
సామర్థ్యం సన్నగిల్లిందే..!
సర్కారు పాఠశాలల్లోని విద్యార్థుల్లో సామర్థ్యం మసకబారుతోంది. ప్రాథమిక విద్యపై కోట్లు ఖర్చుపెడుతున్నా.. విద్యార్థుల ప్రతిభ మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదు.
- ప్రాథమిక పాఠశాలల్లో లక్ష మందికి ‘సీ’ గ్రేడ్
- చదవడం, రాయడం రాని వైనం
- సామర్థ్యాన్ని పెంచేందుకు వేసవిలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు
- 1,809 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ఏర్పాటు
- ఈ నెల 24 నుంచి మే 31 వరకు కొనసాగింపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు పాఠశాలల్లోని విద్యార్థుల్లో సామర్థ్యం మసకబారుతోంది. ప్రాథమిక విద్యపై కోట్లు ఖర్చుపెడుతున్నా.. విద్యార్థుల ప్రతిభ మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదు. ఏడాది పొడవునా చదువు చెప్పినప్పటికీ ఒంట బట్టించుకోని విద్యార్థులపై సర్వశిక్షా అభియాన్ రాష్ట్రప్రాజెక్టు ప్రత్యేకదృష్టి సారించింది. వార్షిక పరీక్షల్లో పూర్తిగా వెనకబడిన (సీ-గ్రేడ్) విద్యార్థులకు 40 రోజులపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఒకటి నుంచి ఐదో తరగతిలో వార్షిక పరీక్షల్లో ‘సీ’ గ్రేడ్ వచ్చిన విద్యార్థులు మాత్రం ఈ నెల 24 నుంచి మే 31 తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.ఈ మేరకు ఎస్‌ఎస్‌ఏ రాష్ట్రప్రాజెక్టు డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రోజుకు మూడు గంటలు..
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు 10 లక్షల మంది ఉన్నారు. వీరిలో సమ్మెటీవ్-1 (త్రైమాసిక పరీక్షలు)లో సీ గ్రేడ్ వచ్చిన విద్యార్థులు 3,84,974 మంది ఉన్నారు. తాజాగా నిర్వహించిన సమ్మెటీవ్-3 (వార్షిక పరీక్షలు)లో సీ గ్రేడ్ వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ ప్రణాళిక తయారు చేసింది. ఉదయం 8గంటల నుంచి 11 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1809 స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఒక్కో శిక్షణ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. ఒక్కో కేంద్రంలో కనీసం 50 మంది విద్యార్థుల చొప్పున 90,450 మంది కవర్ కానున్నారు. అయితే సమ్మెటీవ్-3 ఫలితాల ఆధారంగా శిక్షణ కేంద్రాల సంఖ్యలో మార్పులుంటాయి.
చదవడం, రాయడమే లక్ష్యంగా..
వేసవిలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల లక్ష్యం విద్యార్థులకు చదవడం, రాయడం కోసమే. వాస్తవానికి ‘సీ’ గ్రేడ్‌లో నమోదు కావడమంటే వారికి చదవడం, రాయడం సైతం రావడం లేదని అర్థం. ఈ క్రమంలో ప్రత్యేక తరగతుల్లో ఆయా విద్యార్థులకు ఈ రెండు అంశాల అభ్యసన కోసం ప్రత్యేకంగా అభ్యాస పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. తెలుగు, ఆంగ్లం, గణితానికి సంబంధించి ఏ4 సైజులో ఉన్న 1,08,540 పుస్తకాలను విద్యాశాఖ ఇప్పటికే ముద్రించింది. వీటిని ప్రతి సెంటర్‌కు పంపిణీ చేయనుంది. సీ గ్రేడ్ విద్యార్థులకు బోధన, అభ్యాసన కోసం సీఆర్‌పీ (క్లస్టర్ రిసోర్స్ పర్సన్)లను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 2,609 మందిని ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఎంపిక చేసింది. వీరు ప్రత్యేక తరగతులు నిర్వహించినందుకుగాను రూ.800 గౌరవవేతనం కూడా ఇవ్వనుంది.