ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: నిర్ణీత ప్రమాణాల మేరకు విద్యార్థుల నమోదులేని 418 ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 40 మందికన్నా తక్కువగా విద్యార్థులు ఉన్న ఎయిడెడ్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల యాజమాన్యాలకు పరిస్థితిని చక్కదిద్దుకోవాలని పాఠశాల విద్యా శాఖ గతంలో సూచనలు జారీచేసింది. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో కూడా వారికి అవకాశం ఇచ్చింది.
కానీ పరిస్థితిలో మార్పు లేకపోగా, విద్యార్థుల సంఖ్య మరింతగా దిగజారింది. దీనిపై 840 ఎయిడెడ్ స్కూళ్లకు పాఠశాల విద్యా శాఖ ఇదివరకే నోటీసులు కూడా ఇచ్చింది. అనంతరం విద్యార్థుల నమోదుపై ఆయా యాజమాన్యాలు ఇచ్చిన వివరణలు విద్యా ప్రమాణాల దృష్ట్యా సమర్ధనీయంగా ఉన్నాయో లేవో పరిశీలించింది. వీటిల్లో 418 పాఠశాలల యాజమాన్యాల వివరణలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటికే వారికి పలు దఫాలుగా అవకాశాలు ఇచ్చినా ఫలితం లేనందున నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, డీఈవోలను కమిషనర్ ఆదేశించారు.
‘ప్రభుత్వంలో ఎయిడెడ్ టీచర్ల విలీనంతో ఎంతో మేలు’
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఎయిడెడ్ స్కూళ్లల్లోని ఎయిడెడ్ టీచర్లను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఆ టీచర్లతోపాటు అత్యధిక సంఖ్యలో విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలలకూ మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 418 ఎయిడెడ్ స్కూళ్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పాఠశాల విద్యా శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో 2,000 మందికిపైగా ఎయిడెడ్ టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలోకి రానున్నారు. దీంతో వీరు ప్రభుత్వ టీచర్లకు మాదిరిగా సౌకర్యాలు, ఆరోగ్య కార్డులు పొందేందుకు అర్హులవుతారు’ అని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ప్రతినిధి సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి ప్రకటనలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment