ఆధార్ తరహాలో ‘అపార్’ పేరుతో ఒకే దేశం.. ఒకే ఐడీకి కేంద్రం శ్రీకారం
స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అదే నంబర్ కేటాయింపు
ఎక్కడున్నా.. ఏం చదువుతున్నా ట్రాకింగ్
తొలి విడతలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అమలు
రాష్ట్రంలో 18 లక్షల మంది నమోదుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు
సాక్షి, అమరావతి: ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ’ (అపార్) పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్‌తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ‘వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తీసుకొస్తోంది. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలనూ ఆదేశించడంతో రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ కూడా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
తొలి విడతలో 9 నుంచి 12 (ఇంటర్) తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేసేందుకు ప్రణాళికను సిద్ధంచేసింది. దసరా సెలవుల్లో ఆయా తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలపై సంతకాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే అందించారు. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ అపార్ నంబర్ కేటాయింపు ప్రక్రియ చేపట్టింది. అధార్ వివరాలను చాలా రాష్ట్రాలు బహిర్గతం చేయడాన్ని సమ్మతించకపోవడంతో ఆధార్ తరహాలోనే అపార్ నమోదు ప్రక్రియ చేపట్టారు.
చదువు పూర్తయ్యే వరకూ ఇదే నెంబరు..
నిజానికి.. విద్యార్థుల ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా ప్రస్తుతం బడుల్లో చేరికలు జరుగుతున్నాయి. ఇలా చేరిన తర్వాత ప్రతి విద్యార్థికీ ‘పర్మినెంట్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్’ (పెన్)ను కేటాయించి యూడైస్ ప్లస్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నంబర్‌కు అదనంగా 12 అంకెలతో కూడిన ‘అపార్’ నంబర్ కేటాయిస్తారు. ఇదే నంబరును విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు అన్ని సర్టిఫికెట్లపైనా, ఐడీ కార్డుపైనా ముద్రిస్తారు. ఈనెల 14న అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల నుంచి ధ్రువపత్రాలు తీసుకుని వాటిని కేంద్ర విద్యాశాఖ యూడైస్ ప్లస్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు.
9–12 తరగతుల్లో 18 లక్షల విద్యార్థులు..
అపార్ నంబర్ కేటాయింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2022లోనే ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాలు దీనిని పాటించాలని కోరింది. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగా, ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవుల తర్వాత ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో సుమారు 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తొలి విడతలో వీరి వివరాలు నమోదు చేస్తారు. తర్వాత మిగిలిన విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపడతారు.
ఈ అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, అందుకోసం దసరా సెలవుల అనంతరం నిర్వహించే తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం)లో చర్చించాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలను, ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. తొలి విడతలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. దీంతో అన్ని పాఠశాలల్లోను మంగళవారమే విద్యార్థులకు దరఖాస్తు పత్రాలను అందించారు. వాటిపై తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
అపార్‌తో నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట..
ఇక కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ ‘అపార్’.. హైస్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థుల చదువుకు సంబంధించి సమగ్ర డిజిటల్ సమాచార కేంద్రంగా పనిచేస్తుంది. వివిధ బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీచేసే ప్రతి సర్టిఫికెట్ పైనా ఈ అపార్ నంబరును ముద్రిస్తారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల సమయంలో సమర్పించిన సర్టిఫికెట్లపై అనేక ఫిర్యాదులు రావడం, అవి అసలువా లేక నకిలీవా అనేది తేల్చేందుకు జాప్యం జరుగుతుండడంతో అభ్యర్థికి నష్టం జరుగుతోంది.
ఈ క్రమంలో విద్యలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్–వన్ స్టూడెంట్ ఐడీ’ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడ చదువుతున్నా సదరు విద్యార్థిని సులభంగా గుర్తించేందుకు, గత అకమిక్ వివరాలు తెలుసుకునేందుకు ఈ ‘అపార్’ ఉపయోగపడుతుంది. అంతేగాక.. ఇదే నంబరును డిజీ లాకర్‌తో అనుసంధానం చేయడంతో పాటు వాటిపై ఇదే నంబర్ ముద్రించడం ద్వారా విద్యా సంబంధమైన అన్ని పత్రాలు అసలైనవిగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment