివృద్ధి పనులను పూర్తి చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది యూ–డైస్ ద్వారా సేకరించిన మౌలిక సదుపాయాల ప్రణాళికను ముందుగా పరిశీలించింది. గత ప్రభుత్వం మూడేళ్లుగా పట్టించుకోని మరుగుదొడ్ల, మేజర్ మరమ్మతు పనులను ముందుగా పూర్తి చేయాలని సర్వశిక్షా అభియాన్ నిర్ణయింది. ఈ చర్యల్లో భాగంగా జిల్లాలోని 128 పాఠశాలలకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. వీటిని అత్యవసర పనులుగా సర్వశిక్షా అభియాన్ చేపట్టడానికి సిద్ధమయింది. గత కొన్నేళ్లుగా కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు మోక్షం లభించినట్లయింది. అవసరమైన చోట మరుగుదొడ్లు.. జిల్లాలోని 128 స్కూళ్లకు సర్వశిక్షా అభియాన్ రూ.2.5 కోట్లు నిధులు కేటాయించింది. వీటిలో 21 స్కూళ్లకు రూ.54.60 లక్షలతో బాలురకోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. జిల్లాలోని గుర్ల మండలంలో 4, పార్వతీపురం మండలలో 3 స్కూళ్లకు, జామి, వేపాడ, ఎస్‌కోట, భోగాపు రం, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం, సాలూరు, బొబ్బిలి, గరుగుబిల్లి, జియమ్మవల స, జీఎల్‌పురం, కొమరాడ మండలాల్లో ఒక్కో స్కూల్‌కి బాలుర మరుగుదొడ్డి నిర్మాణానికి ని ధులు మంజూరయ్యాయి. అదేవిధంగా 15 పా ఠశాలల్లో రూ.39 లక్షలతో బాలికలకోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. వాటిలో అత్యధికంగా సాలూరు మండలంలో 4, పార్వతీపురం, పాచిపెంట మండలాల్లో రెండేసి స్కూళ్లు, మెరకముడిదాం, గరివిడి, గరుగుబిల్లి, కురుపాం, జీఎల్‌పురం, కొమరాడ మండలాల్లో ఒక్కొక్క స్కూల్‌ను గుర్తించారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.2.6లక్షల వంతున నిధులు కేటాయించారు. 92 స్కూళ్లకు మేజర్ మరమ్మత్తులు.. జిల్లాలోని 92 పాఠశాలల్లో మేజర్ మరమ్మతులు చేపట్టేందుకు రూ.1.53 కోట్లు మంజూరయ్యాయి. ప్రధానంగా బీటలు వారిన తరగతి గదుల గోడలు, స్లాబ్లకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తరువాత ప్రహరీలు, ఫ్లోరింగ్ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. గుర్తించిన 92 స్కూళ్లలో ఒక్కోదానికి కనీసం రూ.1.2 లక్షల నుంచి అధికంగా రూ.1.8 లక్షల వరకు నిధులు మంజూరు చేశారు. మౌలిక సదుపాయాలే తొలిప్రాధాన్యం.. జిల్లా వ్యాప్తంగా గతంలో పెండింగ్‌లో ఉన్న పాఠశాలల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. వాటిని తక్షణమే నిర్మించాలని జిల్లాకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. గతంలోని రెండు సంవత్సరాలలోని యూ–డైస్ ద్వారా గుర్తించిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రస్తుతం తొలి ప్రాధాన్యమిస్తాం. – ఎం.కృష్ణమూర్తినాయుడు, పీఓ, సర్వశిక్షా అభియాన్ -
రూ.74కోట్ల స్వాహాకు టీడీపీ తిమింగలాల స్కెచ్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో జరిగిన అవినీతి విచ్చలవిడిగా సాగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేశ్, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పటి సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఎస్పీడీ (స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్) జి. శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు వర్ట్యువల్, డిజిటల్ తరగతుల ఏర్పాటు పేరిట రూ.74 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. భారీగా ముడుపులు దండుకునేందుకు రూ.2లక్షల నుంచి 2.5 లక్షలలోపు విలువ చేసే ఒక్కో యూనిట్ పరికరాలను రూ.6.19 లక్షలకు పైగా పెంచేసి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేలా పథకం పన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల ముందు ఈ తతంగాన్ని నడిపించారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్ల పంపిణీ పేరిట రూ.45 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులకు గండిపడేలా ప్రైవేటు సంస్థలకు ఆర్డర్లు ఇచ్చిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి మర్చిపోకముందే మరో బాగోతం బయటపడింది. రూ.50 కోట్లలోపు పరికరాలకు రూ.124 కోట్ల రేటు కాగా, బూట్ల దోపిడీని తలదన్నేలా ప్రభుత్వ పెద్దలు వరŠుచ్యవల్, డిజిటల్ తరగతుల పేరిట మరో భారీ అవినీతికి తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండువేల ప్రభుత్వ స్కూళ్లలో ఈ తరగతుల ఏర్పాటు పేరుతో పెద్ద స్కెచ్చే వేశారు. ఒక్కో యూనిట్ కేవలం రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల మేర మాత్రమే విలువ చేసే ఈ పరికరాల ఏర్పాటుకు రేటును మూడు రెట్ల మేర రూ.6.19లక్షలకు అమాంతం పెంచేసి సెల్కాన్ ఇంప్లెక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీగా ముడుపులు దండుకుని ఆర్డర్లు ఇచ్చారు. ప్రముఖ కంపెనీల నుంచి వీటిని తీసుకున్నా అంతకూడా కాదని.. పైగా అది సెల్కాన్ కంపెనీ కాబట్టి పరికరాలు ఇంకా తక్కువ ధరే ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే.. మొత్తం రూ.50కోట్లలోపే విలువచేసే పరికరాలకు దాదాపు రూ.124కోట్లు చెల్లిస్తున్నారు. కాగా, మెలూహ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ద్వారా ఈ కథను నడిపించారు. పనిచేయని పరికరాలు ఇదిలా ఉంటే.. 90 రోజుల్లోగా వీటిని ఏర్పాటుచేయించాలని ఒప్పందంలో షరతు విధించారు. కానీ, గడువు ముగిసినా కేవలం 780 స్కూళ్లకు మాత్రమే అందించారు. ప్రస్తుతం ఈ పరికరాలు పనిచేయకపోవడంతో అవన్నీ వృధాగా పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. అవినీతి రహిత పాలన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఈ డిజిటల్ పరికరాల బాగోతం వెలుగుచూసింది. దీంతో ఈ ఆర్డర్‌ను నిలిపివేయాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీగా బాధ్యతలు స్వీకరించిన వాడ్రేవు చినవీరభద్రుడు జులై 4న ఆదేశాలిచ్చారు. ఇది పసిగట్టిన టీడీపీ పెద్దలు రద్దు ఉత్తర్వులు రాకముందే సెల్కాన్, మెలూహ కంపెనీల ద్వారా హడావుడిగా మిగిలిన స్కూళ్లకు కూడా డిజిటల్ పరికరాలను ఆఘమేఘాల మీద డంప్ చేయించారు. పరికరాలు పంపిణీ పూర్తయినందున రూ.124 కోట్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో సర్వశిక్ష అభియాన్ దీనిపై నివేదికను ఇటీవల ప్రభుత్వానికి పంపింది. నిధుల కేటాయింపు లేకుండానే ఆర్డర్ నిజానికి వర్ట్యువల్, డిజిటల్ పరికరాల పంపిణీ ఒప్పందం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టమవుతోంది. ఎస్ఎస్ఏ ద్వారా ఏ పని చేపట్టాలన్నా అందుకు సంబంధించి ఆ సంస్థ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) నివేదికలో పొందుపరిచి ఉండాలి. కానీ, అలా జరగకపోవడమే కాక నిధుల కేటాయింపు కూడా లేకుండానే పంపిణీ ఆర్డర్ ఇచ్చేశారు. ఈ పరికరాల రేటు కూడా నిబంధనల ప్రకారం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాక.. పేద పిల్లలకు వినియోగించాల్సిన ఇతర కార్యక్రమాల నిధులనూ దీనికోసం దారిమళ్లించేలా అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఎస్ఎస్ఏ ఎస్పీడీ చేసినట్లు సమాచారం. చంద్రబాబు అధికారంలోకి రాగానే.. కాగా, 2014లో చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఈ సంస్థ ఏర్పాటైంది. ఇది లోకేశ్‌కు బినామీ కంపెనీ అన్న ఆరోపణలున్నాయి. ఈ సంస్థకు డిజిటల్, వర్ట్యువల్ తరగతుల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అనుభవమూ, సాంకేతిక పరిజ్ఞానమూ లేదు. దీంతో సెల్కాన్ ఇంప్లెక్స్ సంస్థను ముందు పెట్టి ఈ కంపెనీతో ఒప్పందాన్ని చేయించారు. రెండువేల స్కూళ్లలో ఈ డిజిటల్ తరగతుల పరికరాల ఏర్పాటు ఆర్డర్‌ను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ఒకరోజు ముందు మార్చి 9న అప్పటి ఎస్ఎస్ఏ ఎస్పీడీ జి. శ్రీనివాస్ ఇచ్చారు. -
మా కొడుకు జాడ చెప్పండి
సాక్షి, పెద్దపల్లి : జిల్లా విద్యాశాఖలోని సర్వశిక్ష అభియాన్ విభాగంలో డివిజినల్ లెవల్ మానిటరింగ్ టీం మెంబర్ (డీఎంఎల్టీ)గా పనిచేస్తున్న ఎలగందుల రమేశ్ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. లేఖ రాసి గత శనివారం నుంచి ఆచూకీ లేకుండా పోయిన అతని ఉదంతం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రమేశ్ జాడ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకొడుకు ఆచూకీ చెప్పాలంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు రమేశ్ చిత్రపటాలతో మంగళవారం ఆందోళనకు దిగారు. తమ కుమారుడు కనిపించకుండా పోవడానికి కారణమైన జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ కుమారుని ఆచూకీ దొరికే వరకు కదిలేది లేదని కార్యాలయం ఎదుట భీష్మించుకు కూర్చున్నారు. బాధ్యులను సస్పెండ్ చేయాలి.. తనకు రావాల్సిన సెక్టోరల్ అధికారి పోస్టును ఇతరులకు ఇప్పించడంతో మనస్థాపానికి గురైన ఎలగందుల రమేశ్ నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తన చావుకు కారణం జీసీడీవో పద్మ పేరును ప్రస్తావిస్తూ లేఖను రాసిన విషయం విధితమే. కుటుంబ సభ్యులకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలిచారు. రమేశ్‌కు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈవో జగన్మోహన్రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించి జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని కోరారు. స్పందించిన డీఈవో ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. కలిచివేసిన కన్నీళ్లు.. రమేశ్ ఆచూకీ కోసం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. రమేశ్ తల్లి మధునమ్మ తన కొడుకును క్షేమంగా తనకు అప్పగించాలని గుండెలవిసేలా రోధించింది. తాము పేదవాళ్లమని, అందుకే పోలీసులు, అధికారులు తమ కొడుకు కనిపించకుండా పోయినా పెద్దగా పట్టించుకోవడం లేదని క్షేమంగా వస్తే చాలని వేడుకుంది. రమేశ్ తమ్ముడు, చెల్లె, బంధువులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. -
సర్వశిక్షా అభియాన్‌లో అచ్చెంగా అవినీతి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్వశిక్షా అభియాన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకాల్లో ‘అచ్చెం’గా అక్రమాలు జరిగాయి. అచ్చెన్న...శీనన్న పేరు చెప్పి పోస్టులమ్మేసుకున్నారు. నాటి మంత్రుల కనుసన్నల్లోనే తంతంగం జరగడంతో కలెక్టర్ అనుమతి లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. అధికారులెవ్వరికీ తెలీకుండానే జాయిన్ చేసేసుకున్నారు. ఒక రోజున నాటి కలెక్టర్ ఆరా తీసే సరికి వారి బాగోతం బయటపడింది. తమ దృష్టికి తీసుకురాకుండా ఎలా నియమించారని ప్రశ్నించేసరికి అనుమతుల కోసం హడావుడిగా ఫైలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ. 3కోట్ల వరకు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. పద్ధతికి విరుద్ధంగా.. సాధారణంగా ఔట్ సోర్సింగ్ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని కలెక్టర్ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఖరారు చేసే బాధ్యతలను కలెక్టర్ల నుంచి తప్పించి ప్రభుత్వమే ఏకపక్షంగా ఔట్ సో ర్సింగ్ ఏజెన్సీలను ఖరారు చేసింది. ఖరారు చేసిన ఏజెన్సీలు ఎప్పటినుంచో పనిచేస్తున్నవనుకుంటే పప్పులో కాలేసినట్టే. టీడీపీ నేతల బినామీ ఏజెన్సీలుగా అప్పటికప్పుడు ఏర్పాటైనవే. ఏ జిల్లాకు ఏ ఏజెన్సీకి, ఏ శాఖ ల ఔట్ సోర్సింగ్ పోస్టులు అప్పగించాలన్నది అమరావతి స్థాయిలోనే కేటాయింపులు చేసి జిల్లాలకు వాటి ఉత్తర్వులకు పంపించేవారు. ఇంకేముంది టీడీపీ మంత్రుల కనుసన్నల్లో ఆ పార్టీ నేతల బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కొక్క పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. ఏజెన్సీల ముసుగులో చెలరేగిపోయిన టీడీపీ నేతల బినామీలు.. సర్వశిక్షా అభియాన్ ఔట్సోర్సింగ్ పోస్టులు కూ డా టీడీపీ నేతల బినామీ ఏజెన్సీ ద్వారా అమ్ముకున్నారు. అయితే, తీగలాగితే డొంక కదిలినట్టు సర్వశిక్షా అభియాన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకాలను లోతుగా పరిశీలిస్తే నాటి ప్రభు త్వ ఘన కార్యం, పాలకుల నిర్వాకం, అధికా రుల తీరు కళ్లకు కట్టినట్టు స్పష్టమవుతోంది. గత డిసెంబర్లో 177 ఔట్ సోర్సింగ్ పోస్టులు వేసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. అంతటితో ఆగకుండా ఆ పోస్టుల నియామక బాధ్యతలను స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీకి అప్పగించింది. ఆ మేరకు జిల్లా అధికా రులకు ఉత్తర్వులు పంపించింది. దీంతో 177పోస్టులకు అర్హత గల అభ్యర్థులను సమకూర్చాలని ఆ ఏజెన్సీకి నాటి కలెక్టర్ ధనుంజయరెడ్డి ఇండెం ట్ ఇచ్చారు. ఇంకే మంచి అవకాశం వచ్చిందని స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ ముసుగులో జిల్లా వ్యాప్తంగా బేరసారాలు జరిగాయి. లక్షల్లో పోస్టులకు ధర పలికింది. నిరుద్యోగం తీవ్రంగా ఉండటంతో అత్యధిక మంది అభ్యర్థులు సంప్రదింపులు చేసుకుని ముడుపులు ముట్ట జెప్పారు. ఇంకేముంది కొన్ని పోస్టులను పద్ధతిగా నియామకాలు చేసి, చాలా వరకు పోస్టులను అమ్మకాల ద్వారా నియామకాలు చేశారు. కలెక్టర్ అనుమతి లేకుండా 140 పోస్టులకు జాయినింగ్.. ఏజెన్సీ చేపట్టిన నియామకాల అభ్యర్థుల జాబి తాను కలెక్టర్‌కు అందజేసి, వారి అనుమతితో జాయిన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ 140 పోస్టులకు సంబంధించి అనుమతి తీసుకోకుండా నేరుగా జాయిన్ చేసుకున్నారు. కలెక్టర్‌కు తెలీకుండా తంతు అంతా నడిచిపోయింది. ఈ విషయాన్ని నాటి కలెక్టర్ ధనుంజయరెడ్డి ఆలస్యంగా తె లుసుకున్నారు. దీంతో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. 140 పోస్టులకు అనుమతి తీసుకోకుండా ఎలా జాయిన్ చేసేశారని నిలదీయడంతో అప్పటికప్పుడు హడావుడిగా ఫైల్ పెట్టారు. ఇదంతా ఫిబ్రవరిలో జరిగింది. ఇంతలో కలెక్టర్ ధనుంజయరెడ్డికి బదిలీ అయిం ది. ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ హయాంలో వాటి కి అనుమతి లభించింది. ఈ లెక్కన డిసెంబర్లో జాయిన్ చేసుకుని ఫిబ్రవరి వరకు కలెక్టర్‌కు తెలీకుండా వారందరినీ కొనసాగించినట్టుగా భావించాలి. అలా ఎందుకు చేశారో నాటి సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసరే చెప్పాలి. ఇదంతా పాలకులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ, సర్వశిక్షా అభియాన్ అధికారులు గూడు పుఠాణై నడిపిన బాగోతమే అన్నది తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో రూ. 3కోట్ల వరకు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
ఎన్నికల నిబంధనలు ఔట్.. అవినీతికి భలే సోర్సింగ్
ఔట్ సోర్సింగ్ పోస్టులు.. ప్రైవేటు ఏజెన్సీల ఇష్టారాజ్యాలు.. ఎన్నికల కోడ్ సమయంలోనూ గుడ్లు పెట్టిన అవినీతి బాతులు.. నియామక పత్రాలపై అధికారుల సంతకాలు.. గత ప్రభుత్వ పెద్దలు వెళుతూ వెళుతూ చేపట్టిన అడ్డగోలు బాగోతాలకు సజీవ సాక్ష్యాలు.. ప్రస్తుత కలెక్టర్ జె.నివాస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారికి సహకరించిన వారి ఆట కట్టింది. 37మందిపై వేటు పడింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల దందా అంతా కాదు. టీడీపీ నేతల బినామీలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలుగా అవతారమెత్తి, వారికి వివిధ శాఖల్లో ఉన్న పోస్టులను తాత్కాలిక పద్ధతిలో నియమించుకునే అధికారాన్ని దక్కించుకున్నారు. ఇంకేముంది చేతికొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను పట్టుకుని ఇష్టారీతిన నియామకాలు చేపట్టారు. నచ్చి నంత రేటు పెట్టి, పోస్టులు భర్తీ చేశారు. దాదా పు ప్రతి శాఖలో ఇదేరకంగా జరిగింది. కొంతవరకు నిబంధనలు అమలు చేసినా చాలావర కు ముడుపులే కొలమానంగా తీసుకుని నియామకాలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉం డగా సర్వశిక్షా అభియాన్‌లో చేపట్టిన నియామకాలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. సర్వశిక్షా అభియాన్‌లో ఏజెన్సీ అడ్డగోలు దందా.. సర్వశిక్షా అభియాన్‌లో గతేడాది 177 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ పోస్టులకు అభ్యర్థులను సరఫరా చేసే బాధ్యతను స్కాట్లాంట్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించింది. ఇంకేముంది అప్పట్లో సదరు ఏజెన్సీ చెలరేగిపోయింది. నియామకాల కోసం బేరసారాలు సాగించింది. కొంతవరకు పద్ధతిగా నియామకాలు చేపట్టగా, మరికొన్ని నియామకాల విషయంలో ముడుపులు ప్రామాణికంగా తీసుకుంది. వాస్తవానికైతే, ఆ నియామకాలు జరిగిన విధానంతో జిల్లా అధికారులకు సంబంధం లేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎంపిక చేసిన అభ్యర్థులు నిబంధనల మేరకు ఉన్నారా లేదా అన్నది చూసుకుని ఉన్నతాధికారుల అనుమతితో సర్వశిక్షా అభియాన్ అధికారులు జాయిన్ చేసుకుంటారు. ఈ విధంగా తొలి విడతగా 140మందిని జాయిన్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా రెండో విడత నియామకాలకొచ్చేసరికి ఉల్లంఘనకు దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామకాలు.. దాదాపు 37మందిని ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జాయిన్ చేసుకున్నారు. వీరి నియామకాల ఉత్తర్వులపై 2019 ఫిబ్రవరి 18 తేదీ కూడా పేర్కొని ఉంది. వారిని జాయిన్ చేసుకున్నట్టుగా 2019 మార్చి 18న నియామక ఉత్వర్వులపై ప్రస్తుత పీఓ శ్రీనివాసరావు సంతకం కూడా ఉంది. వాస్తవానికైతే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎటువంటి నియామకాలు చేపట్టకూడదు. అలాంటిది స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇచ్చిన ఉత్తర్వులపై పీఓ సంతకం చేయడం అనుమానాలకు తావిచ్చింది. దీనికంతటికీ అప్పుడే బదిలీపై వచ్చిన పీఓపై నాటి పాలకుల ఒత్తిడి, ప్రలోభాలే కారణమని తెలుస్తున్నది. అసలు ఈ అడ్డగోలు దందాకు తెరలేచింది గత పీఓ హయాంలోనని స్పష్టమవుతున్నది. ఆయన కాలంలోనే అన్నీ జరిగిపోగా, నియామకాలకు అనుమతి ఇవ్వాల్సివచ్చేసరికి బదిలీపై వెళ్లడంతో ఆ ప్రభావం తర్వాత వచ్చిన పీఓపై పడింది. ఏదేమైనప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇచ్చిన నియామక ఉత్తర్వులపై సంతకం చేయడం ప్రస్తుత పీఓను బోనులో నిలబెట్టింది. 37 మందిపై వేటు.. వాస్తవానికి రెండో విడతగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ చేపట్టిన 37 నియామకాలకు సంబంధించి స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. కానీ వీరి విషయంలో అదేమీ జరగలేదు. ఏకపక్షంగా నియామకాలు చేపట్టేసి, విధుల్లోకి కూడా తీసుకున్నారు. దీంతో వారంతా అనధికారిక వ్యక్తులుగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో వారికి జీతాలు విడుదల కాలేదు. అసలు అధికారిక అనుమతితో నియామకాలే జరగనప్పుడు వారికి జీతాలు ఎలా వస్తాయన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ వ్యవహారం ప్రస్తుత కలెక్టర్ జె.నివాస్ దృష్టికి వెళ్లింది. జరిగినదంతా పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామకాలు చేపట్టడమేంటని, నిబంధనలకు విరుద్ధమని వారందరీ నియామకాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఇంకేముంది అనుమతి లేని 37మందిపై వేటు పడింది. వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. నియామక ఉత్తర్వులపై సంతకాలు చేశాక, రెండు మూడు నెలలు పనిచేశాక తొలగించడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్తామని గగ్గోలు పెడుతున్నారు. సర్వశిక్షా అభియాన్‌ను వెంటాడుతున్న ఆరోపణలు.. సర్వశిక్షా అభియాన్‌ను నిత్యం ఆరోపణలు వెంటాడుతున్నాయి. నాటి నాన్ టీచింగ్ నియామకాలతోపాటు ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ కళాశాలల పార్ట్‌టైమ్ ఉద్యోగాల నియామకాల విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల్లో చేతులు మారాయన్నది సర్వసాధారణమైన ఆరోపణ అయిపోయింది. ఇవి ఒకవైపు ఉండగా, మరోవైపు బదిలీల రగడ కూడా ఇబ్బందికరంగా మారింది. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండానే ఇష్టమొచ్చినట్టు బదిలీలు చేసేశారని విమర్శలొచ్చాయి. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీనిపై శాఖాపరమైన విచారణకు ఉపక్రమించినట్టు తెలిసింది. సర్దుబాటు మాత్రమే చేశాను.. ఎన్నికలకు ముందు జిల్లాకు వచ్చాను. అప్పటికే ఉన్నవారిని ఇతరత్రా అవసరాల కోసం సర్దుబాటు చేశాను. అంతే తప్ప ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన నియామకాలపై నేనెటువంటి సంతకం చేయలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు 37మంది నియామకాలను రద్దు చేశాం. – బి.శ్రీనివాసరావు, సర్వశిక్షా అభియాన్ పీఓ ఎన్నికల కోడ్ విరుద్ధ నియామకాల రద్దు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామకాలు చేపట్టారు. ఆ 37 నియామకాలను రద్దు చేశాను. అనుమతి లేకుండానే వారి నియామకాలు చేపట్టారు. తర్వాత జరిగిన నియామకాలపై పరిశీలిస్తాను. –జె.నివాస్, కలెక్టర్ -
ఎస్ఎస్ఏ పోస్టులకు పైరవీలు
సాక్షి, నెల్లూరు (టౌన్) : సర్వశిక్ష అభియాన్ పోస్టులకు జోరుగా పైరవీలు జరుగుతున్నాయి. పోస్టును దక్కించుకునేందుకు పలువురు జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సర్వశిక్ష అభియాన్‌లో అవుట్ సోర్సింగ్ కింద 102 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ బాధ్యతను రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించింది. దీంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోస్టును రూ.2 నుంచి రూ.3లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు రావడంతో అప్పటి కలెక్టర్ ముత్యాలరాజు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మెరిట్ ప్రకారం జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ పోస్టులపై కదలిక వచ్చింది. రూపేష్ సంస్థ ఒక జాబితాను సిద్ధం చేసి సర్వశిక్ష అభియాన్‌కు పంపింది. ఈ జాబితాలో నగదు తీసుకుని అనర్హుల పేర్లును చేర్చారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కాగా పోస్టులను దక్కించుకునేందుకు పలువురు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 102 పోస్టుల భర్తీ సర్వశిక్ష అభియాన్‌లో అవుట్ సోర్సింగ్ కింద 102 పోస్టులను భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నవంబరు 11న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల భర్తీ బాధ్యతను రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించింది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.14 వేల నుంచి రూ.21వేల వరకు వేతనం ఇవ్వనున్నారు. ఎస్ఎస్ఏలో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీపీఓ)–1, డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఎంఆర్సీ)–1, ఎంఐఎస్ కోఆర్డినేటర్–1, డీఎల్ఎంటీఎస్–1, కేజీబీవీ అటెండర్–1, సీఆర్పీలు–27, ఆర్ట్ ఎడ్యుకేషన్–20, వర్క్ ఎడ్యుకేషన్–5, పీఈటీలు–45 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టుల విద్యార్హతను నోటిఫికేషన్లో ప్రకటించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆరోపణలతో నిలిపివేత సర్వశిక్ష అభియాన్ అవుట్ సోర్సింగ్ పోస్టుల నియామకంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పోస్టుకు రూ.2లక్షలు నుంచి రూ.3 లక్షల వరకు ఏజెన్సీ నిర్వాహకులు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి కలెక్టర్ ముత్యాలరాజు తాత్కాలికంగా పోస్టుల భర్తీని నిలిపివేశారు. మెరిట్ ప్రకారం జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు జిల్లాల్లో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. మళ్లీ ఈ పోస్టులపై కదలిక వచ్చింది. పోస్టులను భర్తీ చేయాలని మార్చిలో రాష్ట్ర సర్వశిక్ష అభియాన్‌కు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో పోస్టుల నియామకాన్ని పూర్తి చేశారు. జిల్లాలో మాత్రం నియామకాలను చేపట్టలేదు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పోస్టుల భర్తీని నిలిపివేశామని ఎస్ఎస్ఏ అధికారులు చెబుతున్నారు. జోరుగా పైరవీలు సర్వశిక్ష అభియాన్‌లో అవుట్సోర్సింగ్ పోస్టుల నియామకాలపై జోరుగా పైరవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు పోస్టును దక్కించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల ద్వారా రూపేష్ సంస్థకు నగదు ఇచ్చినట్లు సమాచారం. వారంతో ఇప్పుడు పోస్టులు ఇవ్వాలంటూ రూపేష్ సంస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. మరికొందరు అభ్యర్థులు నాయకుల ద్వారా జిల్లా ఉన్నతాధికారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. రూపేష్ సంస్థ నిర్వాహకులు మాత్రం రెండు నెలల క్రితమే జాబితాను ఎస్ఎస్ఏ అధికారులకు చేర్చామంటూ చెబుతున్నారు. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఎస్ఎస్ఏ అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్ వద్దకు ఇంకా జాబితాను చేర్చలేదు. ఈ జాబితాపై కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. పోస్టుల భర్తీ నియామకంలో పైరవీలకు అవకాశమిస్తారో లేక మెరిట్ జాబితాను సిద్ధం చేసి అర్హత ఉన్న అభ్యర్థులకే పోస్టులు ఇస్తారో వేచి చూడాల్సిందే. వివరాలను పరిశీలించాల్సి ఉంది రెండ్రోజుల క్రితమే ఇన్చార్జి పీఓగా బాధ్యతలు తీసుకున్నా. ఔట్ సోర్సింగ్ నియామకాల వివరాలు తెలియదు. త్వరలో పోస్టుల నియామకాలపై కలెక్టర్‌ను సంప్రదించి అర్హులైన అభ్యర్థులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. – జనార్దనాచార్యులు, ఇన్చార్జి పీఓ, ఎస్ఎస్ఏ -
ఏమిటీ శిక్ష?
సాక్షి, విజయనగరం: సర్వశిక్ష అభియాన్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా ఎంపికైన యాభై ఎనిమిది మందికి నేటికీ నియామక పత్రాలు అందలేదు. గతంలో ప్రాజెక్టు ఆఫీసర్ చేపట్టిన నియామకాలపై అభ్యంతరాలున్నాయని ప్రస్తుత పీఓ అంటుంటే ... జిల్లా కలెక్టర్ అనుమతిచ్చినా ప్రాజెక్టు ఆఫీసర్ అడ్డుతగులుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. నిజానికి సమాధానం చెప్పాల్సిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ముఖం చాటేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. చేసేది లేక అభ్యర్థులంతా సర్వశిక్ష అభియాన్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. జిల్లాలో సర్వశిక్షాభియాన్ ఆధ్వర్యంలోని కేజీబీవీ పరిధి వివిధ కేటగిరీలో ఉన్న నాన్ టీచింగ్ 134 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీకి గతేడాది ఎంపిక ప్రక్రియ చేపట్టి, పూర్తి చేశారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ 58 మందిని వివిధ పోస్టులకు ఎంపిక చేసి జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. గతేడాది డిసెంబర్లో కలెక్టర్ ఆ జాబితా ను అనుమతించారు. ఈ మేరకు 58 మంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా అదే నెలలో విడుదల చేశారు. శాపంగా మారిన పాత పీఓ బదిలీ ఈ నియామక ప్రక్రియ జరిగిన సమయంలో ఎస్ఎస్ఏ పీఓగా ఉన్న బి.శ్రీనివాసరావు రాజకీయ కారణాలతో బదిలీ అయ్యారు. అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరా వు, కిమిడి కళావెంకటరావు మధ్య జరిగిన అంతర్యుద్ధ్ధం లో భాగంగా ప్రస్తుత పీఓ ఎం.కృష్ణమూర్తి నాయుడు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన వచ్చేనాటికే సిద్ధమైన 58 మంది జాబితాను విడుదల చేయకుండా రెండు నెలల పాటు తాత్సారం చేశారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ వెంటనే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చాయి. ఫలితంగా నియామక ఆదేశాలున్నప్పటికీ అభ్యర్థులకు పోస్టులు రాలేదు. ఇతర జిల్లాల్లో వీరితోపాటే ఎంపిక చేసిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి నా... ఇక్కడే పెండింగ్‌లో ఉండిపోయింది. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఎంపికైన అభ్యర్థులు పలుమార్లు కలెక్టర్‌ను కలిశారు. అప్పటి ఆదేశాల మేరకు పోస్టులను పీఓ ఇస్తారని ఆయన చెప్పడంతో అభ్యర్థులు పీఓ కృష్ణమూర్తి నాయుడు వద్దకు వెళ్లారు. కానీ అక్కడ వారికి ప్రతికూల సమాధానం వచ్చింది. తమకు న్యా యం చేయాలని వారంతా సర్వశిక్షాభియాన్ చుట్టూ తిరుగున్నారు. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీతో పాత ఏజెన్సీల కాలపరిమితి ముగుస్తుందని ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి వారు కలెక్టరేట్ గురువారం వచ్చి కలెక్టర్‌ని కలిసి వేడుకున్నారు. కొత్తగా ఆదేశాలివ్వక్కర్లేదని అప్పటి ఆదేశాలతో పోస్టులను పీఓ ఇవ్వాలని అభ్యర్థులకు కలెక్టర్ హరిజవహర్‌లాల్ వివరించారు. వారు మళ్లీ పీఓ వద్దకు వెళ్లారు. అక్కడ వారికి పాతకథే ఎదురైంది. అయితే గత పీఓ చేపట్టిన నియామక ప్రక్రియలో అభ్యం తరాలున్నాయని ప్రస్తుత పీఓ కృష్ణమూర్తి చెబుతున్నారు. అభ్యర్థులు న్యాయం అడగాల్సింది ఔట్సోర్సింగ్ ఏజెన్సీని లేదా పాత అధికారినేగాని తనను కాదని ఈయన చెబుతున్నారు. మొత్తమ్మీద వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
రెగ్యులర్ టీచర్లు ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పారా టీచర్ సహా ఏ రకమైన పేరుతో తాత్కాలిక టీచర్లు ఉన్నా ఆ వ్యవస్థను తొలగించాల్సిందేనని నూతన విద్యా విధానం ముసాయిదా రూపొందించిన కమిటీ సిఫారసు చేసింది. ‘సమాజంలో సుదీర్ఘకాలం ఉండే బలమైన బంధాన్ని కల్పించేది విద్యా వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో టీచర్లే కీలకం. పారా టీచర్, శిక్షా కర్మి, శిక్షా మిత్ర తదితర పేర్లతో ఉండే తాత్కాలిక టీచర్లు ఆ పనిని పక్కాగా చేపట్టలేరు. అందుకే 2022 నాటికి తాత్కాలిక టీచర్ల వ్యవస్థను రద్దు చేయాల్సిందే’అని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో గతంలో పారా టీచర్ల వ్యవస్థ ఉన్నా, సర్వ శిక్షా అభియాన్ వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో విద్యా వలంటీర్ల పేరుతో ఉపాధ్యాయ ఖాళీల్లో తాత్కాలిక టీచర్ల నియామకాలను ప్రభుత్వం చేపడుతోంది. రెగ్యులర్ టీచర్ల నియామకాలు ఆలస్యమైనప్పుడు, నియామకాలు సకాలంలో చేపట్టలేకపోయినప్పుడు, పాఠశాలల్లో టీచర్ల అవసరం ఏర్పడినప్పుడు విద్యా వలంటీర్లను నియమించి ప్రభుత్వం విద్యా బోధనను కొనసాగిస్తోంది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందాలన్నా, సమాజ నిర్మాణం సరిగ్గా ఉండాలన్నా రెగ్యులర్ టీచర్లతోనే సాధ్యం అవుతుందని కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా లేని నియామకాలు.. రాష్ట్రంలో 2012 డీఎస్సీ నియామకాల తరువాత కొత్త టీచర్లు బడులకు రాలేదు. 2017లో నోటిఫికేషన్ జారీ చేసి 8,792 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినా నియామకాలు పూర్తి కాలేదు. న్యాయ వివాదాలు, ఎలక్షన్ కోడ్ పేరుతో కొన్నాళ్లు, విద్యా శాఖ అధికారులు పట్టించుకోక మరికొన్నాళ్లు ఆలస్యమైంది. మళ్లీ ఇప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్ వంటి కొన్ని పోస్టుల భర్తీ వ్యవహారం కూడా న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. దీంతో పోస్టుల భర్తీ ఆలస్యం అవుతూనే ఉంది. వివాదాలు లేని పోస్టుల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో బడులకు కొత్త టీచర్లు రాలేని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి వేలల్లో విద్యా వలంటీర్లు.. రాష్ట్రంలో గత ఏడేళ్లుగా రెగ్యులర్ టీచర్లు లేకపోవడంతో విద్యా వలంటీర్లతోనే పాఠశాలలను కొనసాగించాల్సి వస్తోంది. ఏటా కనీసం పది వేల మందికి తగ్గకుండా విద్యా వలంటీర్లను నియమిస్తూ పాఠశాలల్లో విద్యా బోధనను విద్యాశాఖ కొనసాగిస్తోంది. ఉపాధ్యాయ ఖాళీలు, అదనపు అవసరం ఉన్న స్కూళ్లలో మొత్తంగా గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లను నియమించి విద్యా బోధనను కొనసాగించిన విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరంలోనూ అదే చర్యలు చేపట్టింది. చివరకు విద్యా వలంటీర్ల నియామకం విషయంలోనూ కోర్టు ఆదేశాలు ఇస్తే తప్ప ముందుగా నియమించలేని పరిస్థితికి చేరుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది కూడా గతేడాది నియమించిన విద్యా వలంటీర్ల సంఖ్యకు మించకుండా నియమించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో విద్యా వలంటీర్ల రెన్యువల్‌కు చర్యలు చేపట్టింది. సిఫారసుల మేరకైనా వేగవంతం చేయాలి.. రాష్ట్రంలోని పాఠశాలల్లో రెగ్యులర్ టీచర్ల నియామకం విషయంలో గత ఏడేళ్లుగా తంటాలు తప్పడం లేదు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకున్నా నియామకాల వ్యవహారం ముందుకు సాగడం లేదు. మహబూబ్‌నగర్‌లో టీచర్లు లేరంటూ హైకోర్టులో పిల్ దాఖలు అవ్వడంతో ప్రభుత్వం స్పందించి తాత్కాలికంగా విద్యా వలంటీర్లను నియమించి బోధన కొనసాగిస్తోంది. ప్రస్తుతం నూతన విద్యా విధానం ముసాయిదాలో 2022 నాటికి ఎలాంటి పేరుతోనూ తాత్కాలిక టీచర్లు ఉండొద్దని, ఆ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని, రెగ్యులర్ టీచర్లు ఉండాల్సిందేనని పేర్కొంది. అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత అయినా రాష్ట్రంలో రెగ్యులర్ టీచర్ల నియామకాలు వేగవంతం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అడ్డగోలు దోపీడీ
-
సమగ్ర (ఆకలి)శిక్షా అభియాన్ !
చిత్తూరు, పీలేరు : సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాం ట్రాక్ట్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. రెం డు నెలలుగా జీతాలు అందకపోవడంతో అతికష్టం పై బతుకు బండిని లాక్కొస్తున్నారు. జీతాలు ఎప్పు డు ఖాతాల్లో జమవుతాయోనని నిరీక్షిస్తున్నారు. జిల్లా సమగ్ర శిక్షా అభియాన్‌లో 807 మందికిపైగా పనిచేస్తున్నారు. వారిలో 350 మంది సీఆర్పీలు, 66 మంది ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, 66 మంది డేటా ఎంట్రీలు, 325 మంది పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు, 120 మంది ఐఈఆర్టీ ఉపాధ్యాయులు, 66 మంది మెసెంజర్లు, 10 నుంచి 12 మంది డివిజనల్ మానిటరింగ్ బృందం, మరి కొంత మంది జిల్లా సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్పీలకు నెలకు రూ. 17,600, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లకు రూ. 19100, డేటా ఎంట్రీలకు రూ. 17,600, పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లకు రూ. 14,200, ఐఈఆర్టీ ఉపాధ్యాయులకు రూ. 20250, ఆయాకు రూ. 4,500 జీతంగా చెల్లిస్తారు. ప్రతి నెలా 15వ తేదీపైన 30వ తేదీలోపు జీతాలు ఇవ్వడం సాధారణంగా మారింది. రెండు నెలలుగా వీరికి జీతాలు అందలేదు. మార్చి, ఏప్రిల్‌కు సంబంధించిన జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖలో వీరి పాత్ర కీలకం జిల్లా విద్యాశాఖలో సమగ్ర శిక్షాఅభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర కీలకమైంది. సీఆర్పీలు ప్రతి రోజూ ఒక పాఠశాలను సందర్శించి ఆన్లైన్ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం పంపాలి. ప్రభుత్వం ఏర్పాటుచేసే ప్రతి కార్యక్రమంలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. విద్యాసంబంధమైన కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషించాలి. బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం, వారి నమోదు తర్వాత నిలకడ కోసం కీలకంగా వ్యవహరించాలి. రెగ్యులర్ పాఠశాలల్లో వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణ, పరీక్షపత్రాల పంపిణీ, ఆధార్ సీడింగ్, ఎన్రోల్మెంట్ డ్రైవ్, జియో ట్యాగింగ్ సర్వే, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాల్లో కీలక పోత్ర పోషిస్తారు. డేటా ఎంట్రీలు రోజూ జిల్లా విద్యాశాఖకు సంబంధించిన గణాంకాలను పూర్తి చేయడం, ఉపాధ్యాయుల జీతభత్యాలు, సెలవుల నమోదు, మధ్యాహ్న భోజనం తదితర కార్యక్రమాలపై గణాంకాలు ఆన్లైన్ ద్వారా జిల్లా విద్యాశాఖకు పంపాలి. ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు...విద్యార్థుల నమోదు, పాఠశాలల పనితీరు, వివరాలు సేకరించాలి. ఆయా పాఠశాలల పరిధిలోని విద్యార్థుల సమగ్ర నివేదిక రూపొందించడం, వివిధ ప్రాంతాల నుంచి రోజువారీ విద్యార్థుల ట్రాన్స్పోర్ట్ తదితర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా జిల్లా అధికారులకు పంపాల్సి ఉంటుంది. ఇంత చేస్తున్నా సకాలంలో జీతాలు అందలేదని పలుమార్లు సంబంధిత జిల్లా అధి కారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. టీఏ కూడా పెండింగ్ సీఆర్పీలకు 2018 జూలై నుంచి (దాదాపు 10 నెలలుగా) నెలనెలా రావాల్సిన టీఏ రూ. 600 ఇప్పటివరకూ మంజూరుకాలేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో టీఏ బిల్లులు చెల్లించినా చిత్తూరులో ఇవ్వలేదు. గతంలో నిర్వహించిన స్లాష్ పరీక్షలు, కోడింగ్‌కు చెల్లించాల్సిన నగదు ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. -
ష్.. గప్‌చుప్‌గా కానిచ్చేయండి..!
సాక్షి, ఒంగోలు టౌన్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పాత డేట్లతో పోస్టింగ్ ఆర్డర్లు జారీచేసి వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలంటూ ఆ శాఖ అధికారి నుండి ఫోన్లు వెళ్లాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే పాత తేదీలతో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చి సంబంధిత అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. వివరాలు.. సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేసేందుకు దఫాలు వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ మొదలుకొని కింది స్థాయి వరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టారు. కొన్ని పోస్టులను రాత పరీక్ష ద్వారా మరికొన్ని పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లు, సీఆర్పీలు, పీఈటీలకు సంబంధించి 57 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి పోస్టుల భర్తీకి అవకాశం వచ్చిన్నా ఆ ఏజెన్సీతో సంబంధం లేకుండానే తాము అనుకున్న వారికి పాత డేట్లు వేసి పోస్టింగ్‌లు ఇవ్వడం వివాదాస్పదమైంది. పాత డేట్లతో పోస్టింగ్‌లు సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, క్లస్టర్ రీసోర్స్ పర్సన్, పీఈటీ వంటి పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఏమైందో ఏమోగానీ ఈ పోస్టులతో పాటు ప్రకటించిన స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. అదే సమయంలో ఈ పోస్టులను తాత్కాలికంగా నిలిపేశారు. మొత్తం మీద ఆ పోస్టులను కూడా భర్తీ చేసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదమైంది. రానా ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ చేసుకునేందుకు ఆ ఏజెన్సీకి ఈ నెల 10వ తేదీ అనుమతి వచ్చింది. అదేరోజు సాయంత్రం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయడంతో ఆ శాఖలో కీలకమైన వ్యక్తికి ‘మనీ’లాంటి ఆలోచన వచ్చింది. ఔట్ సోర్సింగ్ పోస్టులకు ఎలాగూ అనుమతి వచ్చింది కదా అని పాత డేట్లతో పోస్టింగ్ ఆర్డర్లను పుట్టించడం వివాదాస్పదమైంది. సంబంధిత పోస్టుల భర్తీకి పాత డేట్లు వేసి విధుల్లో చేరాలంటూ కొంతమంది ఎస్ఓలపై ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. కీలకమైన ఆ వ్యక్తి సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి 8, 9వ తేదీల్లో విధుల్లో చేరినట్లుగా చూపించాలని సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. కొంతమంది ఆ ఫోన్లకు భయపడి పాత డేట్లతో విధుల్లో చేరినట్లుగానే చూపించేశారు. మరికొంతమంది మాత్రం ఎక్కడ మా ఉద్యోగాలు ఊడతాయోనన్న భయంతో కొద్దిగా సంశయించినా ఒత్తిడి అధికం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాత డేట్లతో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని చేర్చుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు జిల్లాలోని అన్ని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో వాటి రక్షణకు సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఎవరు అడుగు పెట్టినా ఆ క్షణం నుంచే సీసీ కెమేరాల్లో రికార్డు అవుతోంది. జిల్లాలోని పలు కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా విధుల్లో చేరేందుకు పాత తేదీలతో వచ్చిన వారి కదలికలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ. సీసీ కెమెరాలను ఆధారం చేసుకొని సమగ్ర విచారణ జరిపితే కేజీబీవీల్లో ఏం జరుగుతుందో ఇట్టే అర్థమవుతోంది. సంబంధిత అభ్యర్థి ఏ రోజు విధుల్లో చేరారన్నది కూడా స్పష్టంగా తెలియనుంది. పైపెచ్చు ఔట్ సోర్సింగ్ ద్వారా పోస్టులను భర్తీ చేసే సమయంలో రోస్టర్ విధానాన్ని పాటించకుండా, ఓపెన్ కేటగిరి(ఓసీ)కి సంబంధించిన పోస్టులనే భర్తీ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఓసీకి సంబంధించిన వారు అయితే తాము డిమాండ్ చేసిన విధంగా సమర్పిస్తారన్న ఉద్దేశంతో వన్‌సైడ్‌గా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ‘చిరు’ ప్రభావం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ కింద నిబంధనలకు విరుద్ధంగా పోస్టులను భర్తీ చేసిన విషయంలో ఆ శాఖకు చెందిన కీలకమైన అ««ధికారితో పాటు మరో కీలకమైన వ్యక్తి చక్రం తిప్పారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ శాఖకు చెందిన మంత్రికి అత్యంత దగ్గర బంధువైన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాల్లో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికితోడు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసిన పోస్టుల్లో రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ కింద తీసిన వాటిలో ఓసీలకు సంబంధించిన పోస్టులకే పచ్చజెండా ఊపడం చర్చనీయాంశమైంది. ఓసీలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఎక్కువగా తూగుతారని, ఇతరులైతే తాము డిమాండ్ చేసినంత ఇచ్చుకోలేరన్న ఉద్దేశంతో సరికొత్త విధానానికి తెరలేపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. -
పడకేసిన భవిత
విజయనగరం అర్బన్: ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రత్యేక బోధనా విధానం నిర్లక్ష్యానికి గురవుతుంది. దీంతో ప్రత్యేకావసరాల చిన్నారులు దానిపై ఆసక్తి చూపడం లేదు. మరోవైపు బోధన కోసం కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన పరికరాలు, నిర్మించిన భవనాలు అలంకార ప్రాయంగా మారాయి. వారి కోసం నియమించిన ఉపాధ్యాయుల (ఐఈఆర్టీ)ను సైతం వేరే అవసరాలకు వినియోగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలకు చికిత్స చేయాల్సిన ఫిజీషియన్ పోస్టులు భర్తీ చేయకపోవడం, పర్యవేక్షణ కొరవడడంతో ఈ కేంద్రాల భవిత అగమ్యగోచరంగా ఉంది. సర్వశిక్షా అభియాన్ నేతృత్వంలో.. జిల్లాలో సర్వశిక్షాభియాన్ ద్వారా మానసిక, శారీరక వికలాంగులైన చిన్నారులు దైనందిక కార్యక్రమాలను స్వయంగా నిర్వహించుకునేలా తర్ఫీదు ఇచ్చేందుకు 12 భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 6 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు శిక్షణ ఇచ్చేందుకు మండలానికి ఇద్దరేసి చొప్పున ఐఈఆర్టీలు నియమించారు. జిల్లాల్లో 34 మండలాలను కలుపుతూ 12 భవిత, 12 నాన్ భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 5 రకాల ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు 546 మంది ఈ కేంద్రాల్లో అభ్యన పొందుతున్నారు. గతేడాది చివర్లో ‘సహిత’ పేరుతో నిర్వహించిన సర్వేలో 6,923 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. కానీ సర్వే చేయడంలో చూపిన శ్రద్ధ వారిని భవిత కేంద్రాల్లో చేర్పించడంలో చూపలేదు. తాజా నమోదులో కేవలం 546 మంది మాత్రమే ఉండడంపై వాటి సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థమవుతుంది. ఐఈఆర్టీలు చిన్నారులతో ఆక్షరాలు దిద్దించడం, ఆటలు నేర్పించడం వంటివి చేయాలి. ఇందుకు అవసరమైన ఆట వస్తువులు కూడా సర్వశిక్షా అభియాన్ ద్వారా సరఫరా చేశారు. ఫిజీషియన్స్ లేకుండానే థెరిపీ చికిత్సలు.. జిల్లాలోని 34 మండలాల పరిధిలోని 12 భవిత, 12 నాన్ భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఫిజియోథెరిపీ చికిత్సలు ఇతరల సేవలు అందించడానికి 9 మంది ఫిజీషియన్ వైద్యుల అవసరం ఉంది. ప్రస్తుతం 5 మంది మాత్రమే భవిత కేంద్రాల పరిధిలోని చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. అన్ని కేంద్రాల్లో ఫిజియోథెరిపీ సేవలు అందిస్తున్నట్లు నివేదికలు చూపి నిధులు డ్రా చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిరుపయోగంగా పరికరాలు.. ప్రత్యేక అవసరాల చిన్నారులకు వ్యాయామం, విద్య అందించేందుకు జిల్లాలోని 12 భవిత కేంద్రాల్లో పదేసి లక్షల వ్యయంతో నిర్మించిన భవనాలు, చిన్నారుల హాజరుశాతం పడిపోవడంతో పరికరాలు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు విద్యను బోధించటానికి మండలానికి ఇద్దరేసి చొప్పున ఐఈఆర్టీలను నియమించాలి. జిల్లాలో ఇంకా ఐదు ఐఈఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరువైన ఆదరణ.. కేంద్రాలు ప్రారంభించిన తొలినాళ్లలో మానసిక, శారీరక వికలాంగులైన చిన్నారులకు కేంద్రాల్లో చక్కటి సేవలు అందాయి. వైద్య పరీక్షలు, వ్యాయామం, బోధన జరిగింది. తొలుత గ్రామాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పిల్లల హాజరు శాతం తగ్గడంతో మండల కేంద్రాలకు తరలించారు. దీంతో ప్రత్యేకావసరాల పిల్లల తల్లిదండ్రులు వారిని తీసుకొచ్చేందుకు ఇష్టపడడం లేదు. అధికారుల లెక్కల ప్రకారం 6,600 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఉన్నా, కేవలం 546 మందికి మాత్రమే సేవలందిస్తున్నారంటే ఆ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఐఈఆర్టీలను ఇతర పనులకు వినియోగించడం కూడా ప్రస్తుత ఈ పరిస్థితి కారణం. ఐఈఆర్టీల విధులు.. ♦ గ్రామాల్లో ఇంటింటి సర్వే ద్వారా గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఆవాస ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయాలి. ♦ కేంద్రాలకు సమీపంలోని పిల్లలను భవిత కేంద్రాలకు తరలించి, విద్యా బుద్ధులు నేర్పించాలి. ♦ వీరికి సహాయకులుగా కేర్ గివింగ్ వలంటీర్ పనిచేస్తారు. పిల్లలను కేంద్రాలకు తీసుకువచ్చే తల్లిదండ్రులకు ప్రయాణ భత్యంగా నెలకు రూ.250 చెల్లిస్తారు. ♦ ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిన విద్యార్థులతో పాటు వీరికి కూడా మధ్యాహ్న భోజనం అందించాలి. యూనిఫాం ఇవ్వాలి. ♦ కదల్లేని, మెదల్లేని పిల్లలకు ఎస్కార్ట్ అలవెన్స్‌గా రూ.250 చెల్లిస్తారు. -
బడి బిల్లు కట్టేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బిల్లు చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రాథమిక విద్యాశాఖ విడుదల చేసిన నిధులు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఆ జిల్లాల్లోనే మగ్గిపోతున్నాయి. మరోవైపు పాఠశాలలు బిల్లులు చెల్లించకపోవటంతో ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఏంచేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు. వాస్తవానికి గత విద్యా సంవత్సరం వరకు విద్యుత్ బిల్లులను కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించిన నిధులతో చెల్లింపులు జరిపేవారు. ఉన్నత పాఠశాలలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ), ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ద్వారా బిల్లులు చెల్లించేది. తాజాగా ఈ బిల్లు చెల్లింపులను ప్రభుత్వమే చేస్తుందని పాఠశాల విద్యాశాఖ(డీఎస్ఈ) స్పష్టం చేసింది. ఈమేరకు ఆ శాఖ సం చాలకులు టి.విజయ్‌కుమార్ గతనెలలో ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల వారీగా పెండింగ్ బిల్లుల సమాచారాన్ని సేకరించి ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీఎస్ఈ నుంచి ఉత్తర్వులు వచ్చి నెలరోజులు గడుస్తున్నా వాటిపై క్షేత్రస్థాయిలో విద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యుత్ బకాయిలు రూ.18 కోట్లు రాష్ట్రంలో 26,114 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు నెలకు సగటున రూ.500 వరకు విద్యుత్ బిల్లు వస్తోంది. కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదుల నిర్వహణతో పాటు ఇతర ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాల వినియోగాన్ని బట్టి బిల్లుల్లో మార్పులు ఉంటున్నాయి. దీంతో సగటున ఒక ఉన్నత పాఠశాలలో నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు విద్యుత్ బిల్లులు నమోదవుతున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో దాదాపు ఆర్నెల్లకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో రూ.18 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఇటీవల 13 జిల్లాలకు రూ.1.04 కోట్లు చొప్పున విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.40 లక్షలు, ఉన్నత పాఠశాలలకు రూ.64 లక్షలు విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో పాఠశాలల వారీగా బకాయిల వివరాలు తెప్పించుకుని ఆమేరకు చెల్లించాలని డీఎస్ఈ ఆదేశించింది. కానీ, ఆ 13 జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచి స్పష్టమైన సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు సేకరించలేదు. దీంతో డీఎస్ఈ విడుదల చేసిన నిధులు ఆయా జిల్లాల్లోనే మగ్గిపోయాయి. మరోవైపు ఆర్నెల్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ కనెక్షన్‌ను తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. -
పండగ పూటా పస్తులే..
రాయవరం (మండపేట) : పండగ వస్తుందంటే ఎవరికైనా సరదా ఉంటుంది. అందులోనూ దసరా పండగ అంటే అందరికీ సరదాయే. కానీ రెండు నెలలుగా వేతనాలకు నోచుకోని సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం దసరా పండగ సరదా లేకుండా సాగిపోయింది. రానున్న దీపావళికైనా తమ బతుకుల్లో వెలుగు విరబూస్తాయా అనే ఆశతో వీరంతా ఉన్నారు. అసలే అరకొర వేతనంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వీరికి, రెండు నెలలుగా జీతాలు రాక పోవడంతో వడ్డీలకు అప్పులు తెచ్చి జీవనం సాగిస్తున్నారు. రూ.6 కోట్ల బకాయిలు... జిల్లాలోని సర్వశిక్షా అభియాన్ పరిధిలో 64 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 64 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 322 మంది సీఆర్పీలు, 64 మంది మెసెంజర్లు, 736 మంది పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లు, 128 మంది ఐఈఆర్టీలు, 15 మంది డీఎల్ఎంటీలు, 250 మంది వరకు కేజీబీవీ సిబ్బంది, 24 మంది సైట్ ఇంజినీర్లు, 64 మంది భవిత కేంద్రాల ఆయాలు పని చేస్తున్నారు. వీరికి నెలకు సుమారుగా రూ.3 కోట్ల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. జూలై నెల వరకు వేతనాలు మంజూరయ్యాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి వేతనాలు మంజూరు కాలేదు. దీంతో జిల్లాలో ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6 కోట్ల వరకు వేతన బకాయిలు చేరుకున్నాయి. పండుగ పూటా పస్తులతోనే... రెండు నెలలుగా వేతనాలు రాక పోవడంతో దసరా పండుగ ఉసూరుమంటూ గడిపామని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అరకొరగా ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదంటున్నారు. హెచ్ఆర్ పాలసీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, నెల నెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమతో సక్రమంగా పని చేయించుకుంటున్న ప్రభుత్వం మాత్రం సమయానికి వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నాం... రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పండుగ సమయంలోనైనా ముందుగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. చాలా మంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వెంటనే వేతన బకాయిలు చెల్లించాలి. – ఎం.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘం,అల్లవరం మండలం బడ్జెట్ రాగానే చెల్లిస్తాం... కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బడ్జెట్ ఇంకా రాలేదు. బడ్జెట్ రాగానే అందరు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తాం. ఉద్యోగుల ఇబ్బందులను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. – మేకా శేషగిరి, పీవో, సర్వశిక్షా అభియాన్, కాకినాడ -
చలో ప్రగతి భవన్.. ఉద్రిక్తత
-
స్కూళ్లకు సున్నాలు అంటూ నిధులకు కన్నాలు
-
బుక్కుల్లో బొక్కేశారు!
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీలనూ అధికార పార్టీ నేతలు వదలడం లేదు. గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోళ్ల పేరుతో రూ.4.66 కోట్ల సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులను మింగేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడితోపాటు ఓ ఉన్నతాధికారి ఇందులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందినా అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో విచారణ ముందుకు సాగడం లేదు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి వచ్చినా ఈ వ్యవహారానికి అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. అసలు రేట్లను భారీగా పెంచేసి... బెంగళూరుకు చెందిన ‘డ్రీమ్‌వరల్డ్ ఇండియా’ సీడీలు, డీవీడీలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామని రెండేళ్ల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావుకు 16 రకాల పుస్తకాలతో ప్రతిపాదనలు అందచేసింది. పుస్తకాల వాస్తవ ధరలపై 71 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామనడంతో ఎస్ఎస్ఏ ద్వారా పుస్తకాల కొనుగోలుకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్ఈఆర్టీ) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన తరువాత 11 రకాల పుస్తకాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక్కడే గోల్‌మాల్‌కు తెరలేచింది. ముందుగా చెప్పిన్నట్లు కాకుండా పుస్తకాల ధరను పెంచేశారు. డిస్కౌంట్‌ను 71 శాతానికి బదులు 30 శాతానికి పరిమితం చేశారు. ఉదాహరణకు ప్రభుత్వానికి ముందుగా సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ‘స్పిరిట్ ఆఫ్ ఇండియా’ పుస్తకం ధర రూ.1495 ఉంటే ఎస్పీడీ ప్రతిపాదనల్లో అది రూ.2,495కి పెరిగింది. ‘ఓషన్ రిలీవింగ్ ద సీక్రెట్స్ ఆఫ్ డీప్’ పుస్తకం ధర రూ.1,000 నుంచి రూ.1995కి పెంచేశారు. ‘అట్లాస్ ఆఫ్ మై వరల్డ్’ పుస్తకం ధర రూ.695 నుంచి రూ.1,495కు పెంచేశారు. ‘డబుల్’ దందా! వాస్తవానికి తొలుత పేర్కొన్న ధరల ప్రకారం 11 పుస్తకాల సెట్టు ధర రూ.7,200 మాత్రమే. కానీ తరువాత ధరను అమాంతం రూ.13,489కి పెంచారు. రాష్ట్రంలోని 11,217 ప్రాథమికోన్నత పాఠశాలలకు పంపిణీ చేయడానికి రూ.15,13,06,113 అవుతుందని అంచనాలు రూపొందించారు. అయితే తరువాత స్కూళ్ల సంఖ్యను 7,413కి కుదించారు. ఆ ప్రకారం రూ. 9,99,93,957 అవుతుందని లెక్కగట్టారు. ఆమేరకు పుస్తకాలను పాఠశాలలకు అందించాలని జిల్లా ప్రాజెక్టు అధికారులకు ఎస్ఎస్ఏ ఎస్పీడీ ఆదేశాలు జారీచేశారు. మండల పాయింట్లకు డ్రీమ్‌వరల్డ్ సంస్థే పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉన్నా కేవలం జిల్లా కేంద్రాలకు అందించేలా ఎస్ఎస్ఏ వెసులుబాటు కల్పించడంతోపాటు జిల్లా కార్యాలయాల నుంచి చెల్లింపులు చేయించారు. ఫైల్‌ను ముందు ముఖ్యకార్యదర్శికి పంపి ఆమోదం పొందాల్సి ఉన్నా అందుకు భిన్నంగా ఆర్డర్లు ఇచ్చిన తరువాత ఫైలును పంపడం గమనార్హం. ఉన్నతాధికారులు మంత్రికి నివేదించినా... డ్రీమ్‌వరల్డ్ తొలుత ప్రభుత్వానికి అందించిన ధరల ప్రతిపాదనల పత్రాలు ఫైల్లో లేకపోవడం, వాటి స్థానంలో అధిక ధరలతో వేరే పత్రాలు ఉండడాన్ని ముఖ్యకార్యదర్శి గుర్తించారు. ముందుగా ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఒక్కో సెట్టు వాస్తవ ధర రూ.7,200 కాగా రూ.6,289 చొప్పున అదనంగా రేటు పెంచి రూ.13,489 చేశారు. 11 పుస్తకాల సెట్టు రూ.7200 చొప్పున 7,413 సెట్లకు రూ.5,33,73,600 మాత్రమే అవుతుంది. అయితే ఎస్ఎస్ఏ ఎస్పీడీ కొత్త ధరల పట్టికను చూపిస్తూ రూ.13,489 చొప్పున రూ.9,99,93,957 చెల్లింపులు చేశారు. పుస్తక ధరలను నిర్ణయించేందుకు రాష్ట్ర పుస్తక ప్రచురణ విభాగం ఉన్నా దానితో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా ధరలను ఖరారు చేయించారు. ఎస్ఎస్ఏ ఫైల్లో ధరలు భారీగా పెరగడంపై ఉన్నతాధికారులు మంత్రికి నివేదించినా ఫలితం లేకపోయింది. అసలది పబ్లిషింగ్ సంస్థే కాదు.. డ్రీమ్‌వరల్డ్ సంస్థ ముందు ఇచ్చిన ఆఫర్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.5,33,73,600 మాత్రమే కాగా ధరలు పెంచి రూ.4,66,20,357 అదనంగా చెల్లించారు. విచిత్రమేమంటే డ్రీమ్‌వరల్డ్ ఇండియా సంస్థ అసలు పబ్లిషింగ్ సంస్థే కాదని కేవలం పంపిణీదారు మాత్రమేనని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ సంస్థ ప్యారగాన్ పబ్లిషింగ్ తదితర సంస్థల పుస్తకాలను పంపిణీ చేసి వాస్తవ ధరలను 50 శాతం వరకు పెంచిందని, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారని ముఖ్యకార్యదర్శి పరిశీలనలో తేలింది. ఆర్డర్లు రద్దు చేసి బిల్లుల చెల్లింపును నిలిపి వేయాలని, డ్రీమ్‌వరల్డ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని, తొలుత ప్రతిపాదించిన ధరల కన్నా ఎక్కువ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీని ముఖ్యకార్యదర్శి ఆదేశించారు. -
ఎస్ఎస్ఏ ఎస్పీడీగా విజయ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో టి.విజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్‌కుమార్ విద్యాశాఖ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
వృత్తి విద్యాబోధకులను క్రమబద్ధీకరించాలి
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్‌సెంటర్) : ఏపీ సర్వశిక్ష అభియాన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒప్పంద విధానంలో పనిచేయుచున్న ఆర్ట్, వర్క్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమావేశం ఆదివారం తాడేపల్లిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరాముల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు హాజరై మాట్లాడుతూ వృత్తి విద్యాబోధకులకు అండగా ఉంటామన్నారు. చేస్తున్న ఉద్యమాలకు తప్పక సహకరిస్తామన్నారు. ప్రభుత్వానికి వృత్తి విద్యా బోధకుల సమస్యలను తీసుకువెళతామన్నారు. వీర్ల శ్రీరాములు మాట్లాడుతూ మాట్లాడుతూ చాలీచాలనీ వేతనాలతో తాము పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ప్రభుత్వం బేషరతుగా 60 ఏళ్లు వచ్చేవరకు ఉద్యోగ భద్రత కల్పించాలని, క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే లేనిపక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్రీనివాస్, జిల్లా కోశాధికారి టి.చినబాబు, భాస్కరరావు, సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాంతకుమారి, సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
మళ్లీ అక్రమ మార్గమే!
సాక్షి, మచిలీపట్నం : సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ ఏ)లో మళ్లీ అక్రమాలకు తెర లేచింది. అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. అక్రమ మార్గం ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు నేడు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. కాగా ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్న ఉద్దేశ్యంతో కలెక్టర్ ఏర్పాటు చేసిన కమిటీ ఈ అక్రమాలను ఎందుకు నిర్మూలించలేకపోయిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ అనర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నారన్న విషయం తెలిసినా మిన్నకుండటం వెనుక ఆంతర్యం ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... ఎస్ఎస్ఏ పరిధిలో కొన్ని జిల్లాస్థాయి ఉద్యోగాల భర్తీ ప్రధాన్యాంశంగా మా రింది. అందులో సెక్టోరియల్ పోస్టులు ఆరు, అసిస్టెంటెంట్ సెక్టోరియల్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. సెక్టోరియల్ పోస్టులు ఏఎంవో, ఏఎల్‌ఎస్‌వో, సీఎంవో, జీసీడీవో, ఎంఐఎస్ పీఎల్జీ కోఆర్డినేటర్, ఐఈడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులలో అర్హులైన గెజిటెడ్ ర్యాంకు కలిగిన వారితో భర్తీ చేయాలి. అదే విధంగా అసిస్టెంటెంట్ సెక్టోరియల్ పోస్టులైన ఏపీవో (అసిస్టెంటెంట్ ప్రొగ్రామింగ్ ఆఫీసర్), ఏఎస్వో(అసిస్టెంటెంటు సెక్టోరియల్ ఆఫిసర్) పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులకు స్కూలు అసిస్టెంటెంట్ కేడర్‌కు చెందిన వారితో భర్తీ చేయాలి. ఆయా పోస్టులకు అర్హులైన వారికి ఇవ్వాలి. అదే విధంగా ఎస్ఎస్ఏలో గతంలో ఐదేళ్లు పని చేసిన వారికి ఇవ్వకూడదనే ఎస్పీడీ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇందుకు విరుద్ధంగా తక్కువ కేడర్ అయిన ఎస్జీటీలతో భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురించడంతో స్పందించిన కలెక్టర్ నియామకాలను రద్దు చేశారు. ఈ రద్దు కూడా కాగితాలకే పరిమితమైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రద్దు చేసినా కొందరు ఆయా పోస్టు ఉద్యోగాల్లో కొనసాగినట్లుగా తెలు స్తోంది. ఇందుకు నిదర్శనం వారు డ్రా చేసిన జీతాల జాబితాలను చూస్తే అర్థమవుతుందనే వాదన ఎస్ఎస్ఏ కార్యాలయం వారే చెబుతుండటం గమనార్హం. రద్దు చేసినట్లు ప్రకటించి కొత్తగా మళ్లీ ఆయా పోస్టులను భర్తీ చేయడానికి జేసీ, డీఆర్వో, ఎస్ఎస్ఏ పీఓతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశా రు. ఆ కమిటీ ద్వారానే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో కొంత కాలం మిన్నకుండిపోయిన అధికారులు ప్రస్తుతం తిరిగి అనర్హు లకే పోస్టులు కట్టబెట్టినట్లు తెలి సిం ది. కొనసాగుతున్న వారినే మళ్లీ తీసుకుంటున్నారనే వాదన కూడా ఉంది. ఇంత జరుగుతున్నా కమిటీ ఏం చేస్తోం దన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగిందంటే... సెక్టోరియల్ పోస్టులు గెజిటెడ్ వారితో, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్‌తో భర్తీ చేయాలి. దీనికి విరుద్ధంగా ఎస్జీటీ క్యాడర్‌తో భర్తీ చేసినట్లు సమాచారం. ఎస్ఎస్ఏ శాఖలో 5 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన వారు తిరిగి అదే శాఖలో విధులు నిర్వహించేందుకు అనర్హులు. ఇదే విషయాన్ని ఆ శాఖ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలున్నాయి. కానీ పోస్టు గ్రాడ్యుయేషన్ లేని వారిని సైతం ఉద్యోగాలకు ఎంపిక చేయడం వెనుక అంతర్యమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
‘వలస’ పిల్లలకు సీజనల్ హాస్టళ్లు
బొంరాస్‌పేట : డ్రాపౌట్స్ నివారణ కోసం గ్రామాల్లో వలస కుటుంబాల పిల్లలకు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పీపుల్స్ సర్వీస్ సొసైటీ(పీఎస్ఎస్) స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పరమేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని చౌదర్పల్లి జెడ్పీహెచ్ఎస్, రేగడిమైలారం ఎంపీహెచ్ఎస్లో సీజనల్ హాస్టళ్లను జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతిరెడ్డి, ఎంఈఓ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పరమేశ్వర్ మాట్లాడారు. సర్వశిక్షా అభియాన్ సహకారంతో పీఎస్ఎస్ ఆధ్వర్యంలో సీజనల్ హాస్టళ్లను నిర్వహించనున్నట్లు చెప్పారు. వలస వెళ్లిన కుటుంబాల పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి, సాయంత్రం పూట ట్యూషన్ చెప్పించే ఏర్పాటు చేశామని వివరించారు. తద్వారా వలస కుటుంబాల విద్యార్థులు బడి మానేయకుండా చదువు కొనసాగిస్తారనే లక్ష్యంతో సీజన్ హాస్టళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని ప్రధానంగా గిరిజన కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ, ఎంఈఓ సూచించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు రమేశ్‌బాబు, వెంకటేశ్, ఉపాధ్యాయులు ఆనంద్‌రావు, మల్లికార్జున్ ఉన్నారు. -
ఆగిపోయిన విద్యా ప్రణాళికలు!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో కీలకమైన పలు విద్యా పథకాల ప్రణాళికలు ఆగిపోయాయి. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్ ఎడ్యుకేషన్ పథకాల విలీన నిర్ణయం నేపథ్యంలో ఆయా పథకాల కింద రూపొందించాల్సిన 2018–19 విద్యా సంవత్సరం ప్రణాళికలను రాష్ట్ర విద్యా శాఖ నిలిపివేసింది. వాస్తవానికి ఈ నెల 13 నుంచి ఆయా పథకాలకు సంబంధించిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మూడు విద్యా పథకాల విలీనం కారణంగా కేంద్రం ఆయా పీఏబీల సమావేశాలను రద్దు చేసింది. దీంతో విద్యా శాఖ సైతం వాటికి అవసరమైన ఆర్థిక సంవత్సరపు ప్రణాళికల రూపకల్పనను నిలిపివేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన పథకాల విలీనం సమావేశంలో అన్ని రాష్ట్రాలు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం గురువారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో కొత్త పథకం పేరును ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యా పథకాలు, వాటికి అవసరమయ్యే ప్రణాళికలు, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యా శాఖ భావిస్తోంది.