వర్గీకరణ రివ్యూ పిటిషన్‌పై నేడు నిర్ణయం | SC/ST Reservation Supreme Court Judgement Mala Mahanadu Review Petition Updates And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

వర్గీకరణ తీర్పు రివ్యూ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు నిర్ణయం

Published Tue, Sep 24 2024 9:29 AM | Last Updated on Tue, Sep 24 2024 10:10 AM

SC ST Reservation SC Judgement Mala Mahanadu Review Petition Updates

న్యూఢిల్లీ, సాక్షి: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాల మహానాడు సవాల్‌ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని, తీర్పును రివ్యూ చేయాలంటూ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ ఎంపీ హర్ష కుమార్‌లు పిటిషన్‌ వేశారు.  అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. 

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెడుతూ..  6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.

‘‘వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ/ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం’’ అని సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్‌డ్‌ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా.. జస్టిస్‌ బేలా ఎం.త్రివేది మాత్రం ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.

కేసు వివాదం..
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్‌ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్‌ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. షెడ్యూల్డ్‌ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు  2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హరియాణా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది.

దీంతో, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం..  2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ/ఎస్టీలో ఉపవర్గీకరణను సమర్థించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement