న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) వారికి రిజర్వేషన్ల వర్తింపు అర్హతపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు, అంతకంటే తక్కువగా ఉండాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల్ని ఆమోదించాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈడబ్ల్యూఎస్‌ను నిర్వచించడానికి కుటుంబ ఆదాయమే సరైన ప్రమాణంగా కమిటీ సిఫారసు చేసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలలోపు ఉండాలన్న సిఫార్సు సమంజసమైన పరిమితిగా భావిస్తున్నామని అఫిడవిట్‌లో పేర్కొంది.
కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల వరకు ఉన్న వారే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడానికి అర్హులవుతారంది. రూ.8లక్షలు దాటితే క్రీమీలేయర్ వర్తింపజేస్తారు. ఆ కుటుంబాల వారు ఈడబ్ల్యూఎస్‌కు అనర్హులు. ఓబీసీ రిజర్వేషన్లకు గత 3 ఆర్థిక సంవత్సరాల వార్షిక ఆదాయం సరాసరిని పరిగణనలోకి తీసుకుంటుండగా ఈడబ్ల్యూఎస్‌కు గత ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం తరఫున సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. నీట్–పీజీ అభ్యర్థులు వేసిన పలు పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కోటా ఆదాయ అర్హత ప్రమాణాలను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
దీంతో కేంద్రం విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాలు, నీట్–పీజీ కౌన్సిలింగ్ అర్హతకు కుటుంబ ఆదాయపరిమితిపై సిఫారసులు చేసేందుకు గత నవంబర్‌లో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి వీకే మల్హోత్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఏడాది డిసెంబర్ 31న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ‘ఈడబ్ల్యూఎస్ కోటా అర్హతకు అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు, అంతకంటే తక్కువగా ప్రస్తుతమున్న విధానాన్ని కొనసాగించవచ్చు.
అంతకుముందు సంవత్సరం కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల వరకు ఉన్న వారు మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులవుతారు.’అని కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసును ప్రభుత్వం ఆమోదించడంలో జాప్యం కారణంగా నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఆలస్యం అయింది. దీంతో, ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనలకు దిగారు. న్యాయపరమైన అవరోధాలను తొలగించి, వెంటనే కౌన్సిలింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నీట్–పీజీ కౌన్సెలింగ్ చేపట్టడంలో 8 నెలలపాటు జరిగిన జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో రెసిడెంట్ డాక్టర్లకు తీవ్ర కొరత ఏర్పడిందని వారు పేర్కొన్నారు.
త్రిసభ్య కమిటీ ఇంకా ఏం చెప్పిందంటే..
‘ప్రస్తుతమున్న కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలను భారీ ఆదాయంగా పరిగణించలేము. అందుబాటులో ఉన్న వాస్తవ ఫలితాలను బట్టి చూస్తే ఈ మొత్తం సమంజసమైందిగా ఉంది. సంవత్సరాదాయంలో వ్యవసాయ ఆదాయం, వేతనాలను కూడా కలిపిన విషయం గమనించాలి. ఆదాయంతో సంబంధం లేకుండా అయిదెకరాలు అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబానికి చెందిన అభ్యర్థిని ఈ డబ్ల్యూఎస్ నుంచి మినహాయించవచ్చు. నివాస ఆస్తుల ప్రాతిపదికను తొలగించవచ్చు’అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment