ప్రతి విద్యార్థికీ ‘పెన్‌’ | A new system for student tracking | Sakshi
Sakshi News home page

ప్రతి విద్యార్థికీ ‘పెన్‌’

Published Thu, May 30 2024 5:43 AM | Last Updated on Thu, May 30 2024 5:43 AM

A new system for student tracking

దేశంలో ఎక్కడ చదువుతున్నా ఒకే సంఖ్య 

విద్యార్థుల ట్రాకింగ్‌ కోసం కొత్త విధానం 

టీసీ, కులధ్రువీకరణ, మైగ్రేషన్‌ సర్టిఫికెట్స్‌ లేకుండా క్లిక్‌తో బదిలీ 

డిజీ లాకర్‌లోని సర్టిఫికెట్లు తీసుకునేందుకూ ఇదే నంబర్‌ 

2022–23లో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ 

ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం 

యూడైస్‌లో విద్యార్థి వివరాలు నమోదు చేస్తే ప్రత్యేక నంబర్‌ 

సాక్షి, అమరావతి: కాకినాడ నగురంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలకృష్ణ కుటుంబం చెన్నైకి వలస వెళ్లింది. బాలుడు ఇక్కడ టీసీ తీసుకోలేదు. అయితే, ఆ విద్యార్థి అక్కడ బడిలో చేరినట్టు ఎక్కడా వివరాలు లేవు. ఇలాంటి పరిస్థితి విద్యాశాఖకు సవాలే. బడి ఈడు పిల్లలు ఎంతమంది బడిలో ఉంటున్నారు, ఎంతమంది బడికి వెళ్లడంలేదో తెలుసుకునేందుకు ఇంటింటికీ సర్వే చేయడం తప్ప ఇప్పటివరకు మరో మార్గం లేదు. 

‘పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ (పెన్‌)’తో దీనికి పరిష్కారం లభిస్తుంది. నూతన జాతీయ విద్యావిధానం–2020 (ఎన్‌ఐపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యార్థులందరికీ ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య పెన్‌ను తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో ఈ విధానాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2022–23 విద్యా సంవత్సరం నుంచే ఇదే తరహా విధానం అమలు చేస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసింది.

’పెన్‌’ అంటే..
ప్రి ప్రైమరీలో అడ్మిషన్‌ తీసుకున్న సమయంలో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఇంటి అడ్రస్‌ వంటి అన్ని వివరాలను డిజిటలైజ్‌ చేసి కేంద్ర పాఠశాల విద్య మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలోని ‘యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌)’లో నమో దు చేస్తారు. ఒకటో తరగతిలో విద్యార్థుల వివరాలు నమోదు చేసే సమయంలోనే ప్రతి ఒక్కరికీ డిజీ లాకర్‌ను ఓపెన్‌ చేసి, అన్ని సర్టిఫికెట్లను అందులో ఉంచుతారు. ఆ తర్వాత 11 అంకెల పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ వస్తుంది. 

ఈ నంబరు ఆధార్‌ నంబరులాగానే విద్యార్థికి జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ఒక ప్రభు త్వ లేదా ప్రైవేటు స్కూలు నుంచి మరొక ప్రభు త్వ లేదా ప్రైవేటు స్కూలుకు బదిలీ అయినప్పు డు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోని స్కూలు లేదా కాలేజీలో చేరే సమయంలో టీసీ లు, మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు అవసరం లేకుండా చేరొచ్చు. ఈ పెన్‌ నంబరు ఇవ్వగానే ఆన్‌లైన్‌లో ఆ విద్యార్థికి సంబంధించిన అన్ని సర్టిఫికె ట్లు అందులో వస్తాయి. దీనిద్వారా విద్యార్థి ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యా సంస్థకు సులభంగా ట్రాన్స్‌ఫర్‌ అవ్వొచ్చు.  

చదువు పూ ర్తయిన అనంతరం  వారు ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు పిల్లలను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఆధార్‌ నంబర్‌ నమోదు చేసేవారు. అయితే, ఈ వివరాలు ఆ జిల్లా, రాష్ట్రం వరకే తెలిసేవి. ఒకవేళ విద్యార్థి రాష్ట్రం వెలుపల మరోచోట చదువుతున్నా తెలుసుకోవడం కష్టం. అయితే పెన్‌ ద్వారా విద్యార్థి ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది.  చిరునామా వంటి వివరాలు మారినప్పుడు పెన్‌ నంబర్‌కు కూడా అప్‌డేట్‌ చేస్తారు. దాంతో దేశవ్యాప్తంగా విద్యార్థి ఎక్కడున్నా సులువుగా తెలుసుకోవచ్చు.

పత్రాలు లేకుండానే బదిలీ
రాష్ట్రంలో ప్రస్తుతం స్కూల్‌ స్థాయి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 86 లక్షల మందికి, ఈ విద్యా సంవత్సరం ప్రి ప్రయిమరీలో చేరే విద్యార్థులకు కూడా ‘పెన్‌’ కేటాయిస్తారు. దీని ద్వారా జూన్‌ 12 నుంచి ప్రారంభమయ్యే 2024–25 విద్యా సంవత్సరంలో ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్లే విద్యార్థులు, ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలలో చేరే విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. 

ఒకప్పటి నిబంధనల ప్రకారం ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలలో చేరే విద్యార్థికి టీసీ, స్టడీ సర్టిఫికెట్‌ కుల ధ్రువీకరణ పత్రం.. ఇలా అనేక సర్టిఫికెట్లను సమర్పించాలి. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ల అవసరం లేకుండా విద్యార్థి ‘పెన్‌’ నంబర్‌తో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక్క క్లిక్‌తో విద్యార్థిని బదిలీ చేయొచ్చు.

పాఠశాలలకు విద్యార్థుల మ్యాపింగ్‌
వచ్చే నెలలో ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ సులభతరం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో  5, 7 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను పై తరగతులు ఉన్న పాఠశాలలకు ట్యాగింగ్‌ చేస్తారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థికి అవసరమైన స్కూళ్లను ఆన్‌లైన్‌లో చూపిస్తే తల్లిదండ్రులు నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకుంటారు. 

ఇలాంటి విద్యార్థులందరినీ మ్యాప్‌ చేసిన తర్వాత ఆ డేటాను విద్యా శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి నేరుగా విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలకు బదిలీ చేస్తారు. విద్యార్థి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు సమర్పించా ల్సిన అవసరం ఉండదు. ఉన్నత తరగతులకు ప్రమోట్‌ చేసేటప్పుడు కూడా ఇదే విధానం అనుసరిస్తారు. 

అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలోని పాఠశాలల్లో ఇదే తరహా విధానం అనుసరిస్తారు. గత ఏడాది వరకు పాఠశాలలో ప్రవేశానికి తప్పనిసరిగా పుట్టిన తేదీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికెట్, నివాస «సర్టిఫికెట్‌ వంటివి తప్పనిసరి. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ విధానానికి స్వస్తి పలకనున్నారు. 

‘పెన్‌’పై అవగాహన  
ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి ‘పెన్‌’ నంబర్‌ కేటాయించాలని పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ జిల్లా, మండల విద్యా శాఖాధికారులు, పాఠశాలల హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను చేర్చుకునే సమయంలో పర్మినెంట్‌ నంబర్‌పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, సర్టిఫికెట్ల పేరిట తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement