కార్పొరేట్ ఉరితాళ్లు
కార్పొరేట్ విద్యావిధానం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికి బదులు ఒత్తిడిని పెంచుతోంది. హాస్టళ్లు కార్పొరేట్ జైళ్లుగా మారాయి. నిర్బంధాలను భరించలేక కొందరు, భయంతో మరికొందరు విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. చిన్న వయసులోనే తమ నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. తల్లి దండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. కాలేజీల యాజమాన్యాలు మాత్రం పిల్లలు చనిపోతే మేమేమి చేస్తామంటూ శవాలను తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాయి. మరి నేటి విద్యావిధానంలో మార్పు వచ్చేదెన్నడు!?
- విద్యార్థి దశలోనే బలవన్మరణాలు
- తల్లిదండ్రులకు మిగుల్చుతున్న కడుపుకోత
సాక్షి ప్రతినిధి, విజయవాడ : కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయల్లో ఫీజులు దండుకుంటున్నా విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకు ఆవాసం కోసం ఏర్పాటుచేసిన హాస్టళ్లలో కనీస వసతులు కూడా ఉండటం లేదు. ఒక్కో గదిలో ఆరు నుంచి పది మంది వరకు విద్యార్థులను ఉంచుతూ తీవ్ర నిర్బంధాలకు గురిచేస్తున్నారు. ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు సరిగా అందక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యానికీ గురవుతున్నారు. ఆహారం విషయంలోనూ నాణ్యత పాటించకపోవడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు పోటీ పేరుతో తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తుండటంతో విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు.
ర్యాంకుల కోసం 12 గంటల విద్యా విధానం...
కార్పొరేట్ కాలేజీల్లో ర్యాంకుల కోసం 12 గంటల విద్యా విధానం అమలవుతోంది. కదిలితే కాళ్లు విరగ్గొడతామనే భయంతో విద్యాభ్యాసం చేపడుతున్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఒత్తిళ్లను తట్టుకోలేక, తమ భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దుకోవాలో అర్థం కాక, తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడలేక, కాలేజీ నుంచి ఇంటికి వెళదామంటే లక్షల్లో డబ్బు కట్టిన తల్లిదండ్రుల బాధ చూసి తట్టుకోలేక.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి...
ర్యాంకుల రేసులో కొట్టుకుపోతున్న నేటి విద్యావిధానం వెంటే తల్లిదండ్రులు కూడా పయనిస్తున్నారు. అదే తమ బిడ్డల బంగారు భవితకు ఆధారమని భావిస్తున్నారు. అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు కార్పొరేట్ కళాశాలలకు చెల్లిస్తున్న తల్లిదండ్రులు, పిల్లల ఇబ్బందులు, వారి మనసు తెలుసుకోలేకపోతున్నారు. తాము చెప్పిందే వినమంటున్నారు. అటు అమ్మానాన్నల మాట కాదనలేక, మనసుకు నచ్చని చదువు చదువలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తేలిపోతున్న పోలీస్ కేసులు
విద్యా సంస్థల్లో జరిగే ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతి కేసులు తేలిపోతున్నాయి. విచారణలో ఆత్మహత్యకు పురిగొల్పిన కారణాలను సరిగా బయటికి తీయడం లేదు. కార్పొరేట్ కళాశాలల్లో కేసులను మాత్రం త్వరగా ముగించేస్తున్న ఉదంతాలే ఎక్కువ. గత ఏడాది సెప్టెంబర్‌లో, నవంబరులో ఇద్దరు విద్యార్థులు, ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో మరో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నలుగురు ఒకే విద్యా సంస్థలో విద్యార్థినీ విద్యార్థులు. తాజాగా కడపలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దీనికి తాజా ఉదాహరణ.
పిల్లల ఆసక్తిని గుర్తించాలి
పిల్లల ఆసక్తికి అనుగుణంగా తల్లిదండ్రులు చదివించాలి. ఇందుకు భిన్నంగా జరిగినప్పుడు ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డాక్టర్, ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే చదువు కాదు. ఇవి కాకున్నా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. చదువు కంటే జీవితం ముఖ్యమని గుర్తించాలి. తమ ఆశలను బలవంతంగా వారిపై రుద్దరాదు. పిల్లల శక్తిసామర్థ్యాలను బట్టి చదివించాలి. వారి ఆసక్తిని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహిస్తే ఒత్తిడి లేకుండా ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరతారు.
- ఎల్.కాళిదాస్, డీసీపీ (శాంతి భద్రతలు), విజయవాడ
మానసిక స్థితి అర్థం చేసుకునే పరిస్థితుల్లేవు
పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ పర్యవేక్షణలోనే చదివించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోవాలనే ఆలోచనలు, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలు పాల్పడేందుకు సిద్ధపడుతున్నారు. వాళ్లంతట వారే చదువుకునే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి.
- బి.రవిప్రసాద్, విద్యావేత్త, విజయవాడ
కారణాలు అనేకం...
ఇటీవల జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ర్యాగింగ్‌తో ఆత్మహత్య చేసుకుంటే, మరొకరు చదువులో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు బలవంతంగా తమ ఆశలను పిల్లలపై రుద్దుతున్నారు. దీంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
- డాక్టర్ టీఎస్ రావు, మానసిక వికాస నిపుణుడు, విజయవాడ