నరకానికి కేరాఫ్‌.. | Vizianagaram JNTU Neglect Of Student Problems | Sakshi
Sakshi News home page

నరకానికి కేరాఫ్‌..

Published Thu, Oct 17 2019 12:15 PM | Last Updated on Thu, Oct 17 2019 12:16 PM

Vizianagaram JNTU Neglect Of Student Problems - Sakshi

విద్యార్థులతో చర్చిస్తున్న జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్‌ సుబ్బారావు

సాక్షి ప్రతినిధి విజయనగరం: విజయనగరంలోని జేఎన్‌టీయూకే క్యాంపస్‌లో సమస్యలు తిష్ట వేశాయి. వందల మంది చదువుతున్న ఈ యూనివర్సిటీలో సగానికి పైగా విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉంటూ కాలేజ్‌ మెస్‌లోనే తింటున్నారు. కానీ కొన్ని నెలలుగా ఈ మెస్‌ సరిగ్గా నడవడం లేదు. కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరానికి వచ్చి భోజనం చేయాల్సి వస్తోంది. లేదా పస్తులుండాలి. మరో వైపు కళాశాలలో పరిశోధన శాల అభివృద్ధికి వచ్చిన నిధులు కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇంత జరుగుతున్నా నిర్వాహకులు ఏ మాత్రం  పట్టించుకోవడం లేదు. దీనిపై రెండు రోజులుగా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా విద్యార్థులు ఆందోళనల చేపడుతున్నారు.

ప్రిన్సిపల్‌ ఆధిపత్యం.. 
కళాశాలలో మొత్తం 1670 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో దాదాపు 1430 మంది వసతి గృహంలోనే ఉంటున్నారు. స్టూడెంట్‌ మెస్‌లు నడుపుతూ విద్యార్ధులకు భోజన వసతి కల్పిస్తున్నారు. అయితే స్టూడెంట్స్‌ మేనేజ్మెంట్‌ నిర్వహణలో భోజన వసతి వ్యవహారంలో స్టూడెంట్స్‌కి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ప్రిన్సిపల్‌ ఆధిపత్యం వల్ల మెస్‌ చార్జీలు భారీగా  పెరుగుతున్నాయి. కాంట్రాక్ట్‌ పద్ధతి మెస్‌ నిర్వహణలో రూ.3 వేలు వరకు వచ్చిన బిల్లును స్టూడెంట్‌ మేనేజ్మెంట్‌ నిర్వహణ ద్వారా రూ.1400 కి తీసుకొచ్చారు. కానీ ప్రిన్సిపాల్‌ ఆధిపత్యంలో మెస్‌ నిర్వహణ వచ్చినప్పటి నుంచి రూ.1900 కి మెస్‌ బిల్లు చేరింది. దాదాపు నెలన్నరగా విద్యార్ధుల చేత నడిపించే మెస్‌లకు నీటి సౌకర్యం ఆగిపోయింది. విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించినా ప్రిన్సిపల్‌ పట్టించుకోలేదు.

తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు విజయనగరం వచ్చి భోజనం చేస్తున్నారు. రెండేళ్లుగా కళాశాల ప్రాంగణానికి ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. ప్రయోగశాల అభివృద్ధికి సంబంధించిన నిధులు ఉన్నప్పటికీ రెండేళ్లుగా వాటి ఏర్పాటుకు సంబంధించిన టెండర్లను పిలిచి డిపార్ట్‌మెంట్లకు అందజేయడం లేదు. నిధులున్నా విద్యార్థులకు ప్రయోగశాల నైపుణ్యాలను అప్‌గ్రేడ్‌ చేయలేదు. హాస్టల్లో మౌలిక సౌకర్యాల కొరత ఉంది. క్రీడాప్రాంగణం కళాశాల క్రీడలు ఆడుకునే స్థాయిలో లేదు. వీటిపై విద్యార్థులెవరైనా వ్యక్తిగతంగా నిలదీసినా, ప్రశ్నించినా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నా రు. మార్కులు తగ్గించేస్తామంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. ఈ నేప థ్యంలో మూకుమ్మడిగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మిడ్‌ ఎగ్జామ్స్‌కి దూరమైనా కూడా నిరసనలో పాల్గొంటున్నారు.

దిగివచ్చిన రిజిస్ట్రార్‌.. 
జేఎన్‌టీయూ వీసీ వస్తేగానీ నిరసన విరమించేది లేదంటూ మంగళ వారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా విద్యార్థులు ఆందో ళన కొనసాగించారు. రాత్రి వేళ చీకట్లోనూ కళాశాల గేటు వద్ద బైఠాయించారు. చేసేది లేక జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్శిటీ రిజస్ట్రార్‌ సుబ్బారావు బుధవారం విజయనగరం వచ్చారు. తొలుత కళాశాల ప్రిన్సిపాల్, వైస్‌ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, ఫ్యాకల్టీలతో  సమస్యలపై సమీక్షించారు. అనంత రం విద్యార్థుల వద్దకు వచ్చివారి సమస్యలను తెలుసుకున్నారు. కళాశాల నిర్వహణలో లోపాలున్నట్లు ఆయన గుర్తించారు. అకడమిక్‌కి నష్టం కలగకుండా వాటిని సరిదిద్దుకుందామని వారికి హామీ ఇచ్చారు. సమస్యలు చెప్పే వారిపై పరోక్షంగా ఫ్యాకల్టీ శిక్షలు వేస్తున్నారని విద్యార్థులు రిజిస్ట్రార్‌ ముందు ఏకరుపు పెట్టడంతో అక్కడున్న కళాశాల ఫ్యాకలీ, ఇతర సిబ్బందిని రిజస్ట్రార్‌ కళాశాల లోపలికి పంపారు. అనంతరం విద్యార్థులు చెప్పిన సమస్యల్లో ప్రధానంగా కళాశాల గ్రంథాలయ సౌకర్యాన్ని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రూ.లక్షలోపు నిధులను విడుదల చేసే అర్హత తనకు ఉందని ప్రస్తుతం సెమిస్టర్‌కి అవసరమైన తక్షణ మెటీరియల్‌ని తెప్పిస్తామని చెప్పారు. గ్రంథాలయంలో కంప్యూటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలన్న డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇచ్చారు. వసతి గృహంలోని మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలిస్తాన్నారు. ఎప్పటిలాగే మెస్‌బిల్లును తగ్గించుకోవడానికి మెస్‌ నిర్వాహణలో ఫ్యాకల్టీ ఆధిపత్యం లేకుండా చేయాలని విద్యార్థులు కోరారు. స్టూడెంట్‌ మేనేజ్‌ మెంట్‌ పద్ధతిలో జరుగుతున్న మెస్‌ నిర్వహణలో పూర్తిగా విద్యార్థులకే స్వేచ్ఛ ఇస్తామని హామీ ఇచ్చారు.  

వీసీ రావాల్సిందే... 
రిజిస్ట్రార్‌ ఇచ్చిన హామీలపై విద్యార్థులు సంతృప్తి చెందలేదు. రిజస్ట్రార్‌ సుబ్బారావు విద్యార్థుల సమస్యలు ఒక్కొక్కటిగా వింటూ పరిష్కార మార్గాలు చెపుతూ విద్యార్థులకు హామీలిచ్చారు. దాదాపు నాలుగు అంశాల తరువాత బాలికల హాస్టల్‌ సమస్యలు చర్చలోకి వచ్చాయి. ఫ్యాకల్టీ, హాస్టల్‌ ఇతర సిబ్బంది వారిపై చేస్తున్న అసభ్యకర చర్యలను బాలికలు చెపుతున్న సమయంలో పరిష్కార మార్గాలు చెప్పకుండా మధ్యలో రిజిస్ట్రార్‌ కళాశాలలోపలికి వెళ్లిపోయారు. చాలా సేపటి వరకూ బయటకు రాకపోవడంతో విద్యార్థులు నిరసనలు కొనసాగించారు. రాత్రి 9.30 గంటల సమయంలో రిజిస్ట్రార్‌ మరలా విద్యార్థుల దగ్గరకు వచ్చారు. వీసీ వస్తేనే తాము ఆందోళన విరమిస్తామని విద్యార్థులు పట్టుబట్టి కూర్చున్నారు. రాత్రి 10 గంటలకు కూడా చర్చలు కొనసాగుతున్నాయి.

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement