టెన్త్‌ పరీక్షల్లో సమూల మార్పులు! | Group changes in Tenth Exams | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షల్లో సమూల మార్పులు!

Published Sun, Aug 18 2019 3:23 AM | Last Updated on Sun, Aug 18 2019 9:04 AM

Group changes in Tenth Exams - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. రానున్న పరీక్షల్లో విద్యార్థులు 100 మార్కులకు (50 మార్కుల చొప్పున రెండేసి పేపర్లు) పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ప్రతి పేపర్‌లో పది మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో బిట్‌ పేపర్‌ ఉండగా దాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. 20 శాతం అంతర్గత మార్కుల రద్దు నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా పాఠశాల విద్యా శాఖ ఈ ప్రతిపాదనలు రూపొందించింది. అంతర్గత మార్కులను రద్దు చేస్తూ ప్రభుత్వం జూలై 16న జీవో 41 ఇచ్చిన సంగతి తెలిసిందే. 

బిట్‌ పేపర్‌ రద్దు
బిట్‌ పేపర్‌ వల్ల మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందని, కార్పొరేట్‌ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. బిట్‌ పేపర్‌ స్థానంలో ఏకవాక్య సమాధానాలు రాసే విధంగా ప్రశ్నలు ఇవ్వనున్నారు. వీటిని విడిగా కాకుండా ప్రధాన ప్రశ్నపత్రంలోనే ఇస్తారు. ఇప్పటివరకు హిందీ (100 మార్కులు) మినహాయించి ఆయా సబ్జెక్టుల్లో 40 చొప్పున 80 మార్కులకు రెండు పేపర్లు ఉండేవి. సబ్జెక్టుకు 20 చొప్పున అంతర్గత మార్కులుండేవి. ఇక నుంచి హిందీ/సంస్కృతం మినహాయించి ప్రతి సబ్జెక్టులోనూ ఒక్కో పేపర్‌ను 40 మార్కులకు బదులు 50 మార్కులకు ఇవ్వనున్నారు. మార్కులు, ప్రశ్నలు పెరుగుతున్నందున కొన్ని పేపర్ల పరీక్ష సమయాన్ని కూడా మార్పు చేయనున్నారు. హిందీ/సంస్కృతం మినహాయించి మిగిలిన సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌కు 2.30 గంటలు పరీక్ష రాయడానికి, 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఉంటుంది. హిందీ/సంస్కృతం 100 మార్కులకు ఉండనున్నందున పరీక్ష రాయడానికి 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు ఇవ్వనున్నారు. 

నాలుగు భాగాలుగా ప్రశ్నపత్రం
పదో తరగతి ప్రశ్నపత్రాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ఒక్కో విభాగంలో ఎన్ని ప్రశ్నలు ఇవ్వనున్నారో ప్రశ్నపత్రం, బ్లూప్రింట్‌ను కూడా రూపొందించారు. ఈపాటికే దీన్ని విడుదల చేయాల్సి ఉన్నా అనుమతి రానందున పాఠశాలలకు పంపలేదు. ఒక్కో పేపర్‌ 50 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు బట్టీ పట్టి రాయకుండా సొంతంగా రాయగలిగేలా, ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా ప్రశ్నలు ఇస్తారు. అర మార్కు ప్రశ్నలు 12 ఉంటాయి. వీటికి ఆరు మార్కులు కేటాయించారు. వీటికి ఒకే వాక్యం/పదంతో జవాబు రాయాలి. బిట్‌ పేపర్‌కు బదులుగా దీన్ని పెడుతున్నారు. ఒక మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. వీటికి ఒకటి లేదా రెండు వాక్యాల్లో జవాబు రాయాలి. వీటికి 8 మార్కులు ఉంటాయి. రెండు మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి. మూడు లేదా నాలుగు వాక్యాల్లో జవాబు రాయాలి. వీటికి 16 మార్కులు కేటాయించారు. పెద్ద ప్రశ్నలు 5 ఉంటాయి. వీటికి ఎనిమిది నుంచి పది వాక్యాల్లో జవాబు రాయాలి. ఒక్కో దానికి నాలుగు మార్కుల చొప్పున 20 మార్కులు కేటాయించారు. సమాధానాలు రాసేందుకు 12 నుంచి 16 పేజీలుండే బుక్‌లెట్‌ను రూపొందించి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. దీని ద్వారా మాస్‌ కాపీయింగ్‌ను నివారించొచ్చని భావిస్తున్నారు. 

పేపర్ల వారీగా పాస్‌ మార్కులు
ఇప్పటివరకు పదో తరగతిలో ఆయా సబ్జెక్టుల్లోని రెండు పేపర్లు కలిపి 35 మార్కులు వచ్చినా ఉత్తీర్ణులైనట్లుగా పరిగణించేవారు. ఇక నుంచి సబ్జెక్టుల్లోని రెండు పేపర్లలో ప్రతిదానిలోనూ ఉత్తీర్ణులవ్వాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం.. ప్రతి పేపర్‌లోనూ 17.5 చొప్పున మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇలా రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు వస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. పాత విధానంలో ఒక పేపర్‌లో 35 మార్కులు వచ్చి, రెండో దానిలో సున్నా వచ్చినా పాసవుతున్నారు. దీనివల్ల విద్యార్థులు ఎందులో వెనుకంజలో ఉన్నారు.. ఏ సబ్జెక్టుల్లో ప్రమాణాలు ఉన్నాయి.. టీచర్లలో ఎవరు బాగా పాఠాలు చెబుతున్నారు.. ఎవరు చెప్పడం లేదు అనే విషయాలు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement