విద్యార్థులను పాఠశాలలకు దూరం చేస్తున్న వాతావరణ సంక్షోభం
తీవ్ర ఉష్ణోగ్రతలు, తుపానులు, కరువు కారణంగా పాఠశాల విద్యపై ప్రతికూల ప్రభావం
గతేడాది 85 దేశాల్లో 242 మిలియన్ విద్యార్థుల విద్యకు అంతరాయం
భారత్‌లో 5 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం చూపిన తీవ్రమైన వేడి గాలులు
యునిసెఫ్ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేడి గాలులు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పాఠశాల విద్యకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయం యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్స్ (యునిసెఫ్) అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది ప్రకృతి విపత్తులతో 85 దేశాల్లో 242 మిలియన్ల మంది విద్యార్థులు ప్రీ–ప్రైమరీ నుంచి అప్పర్ సెకండరీ వరకూ విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొన్నట్టు పేర్కొంది.
ప్రతి ఏడుగురు విద్యార్థుల్లో ఒకరి పాఠశాల విద్యపై వాతావరణ సంక్షోభం ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు స్పష్టం చేసింది. విపత్తుల కారణంగా విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో దిగువ, మధ్య ఆదాయ దేశాలే అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. గతేడాది విద్య అంతరాయానికి గురైన 242 మిలియన్ల మంది విద్యార్థుల్లో 74 శాతం మంది అల్పాదాయ దేశాలకు చెందిన వారున్నారు.
భారత్‌లోనూ 5 కోట్ల మంది
2024 విద్య అంతరాయానికి తీవ్రమైన వేడిగాలులు ప్రధాన కారణంగా నిలిచాయని చెప్పవచ్చు. తీవ్రమైన వేడిగాలుల కారణంగా గతేడాది భారత్‌లో 5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. వేడిగాలుల కారణంగా భారత్‌తో పాటు బంగ్లాదేశ్, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ వంటి దేశాలు గణనీయమైన ప్రభావాలను చవిచూశాయి. ఈ దేశాల్లో కనీసం 118 మిలియన్ల మంది పిల్లలకు చదువుల్లో అంతరాయం ఎదురైంది. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడినవారు 171 మిలియన్ల మంది ఉంటారని అంచనా వేశారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యంత తరచుగా విద్య అంతరాయాలు సంభవించాయి. 18 దేశాలలో తరగతులు నిలిపేశారు. తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాలలో 16 మిలియన్ల మంది పిల్లలపై ప్రభావం పడింది. ఆఫ్రికాలో 107 మిలియన్ల మంది పిల్లలు ఇప్పటికే పాఠశాలలకు దూరంగా ఉండగా.. వీరిలో 20 మిలియన్ల మంది వాతావరణ సంక్షోభం కారణంగానే పాఠశాలల నుంచి తప్పుకున్నట్టు స్పష్టమైంది. 2050–2059 మధ్య తీవ్ర వాతావరణ సంక్షోభాలను ప్రపంచ దేశాలు చవిచూడనున్నాయని అధ్యయన నివేదిక వెల్లడించింది.
26వ స్థానంలో భారత్
ప్రకృతి వైపరీత్యాల ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలపై యునిసెఫ్ గతంలోనే అధ్యయనం చేసింది. 163 దేశాలకు చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (సీసీఆర్‌ఐ) పేరిట స్కోరింగ్ ఇచ్చింది. ఇందులో భారత్‌కు 26 స్థానం దక్కింది. పాకిస్తాన్ 14, బంగ్లాదేశ్, 15, ఆఫ్ఘనిస్తాన్ 25 స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment