Classification of castes
-
వర్గీకరణ రివ్యూ పిటిషన్‌పై నేడు నిర్ణయం
న్యూఢిల్లీ, సాక్షి: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాల మహానాడు సవాల్ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని, తీర్పును రివ్యూ చేయాలంటూ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ ఎంపీ హర్ష కుమార్‌లు పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెడుతూ.. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.‘‘వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ/ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం’’ అని సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది మాత్రం ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.కేసు వివాదం..ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హరియాణా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది.దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ/ఎస్టీలో ఉపవర్గీకరణను సమర్థించింది. -
అగ్రవర్ణాల లబ్ధి కోసమే వర్గీకరణ డ్రామా
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాలు లబ్ధి పొందేందుకే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ డ్రామా ఆడుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. వర్గీకరణ అంశానికి కాలం చెల్లిందని, దళితులు ఈ డిమాండ్ కోరుకోవడం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల్లో మాల, మాదిగలు, ఎస్టీల్లో లంబాడ, ఆదివాసీల మధ్య గొడవలు సృష్టించి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయని చెన్నయ్య విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన రాజకీయ పార్టీల వైఖరిని మాలమహానాడు ఖండిస్తోందన్నారు. అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనను రాజకీయ పార్టీలు విరమించుకోవాలని, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును దళితులు వ్యతిరేకిస్తున్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో మాలమహానాడు ప్రతినిధులు జంగా, భగవాన్ దాస్, బి.సాయి తదితరులు పాల్గొన్నారు. -
ఓబీసీ ఉప వర్గీకరణకు సూచనలిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో కీలకమైన ఓబీసీ కోటా ఉపవర్గీకరణపై రాష్ట్ర బీసీ కమిషన్ సమాలోచనలు చేస్తోంది. ఓబీసీ ఉపవర్గీకరణ అధ్యయనం కోసం జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీకి తెలంగాణ స్థితిగతులను వివరించేందుకు బీసీ కమిషన్ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మెజార్టీ జనాభా బీసీలదే. అయితే ప్రస్తుతం 50 శాతంలోపు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటే బీసీల వాటా 60 శాతం దాటుతుంది. ఈ అంశంపై రాష్ట్ర బీసీ కమిషన్ ఇప్పటికే అధ్యయనం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాలు, నిరుద్యోగులు, బీసీల ఆర్థిక స్థితిగతులపై పరిశీలన దాదాపు పూర్తి చేసింది. క్షేత్రస్థాయి సర్వే మినహా మిగతా ప్రక్రియ పూర్తయిందని సమాచారం. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ ఉపవర్గీకరణకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్ర బీసీ కమిషన్ ఈమేరకు సమగ్ర నివేదిక రూపొందిస్తోంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, బీసీల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో పరిస్థితులను ఇందులో వివరించబోతోంది. ఇదే క్రమంలో ఓబీసీ ఉపవర్గీకరణపై దక్షిణాది రాష్ట్రాల్లోని బీసీ కమిషన్లతో హైదరాబాద్‌లో సదస్సు ఏర్పాటు చేయబోతోంది. ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, సదస్సు నిర్వహించే తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుతోపాటు మహారాష్ట్ర బీసీ కమిషన్లను ఆహ్వానించనుంది. ఈనెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారంలో ఈ సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సదస్సు అనంతరం ఓబీసీ ఉపవర్గీకరణపై చేసే తీర్మానాలను అధ్యయన బృందానికి అందించే అవకాశం ఉంది. -
భావోద్వేగానికి గురైన మంద కృష్ణ
న్యూఢిల్లీ: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జంతర్‌మంతర్ వద్ద జరిగిన మహాధర్నాకు హాజరైన వెంకయ్య నాయుడికి పాదాభివందనం చేసిన మంద కృష్ణ ధర్నాలో భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమంలోని ఆటుపోట్లను, కుట్రలను ఆయన వివరించారు. ‘తినడానికి తిండిలేని జాతి. ప్రయాణానికి ఖర్చులు లేని జాతి. ఎన్ని త్యాగాలు చేస్తే ఎన్ని బాధలు భరిస్తే ఈరోజు ఢిల్లీకి వేలాదిగా తరలిరాగలిగిందో అర్థం చేసుకోవాలి. మాదిగ జాతి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీదే.. మీరు వర్గీకరణకు సహకరించి మాకు మరో అంబేడ్కర్‌గా నిలవాలి..’ అంటూ వెంకయ్య నాయుడికి విన్నవించారు. వర్గీకరణపై ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తా: వెంకయ్య షెడ్యూలు కులాల వర్గీకరణ దిశగా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తానని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. మహాధర్నాకు హాజరైన వెంకయ్య నాయుడు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, ఈ ఉద్యమం విజయం సాధిస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాన మంత్రికి వివరించినట్టు తెలిపారు. ‘మీ కోరిక అసాధారణమైనది కాదు. అన్యాయమైనదీ కాదు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాల్సిందే. వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలతో ఈ అంశం మాట్లాడాను. అందరూ ఈ డిమాండ్ సహేతుకమని అన్నారు. వర్గీకరణపై అధ్యయనం జరుగుతోంది. ఒకసారి అడుగు ముందుకు పడితే మళ్లీ వెనక్కి రావడం ఉండదు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. దళితులపై దాడులు, ఇతర సమస్యలను రాజకీయ కోణంలో చూడకండి. ఇది సామాజిక రుగ్మత. కులాలను ఓటు బ్యాంకుగా చూడరాదు. సమాజంలో వెనకబడి, ఆఖరి వరుసలో ఉన్న వారిని ముందు పైకి తేవాలని దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు. ఈ సమావేశాల్లో బిల్లు పెట్టడం సాధ్యం కాదు. నేను ఉత్తుత్తి హామీలు ఇవ్వను. ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని పార్టీలతో చర్చిస్తున్నాం. రాజకీయాలకతీతంగా వర్గీకరణ జరిగి తీరుతుందని నాకు నమ్మకం ఉంది..’ అని పేర్కొన్నారు. వర్గీకరణ వల్ల దళితుల్లోని 59 కులాలకు మేలు జరుగుతుందని, దీన్ని గ్రహించి మాలలు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. మావంతు ప్రయత్నం చేస్తాం... కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ‘ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. ఎస్సీ వర్గీకరణ కోసం మావంతు ప్రయత్నం చేస్తాం. ఈ విషయమై ప్రధానితో మాట్లాడుతాను. యూపీఏ హయాంలో వర్గీకరణకు అనుకూలంగా ఉషామెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చినా వర్గీకరించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైంది. ఢిల్లీ గడ్డపై ఎవరూ సాహసించని, ఎవరూ చేయని దీక్షలు ఎమ్మార్పీఎస్ చేయగలిగింది.. ఈ దీక్షలు ఫలితాన్ని ఇస్తాయి..’ అని పేర్కొన్నారు. మాదిగలకు మంద కృష్ణ మాదిగ దేవుడిచ్చిన వరమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు. వర్గీకరణ చేస్తే బీజేపీ వెంట నిలబడతామని హర్యానా వర్గీకరణ ఉద్యమ నేత స్వదేశ్ కబీర్ పేర్కొన్నారు. వర్గీకరణతోనే మాదిగలకు స్వాతంత్య్రం లభిస్తుందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ మహాధర్నాకు ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగాటి సత్యం సభాధ్యక్షత వహించగా జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు, నేతలు మందకుమార్, నాగయ్య, బ్రహ్మయ్య, బి.ఎన్.రమేశ్, కోళ్ల వెంకటేశ్, తీగల ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.