నిధులున్నా.. నిర్లక్ష్యమే... | Sarva Shiksha Abhiyan Neglect To Provide Cosmetic Charges To Students | Sakshi
Sakshi News home page

నిధులున్నా.. నిర్లక్ష్యమే...

Published Sun, Sep 15 2019 10:42 AM | Last Updated on Sun, Sep 15 2019 10:42 AM

Sarva Shiksha Abhiyan Neglect To Provide Cosmetic Charges To Students - Sakshi

సాక్షి, విజయనగరం అర్బన్‌: ఓ వైపు సర్కారు విద్యకు పెద్ద పీట వేస్తూ... అందులోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశిస్తుంటే... జిల్లా అధికారులు నిర్లక్ష్యం వల్ల కేజీబీవీ విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదరికంతో  డ్రాపౌట్లుగా మారిన విద్యార్థినుల కోసం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను నెలకొల్పారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం మోపకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ జిల్లా అధికారుల నిర్వహణ లోపం వల్ల విద్యార్థినులే కాస్మొటిక్‌ చార్జీలు భరించాల్సి వస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థినులకు వసతితోపాటు స్టేషనరీ, కాస్మొటిక్‌ చార్జీలు వంటివాటిని యంత్రాంగం అందించాల్సి ఉంది. కానీ పాఠశాలలు పునఃప్రారంభమై నాలుగునెలలు కావస్తున్నా జిల్లా సర్వశిక్షాభియాన్‌ వాటిని అందివ్వలేదు. ఇందుకు సంబంధించిన నిధులు రెండు నెలల క్రితమే జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా... పర్చేజింగ్‌ టెండర్‌ చేపట్టడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

 సర్కారు చొరవ చూపుతున్నా...
జిల్లాలో మొత్తం 33 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినికి రెండు జతల యూనిఫాం, పాదరక్షలు, స్టేషనరీ, వారికి అవసరమైన నోట్‌ పుస్తకాలు, ప్లేట్లు, పెట్టెలు, కాస్మొటిక్‌ వస్తువులు, పాఠ్యపుస్తకాలు వంటివి విద్యాలయాల్లోనే ఇవ్వాలి. తొలుత జిల్లా స్థాయిలోని పర్చేజింగ్‌ కమిటీల ద్వారానే కొనుగోలు చేసి జూన్‌ నెలలోనే వాటిని పంపిణీ చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రస్థాయిలో టెండర్లు వేసి అన్ని జిల్లాలకు పంపి ణీ చేశారు. దానివల్ల ఆలస్యం అవుతోందని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా స్థాయిలోనే పర్చేజ్‌ చేసుకోమని రెండు నెలల క్రితమే నిధులు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఒక్కో విద్యార్థినికి కాస్మొటిక్‌ వస్తువుల కోసం నెలకు రూ.125, శానిటరీ నాప్‌కిన్స్‌ కోసం నెలకు రూ.35లు ఇవ్వాలని ఆదేశించారు.  కానీ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నాలుగునెలలవుతున్నా టెండర్‌ ఊసే లేదు. కనీసం డబ్బులు చెల్లించలేదు. విద్యార్ధినులు తమకు అవసరమైన వస్తువులను సొంత డబ్బు వెచ్చించి బయటే కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.

విద్యార్థినులపై రూ. 41.6లక్షల భారం
జిల్లాలో 33 కేజీబీవీల్లో 6,500 మంది విద్యార్థినులున్నారు. గడిచిన నాలుగు నెలల్లో వారు నెలకు కాస్మొటిక్‌ వస్తువులకోసం రూ.125, శానిటరీ నాప్కిన్స్‌కి రూ.35 వంతున రూ.41.6 లక్షల ఆర్థిక భారం మో యాల్సి వచ్చింది. కాస్మొటిక్‌ వస్తువులు పంపిణీ అయ్యేంతవరకు దుస్తులు శుభ్రపర్చుకోవడానికి నెలకు మూడు సబ్బులు, స్నానం సబ్బులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పేస్టులు, తలకు కొబ్బరి నూనె, ముఖానికి రాసుకునేందుకు పౌడర్‌ డబ్బాలు, షాంపూలు, బ్రష్‌లు కొనుగోలు చేయాలి. అయితే నాలుగునెలలుగా వీటికి డబ్బులు రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్చేజింగ్‌ టెండర్‌ దశలో ఉంది..
కాస్మొటిక్‌ కిట్స్‌ పర్చేజింగ్‌ బాధ్యత గతంలో రాష్ట్రస్థాయిలో ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పర్చేజింగ్‌ కమిటీకి అప్పగించిం ది. నిధులు వచ్చి రెండునెలలు అయింది. గిరిజన ఉత్పత్తులు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నాం. అందుకే ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం వాటి కొనుగోలుకు సంబంధించిన పర్చేజింగ్‌ టెండర్‌ దశలో ఉంది. 
– ఎం.కృష్ణమూర్తినాయుడు,  పీఓ, ఎస్‌ఎస్‌ఏ 

బయట షాపుల్లో కొని తెచ్చుకుంటున్నాం
కాస్మొటిక్‌ వస్తువులు ఇవ్వడంలేదు. పాఠశాల ప్రారంభం నుంచి ఆ వస్తువులను ఇంటిదగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని బయట కొనుక్కుంటున్నాను. కొందరికి డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. త్వరగా ఇస్తే బాగుంటుంది. 
– బి.వి.లక్ష్మి, 9వ తరగతి, విజయనగరం కేజీబీవీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement