
మళ్లీ వస్తా!
పై స్థాయిలో ఆశీస్సులు
ఉన్నాయంటూ ప్రచారం
ఆయన హయాంలో
పలు అవినీతి ఆరోపణలు
కొత్త అధికారి వస్తే బయటపడుతుందేమోనని ఆందోళన
సిబ్బంది నోరు మెదపకుండా ముందస్తు జాగ్రత్త
కర్నూలు: సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ)లో గతంలో పనిచేసిన అధికారి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మళ్లీ ఎస్‌ఎస్‌ఏ అధికారిగా తానే వస్తానంటూ అక్కడి ఉద్యోగుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఇందుకోసం తనకు పైస్థాయిలో ఆశీస్సులు కూడా ఉన్నాయని ఆయన చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన అధికారి మొదట్లో విధుల్లో చేరకుండా
అడ్డుకోగలిగానని కూడా ఆయన వ్యాఖ్యానిస్తుండటం చర్చకు దారితీస్తోంది. రెండు నెలల్లోగా తానే మళ్లీ అధికారిగా వస్తానని ఆయన నిర్దిష్ట సమయాన్ని కూడా చెబుతుండటం దుమారం రేపుతోంది. ఇదే సమయంలో ఎస్‌ఎస్‌ఏ వ్యవహారాలపై ఆరోపణలు రావడం కూడా చర్చనీయాంశమవుతోంది
.
అన్నీ ఆరోపణలే..
వాస్తవానికి ఎస్‌ఎస్‌ఏ వ్యవహారంలో మొదటి నుంచీ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. అధికారుల పుణ్యమా అని 2015-16 ఆర్థిక సంవత్సరంలో అదనపు తరగతుల నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇందుకు కారణం 2014-15లో కేంద్రం మంజూరు చేసిన నిధులన్నీ ఖర్చు చేయకపోవడమే. దీంతో పాటుగా జిల్లాలో పాఠశాలన్నింటిలోనూ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామని ప్రభుత్వానికి ఎస్‌ఎస్‌ఏ అధికారులు నివేదించారు. అదేవిధంగా కేవలం ఈ విద్యా సంవత్సరంలో 700 పైచిలుకు పాఠశాలల్లోని మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించామని బిల్లులు కూడా చూపించారు. అయితే, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తాజాగా జిల్లాలో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటించిన సందర్భంలోనూ ఇదే విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో కొత్త అధికారి రావడంతో తాను చేసిన మొత్తం వ్యవహారాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న అనుమానం గతంలో పనిచేసిన అధికారికి కలుగుతోందని సమాచారం.