
ఈ ‘మార్కు’ చదువులు మారాలి
కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలంటూ ఉచిత సలహాలు పారేసే విద్యావేత్తలు, పరీక్షలు కాగానే విద్యార్థులు ఆ పుస్తకాలను చించి రోడ్ల మీదకు విసిరికొడుతున్న దృశ్యాన్ని చూడాలి. ఎందుకంటే మన విద్యా విధానంలోని డొల్లతనం ఎలాంటిదో ఆ చర్యలో వ్యక్తమవుతోంది.
కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలంటూ ఉచిత సలహాలు పారేసే విద్యావేత్తలు, పరీక్షలు కాగానే విద్యార్థులు ఆ పుస్తకాలను చించి రోడ్ల మీదకు విసిరికొడుతున్న దృశ్యాన్ని చూడాలి. ఎందుకంటే మన విద్యా విధానంలోని డొల్లతనం ఎలాంటిదో ఆ చర్యలో వ్యక్తమవుతోంది.
‘స్పర్థయా వర్ధతే విద్యా...’ ఇదో భారతీయ నానుడి. కానీ రానురాను స్పర్థ మాత్రం మిగిలి, విద్య అప్రధానమైంది. చదువులు కునారిల్లుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంజనీర్లనీ, డాక్టర్లనీ, పట్టభద్రులనీ, ఇతర వృత్తి నిపుణులనీ ఎన్నో రెట్లు ఎక్కువగా సృష్టించుకుంటున్నాం కదా! ఇది విద్యా వ్యవస్థ పురోగతే కానీ, దిగజారుడు లక్షణం ఎక్కడ ఉంది? పైపైన చూస్తే ఇదే అనిపించవచ్చు. కానీ రాశిలోనే కాక, వాసిలో మనం సాధించిన పురోగతి ఏమిటి అన్నదే అసలు ప్రశ్న.
అంతటా అనైతిక వాతావరణం
మనం చదువుకోవడం మాని, చదువు‘కొనడం’ మొదలెట్టి చాలాకాలమైంది. ‘కొంటున్న’ ఆ చదువులైనా నాణ్యమైనవా? దీనికి ఆశాజనకమైన సమాధానం రాదు. విద్యార్థులను పరిపూర్ణ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత నుంచి విద్యా సంస్థలు క్రమంగా తప్పుకుంటున్నాయి. ఏదో ఒక మార్గంలో మార్కులు తెచ్చుకోవడమే పరమార్థం అన్న అనైతిక వాతావరణమే (ప్రభుత్వ సంస్థలలో సహా) నెలకొని ఉంది. విజ్ఞాన సముపార్జన, మంచి మార్కులు తెచ్చుకోవడం వేర్వేరు విషయాలు కావు. కానీ, లక్ష్యమే కాదు; లక్ష్యసాధనకు ఎంచుకున్న మార్గం కూడా మంచిదై ఉండాలి. లేకపోతే ఆ ఫలితాలకు విలువ ఉండదు. అయితే ర్యాంకులూ మార్కులూ సాధించే సత్తా ఉన్న రేసుగుర్రాల మీద (10 శాతం) విపరీతమైన శ్రద్ధ కనపరుస్తూ, మిగిలిన వారిని (90 శాతం) నిర్లక్ష్యం చేయడం ఇప్పుడు సర్వసాధారణమైంది. విద్యా వ్యవస్థ వాస్తవంగా శ్రద్ధ తీసుకోవలసినది- ఈ 90 శాతం విద్యార్థుల గురించే. ఇంటెన్సివ్ బ్యాచ్, స్పెషల్ బ్యాచ్ వంటి పేర్లతో ఆ పది శాతం విద్యార్థులను వేరు చేసి, వారు తెస్తున్న ర్యాంకులను ఎరగా వేసి లక్షలాది సాధారణ విద్యార్థులను ప్రలోభ పెడుతున్నారు. కార్పొరేట్ పేరుతో జరుగుతున్న తతంగం అంతా ఇదే.
మెదళ్ల సామూహిక హింస
ఐదేళ్లకొకసారి జనరేషన్ గ్యాప్ వస్తూ ఉంటుందన్నది శాస్త్రీయ అవగాహన. ప్రతి తరం ముందు తరం కంటె చురుకుగా కనిపిస్తుంది. కానీ ఈ తరం పిల్లలను చూస్తే వారి గ్రహణశక్తీ, అవగాహనా శక్తీ అద్భుతమనిపిస్తాయి.అదే సమయంలో వీరంతా ఆ ప్రతిభనంతా కోల్పోబోతున్నారన్న వాస్తవం తెలిస్తే బాధ కూడా కలుగుతుంది. కార్పొరేట్ విద్య పేరుతో తెలుగు ప్రాంత విద్యనూ, విద్యార్థులనూ కొన్ని తరాల పాటు కోలుకోలేని రీతిలో చావు దెబ్బ తీశారు. ఆటస్థలం కూడా లేని పాఠశాలలూ, కోళ్ల ఫారాల వంటి కళాశాలలూ ఆత్మ విశ్వాసమంటే తెలియని విద్యార్థులను తయారు చేస్తున్నాయి. తరగతి గదులలో విద్యార్థులకు లభిస్తున్నది విద్య కాదు, వాళ్ల మెదళ్లకు సామూహిక హింస. ‘స్టడీ మెటీరియల్’ను వల్లె వేసి, పరీక్షలో దానిని విసర్జించి తెచ్చుకుంటున్న మార్కులు వారి కెరీర్‌కు పనికిరావని పిల్లలకే కాదు, వారి తల్లిదండ్రులకు సైతం తెలియడం లేదు. కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలంటూ ఉచిత సలహాలు పారేసే విద్యావేత్తలు, పరీక్షలు కాగానే విద్యార్థులు ఆ పుస్తకాలను చించి రోడ్ల మీదకు విసిరికొడుతున్న దృశ్యాన్ని చూడాలి. ఎందుకంటే మన విద్యా విధానంలోని డొల్లతనం ఎలాంటిదో ఆ చర్యలో వ్యక్తమవుతోంది.
తృష్ణను రేకెత్తించేవారేరి?
‘ఉత్తమ ఉపాధ్యాయుడు విద్యార్థులకి తాగేందుకు నీరు ఇవ్వడు. కానీ దాహం సృష్టిస్తాడు’ అంటుందొక చైనా సూక్తి. కానీ నేటి మన విద్యా విధానంలో విద్యార్థికి పళ్లరసం తీసి, నేరుగా గొంతులో పోస్తున్నారు. విద్యార్థి పనల్లా దానిని మింగడమే. అంత సులభంగా పళ్లరసం లభిస్తోందని సమాజం ఆనందిస్తోంది. కానీ, అది ఏ రకమో, ఏ పండుదో విద్యార్థికి అవగాహన లేదన్న సంగతిని అంతా విస్మరిస్తున్నారు. ఇలాంటి ‘రసం’ అంతర్జాతీయ పోటీ ఉన్న ఉద్యోగాల దగ్గర విద్యార్థులను కొరగాకుండా చేస్తోందన్న సంగతినీ సమాజం గుర్తెరగడం లేదు. ఇంజనీరింగ్ చదివినవారిలో పది శాతానికి కూడా మంచి ఉద్యోగాలు రావడం లేదని బాధపడే మనం, దీనికి మూలాలు ప్రాథమిక, మాధ్యమిక విద్యా విధానంలోనే ఉన్నాయన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాం. తృష్ణను చంపేది విద్య కాదు, అవిద్యే. ఈ అవిద్యే నేడు కార్పొరేట్ విద్యగా చలామణి అవుతోంది. పాఠ్యపుస్తకాలు కాకుండా, ఇతర పుస్తకాలు చదువుతున్న విద్యార్థులు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? రోజూ పావుగంటైనా పత్రిక చదవమని పిల్లలను ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎందరు? కెరీర్ విజయవంతం కావడానికి ఇవీ ముఖ్యమేనని చెప్పగలిగే ఉపాధ్యాయులు ఎంతమంది?
శిష్యుని మించలేని గురువులు?
ఇప్పటి విద్యార్థుల ఆలోచనా శక్తితో పోటీపడగల సామర్థ్యం చాలా మంది ఉపాధ్యాయులలో లేదన్నది ఒక కఠోర వాస్తవం. ఎందుకంటే ఏ ఉద్యోగమూ రాక ఉపాధ్యాయులైన వాళ్లే ఎక్కువ కనపడుతున్నారు. ఇంజనీరింగ్ దీనికి గొప్ప ఉదాహరణ. చురుకైన అభ్యర్థులంతా ఉద్యోగాలలో స్థిరపడుతూ ఉంటే, ఏ అవకాశమూ రాని వారే ఇంజనీరింగ్ కళాశాలల్లో లెక్చరర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరుతున్నారన్న వాదన కొట్టిపారేయలేనిది. అలాగే, నిజమైన కార్పొరేట్ వ్యవస్థకీ, ఉత్తుత్తి కార్పొరేట్ విద్యా రంగానికీ మధ్య ఎలాంటి సకారాత్మక సంబంధం లేకపోవడం మరింత బాధాకరం. వినడానికీ, నేర్వడానికీ; నేర్చుకోవడానికీ, దానిని అన్వయించడానికీ మధ్య ఉన్న తేడాను గమనించని మన విద్యావ్యవస్థ విద్యార్థులను వినడానికే పరిమితం చేస్తోంది. మానవాళి అభివృద్ధికి దోహదపడడానికి వారి వద్ద ఉండే ప్రతిభను మరుగున పెడుతోంది. జపాన్‌లో ఆరో తరగతి బాలుడు గడియారం తయారు చేయగల స్థితిలో ఉంటే, మన ఇంజనీర్లు మహా అయితే గడియారం తయారు చేయడం ఎలాగో చెప్పే ఐదారు పేజీల పాఠాన్ని బట్టీయం వేసి యథాతథంగా పరీక్షలలో రాసే స్థితికే పరిమితమై ఉన్నారు. నిజానికి కొందరికి అది కూడా రాదు. కొరియా, జపాన్ వంటి దేశాలు జ్ఞానాన్ని ఒంటబట్టించుకుని పురోగతి సాధిస్తుంటే, మన పిల్లలు పాఠాలను వల్లె వేస్తూ బోలెడు మార్కులు తెచ్చుకుంటున్నామని మురిసిపోతున్నారు. ఆ దేశాల నుంచి చిన్న చిన్న వస్తువులను కూడా దిగుమతి చేసుకోవలసిన దుస్థితిలోనే మనం ఉన్నామన్న సంగతిని ఆ మురిపెంలో అంతా మరచిపోతున్నారు.
మార్కులే పరమావధి కాదు
పిల్లలకు మార్కులూ, ర్యాంకులూ వస్తే అదే పదివేలు అనుకునే తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావలసిన సమయం వచ్చింది. బిల్‌గేట్స్, అబ్దుల్ కలామ్, సత్య నాదెళ్ల - మనం ఆరాధనతో చూసే వీరెవరూ కూడా బట్టీ విద్యావిధానంలో భాగస్వాములు కారు. వారి ఎదుగుదలకు కారణం- వారి సృజనాత్మకత, అవగాహన. వారి సంస్థ గొప్పలు చెప్పుకునే పేరుతో అవతలి సంస్థల మీద కుసంస్కారంతో వెకిలి వ్యాఖ్యలు చేసే విద్యా సంస్థలను చూస్తే, ‘ఇవేనా, మన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేవి!’ అన్న ప్రశ్న వస్తుంది. అసలు ఏ విద్యార్థి విజయమైనా గురువుల ఘనత కాదు. అది గురువుల బాధ్యత. చిన్నతనంలో పిల్లల వ్యక్తిత్వాన్ని చిదిమేస్తే, వారు పెద్దవారు అయ్యాక మళ్లీ వ్యక్తిత్వ వికాసం కోసం వేలల్లో ఖర్చు చేసే తల్లిదండ్రులు గుర్తించవలసిన అంశం కూడా ఉంది. వ్యక్తిత్వ వికాసం చిన్నతనం నుంచి పిల్లల్లో నిర్మించాలి. ఒక క్రమపద్ధతిలో ఆ వికాసం జరగాలి. కొన్ని వేలు పోసి, కొన్ని నెలల్లో దానిని పిల్లలకి సమకూర్చిపెట్టలేం. విద్యార్థిని విననివ్వండి. నేర్చుకోనివ్వండి. ప్రశ్నించనివ్వండి. ఆలోచించ నివ్వండి. అంతేకానీ, కొందరి విజయాన్ని ప్రచారం చేసి మిగిలిన వారిలో న్యూనత మిగల్చకండి. సాటివారిని గౌరవించే సంస్కారం నింపండి. సమాజ శ్రేయస్సు, వ్యక్తి శ్రేయస్సు వేర్వేరు కాదని చెప్పండి. గుమస్తాలనే కాదు, నాయకులనూ తీర్చిదిద్దండి. అప్పుడు ‘కార్పొరేట్ విద్య’ అనేది సార్థక నామధేయమవుతుంది.
(వ్యాసకర్త సీఏ, ఆ రంగంలో బోధనా నిపుణుడు)-ఆర్. శశికుమార్