చదువులకు దూరంగా చిన్నారులు | Millions of children away from education | Sakshi
Sakshi News home page

చదువులకు దూరంగా చిన్నారులు

Published Tue, Sep 4 2018 4:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Millions of children away from education - Sakshi

సాక్షి, అమరావతి: ఒకవైపు పాఠశాలలు అందుబాటులో లేకపోవడం మరోవైపు వందల సంఖ్యలో స్కూళ్లు మూతపడుతుండటంతో రాష్ట్రంలో లక్షల మంది చిన్నారులు బడికి వెళ్లే భాగ్యానికి నోచుకోవడం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర శిక్షా అభియాన్‌ సమర్పించిన గణాంకాలు ఈ అంశాలను తేటతెల్లం చేస్తున్నాయి. ఆధార్‌ ద్వారా బడి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించే ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించిన సంగతి తెలిసిందే.  

అదనంగా 70,965 మంది బడికి దూరం
ఏపీలో 2016–17లో బడిబయట ఉన్న పిల్లలు 34,880 మంది కాగా 2017–18లో అది 1,05,845కి పెరిగింది. గతంలో కన్నా అదనంగా 70,965 మంది (203.45 శాతం) బడి బయట ఉన్నట్లు తేలింది. ఆధార్‌ ద్వారా డూప్లికేట్, డబుల్‌ చేరికలను నివారించినట్లు పేర్కొన్నారు. పాత గణాంకాల ఆధారంగా ఆధార్‌తో డ్రాపవుట్ల సంఖ్యను గుర్తించారు.

స్పెషల్‌ డ్రైవ్‌తో 3.36 లక్షల మంది బడికి
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాసాధికార సర్వే ద్వారా రాష్ట్రంలో దాదాపు 8.96 లక్షల మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు తేలింది. పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ గణాంకాలతో వీటిని పోల్చి చూడగా బడిఈడు పిల్లలు లక్షల సంఖ్యలో బడి బయట ఉన్నట్లు తేలింది. దీంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి 3.36 లక్షల మందిని ఈ ఏడాది తిరిగి స్కూళ్లలో చేర్పించారు. అయినా కూడా ఇంకా 5.6 లక్షల మంది పిల్లలు బడి బయటే ఉన్నట్లు వెల్లడైంది. 

పాఠశాలల మూసివేతలు..
సమగ్రశిక్ష అభియాన్‌ నివేదిక ప్రకారం గత ఏడాది 468 ప్రాథమిక పాఠశాలలను మూసివేసి విద్యార్థులను సమీపంలోని ఇతర స్కూళ్లలో చేర్చారు. 936 ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక స్కూళ్ల స్థాయికి కుదించారు. 322 హైస్కూళ్లను రేషనలైజేషన్‌ చేసి సింగిల్‌ మీడియం పాఠశాలలుగా మార్చారు.

పొంతన లేని లెక్కలు..
రాష్ట్రంలో పాఠశాల విద్యావ్యవస్థ అద్భుతంగా పరుగులు తీస్తోందని పాఠశాల విద్యాశాఖ గతంలో పలు గణాంకాలను చూపించింది. అయితే ఇవన్నీ తప్పుడు తడకలేనని గత ఏడాది కాగ్‌  నివేదికలో  తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి సర్వశిక్ష అభియాన్‌ ద్వారా పంపే లెక్కలకు, పాఠశాల విద్యాశాఖ అంకెలకు మధ్య చాలా  వ్యత్యాసాలున్నాయని, వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని అక్షింతలు వేసింది. విద్యార్థులు, టీచర్లు, పాఠశాలల సంఖ్యకు సంబంధించిన లెక్కల్లో పొంతనలేదని తేల్చింది. తాజాగా సర్వశిక్ష అభియాన్‌ కేంద్రానికి పంపిన గణాంకాలు రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితిని కళ్లకు కడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement