Unicef
-
విద్యపై ప్రకృతి ప్రకోపం
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేడి గాలులు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పాఠశాల విద్యకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయం యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్స్ (యునిసెఫ్) అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది ప్రకృతి విపత్తులతో 85 దేశాల్లో 242 మిలియన్ల మంది విద్యార్థులు ప్రీ–ప్రైమరీ నుంచి అప్పర్ సెకండరీ వరకూ విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొన్నట్టు పేర్కొంది. ప్రతి ఏడుగురు విద్యార్థుల్లో ఒకరి పాఠశాల విద్యపై వాతావరణ సంక్షోభం ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు స్పష్టం చేసింది. విపత్తుల కారణంగా విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో దిగువ, మధ్య ఆదాయ దేశాలే అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. గతేడాది విద్య అంతరాయానికి గురైన 242 మిలియన్ల మంది విద్యార్థుల్లో 74 శాతం మంది అల్పాదాయ దేశాలకు చెందిన వారున్నారు. భారత్‌లోనూ 5 కోట్ల మంది 2024 విద్య అంతరాయానికి తీవ్రమైన వేడిగాలులు ప్రధాన కారణంగా నిలిచాయని చెప్పవచ్చు. తీవ్రమైన వేడిగాలుల కారణంగా గతేడాది భారత్‌లో 5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. వేడిగాలుల కారణంగా భారత్‌తో పాటు బంగ్లాదేశ్, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ వంటి దేశాలు గణనీయమైన ప్రభావాలను చవిచూశాయి. ఈ దేశాల్లో కనీసం 118 మిలియన్ల మంది పిల్లలకు చదువుల్లో అంతరాయం ఎదురైంది. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడినవారు 171 మిలియన్ల మంది ఉంటారని అంచనా వేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యంత తరచుగా విద్య అంతరాయాలు సంభవించాయి. 18 దేశాలలో తరగతులు నిలిపేశారు. తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాలలో 16 మిలియన్ల మంది పిల్లలపై ప్రభావం పడింది. ఆఫ్రికాలో 107 మిలియన్ల మంది పిల్లలు ఇప్పటికే పాఠశాలలకు దూరంగా ఉండగా.. వీరిలో 20 మిలియన్ల మంది వాతావరణ సంక్షోభం కారణంగానే పాఠశాలల నుంచి తప్పుకున్నట్టు స్పష్టమైంది. 2050–2059 మధ్య తీవ్ర వాతావరణ సంక్షోభాలను ప్రపంచ దేశాలు చవిచూడనున్నాయని అధ్యయన నివేదిక వెల్లడించింది. 26వ స్థానంలో భారత్ ప్రకృతి వైపరీత్యాల ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలపై యునిసెఫ్ గతంలోనే అధ్యయనం చేసింది. 163 దేశాలకు చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (సీసీఆర్‌ఐ) పేరిట స్కోరింగ్ ఇచ్చింది. ఇందులో భారత్‌కు 26 స్థానం దక్కింది. పాకిస్తాన్ 14, బంగ్లాదేశ్, 15, ఆఫ్ఘనిస్తాన్ 25 స్థానాల్లో ఉన్నాయి. -
ఈ ఏడాది.. పిల్లల పాలిట పెనుశాపమే!
పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా నిలిచింది 2024. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ తాజాగా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 15 నెలల్లో కనీసం 17,492 మంది బాలలు మరణించినట్లు తెలిపింది...! మునుపెన్నడూ లేనంతంగా ఎక్కువ మంది పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బలవంతంగా నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణలో మరణిస్తున్న, గాయపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాలలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భద్రత మాట పక్కకు పెడితే.. ప్రాథమిక అవసరాలు తీర్చుకునే అవకాశమూ ఉండటం లేదు. వాళ్లు ఆడుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడో మరిచారు. ఈ యుద్ధాలు పిల్లల హక్కులను హరిస్తున్నాయి. ఇక, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు, పోషకాహారం విలాసంగా మారాయి. ‘‘ప్రపంచంలో అనియంత్రిత యుద్ధాలకు ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు మనుగడ కోసం పోరాటమే చేస్తున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది దారుణం’’ అని యునిసెఫ్ డైరెక్ట్ కేథరిన్ రస్సెల్ వాపోయారు. గణాంకాలు చెబుతున్న విషాదాలు.. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో పిల్లలు 30 శాతం ఉన్నారు. వారిలో 47.3 కోట్ల మంది యుద్ధ ప్రభావింత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంతర్జాతీయ ఏజెన్సీ తెలిపింది. 1990లలో సుమారు 10 శాతం మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో ఉండగా ఇప్పుడది ఏకంగా రెట్టింపుకు, అంటే 19 శాతానికి పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా 2023 చివరి నాటికి 4.7 కోట్ల మంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 2024లో హై తీ, లెబనాన్, మయన్మార్, పాల స్తీనా, సూడాన్ నుంచి అత్యధికంగా శరణార్థులుగా వెళ్లారు. ప్రపంచ శరణార్థుల జనాభాలో సుమారు 40 శాతం బాలలే. ఆయా దేశాల్లో నిర్వాసితులయినవారిలో బాలలు 49 శాతమున్నారు. 2023 నుంచి ఇప్పటిదాకా 22,557 మంది పిల్లలపై రికార్డు స్థాయిలో 32,990కు పైగా తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లో అత్యాచారాలు, లైంగిక హింస పెచ్చరిల్లాయి. ప్రమాదకర స్థాయిలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యా మౌలిక సదుపాయాల విధ్వంసం, పాఠశాలల సమీపంలో అభద్రతా భావం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పిల్లల్లో పోషకాహార లోపం కూడా ప్రమాదకర స్థాయికి పెరిగింది. యుద్ధం పిల్లల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని పిల్లల్లో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ పెరిగింది. పిల్లల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. విచారం, భయం వంటి వాటితో బాధపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పిల్లలకు వె'డర్'!
సాక్షి, అమరావతి: వాతావరణంలో తీవ్రంగా పెరుగుతున్న గాలి కాలుష్యంతోపాటు ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు పిల్లల జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యునిసెఫ్) వెల్లడించింది. మన దేశంలో 2050 నాటికి పిల్లల సంఖ్య 10.60 కోట్ల మేర తగ్గుతుందని హెచ్చరించింది. వాతావరణంలో మార్పుల వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు తక్కువ ఆదాయ వర్గాల జీవనోపాధులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. అదేవిధంగా వరదలు వంటి ప్రకృతి విపత్తుల ముప్పు కూడా పెరుగుతుందని పేర్కొంది. వీటివల్ల పిల్లల సంఖ్య తగ్గుతుందని, 2050 నాటికి దేశ జనాభాలో సుమారు 45.6 కోట్లు ఉండాల్సిన బాలలు... కేవలం 35 కోట్లు మాత్రమే ఉంటారని వివరించింది. అయినా 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉండే మొత్తం పిల్లల జనాభాలో భారతదేశ వాటా 15శాతం ఉంటుందని అంచనా వేసింది. యునిసెఫ్ ఫ్లాగ్షిప్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్–2024 నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది పిల్లలు ఉంటారని, వారిలో మూడో వంతు భారత్, చైనా, నైజీరియా, పాకిస్తాన్ దేశాల్లోనే ఉంటారని ప్రకటించింది. కొన్ని దేశాల్లో ప్రతి పది మందిలో ఒక్కరు కూడా పిల్లలు ఉండని ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2050–59 మధ్య పర్యావరణ సంక్షోభాలు మరింత ఎక్కువగా తలెత్తే అవకాశం ఉందని, ఇవి పిల్లల జనాభాపై అత్యంత తీవ్రంగా ప్రభావం చూపుతాయని యునిసెఫ్ ఆందోళన వ్యక్తంచేసింది.యునిసెఫ్ నివేదికలోని ముఖ్యాంశాలు..» ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం కలిగిన 28 దేశాల్లో కుటుంబ ఆదాయాల పరంగా పిల్లల జనాభాలో మార్పులను అంచనా వేశారు. 2000 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం పిల్లల జనాభాలో 11 శాతం మంది తక్కువ ఆదాయం కలిగిన 28 దేశాల్లోనే ఉండగా... 2024 నాటికి 23 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఉన్నత, మధ్యస్థ ఆదాయాలు కలిగిన దేశాల్లో పిల్లల జనాభా తగ్గింది.» ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో 2000వ సంవత్సరంలో 24 కోట్ల మంది పిల్లలు ఉండగా, ఆ సంఖ్య 2050 నాటికి 54.40 కోట్లకు పెరుగుతుందని అంచనా. దిగువ మధ్య తరగతి ఆదాయ కుటుంబాల్లో 100.09 కోట్ల మంది ఉండగా, 2050 నాటికి స్పల్పంగా పెరిగి 118.70 కోట్లకు చేరుతుంది. » ఉన్నత, మధ్య ఆదాయ కుటుంబాల్లో 2000లో 65 కోట్ల మంది పిల్లల జనాభా ఉండగా, 2050 నాటికి ఆ సంఖ్య బాగా తగ్గి 38.70 కోట్లకు పరిమితమవుతుంది. ధనిక కుటుంబాల్లో 2000 నాటికి 24.40 కోట్ల మంది పిల్లల జనాభా ఉండగా, ఆ సంఖ్య 2050 నాటికి 21.60 కోట్లకు పరిమితమవుతుంది. » అదేవిధంగా పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు 57 అంశాల అమలుపై 163 దేశాల్లో యునిసెఫ్ అధ్యయనం చేసి ప్రకటించిన చిల్డ్రన్ క్లెయిమెట్ రిస్క్ ఇండెక్స్‌లో భారత్ 26వ స్థానంలో ఉంది. -
చిన్నారుల్లో కోపం స్మార్ట్ గాడ్జెట్స్ ప్రభావం..
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ వాడకం చిన్నారుల్లో ప్రతికూల భావోద్వేగాలను పెంచుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎల్రక్టానిక్ పరికరాలు వాడే ప్రీ స్కూల్ చిన్నారుల్లో చిరాకు, కోపం ఎక్కువగా కనిపిస్తోందని గుర్తించారు. కెనడా లోని షెర్‌బ్రూక్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. స్మార్ట్ ఫోన్ వాడకం చిన్నారుల్లో స్వీయ నియంత్రణ, నైపుణ్యాల అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోంది. మూడున్నరేళ్లు, నాలుగున్నరేళ్ల వయసు నుంచి టాబ్లెట్‌కు అలవాటుపడ్డ చిన్నారుల భావోద్వేగాలను పరిశీలించారు. ఇలాంటి చిన్నారుల్లో ఏడాది తర్వాత కోపం, నిరాశ విపరీతంగా పెరిగినట్టు గుర్తించారు. చిన్నారులు సొంత ప్రతికూల భావోద్వేగాలను నేర్చుకునే విధానం సాంకేతిక పరికరాల ద్వారా జరుగుతుండటం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో బాల్య వికాసం జరిగితేనే.. సరైన భావోద్వేగం ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ప్రతి ఇంట్లో చిన్నారుల అల్లరిని కట్టడి చేసేందుకు, ఏడుపును అదుపు చేసేందుకు స్మార్ట్ ఫోన్ అలవాటు చేయడం సరైన పద్ధతి కాదని అధ్యయనం చెబుతోంది. ఇది బాల్యం, యుక్తవయసులో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందంటున్నారు. యునిసెఫ్ సైతం యునిసెఫ్ సైతం చిన్నారుల స్క్రీనింగ్ అలవాట్లను తీవ్రంగా తప్పుపడుతోంది. ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎటువంటి సాంకేతిక పరికరాల నుంచి ఏమీ నేర్చుకోలేరని చెబుతోంది. వారికి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు చూపించడం ద్వారా మెదడుపై ప్రతికూల ప్రభావం గురించి యునిసెఫ్ వైద్య బృందం సైతం హెచ్చరిస్తోంది. ఆఫ్–్రస్కీన్ అనుభవాలను అందించడం ద్వారా క్లిష్టమైన వాటిని కూడా చిన్నారులు నేర్చుకోవడంతో పాటు సామాజిక, అభిజ్ఞా నైపుణ్యాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. చిన్నారుల్లో మెదడు బాహ్య ప్రపంచం నుంచి గ్రహించిన వాటితోనే అభివృద్ధి చెందుతుందని, కథలు వినడం, పుస్తకాలను బిగ్గరగా చదవడం, చిత్రాలను గుర్తించడం ద్వారా ప్రేరణ పెరుగుతోందని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు స్క్రీన్ సమయం ఇవ్వకూడదని, నాలుగేళ్ల లోపు చిన్నారులకు పాఠ్యాంశాల పరమైన వాటికి, గంటలోపు మాత్రమే స్క్రీనింగ్‌కు కేటాయించాలని సూచిస్తోంది. తాజా పరిశోధనలో 75 నిమిషాలు, అంతకంటే ఎక్కువ రోజువారీ స్క్రీన్ సమయం ఉండటం గమనార్హం. స్క్రీనింగ్‌తో అనారోగ్యం మన ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల స్క్రీన్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. స్క్రీన్ సమయంలో కదలకుండా ఒకేచోట కూర్చోవడంతో బరువు పెరగడం, ఊబకాయం సమస్యలు తలెత్తున్నాయి. ఇది యుక్త వయసు వచ్చేసరికి మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, చిత్త వైకల్యానికి దారితీస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు మాట్లాడే పదాలను తక్కువగా నేర్చుకోవడంతో పాటు డిప్రెషన్ ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతాయని అధ్యయనంలో పాల్గొన్న వైద్యులు చెబుతున్నారు. -
రోజుకు 2 వేల మంది చిన్నారులను మింగేస్తున్న ‘కాలుష్యభూతం’
దేశ రాజధాని నగరం ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. గాలిలో నాణ్యత అత్యంత ప్రమాదకరస్థాయిలకు పడిపోవడం ఇటీవలి కాలంలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా వాయు కాలుష్యానికి సంబంధించిన ఆందోళకరమైన అధ్యయనం ఒకటి మరింత ఆందోళన రేపుతోంది. వాయుకాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు రెండో అతిపెద్ద ప్రమాద కారకంగా వాయు కాలుష్యం నిలుస్తోందని కూడా ఈ నివేదిక తేల్చింది.అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం, 2021లో ఏకంగా 81 లక్షలమంది చిన్నారు వాయు కాలుష్య భూతానికి బలైనారు. మొత్తం మరణాలలో దాదాపు 12 శాతం. అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం ఉంది. పొగాకు, పోషకాహార లోపం కంటే ఎక్కువగా వాయుకాలుష్యమే ప్రజలను బలితీసుకుంటోందని ఈ అధ్యయనం తేల్చింది. మన నిర్లక్ష్యమే తదుపరి తరంపై తీవ్ర ప్రభావం చూపుతోందని యునిసెఫ్‌కు చెందిన కిట్టి వాన్ డెర్ హీజ్డెన్ తెలిపారు.వాయు కాలుష్యంకారణంగా ఐదేళ్ల లోపు ఉన్న 7 లక్షల మంది పిల్లల మరణించారు. ఇందులో 5 లక్షల మరణాలకు ప్రధాన కారణం ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య బొగ్గు, చెక్కలు, పేడ వంటి వాటిని వంటచెరకుగా వాడటం వలన సంభవించాయి.తరువాతి తరంపై తీవ్ర ప్రభావంయూనీసెఫ్తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన వార్షిక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం చూపుతోందని అధ్యయనం హెడ్ పల్లవి పంత్ వెల్లడించారు. ఇవి మనం పరిష్కరించగల సమస్యలేనని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోని దాదాపు ప్రతీ ఒక్కరూ ఆనారోగ్యకర స్థాయిలో వాయుకాలుష్యం బారిన పడుతున్నారు. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90 శాతానిపైగా పీఎమ్ 2.5 అనే సూక్ష్మ ధూళి కణాలే కారణం. పీఎమ్ 2.5 సూక్ష్మధూళి కణాల కారణంగా ఊపిరితిత్తుల కేన్సర్, గుండె జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వాస్తవ పరిస్థితి తీవ్రత ఇంతకంటే ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాలుష్యంతో 2021లో 5 లక్షల మంది ప్రాణాలు గాల్లోకి కలిసి పోయాయి. వాతావరణ మార్పులు, వాయుకాలుష్యానికి చాలా సారూప్యమైన పరిష్కార మార్గాలు ఉన్నాయని పల్లవి వ్యాఖ్యానించారు. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ఇళ్లల్లో వంటకు బొగ్గు, చెక్క వంటి అనారోగ్య కారక ఇంధనాల వినియోగం తగ్గించాలి. ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది. ఓజోన్ స్థాయిలను పెంచే అడవి మంటలు, దుమ్ము తుఫానులు లేదా విపరీతమైన వేడి వంటి సంఘటనల కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్‌లు లేదా మంటలపై ఆహారం వండుకుంటూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే మెరుగైన స్టవ్‌లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గాయి. 200 పైగా దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది. -
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
ఢిల్లీ: యూనీసెఫ్ ఇండియా (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) తన కొత్త జాతీయ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ 'కరీనా కపూర్'ను ప్రకటించింది. 2014 నుంచి యునిసెఫ్ ఇండియాతో సంబంధం కలిగి ఉన్న ఈమె ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.కరీనా ఇంతకు ముందు యునిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అడ్వకేట్‌గా పనిచేశారు. కాగా ఇప్పుడు నూతన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు భారత జాతీయ రాయబారిగా యునిసెఫ్‌తో నా అనుబంధాన్ని కొనసాగించడం నాకు గౌరవంగా ఉంది కరీనా పేర్కొన్నారు. ప్రతి బిడ్డకు బాల్యం, సమానమైన అవకాశం, భవిష్యత్తు అవసరం అని ఆమె పేర్కొన్నారు.#WATCH | Delhi: Actress Kareena Kapoor Khan appointed as UNICEF India's National Ambassador. pic.twitter.com/tglRjOtyPU— ANI (@ANI) May 4, 2024 -
ఏటీఎల్ వినియోగంలో ఏపీ ముందంజ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్)’ సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని యునిసెఫ్, టీసీఎస్ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం న్యూఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చిన యునిసెఫ్, టీసీఎస్ ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లాలో మొవ్వ, పెనమలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. దీన్లోభాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, హబ్, స్పోక్స్ మోడల్‌తో పాటు ప్రభుత్వం అమలు చేసిన స్టెమ్ ఆధారిత కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడలో పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 713 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను హబ్, స్పోక్ మోడల్‌గా రూపొందించామన్నారు. విద్యార్థులను సాంకేతికత విజ్ఞానం వైపు ప్రోత్సహించడానికి ‘సంకల్పం’ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామన్నారు. అటల్ టింకరింగ్ మారథాన్, సీడ్ ది ఫ్యూచర్, సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ తదితర పోటీల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పనితీరుపై యునిసెఫ్ డాక్యుమెంటరీ రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ నుంచి వచ్చిన యునిసెఫ్ ప్రతినిధులు అరేలియా ఆర్డిటో (చీఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్), ప్రమీల (విద్యా నిపుణురాలు), హైదరాబాదు నుంచి శేషగిరి మధుసూదన్ (విద్యా నిపుణులు), శిఖా రాణా (విద్యాధికారి), టీసీఎస్ నుంచి విమల్, విపుల్, శ్రీనివాస్ విశ్వనాథ, ఏపీ యునిసెఫ్ కన్సల్టెంట్ టి.సుదర్శన్, రాష్ట్ర నోడల్ అధికారి డా.జిఆర్ భాగ్యశ్రీ, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి తదితరులున్నారు. -
ప్రభుత్వ చర్యలు భేష్.. సీఎం జగన్‌కు యూనిసెఫ్ టీమ్ అభినందన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ జెలలీమ్ బి.టఫ్పెస్సే క్యాంపు కార్యాయంలో కలిశారు. ఈ సందర్బంగా గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా పనిచేసేందుకు యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ సంసిద్థంగా ఉన్నట్టు తెలిపారు. అయితే.. వైద్య, ఆరోగ్యం రంగంలోని వివిధ స్థాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్ఎంలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ వంటి వివిధ స్థాయిల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు యూసిసెఫ్ ముందుకొచ్చినట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై యూనిసెఫ్ బృందంతో సీఎం జగన్ చర్చించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరును ముఖ్యమంత్రి జగన్ వారికి వివరించారు. దీంతో, ప్రభుత్వ నిర్ణయాలను వారు అభినందించారు. ఇక, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్ ప్లాన్, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని యూనిసెఫ్ అందిస్తామని తెలిపారు. కాగా, ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు యూనిసెఫ్ ప్రతినిధులకు సీఎం జగన్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీలో వ్యవసాయ రంగ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష.. ఆదేశాలు ఇవే.. -
Sudan Conflict: 400 మందికి పైగా మృతి.. వేల మందికి గాయాలు
న్యూయార్క్: సూడాన్ అంతర్యుద్ధంలో 413 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(RSF)కు నడుమ అక్కడ భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు ఐరాస మరో విభాగం యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరేట్ హ్యారిస్ మీడియాతో మాట్లాడుతూ.. సూడాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 413 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, అలాగే 3,551 మంది గాయపడ్డారని వెల్లడించారు. అలాగే.. అక్కడి ఆరోగ్య కేంద్రాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. ఇదే సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ మాట్లాడుతూ.. ఈ పోరులో పిల్లలే ఎక్కువగా బాధితులైనట్లు వెల్లడించారు. తొమ్మిది మంది చిన్నారులు మరణించారు, 50 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారాయన. అలాగే.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారని, చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకపోయాయని తెలిపారు. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారని, మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అవుతున్నాయంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితులతో యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. సూడాన్‌లో 2021 అక్టోబర్ నుంచి ప్రభుత్వం లేకుండానే ఎమర్జెన్సీలో నడుస్తోంది. మిలిటరీ అప్పటి ప్రధాని అబ్దల్లా హందోక్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. గత శనివారం నుంచి సూడాన్ రాజధాని ఖార్తోమ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు నడుమ పోరాటం నడుస్తోంది. అధికార దాహం నుంచి పుట్టిందే ఈ అంతర్యుద్ధం -
పద్దెనిమిదికి ముందే పెళ్లి!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోవిడ్... ప్రతి మనిషిని ఆరోగ్యపరంగా, ఆర్థికం గా కుంగదీసింది. ఉపాధినీ దెబ్బతీసింది. ఆ మహమ్మారి వ్యాప్తి తగ్గినా... దాని ప్రభావం మాత్రం సమాజంపై వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. మనుషుల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తూనే ఉంది. కోవిడ్ చేసిన గాయం కారణంగా అభద్రతాభావానికి గురవుతున్న తల్లిదండ్రులు తమ కుమార్తెలకు వయసుతో నిమిత్తం లేకుండా వెంటనే పెళ్లిళ్లు చేయాలనే భావనలోకి వచ్చారని యూనిసెఫ్ నిర్వహించిన సర్వేలో తేలింది. అందువల్లే దేశవ్యాప్తంగా 2022లో జరిగిన పెళ్లిళ్లలో 25.3శాతం మంది అమ్మాయిలు 18 ఏళ్లు నిండనివారే ఉన్నారని వెల్లడించింది. ఇందుకు కొన్ని కారణాలను ఈ సర్వేలో గుర్తించినట్లు తెలిపింది. మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్ పద్దెనిమిదేళ్ల వయసు నిండకముందే అమ్మాయిలకు వివాహాలు చేస్తున్న రాష్ట్రాల్లో పశి్చమ బెంగాల్ తొలి స్థానంలో నిలిచింది. అక్కడ 41.6 శాతం బాల్యవివాహాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో బిహార్ (40.8 శాతం), త్రిపుర (40.1శాతం), జార్ఖండ్ (32.2 శాతం), అస్సాం(31.8 శాతం), ఆంధ్రప్రదేశ్ (29.3 శాతం) ఉన్నాయి. జమ్మూ–కశీ్మర్లో అత్యంత తక్కువగా 4.5 శాతం, కేరళలో 6.3 శాతం చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేసినట్లు యూనిసెఫ్ గుర్తించింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో బాల్యవివాహాల పరిస్థితి మన రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 37.3 శాతం చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత స్థానాల్లో ఉమ్మడి కర్నూలు (36.9 శాతం), గుంటూరు (35.4 శాతం), విజయనగరం (33.7 శాతం), చిత్తూరు (28.1 శాతం), తూర్పుగోదావరి (26.0 శాతం), వైఎస్సార్ కడప (25.6 శాతం), శ్రీకాకుళం (25.4 శాతం), విశాఖపట్నం (25.4 శాతం), కృష్ణా (25.3 శాతం), నెల్లూరు (23.8 శాతం), పశి్చమగోదావరి (22.1 శాతం) చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు 2022లో వివాహాలు చేసినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. ప్రధాన కారణాలు ఇవీ... ► కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. పది, ఇంటర్ చదువుతున్నవారు ఆన్లైన్ తరగతుల కారణంగా చదువులో రాణించలేకపోయారు. ఫలితంగా డ్రాపవుట్స్ పెరిగాయి. ► చదువు మధ్యలో ఆపేసిన ఆడపిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. ► కరోనా రాకముందు వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి సొంత గ్రామాలకు వచ్చేశాయి. నిరుద్యోగిత పెరగడంవల్ల ఆరి్థకంగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ► అందువల్ల అభద్రతాభావంతో పెళ్లీడు రాకపోయినా ఆడపిల్లలకు వివాహాలు చేస్తే బాధ్యత తీరిపోతుందని ఎక్కువ మంది తల్లిదండ్రులు భావిస్తున్నట్లు సర్వేలో గుర్తించినట్లు యూనిసెఫ్ ప్రకటించింది. -
దేశానికే దిక్సూచి ‘మిడ్వైఫరీ’
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ (ప్రసూతి సహాయకులు) వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అను బంధ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచి, దిక్సూచిగా మారిందని అభినందించింది. ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ‘ఫర్ ఎవ్రి చైల్డ్ ఎ హెల్థీ స్టార్ట్’ హాష్ ట్యాగ్‌తో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేసి యూనిసెఫ్ ట్వీట్ చేసింది. తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థపై యూనిసెఫ్ ప్రశంసల పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందనడానికి ఇది మరొక నిదర్శనం అని ట్వీట్ చేశారు. తగ్గిన మాతృ మరణాలు మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృత్వపు మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) ప్రత్యేక బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్య,ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్న మాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు తగ్గుదల నమోదైందని వెల్లడించింది. దీని ఫలితంగానే యూనిసెఫ్ మిడ్వైఫరీ వ్యవస్థను ప్రశంసించిందని పేర్కొంది. -
Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం
పట్టుమని పదేళ్లు కూడా నిండకముందే తండ్రి మరణం, దీనికితోడు ఆర్థిక పరిస్థితులు దిగజారి భవిష్యత్ శూన్యంగా కనిపించింది. విధి వంచించిందని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతోన్న తరుణంలో ఎంతో ఇష్టమైన చెల్లి, తల్లి అకాల మరణాలు అమాంతం పాతాళంలోకి లాగినట్టు అనిపించాయి. అయినా ఏమాత్రం భయపడకుండా ఎదురవుతోన్న ఆటుపోట్లను బలంగా మార్చుకుని సామాజిక వేత్తగా, డైరెక్టర్‌గా రాణిస్తోంది ప్రియస్వర భారతి. 21 ఏళ్లకే జీవితానికి సరిపడినన్ని కష్టాలను అనుభవించిన ప్రియస్వర నేడు అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలు తీస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్. భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు. ప్రారంభంలో ఆరునెలలు అనుకున్న చికిత్స మూడేళ్లపాటు కొనసాగింది. దీంతో కుటుంబం మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించినప్పటికీ ఫలితం దక్కకపోగా, తండ్రిని కోల్పోయారు. మరోపక్క ఆర్థిక ఆధారం లేక నలుగురూ మూడేళ్లు స్కూలుకు వెళ్లలేదు. ట్యూషన్లు చెబుతూ... తండ్రి చనిపోయాక భారతి తల్లి ఉద్యోగం చేసినప్పటికీ కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో తల్లికి సాయపడేందుకు హోమ్ ట్యూషన్స్ చెప్పేది భారతి. ఇదే సమయంలో స్కూలుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌ను నేర్పించే కిల్కారి సంస్థలో చేరింది. అక్కడ సైన్స్ ప్రాజెక్టుపై మక్కువ ఏర్పడడంతో ఎంతో ఆసక్తిగా నేర్చుకునేది. దీంతో 2013లో కిల్కారి నుంచి యూనిసెఫ్‌కు ఎంపికైన 20 మందిలో భారతి ఒకరు. కిల్కారి, యూనిసెఫ్ ద్వారా పిల్లల హక్కుల గురించి వివరంగా తెలుసుకుని తన తోటి వలంటీర్లతో కలిసి ‘బీహార్ యూత్ ఫర్ చైల్డ్ రైట్స్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు విద్య, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, బాల్యవివాహాలు, మహిళలు, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపై అవగాహన కల్పించేది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వివిధ వర్క్‌షాపులు, వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చెల్లితో కలిసి డైరెక్టర్‌గా... ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్, కిల్కారి సంస్థలు రెండు కలిసి పదిరోజుల పాటు డైరెక్షన్ లో ఉచితంగా వర్క్‌షాపు నిర్వహించాయి. అప్పుడు యూనిసెఫ్ అడ్వైజరీ బోర్డు యువ యంగ్ పీపుల్ యాక్షన్ టీమ్‌లో సభ్యురాలిగా కొనసాగుతోన్న భారతి సినిమాటోగ్రఫీపై ఆసక్తితో పదిరోజులపాటు వర్క్‌షాపుకు హాజరైంది. తరువాత తన చెల్లి ప్రియాంతరాతో కలిసి ‘గెలటాలజీ’ డాక్యుమెంటరీ తీసింది. తొమ్మిదో జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీకి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత 2019లో పట్నాను ముంచెత్తిన వరద బీభత్సాన్ని కళ్లకు కట్టేలా ‘ద అన్నోన్ సిటీ, మై ఓన్ సిటీ ఫ్లడెడ్’ పేరుతో మరో డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీకి కూడా ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. 2018 నుంచి డాక్యుమెంటరీలు తీస్తూ జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపిస్తూ అనేక అవార్డులను అందుకుంది. ప్రస్తుతం పట్నా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న భారతి కొన్ని పెద్ద ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అవకాశాలు సృష్టించుకోవాలి అవకాశాలు వాటంతట అవే మన దగ్గరికి రావు. మనమే సొంతంగా సృష్టించుకుని ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఎదగగలుగుతాము. అదే నా విజయ రహస్యం. – ప్రియస్వర భారతి -
పాకిస్తాన్ వరద బాధితులుగా... 1.6 కోట్ల చిన్నారులు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంభవించిన భీకర వరదల ధాటికి 1.6 కోట్ల మంది చిన్నారులు బాధితులుగా మారారని, వీరిలో 34 లక్షల మందికి తక్షణమే సాయం అందించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే పోషకాహార లేమిని ఎదుర్కొంటున్న బాలలు డయేరియా, డెంగ్యూ జ్వరం, చర్మ వ్యాధులతో పోరాడుతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్) ప్రతినిధి అబ్దుల్లా ఫాదిల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్లో సింధ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఇటీవలే రెండు రోజులపాటు పర్యటించారు. పాకిస్తాన్లో వరదలు 528 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్నాయని చెప్పారు. ఇవన్నీ నివారించగలిగే మరణాలే అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని ఆక్షేపించారు. ఆవాసం లేక చిన్నపిల్లలు కుటుంబాలతో కలిసి బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటున్నారని, ఆహారం, నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు కూలిపోయాయని అన్నారు. బాధితులను ఆదుకొనేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణం ముందుకు రావాలని అబ్దుల్లా ఫాదిల్ విజ్ఞప్తి చేశారు. -
జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మృత్యువాత
హరారే: జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. సెప్టెంబర్ 4 నాటికి దేశంలో మొత్తం 6,291 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అయితే రెండు వారాల క్రితం మీజిల్స్ వల్ల 157మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. మీజిల్స్ వ్యాధి బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉంటున్నారు. మతపరమైన నమ్మకాలతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించకపోవడమూ ఈ పరిస్థితికి కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాక్సిన్ తప్పనిసరిచేసేలా కొత్త చట్టం తీసుకురావాలని జింబాబ్వే భావిస్తోంది. 6 నెలల నుంచి 15ఏళ్ల పిల్లలకు పెద్దఎత్తున మాస్ వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మతపెద్దలు దీనికి సహకరించాలని కోరుతోంది. డేంజర్.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకటి. గాలి ద్వారా, తమ్ముడం, దగ్గడం వల్ల ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లలలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కన్పిస్తాయి. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు ఈ వ్యాధి సోకితే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించాలంటే 90శాతం మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందుల వల్ల సేవలు నిలిచిపోయి పేద దేశాల్లో మీజిల్స్ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్‌లోనే హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5కోట్ల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్లు తీసుకోలేకపోయారని యూనిసెఫ్ జులైలో చెప్పింది. దీనివల్ల పిల్లలకు ప్రమాదమని అప్పుడే హెచ్చరించింది. చదవండి: చైనాలో తీవ్ర భూకంపం.. 46 మంది దుర్మరణం -
'లంక దుస్థితికి చలించి'.. ఆసీస్ క్రికెటర్ల కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పెద్ద మనుసు చాటుకుంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ప్రజలకు సహాయం అందిస్తున్న యూనిసెఫ్‌కు(UNICEF) తమ వంతు విరాళాన్ని ప్రకటించింది. ఇటీవలే కంగారూలు.. లంకలో మూడు టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడిన సంగతి తెలిసిందే. లంకలో నెలకొన్న పరిస్థితులను ఆసీస్ ఆటగాళ్లు దగ్గరుండి చూశారు. ఎన్ని కష్టాలున్నా లంక, ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లను లంక ప్రేక్షకులు బాగా ఆదరించారు. లంక ప్రజల అభిమానం చూరగొన్న ఆసీస్ క్రికెటర్లు వారికి స్వయంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే లంక పర్యటనలో భాగంగా వచ్చిన ప్రైజ్ మనీని యూనిసెఫ్ ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్లు లంక చిన్నారులకు అందించనుంది. ఆస్ట్రేలియాలో యూనిసెఫ్ కు ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20లలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీ (45వేల ఆస్ట్రేలియా డాలర్లు)ని లంకలో యూనిసెఫ్ కు అందించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ధరాభారం పెరిగి పెద్దలతో పాటు చిన్నారులు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారి బాగోగులు చూసుకోవడానికి పనిచేస్తున్న యూనిసెఫ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ప్రైజ్ మనీని అందించనున్నారు. ఇదే విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో ప్రజల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయనేది ప్రపంచం ముందు కనబడుతున్న సత్యం. మేము అక్కడ పర్యటించినప్పుడు వాళ్ల కష్టాలను స్వయంగా చూశాం. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం. తద్వారా చిన్నారులకు, పేద ప్రజలకు సాయం చేయాలని ఆశించాం’ అని అన్నాడు. కాగా కమిన్స్ ఇలా సాయం చేయడం తొలిసారి కాదు. గతేడాది కరోనా సందర్బంగా ఆక్సిజన్ సిలిండర్లు లేక భారత్ లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్యాట్ కమిన్స్, క్రికెట్ ఆస్ట్రేలియా లు కలిసి 50వేల డాలర్ల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఇక లంక పర్యటనలో ఆసీస్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. కానీ వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. ఇక టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. చదవండి: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ -
'చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం: యూనిసెఫ్
హోని: రష్యా దాడి మొదలయ్యాక ఇప్పటివరకు ఏకంగా 10 లక్షల మందికి పైగా చిన్నారులు తల్లులతో కలిసి సరిహద్దులు దాటినట్టుగా యూనిసెఫ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘‘ఈ స్థాయిలో చిన్నారులు దేశం విడిచి పెట్టడం ఇదే మొదటిసారి. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం’’ అని యూనిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ చెప్పారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా దేశం విడిచిపెట్టి వెళితే వారిలో సగం మంది పిల్లలే ఉన్నారు. తమ దేశంలో ఉన్న ప్రతీ ఎనిమిది మంది చిన్నారుల్లో ఒకరు శరణార్థి అని మోల్దోవా ప్రధానమంత్రి గవిరిలి చెప్పారు. మాజీ మిస్ ఉక్రెయిన్ వెరొనికా దిద్సెంకో కీవ్ నుంచి ఏడేళ్ల వయసున్న తన కుమారుడితో కలిసి నానా కష్టాలు పడి అమెరికాలోని లాస్ఏంజెల్స్ చేరుకున్నారు. కీవ్ నుంచి వస్తూ ఉంటే బాంబుల మోతలు వినిపించని ప్రాంతమే లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పౌరులు తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఎంతో పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని, అయితే వారికి మరిన్ని ఆయుధాలు కావాలని ఆమె చెప్పారు. -
బడుల మూసివేతతో ఒక తరం మొత్తానికి నష్టం!
న్యూఢిల్లీ: కరోనా కారణంగా బడులు మూసివేతతో ఒక తరం మొత్తం దుర్బలమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. ప్రస్తుత విలువ ప్రకారం లెక్కిస్తే ఒక తరం విద్యార్ధులు బడుల మూసివేతతో 17 లక్షల కోట్ల డాలర్ల జీవితకాల ఆర్జనను నష్టపోతారని అంచనా వేసింది. ఈ మొత్తం ప్రస్తుత ప్రపంచ జీడీపీలో 14 శాతానికి సమానమని తెలిపింది. కరోనా కారణంగా పలు దేశాల్లో విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే. యునెస్కో, యూనిసెఫ్‌తో కలిసి ప్రపంచబ్యాంకు ‘‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ క్రైసిస్’’ పేరిట ఈ నివేదికను రూపొందించింది. గతంలో అనుకున్నదానికన్నా విద్యాసంస్థల మూసివేతతో వచ్చే నష్టం అధికమని తెలిపింది. బడుల మూసివేతతో 10 లక్షల కోట్ల డాలర్లు నష్టమని 2020లో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. గతంలో అల్పాదాయ దేశాల్లోని పిల్లల్లో 53 శాతం మంది పేదరికంతో జీవించడాన్ని నేర్చుకునేవారని, స్కూల్స్ మూసివేతతో వీరి సంఖ్య 70 శాతానికి చేరనుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో ప్రపంచ విద్యావ్యవస్థలు స్తంభించాయని, కరోనా బయటపడిన 21 నెలల తర్వాత కూడా కోట్లాదిమంది పిల్లల బడులు మూసివేసే ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీరిలో చాలామందికి ఇకపై బడికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేసింది. జ్ఞానార్జనకు పిల్లలు దూరం కావడం నైతికంగా సహించరానిదని, ఒకతరం పిల్లలు పేదరికంలోకి జారడం భవిష్యత్ ఉత్పాదకతపై, ఆదాయాలపై పెను ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు ఎడ్యుకేషన్ గ్లోబల్ డైరెక్టర్ జైమె సావెద్రా వివరించారు. నిజాలను చూపుతున్న గణాంకాలు బడుల మూసివేతతో గతంలో చేసిన అంచనాల కన్నా తీవ్ర ఫలితాలున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నట్లు నివేదిక తెలిపింది. గ్రామీణ భారతం, పాకిస్తాన్, బ్రెజిల్, మెక్సికో తదితర ప్రాంతాల్లో పిల్లలు లెక్కలు, చదవడంలో నష్టపోయారని గణాంకాలు వివరిస్తున్నట్లు తెలిపింది. బడుల మూసివేత ఎంతకాలం కొనసాగింది, విద్యార్థుల సామాజికార్థిక పరిస్థితి, గ్రేడ్ లెవల్‌ను బట్టి నష్టాలుంటాయని వివరించింది. ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో కేవలం 3 శాతం కన్నా తక్కువ మొత్తమే విద్యారంగానికి అందాయని విమర్శించింది. చాలా దేశాల విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్లాంటివి చేపట్టినా, వీటి విస్తృతి, నాణ్యత వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది. అల్పాదాయ దేశాల్లో సుమారు 20 కోట్ల మంది విద్యార్ధులు నూతన విద్యాబోధనా పద్ధతులకు దూరంగా ఉన్నారని పేర్కొంది. -
తక్షణమే భారత్‌కు వచ్చేయండి.. అక్కడ పరిస్థితులు బాగోలేవు
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో రోజు రోజుకీ పరిస్థితులు క్షీణిస్తున్నాయి. తాలిబన్లు దేశంపై తమ పట్టుని పెంచుకుంటున్నారు. అఫ్గాన్ సైన్యం, తాలిబన్ల మధ్య ఘర్షణలతో దేశంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఒక్కో ప్రావిన్స్ని ఆక్రమించుకుంటూ వస్తున్న తాలిబన్లు మజర్–ఎ–షరీఫ్ నగరం వైపు దూసుకొస్తున్నారు. దీంతో ఆ దేశం విడిచి పెట్టి మంగళవారమే వెనక్కి రావాలని కేంద్రం అక్కడి భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. మజర్–ఎ–షరీఫ్‌లో దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అందులో పని చేసే దౌత్య అధికారులు, ఇతర భద్రతా సిబ్బందిని హుటాహుటిన ప్రత్యేక విమానంలో వెనక్కి రప్పిస్తోంది. ‘మజర్–ఎ–షరీఫ్ నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక విమానం వస్తోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరూ వెంటనే అందులో బయల్దేరండి. ఇక్కడ ఎవరికీ భద్రత లేదు’’ అఫ్గాన్‌లో భారత్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. అఫ్గాన్‌లో హింస ఇంకా కొనసాగితే విమాన సర్వీసుల్ని రద్దు చేస్తామని ఈ లోగా భారతీయులందరూ వెనక్కి రావాలని సూచించింది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం అఫ్గాన్‌లో ఇండియన్ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల్ని ప్రాజెక్టుల నుంచి తప్పించి విమాన సర్వీసులు రద్దయ్యేలోపు భారత్‌కు పంపించాలని సలహా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దగ్గరున్న డేటా ప్రకారం ప్రస్తుతం అఫ్గాన్‌లో 1,500 మంది వరకు భారతీయులు ఉన్నారు. 3 రోజుల్లో 27 మంది చిన్నారులు మృతి అఫ్గాన్‌లో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి చిన్నపిల్లల ఏజెన్సీ యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత మూడు రోజుల్లోనే అన్నెం పున్నెం తెలీని 27 మంది చిన్నారులు అఫ్గాన్ సైన్యానికి, తాలిబన్లకి మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయినట్టుగా వెల్లడించింది. గత నెల రోజుల్లో వెయ్యిమంది సాధారణ పౌరులు మరణించారు. 20 ఏళ్ల మిలటరీ ఆపరేషన్ తర్వాత అమెరికా దళాలు అఫ్గాన్ నుంచి వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు రెచ్చిపోతూ దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కుందుజ్ సహా ఎన్నో కీలక నగరాలు వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. గత మూడు రోజుల్లో అయిదు ప్రావిన్షియల్ రాజధానుల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. -
ఏపీ: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం అందించింది. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన యూనిసెఫ్ ప్రతినిధులు.. కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశారు. వారి వెంట డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ఉన్నారు. కోవిడ్ నివారణ కోసం సీఎం జగన్ ఎంతో శ్రమిస్తున్నారు.. ఈ సందర్భంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ నివారణ కోసం సీఎం జగన్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. యూనిసెఫ్ లాంటి సంస్థలు ముందుకొచ్చి తమ వంతు సాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. మరో 50 లక్షల ఎన్-95 మాస్కులను కూడా అందించారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని గౌతమ్‌రెడ్డి తెలిపారు. చదవండి: కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్ -
కోవిడ్ వల్ల అనాథలుగా 577 మంది బాలలు
న్యూఢిల్లీ: కోవిడ్ మరణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు 577 మంది ఉన్నట్లు రాష్ట్రాలు వెల్లడించాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ పిల్లలందరనీ వారి దగ్గర బంధువుల వద్దే ఉంచి, జిల్లా కలెక్టర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. వీరి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడం లేదని, సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో పిల్లల గురించి వివరాలు కనుక్కుంటున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. మహిళా శిశుసంక్షేమ శాఖ సహా ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ సైతం వీరికి తోడ్పాటును అందిస్తున్నాయని వెల్లడించాయి. (చదవండి: ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి) -
బ్రిటన్ 20 శాతం టీకాలను పేద దేశాలకు ఇవ్వాలి: యూనిసెఫ్
లండన్: గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ అడ్డుకట్టకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని భావించి ఆయా దేశాల శాస్త్రవేత్తలు వాళ్ల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సంపన్న దేశాలు పరిస్థితి బాగానే ఉంది కానీ పేద దేశాలు టీకాలను తయారు చేసుకోలేక, ఇతర దేశాలనుంచి కొనుగోలు చేసుకోలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ ( యూనిసెఫ్ల) దీని పై స్పందించింది. బ్రిటన్ వద్ద ఉన్న కరోనా వ్యాక్సిన్లలో 20 శాతం టీకాలను పేదదేశాలకు విరాళంగా ఇవ్వాలని యూనిసెఫ్ సూచించింది. పేద దేశాలను పట్టించుకోండి జూన్ మొదటివారం నాటికి టీకాలను పంపించే విధంగా బ్రిటన్ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇలా చేసినప్పటికీ బ్రిటన్ దగ్గర జూలై చివరినాటికి ఆ దేశపౌరులైన వయోజనులకు ఇచ్చేందుకు సరిపడా టీకాలు ఉంటాయని ఆ సంస్థ వివరించింది. కాగా ఇప్పటికే బ్రిటన్‌లో దాదాపు 18 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆ దేశం పూర్తి చేసింది. ఇక అధిక శాతం వయోజనులకు కనీసం ఒక డోసు టీకాను కూడా పూర్తి చేసింది. ప్రపంచంలోని 5 కోట్ల మంది ప్రజలకు టీకాలు అందించే సామర్థ్యం బ్రిటన్‌కు ఉందని ఈ సందర్భంగా తెలిపింది. బ్రిటన్ను చూసి మిగతా జీ-7 దేశాలు సైతం సాయం కోసం అలమటిస్తున్న ఇతర దేశాలకు టీకాలు పంపించే అవకాశం ఉంటుందని యూనిసెఫ్ అభిప్రాయపడింది. ఇతర దేశాల ప్రజలకు టీకాలు అందుబాటులో ఉన్నప్పడే మరో కొత్త రకం వైరస్లు పుట్టుకురాకుండా ఉంటాయని యూనిసెఫ్ తెలిపింది. ( చదవండి: ‘ఈ వేరియంట్ వల్లే భారత్‌లో కరోనా కల్లోలం’ ) -
కన్నతల్లి ప్రేమ కన్నా మిన్న ఏది?
ఈ భూమ్మీద కరోనా వైరస్ ఎక్కడైనా సోకగలదేమో కానీ.. తల్లిపాలను ‘అంటు’కోలేదు. అవును.. తల్లిపాలలో వైరస్ ఉండదు. ఒకవేళ కరోనా సోకిన తల్లైనా.. తన బిడ్డకు పాలివ్వవచ్చు. (అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనిసెఫ్ ప్రకటించిన విషయమిది) సాక్షి, హైదరాబాద్: ‘భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అమ్మ నడకనే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే’ అంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ దశరథరామారెడ్డి. ‘అమ్మ కూడా చిన్నప్పుడు గారాల కూతురే. కానీ మనం పుట్టగానే అన్ని బాధ్యతలు తనపై వేసుకుని పెద్దరికంతో మనల్ని పెంచుతుంది. మన అల్లరినీ, కోపాల్నీ, అలకల్నీ భరిస్తుంది. మనం పెద్దయ్యాక.. మన ముందు పసిపాప అవుతుంది. కానీ మనమేం చేస్తున్నాం? చాలామంది పెద్దయ్యాక అమ్మని ‘వదిలించుకుంటున్నారు’. మనకు ఇష్టమైన వ్యక్తుల కోసం కష్టపడుతున్నప్పుడు గానీ మనకు అర్థమవ్వదు.. అమ్మ ఓపిక ముందు మనమెంత అని? కానీ, ఆ నిజం మనకు అప్పుడు అర్థం కాదు. జీవితంలో పెద్దయ్యాక.. ఏదోరోజున ‘అరె అమ్మని ఆనాడు కష్టపెట్టానే’ అని బాధపడిన రోజు తెలిసివస్తుంది అమ్మంటే ఏంటో. అలా మనం బాధపడే సందర్భం రాకూడదంటే అమ్మని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అమ్మనే కాదు, ఆమె ఆరోగ్యాన్నీ కనిపెట్టుకుని చూసుకుంటే మన జీవితాలకు కావాల్సినంత భరోసా లభిస్తుంది’ అంటున్నారాయన. ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కరోనాతో కళ్లు తెరుస్తున్న కుటుంబాలు మనం జీవితంలో ఎంత సాధించినా, ఎంత ఎదిగినా అమ్మ ఉన్నంత వరకు పిల్లలుగానే ఉంటాం. పిల్లల్లానే ఆలోచిస్తాం. మన కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్దచేసిన తల్లులను జీవిత చరమాంకంలో కళ్లలో పెట్టుకుని చూసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం. అమ్మను దూరం చేసుకొని బాధపడేవారు చాలామంది ఉన్నారు. డబ్బులు, ఆస్తులు సంపాదించుకోవడం గొప్ప కాదు. కానీ అమ్మ ఆప్యాయతను పొందడమే నిజమైన అదృష్టం. ప్రస్తుతం కరోనా వసుధైక కుటుంబం గొప్పదనాన్ని చాటిచెప్పింది. అందరూ ఇళ్లలో ఉండి అమ్మకు సమయం ఇస్తున్నారు. ఒక్కోసారి ప్రకృతి ఇటువంటి వాటిని సృష్టించి పరిస్థితిని సమం చేస్తుందంటారు. కరోనా అలానే చేస్తుందేమో.. తల్లుల ఆరోగ్యం కోసం బీమా... అమ్మ ఆరోగ్యం కోసం ప్రతీ ఏటా అవసరమైనప్పు డు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ము ఖ్యంగా మహిళలకు సంబంధించిన ప్రత్యేక చెకప్ లు తప్పనిసరి. చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితు లు సరిగా లేక తల్లి అనారోగ్యానికి గురైతే వైద్యం చే యించలేని దుస్థితి..అందువల్ల తల్లితోపాటు కుటుంబసభ్యులంతా ఆరోగ్య బీమా చేయించుకో వాలి. దీనివల్ల అమ్మను అనారోగ్యాల నుంచి రక్షిం చుకోగలం. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్లతో పా టు విటమిన్ డీ, విటమిన్ బీ12 సమస్యలు ఎక్కువ. హార్మోన్లలో మార్పులు, పోషకాహార లోపం వల్ల ఇతరత్రా అనారోగ్యాలు అమ్మను కబళిస్తున్నాయి. వీటి నుంచి అమ్మను కాపాడుకోవాలి. కరోనా వేళ.. అమ్మ పైలం గర్భిణుల కోసం యూనిసెఫ్ ప్రత్యేక సూచనలు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ కీలక ప్రకటన జారీచేసింది. కరోనా సమయంలో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. ఒక్క తెలంగాణలోనే ఈ ఏడాది మార్చి చివరి నుంచి మే నెలాఖరు వరకు ఏకంగా 1.1 లక్షల ప్రసవాలు జరుగుతాయని అంచనా. లాక్డౌన్లు, కర్ఫ్యూల వంటి నియంత్రణ చర్యల నేపథ్యంలో గర్భి ణుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు యూనిసెఫ్ విజ్ఞప్తి చేసింది. ► గర్భిణులకు యాంటెనాటల్ చెకప్‌లు, నైపుణ్యం కలిగిన డెలివరీ కేర్, ప్రసవానంతర సంరక్షణ సేవలు అందించడంతో పాటు కరోనా నుంచి భద్రత కల్పించాలి. వారిని పర్యవేక్షించే ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించాలి. ► ప్రసవ సమయంలో అన్ని ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ చర్యలు ఉన్నాయని గర్భిణులకు హామీనివ్వాలి. ► మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను ప్రసూతి కేంద్రాలకు వెళ్లాలని సూచించాలి. టెలి కన్సల్టేషన్, మొబైల్ ఆరోగ్య వ్యూహాలను వారికి తెలియజెప్పాలి. ► వైద్య ఆరోగ్య సేవలు అందనిపక్షంలో ఇంట్లోనే ప్రసవించేలా ఏర్పాట్లు చేయాలి. అందుకోసం ఆరోగ్య కార్యకర్తలకు మంచి శిక్షణతో పాటు తగిన సామగ్రి, రక్షణ అందించాలి. ► తల్లీపిల్లల ఆరోగ్యానికి, వారి ప్రాణాలను రక్షించే సేవలకు అవసరమైన నిధులు కేటాయించాలి. ► వైరస్ బారినపడకుండా తమను తాము రక్షించుకోవడానికి గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి. ఆన్లైన్ ఆరోగ్య సేవలను ఉపయోగించుకోవాలి. ► గర్భిణులు వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తుంటే వారిలో ఎవరికైనా జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ► తల్లిపాలలో వైరస్ ఉండదు. కాబట్టి వారికి ఒకవేళ వైరస్ సోకినా బిడ్డకు తల్లిపాలను ఇవ్వనివ్వాలి. ► కరోనా ఉన్న తల్లులు బిడ్డకు ఆహారం ఇచ్చేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ► శిశువును తాకడానికి ముందు, తరువాత చేతులు కడుక్కోవాలి. -
లాక్డౌన్: రికార్డు స్థాయిలో జనాభా పెరుగుదల
పారిస్: మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచ దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్డౌన్ ఒక్కటే శరణ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ లాక్డౌన్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు గణనీయంగా పెరగనుందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) అనుబంధ సంస్థ యునిసెఫ్ తెలిపింది. ముఖ్యంగా భారత్‌లో జననాల రేటు రికార్డు స్థాయిలో ఉండనున్నట్లు వివరించింది. భారత్‌లో మార్చి చివరి వారం నుంచి లాక్డౌన్ అమలవుతోందని, ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు రెండు కోట్ల మంది పిల్లలు పుడతారని యునిసెఫ్ అంచనా వేసింది. భారత్ తర్వాత చైనా (1.35 కోట్లు), నైజీరియా(64 లక్షలు), పాకిస్తాన్ (50 లక్షలు) ఇండోనేషియా(40 లక్షలు) దేశాలలో అత్యధికంగా జననాల రేటు నమోదుకానుందని తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 11.6 కోట్లుగా ఉండనుందని యునిసెఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఇక కరోనా కష్టకాలంలో గర్భిణిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఈ సమయంలో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పుట్టబోయే పిల్లలను ప్రమాదంలో పడేసినట్లే’ అని యునిసెఫ్ స్పష్టం చేసింది. ఇక గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 14.1 కోట్ల మంది పిల్లలు పుట్టగా, భారత్‌లో అత్యధికంగా 2.72 కోట్ల మంది పిల్లలు పుట్టారని గుర్తుచేసింది. ఇక 2015 నుంచి భారత్‌లో జననాల రేటు తగ్గుతూ వస్తోందని వివరించింది. ఈ ఏడాది మార్చి 11 నుంచి డిసెంబర్ 16 వరకు జరిపిన అధ్యయనం ప్రకారమే జననాల రేటుపై నివేదిక రూపొందించామని యునిసెఫ్ ప్రకటించింది. చదవండి: లిక్కర్‌కి వేలమంది, శవయాత్రలో 20 మందికేనా? కరోనా: అందుకే మనదేశంలో మరణాలు తక్కువ -
ఆరోగ్య సంక్షోభంలో దక్షిణాసియా చిన్నారులు!
ఖాట్మండు : దక్షిణాసియాలో కరోనా వైరస్ కారణంగా చిన్నపిల్లలకు ఇచ్చే టీకాలకు అంతరాయం కలుగుతోంది. చిన్నారుల ప్రాణరక్షక టీకాలను అందించకపోతే దక్షిణాసియాలో మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారి తీయవచ్చనని ‘యూనిసెఫ్’ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేయించుకోని, లేదా అరకొరగా టీకాలు వేయించుకున్న చిన్నారుల్లో దాదాపు పావుభాగం అంటే 45 లక్షల మంది దక్షిణాసియాలోనే ఉన్నారనీ, వారిలో 97 శాతం మంది భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో ఉన్నారని వెల్లడించింది. రవాణాపై ఆంక్షలు, విమానాల రద్దు కారణంగా కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటిపోయాయని, వ్యాక్సిన్ల తయారీ కూడా తీవ్రంగా ప్రభావితమైందనీ యూనిసెఫ్ రీజనల్ హెల్త్ అడ్వైజర్ పాల్ రట్టర్ అన్నారు. -
నెమార్ విరాళం రూ. 7 కోట్ల 64 లక్షలు
రియో డి జనీరో: బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్, ప్యారిస్ సెయింట్–జెర్మయిన్ క్లబ్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ నెమార్ కరోనా కట్టడికి భారీ విరాళమిచ్చాడు. అతను 10 లక్షల డాలర్ల (రూ. 7,64, 18,241) విరాళం ప్రకటించినట్లు స్థానిక టీవీ చానల్ తెలిపింది. ఈ మొత్తాన్ని ‘యూనిసెఫ్’తో పాటు టీవీ వ్యాఖ్యాత లూసియానో హక్ ఆధ్వర్యంలో జరుగుతోన్న చారిటీ క్యాంపెయిన్ కోసం వినియోగించనున్నారు. -
‘చైనాను అధిగమించనున్న భారత్’
ఢిల్లీ: ఈ ఏడాది మొదటి రోజు (జనవరి1)న భారతదేశంలో మొత్తం 67,385 పిల్లలు జన్మించగా, ప్రపంచవ్యాప్తంగా 3,92,078 పిల్లలు పుట్టినట్లు యూనిసెఫ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను పరిశీలిస్తే త్వరలోనే భారత్దేశ జనాభా చైనాను దాటుతుందని యూనిసెఫ్ అంచనా వేసింది. భారత్‌తో పాటు మరో ఏడు దేశాల్లో జన్మించిన శిశువులు.. ప్రపంచవవ్యాప్తంగా పుట్టిన పిల్లల సంఖ్యకు సగంగా నమోదవడం గమనార్హం. చైనా(46,299), నైజిరియా(26,039), పాకిస్తాన్(6,787), ఇండోనేషియా(13,020), అమెరికా(10,452), రిపబ్లిక్ ఆఫ్ కాంగో (10, 247), ఇథియోపియా(8, 493) దేశాల్లో పిల్లలు జన్మించారని యునిసెఫ్ పేర్కొంది. అయితే ఈ ఏడాది మొదటి రోజు జన్మించిన పిల్లల సంఖ్యను గమనిస్తే.. చైనా కన్నా భారత్‌లోనే ఎక్కుగా నమోదైంది. 2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా నివేదికను వెల్లడించిన సందర్భంలో ఇండియా జనాభా.. వచ్చే దశాబ్దకాలంలో చైనాను అధిగమిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఏటా జనవరి 1న జన్మించిన శిశువుల గణనను యూనిసెఫ్ నిర్వహిస్తుంది. 2018లో 2.5 మిలియన్ శిశువులు జన్మించి మొదటి మాసంలోనే మరణించారని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ పిల్లలంతా ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు, అంటు వ్యాధులతో మృతి చెందారని వెల్లడించింది. గత మూడు దశాబ్దాలగా ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాలలోపు మృతిచెందిన పిల్లల సంఖ్య సగానికి తగ్గినట్లు యూనిసెఫ్ పేర్కొంది. -
మహిళల ప్రపంచ కప్‌తో యూనిసెఫ్ ఒప్పందం
దుబాయ్: ‘యూనిసెఫ్’తో తమ భాగస్వామ్యాన్ని మరింత కాలం కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. మహిళలు, బాలికల సాధికారికత కోసం వచ్చే ఏడాది జరిగే మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీ వరకు యూనిసెఫ్‌తో తాము కొనసాగుతామని ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో క్రికెట్ ఆడే దేశాల్లో బాలల హక్కుల కోసం యూనిసెఫ్ చేపడుతోన్న కార్యక్రమాలకు నిధుల సేకరణలో ఐసీసీ సహాయపడినట్లవుతుంది. ఐసీసీ క్రికెట్ ఈవెంట్ల ద్వారా సమకూర్చిన నిధుల్ని బాలికలకు క్రికెట్ క్రీడ నేర్పించేందుకు, మౌలిక సదుపాయాలు, శిక్షణా సిబ్బంది ఏర్పాటు వంటి తదితర కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. తాజా వన్డే ప్రపంచ కప్–2019 సమయంలో సేకరించిన నిధులను కూడా అఫ్గానిస్తాన్‌లో బాలికల క్రికెట్ ప్రాజెక్ట్ కోసం వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కూడా పాలుపంచుకోవచ్చని ఐసీసీ తెలిపింది. టిక్కెట్ల కొనుగోలు ద్వారా వారు ఇందులో భాగస్వాములు కావచ్చని పేర్కొంది. -
సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసి మంచి ఫలితాలు సాధించేందుకు ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కోరారు. ఈ విషయంలో యూనిసెఫ్ కూడా మరింత సహకారాన్ని అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. యూనిసెఫ్ సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమం, ఆరోగ్యం, పాఠశాల విద్య, గ్రామీణ రక్షిత నీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సీఎస్ గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటోందని సీఎస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళల్లో రక్తహీనత నివారించేందుకు, బాలికల్లో డ్రాపవుట్ రేట్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి యూనిసెఫ్ కూడా తోడ్పాటును అందించాలని కోరారు. సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి మైటల్ రుష్డియా, స్త్రీ శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంత గృహనిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అర్బన్ కింద వివిధ పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహనిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన పీఎంఏవైకి సంబంధించి రాష్ట్ర స్థాయి మంజూరు, పర్యవేక్షణ(శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్) కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పీఎంఏవై కింద నిర్మిస్తున్న గృహ నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. ఏపీ టిడ్కో(ఆంధ్రప్రదేశ్ టౌన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎండీ దివాన్ మైదీన్ ఇళ్ల నిర్మాణాల పురోగతి గురించి సీఎస్‌కు వివరించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ, ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ పట్టణాభివృద్ధి సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి నూతన డీపీఆర్‌ల కింద రెండు లక్షల 58 వేల గృహాలకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. వాటిని కేంద్రానికి పంపేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. -
న్యుమోనియానూ ఎదుర్కోలేకపోతున్నాం
ఐక్యరాజ్యసమితి: అదేమి అరికట్టలేని భయంకరమైన వ్యాధి కాదు. చికిత్స లేని ప్రాణాంతకమైన జబ్బు కూడా కాదు. కానీ భారత్ మాత్రం ఆ వ్యాధిని నియంత్రించడంలో చతికిలపడిపోతోంది. అదే న్యుమోనియా. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో వచ్చే ఈ వ్యాధి సోకి ఐదేళ్లలోపు వయసు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా ప్రతీ 39 సెకండ్లకు ఒక చిన్నారి ఉసురు తీస్తున్నట్టు యూఎన్ అధ్యయనంలో వెల్లడైంది. 2018లో న్యుమోనియా వ్యాధి సోకి ఎందరు చిన్నారులు బలయ్యారో యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను సేకరించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అయిదేళ్లలోపు చిన్నారులు అత్యధికంగా న్యుమోనియో సోకి మరణిస్తున్నారు. ఆ దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉండడం ఆందోళన పుట్టిస్తోంది. 2018లో ప్రపంచ దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 8 లక్షల మందికి పైగా న్యూమోనియా వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయారు. మొదటి నెలలోనే ప్రాణాలు కోల్పోయిన పసివారు లక్షా 53 వేలుగా ఉంది. పేదరికమే కారణం అసలు న్యుమోనియా అన్న వ్యాధి ఉందన్న సంగతి కూడా ఎన్నో దేశాలు మర్చిపోయిన వేళ హఠాత్తుగా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత పెరగడంపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయిదేళ్ల కంటే తక్కువ వయసున్న వారి మృతుల్లో 15 శాతం న్యుమోనియా కారణంగా నమోదవుతున్నాయని చెప్పింది. పేదరికానికి, ఈ వ్యాధికి గల సంబంధాన్ని కొట్టి పారేయలేమని పేర్కొంది. సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు తక్కువ సంఖ్యలో ఉండడం, పౌష్టికాహార లోపాలు పెరిగిపోవడం, కాలుష్యం కాటేయడం వంటివి న్యుమోనియా పెరిగిపోవడానికి కారణాలుగా యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. న్యుమోనియా మరణాల్లో ఆ దేశాలే టాప్ న్యుమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో సగానికి పైగా అయిదు దేశాల్లోనే నమోదవుతున్నాయి. నైజీరి యా, భారత్, పాకిస్తాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా దేశాలే దీనికి బాధ్యత వహించాలని యూఎన్ వెల్లడించింది గత ఏడాది మృతుల సంఖ్య నైజీరియా 1,62,000 భారత్ 1,27,000 పాకిస్తాన్ 58,000 డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 40,000 ఇథియోపియా 32,000 -
పసిప్రాయం ఎగ‘తాళి’!
వారిలో ఆలోచన శక్తి, సమస్యలను అధిగమించే పరిస్థితి ఉండదు. దీంతో గృహహింస, లైంగిక వేధింపులు, సామాజికంగా విడిపోవడం వంటి పరిస్థితులకు గురవుతారు. త్వరగా వృద్ధాప్యం వచ్చి వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది. రక్తహీనత ఏర్పడుతుంది. కారణాలు పేదరికం, అక్షరాస్యతలో బాలికల శాతం తక్కువగా ఉండడం. వారికి తక్కువ హోదా కల్పించడం, ఆర్థిక భారంగా భావించడం.. సాంఘికాచారాలు, సంప్రదాయాలు బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. దుష్పరిణామాలు బాల్య వివాహాలవల్ల చిన్న వయస్సులోనే బాలికలు గర్భం దాలిస్తే కాన్పు కష్టం కావటం, ప్రసూతి మరణాలు, శిశు మరణాలు అధికంగా ఉంటాయి. సాక్షి, అమరావతి : వివాహ భారంతో పసిప్రాయం నలిగిపోతోంది. మూడుముళ్ల బంధం పేరుతో బాలికల మెడలో పడుతున్న తాళి వారి జీవితానికి గుదిబండగా మారుతోంది. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు చేస్తే నేరమని చట్టాలు చెబుతున్నా మైనర్ వివాహాలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమలులోకి వచ్చినప్పటికీ పెళ్లీడు రాక ముందే జరుగుతున్న వివాహాలకు అడ్డుకట్ట పడట్లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఇటీవల చేసిన సర్వేలు సైతం దేశంలోను, రాష్ట్రంలోను జరుగుతున్న బాల్య వివాహాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనెసెఫ్) లెక్కల ప్రకారం.. 40 శాతం కంటే ఎక్కువ బాల్య వివాహాలతో భారతదేశం ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. అలాగే, దేశంలో పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో 73 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 71, రాజస్థాన్‌లో 68, బీహార్‌లో 67, ఉత్తరప్రదేశ్‌లో 64 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రానికి వస్తే.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు వరుస స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో బాలికలే ఎక్కువ.. బాల్య వివాహాల్లో ఎక్కువగా బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015–2016 లెక్కల ప్రకారం దేశంలోని బాల్య వివాహాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరుగుతున్న 45 శాతం పెళ్లిళ్లలో 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహాలు జరగడం గమనార్హం. ఇది గ్రామాల్లో 35.5 శాతం, పట్టణాల్లో 26.3 శాతంగా ఉంది. పురుషుల విషయానికొస్తే.. 21 ఏళ్లు నిండని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 13.2 శాతం, పట్టణాల్లో 8.8 శాతం మందికి వివాహాలు జరుగుతున్నాయి. అలాగే, ఏపీకి సంబంధించి చైల్డ్‌లైన్–1098కు 2017–18 కాలంలో వచ్చిన ఫిర్యాదుల్లో 1,700.. 2018–19లో 1,900 బాల్య వివాహాలు జరిగాయి. అయితే, ఇలా వెలుగు చూడనివి మరెన్నో ఉన్నాయి. బాల్య వివాహాలకు బీజం ఇలా.. ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్, బ్రిటీషు వాళ్లు భారతదేశాన్ని పాలించే కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బల వంతంగా వివాహమాడటం, బలాత్కరించడం జరిగేది. వివాహితుల జోలికి రారనే ఉద్దేశ్యంతో తమ ఆడబిడ్డలను కాపాడుకునేందుకు భారతీ యులు తమ పిల్లలకు బాల్యంలోనే పెళ్లిళ్లు చేసే వారనే ప్రచారం ఉంది. రానురాను కుటుంబాల మధ్య సంబంధాలను పటిష్ఠ పరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో ఫలానా వాడికి భార్య పుట్టిందని ఇరువర్గాల వారు నిర్ణయించుకుని మొదట బొమ్మల పెళ్లిచేసి పెద్దయ్యాక వివాహం చేసేవారు. తాము చనిపోయే లోపు తమ వారసుల పెళ్లిళ్లు చూడాలనే వృద్ధుల కోరికను తీర్చడానికి కూడా పురుషుడి వయస్సు ఎక్కువైనా జరిపించే వారు. అనం తరం కాలంలో.. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. అయినా ఇవి జరుగుతూనే ఉన్నాయి. నిరోధించే చట్టాలు బ్రిటిష్ పాలకులు 1929లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్ తెచ్చారు. అనంతరం.. భారత ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్) 2007 జనవరి 10న ఆమోదం పొంది, 2007 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 18 ఏళ్లలోపు ఆడపిల్లలు, 21 ఏళ్ల లోపు మగపిల్లలు బాలల కిందకే వస్తారు. ఈ వయస్సులోపు వారికి పెళ్లి చేస్తే జిల్లా కలెక్టర్, ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, మెట్రోపాలి టన్ మేజిస్ట్రేట్, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, వీఆర్ఓ, వీఆర్ఏలకు ఫిర్యాదు చేయవచ్చు. వివాహ నమోదు చట్టంతో కూడా వీటికి చెక్ పెట్టవచ్చు. అలాగే, బాల్యవివాహం చేసిన వారెవరైనా నేరస్థులే. పెళ్లికి హాజరవ డమూ నేరమే. వీరికి రెండేళ్ల వరకు కఠిన కారా గార శిక్ష.. రూ.లక్ష వరకు జరిమానా విధించ వచ్చు. ఈ నేరాలకు బెయిల్ కూడా ఉండదు. బాల్య వివాహం సామాజిక దురాచారం తగిన వయసు రాకుండానే పెళ్లి చేయడంవల్ల బాలికలు సమస్యల సుడిగుండంలో కూరుకుపోతున్నారు. శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను కుంగదీసే ఈ వివాహాలు సమర్థనీయం కాదు. సామాజిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలి. – మణెమ్మ, సామాజిక కార్యకర్త నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలి బాల్య వివాహాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలి. దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో గతం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బాల్య వివాహాలపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేస్తే వాటిని నిలుపుదల చేయిస్తున్నారు. కానీ, కేసులు పెట్టి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. – ఎన్. రామ్మోహన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి -
అంతర్జాతీయ వేదికపై పాక్‌కు మరో ఎదురుదెబ్బ
అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలాకోట్ వైమానికి దాడులను సమర్థించడంతో ఆమెను యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా తొలగించాలంటూ పాక్ మానవ వనరుల శాఖ మంత్రి షిరిన్ మజరి ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశంపై యూఎన్ స్పందించింది. తనకు సంబంధించిన అంశాలపై.. తన వ్యక్తిగత సామార్థ్యం మేరకు స్పందించే హక్కు ప్రియాంకకు ఉందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. (చదవండి: కశ్మీర్‌పై ఐరాసలో రహస్య చర్చలు) ఈ మేరకు యూఎన్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘యూనిసెఫ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తికి తన వ్యక్తిగత లేదా తనకు సంబంధించిన సమస్యలపై స్పందించే హక్కు ఉంది. వారి వ్యక్తిగత అభిప్రాయాలు, చర్యలతో యూనిసెఫ్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ యూనిసెఫ్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటాం. నిరాధార వ్యాఖ్యలను ప్రోత్సాహించము. అంతేకాక స్వచ్ఛందంగా తమ సమయాన్ని, వారి గుర్తింపును పిల్లల హక్కులు కాపాడటం కోసం వినియోగించడానికి అంగీకరించిన ప్రముఖులను మాత్రమే యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్లుగా నియమిస్తాం’ అని తెలిపారు. బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దాడులను ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్ హోదాలో ప్రియాంక చోప్రా సమర్ధించడం పట్ల లాస్ఏంజెల్స్లో జరిగిన ఓ ఈవెంట్లో ప్రియాంకను పాక్‌కు చెందిన ఆయేషా అనే మహిళ నిలదీశారు. ప్రియాంక తీరును కపటత్వంగా ఆయేషా అభివర్ణిస్తూ మండిపడ్డారు. ఆమె ఆరోపణలపై ప్రియాంక ఆ వేదికపై దీటుగా స్పందించారు. తాను యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. తన దేశం పట్ల అభిమాననాన్ని వెల్లడించే హక్కు తనకు ఉందని ప్రియాంక స్పష్టం చేశారు. -
ప్రియాంకపై వేటు వేయండి : ఐరాసకు పాక్ లేఖ
ఇస్లామాబాద్ : బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రాపై పాకిస్తాన్ దుర్నీతి ప్రదర్శించింది. ప్రియాంక చోప్రాను యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా తొలగించాలని పాక్ మానవ వనరుల మంత్రి షిరీన్ మజరి ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. కశ్మీర్‌పై భారత వైఖరిని ప్రియాంక చోప్రా బాహాటంగా సమర్ధించడంతో పాటు భారత రక్షణ మంత్రి పాకిస్తాన్‌కు చేసిన అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలను వెనకేసుకొచ్చారని, ఇది శాంతి, సామరస్య భావనలకు విరుద్ధమని మజరి ఐరాసకు రాసిన లేఖలో ఆరోపించారు. ఐరాస గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రా శాంతి వెల్లివిరిసేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం ఈ దాడులను సమర్ధిస్తూ ప్రియాంక ట్వీట్ చేయడాన్ని పాక్ తప్పుపడుతోంది. బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దాడులను ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్ హోదాలో ప్రియాంక చోప్రా సమర్ధించడం పట్ల లాస్ఏంజెల్స్లో జరిగిన ఓ ఈవెంట్లో ప్రియాంకను పాక్‌కు చెందిన ఆయేషా అనే మహిళ నిలదీశారు. ప్రియాంక తీరును కపటత్వంగా ఆయేషా అభివర్ణిస్తూ మండిపడ్డారు. ఆమె ఆరోపణలపై గ్లోబల్ స్టార్ ఆ వేదికపై దీటుగా స్పందించారు. ‘మీరు ఆవేదన వెళ్లగక్కడం పూర్తయిందా.. అసలు యుద్ధం నేను నిజంగా ఇష్టపడే విషయం కాదు, కానీ మొదట నేను దేశభక్తురాలిని.. నన్ను ప్రేమిస్తున్న మరియు నన్ను ప్రేమించిన వ్యక్తుల పట్ల మనోభావాలను దెబ్బతీస్తే క్షమించండి. కానీ మనందరికీ మనమందరం అనుసరించాల్సిన మార్గం ఒకటుంది..మీరు కేకలు వేయడం మాని మనమంతా ప్రేమ కోసమే ఇక్కడ ఉన్నా’మని ప్రియాంక వ్యాఖ్యానించారు. -
డాల్ఫినో డాల్..
సాక్షి, ఆసిఫాబాద్ : విద్యార్థుల్లో ఉత్తేజం.. సులభంగా అర్థం చేసుకునేందుకు కస్తూరిబా విద్యాలయాల్లో సరికొత్త పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. యూనిసెఫ్ సహకారంతో స్వస్త్ ఫ్లస్ పథకం కింద మాట్లాడే పుస్తకాలను తీసుకొ చ్చారు. జిల్లాలోని 8 కేజీబీవీల్లో వీటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ పుస్తకాల పేజీపై డాల్ఫినో అనే పరికరాన్ని పెట్టగానే పుస్తకంలోని బొమ్మల గురించి చెప్పడంతో పాటు కథనాంశాలను విద్యార్థులకు వివరిస్తోంది. కుమురం భీం జిల్లాలో మొత్తం 15 కేజీబీ వీలు ఉన్నాయి. నిరుపేద బాలికలకు విద్యన ందించాలనే సంకల్పంతో ప్రతి మండలానికి ఒక కేజీబీవీని ఏర్పాటు చేశారు. ఆ మండలంలోని బాలికలకు 6వ తరగతి నుంచి ఇం టర్ వరకూ విద్యతో పాటు వసతిగృహ సదుపాయాన్ని కూడా కల్పించారు. విద్యార్థినులకు సరికొత్త పరిజ్ఞానంతో సులభంగా ఇంగ్లీష్ అర్థమయ్యేలా డాల్ఫిన్ పుస్తకంలోని బొమ్మల గురించి చెప్పడంతో పాటు మాటల రూపంలో వస్తున్న అక్షరాలు ఉత్తేజపరుస్తున్నాయి. ఈ మాట్లాడే పుస్తకాలతో విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతున్నారు. యూనిసెఫ్ సహకారంతో.. యూనిసెçఫ్ సహకారంతో స్వస్త్ ప్లస్ పథకం కింద ప్రతి పాఠశాలకు వంద వరకూ కథల పుస్తకాలను ప్రవేశపెట్టిన అధికారులు దానికి మరింత సాంకేతికతను జోడించి మాట్లాడే పుస్తకాలను తయారు చేశారు. 2018– 19 విద్యా సంవత్సరానికి గానూ దాదాపు 200 వరకూ పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి మరిన్ని పుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లాలోని 8 కేజీబీవీలకు వీటిని అందించారు. ఒక్కో కేజీబీవీకి 100 ఇంగ్లీష్, 100 తెలుగు భాషల్లో పుస్తకాలను అందజేశారు. వీటి ద్వారా ప్రయోగాత్మకంగా విద్యబోధన చేపడుతున్నారు. ద్యార్థుల్లో సృజనాత్మకత పెంపు.. మాట్లాడే పుస్తకాలను విద్యార్థులకునుగుణంగా తయారు చేశారు. ఇంగ్లిష్ పదాలు పలకడం కష్టతరంగా ఉన్న పదాలను పుస్తకం మాట్లాడడంతో సులభంగా అర్థమవుతుంది. దీంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఇవి దోహదపడుతున్నాయి. ఈ పుస్తకాల్లో నీతి కథలైన లెట్స్ మీ హిచర్ ది మ్యూజిక్, ఏ లెస్సన్ ఫర్ ది సర్పంచ్, బాలల హక్కులు, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి నీతి కథలు ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థుల్లో చదివేం దుకు కుతుహలం ఏర్పడుతోంది. వీటి పై ఉన్న బొమ్మల మీద డాల్ఫినో పరికరాన్ని ఉంచితేబొమ్మ గురించి పూర్తిగా చెప్పడంతో పాటుగా చదవుతుంది. ఈ పరిరాన్ని కర్ణాటకకు చెందిన ఐస్ పార్కు సంస్థ రూపొందించింది. విద్యుత్ చార్జింగ్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. 6 నుంచి 7వ తరగతి విద్యార్థినులకు ఈబొమ్మల పాఠాలు ఉపయోగపడుతున్నాయి. -
మాట్లాడే పుస్తకాలు వచ్చేశాయ్!
సాక్షి, విద్యారణ్యపురి(వరంగల్) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని కస్తూర్బాగాంధీ బాలికలు మాట్లాడే బొమ్మలతో కూడిన పుస్తకాలు, మాట్లాడే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొంత కాలం క్రితమే మాట్లాడే ఈ పుస్తకాలు కేజీబీవీలకు చేరగా తాజాగా డాల్ఫిన్ పరికరాలు అందాయి. వీటి వినియోగం, ఉపయోగాలపై హన్మకొండలోని డీఈఓ కార్యాలయంలో కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు యునిసెఫ్ రాష్ట్ర సలహాదారు సదానంద్ శిక్షణ ఇచ్చారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో.. 2006 సంవత్సరంలో యూనిసెఫ్ ‘స్విస్’ ప్లస్ కార్యక్రమం కింద విద్యార్థుల్లో మార్పు కోసం మాట్లాడే వంద రకాల పుస్తకాలను రూపొందించింది. ఇందులో పర్యావరణ సమస్యలు, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ, బాలికల సమస్యలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, బాలల హక్కులు తదితర అంశాలు ఉంటాయి. పల్లెల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలను సులభశైలిలో చెప్పేలా ఉంటాయి. వీటిని చదివితే వారిలో తప్పకుండా మార్పు వస్తుందనటంలో సందేహం లేదు. దీంతో విద్యార్థు«ల్లో చైతన్యం మార్పు వస్తుందని యూనిసెఫ్ సలహాదారు సదానంద్, అర్బన్ జిల్లా సెక్టోరియల్ అధికారి డి.రమాదేవి అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాల్లో ఉన్న అంశంపై ప్రత్యేకంగా రూపొందించిన డాల్ఫిన్ రూపంలో పరికరాన్ని ఉంచడం ద్వారా ఆ కథనం బయటకు వినిపిస్తుంది. విద్యార్థుల్లో చైతన్యం.. జీవన నైపుణ్యాలు కేజీబీవీల్లోని 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు మాట్లాడే పుస్తకాల్లోని అంశాలు చైతన్యం కలిగిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 63 కేజీబీవీలు ఉండగా.. మాట్లాడే పుస్తకాలు అందజేసిన అధికారులు తాజాగా డాల్ఫిన్ పరికరాలను కేజీబీవీకి ఒక్కటి చొప్పున పంపిణీ చేశారు. అలాగే జిల్లాకో ప్రభుత్వ పాఠశాలకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారని సమాచారం. కొంచెం నవ్వండి బాబు, సైలెంట్ హీరోస్, పని మంతురాలు ప్రతిమ, సిల్లీ సాంబయ్య, బిల్లీగోట్ వంటిç కథనాలతో కూడిన పుస్తకాలు ఉన్నాయి. చదువులో కొత్త విధానంతో మరింతగా మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. -
ఆమె జై హింద్ అంది, తీసేయండి : పాక్
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిభిరాలే లక్ష్యంగా భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులను కొనియాడుతూ ‘జై హింద్’ అని ట్వీట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై దాయాదీ దేశం ఆగ్రహంగా ఉంది. ఆర్మీ వైద్యులైన డాక్టర్ అశోక్ చోప్రా, మధు చోప్రాల కూతురైన ప్రియాంక కూడా భారత వాయుసేన మెరుపు దాడులను కొనియాడుతూ తన దేశంపై ఉన్న ప్రేమను చాటుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన పాకిస్తానీయులు ఆమెను వెంటనే యునిసెఫ్ ప్రచారకర్తగా తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె కామెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆన్లైన్లో ఓ పిటషన్ కూడా దాఖలు చేశారు. ఇరుదేశాల మధ్య యుద్దాన్ని తలపించే ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో శాంతిని కోరుకోవాల్సిన యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ ప్రియాంక.. ఇలా ఒక దేశానికి మద్దతుగా ఎలా మాట్లాడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో తటస్థంగానన్న ఉండాలి.. కానీ భారత వాయుసేనను యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ కొనియాడుతారని, ఆమె యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా అనర్హురాలన్నారు. ఇక ఈ పిటిషన్ వేల సంతకాలు చేయగా.. దానిలో పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది భారత జవాన్ల విషయాన్ని ప్రస్తావించలేదు. -
పవర్ గర్ల్
ప్రేమ ముందు ఎవరెస్టు శిఖరం కూడా చిన్న రాళ్ల గుట్టలా అనిపిస్తుంది. ప్రేమ మహిమ అది. అలాగని ప్రియాంకా చోప్రా ప్రేమలో మునిగిపోయి తన కెరీర్‌లోని భవబంధాలనేమీ తెంచుకో లేదు. పెళ్లి వల్ల వచ్చిన కొత్త పవర్‌తో.. పాత విధుల్లోకి ఉత్సాహంగా పునఃప్రవేశం చేయబోతున్నారు. పెళ్లి తప్ప జీవితంలో ఇంకేం లేనట్లు.. కాబోయే భర్త (ఇప్పుడయ్యిందిలెండి) భుజం మీద చెయ్యేసి నోరంతా తెరిచి ఇలా నవ్వుతోందేమిటీ పిచ్చిపిల్ల.. ఆరేడు నెలలుగా! న్యూయార్క్ వెళుతోంది. ముంబై వస్తుంది. మళ్లీ న్యూయార్క్, మళ్లీ ముంబై. అస్సలు ఎక్కడా సింగిల్‌గా కనిపించలేదు. నిక్ ఆమెకు ఒక బాడీ పార్ట్‌గా ఉన్నాడే కానీ, బాయ్ ఫ్రెండ్‌గా లేడు. అంతలా ప్రియాంక అతడిని అంటిపెట్టుకునే ఉంది. నిక్ కూడా ఆమె వెంట తిరుగుతున్నాడు కానీ.. ఆ తిరగడంలో పెద్దగా ఫీల్ కనిపించడం లేదు. సరే, అది అతడి స్వభావం. ప్రియాంకైనా చిన్నపిల్లైపోయి నిక్‌పై అందర్లో అలా వాలిపోవాలా? పోనివ్వండి. అది పర్సనల్. ఇప్పుడు అభిమానుల కన్సర్న్ ఏంటంటే.. పెళ్లైపోయింది కదా.. లాస్ట్ సాటర్డే.. ఇకనైనా ప్రియాంక కుదురుగా ఉంటుందా? అని. ఆమె చేయవలసిన చాలా పనులు పెండింగ్‌లో పడిపోయాయి. అసలు నిక్ సమక్షంలో గడపడం కోసమే ఆమె సల్మాన్ చిత్రం ‘భరత్’ సినిమా కాంట్రాక్ట్‌ను సగంలో రద్దు చేసుకుని వెళ్లిపోయింది. అలాంటివే కొన్ని చిన్నచిన్న ఒప్పందాలు క్యాన్సిల్ అయ్యాయి. ప్రేమ మహిమ కావచ్చు. ప్రేమ ముందు ఎవరెస్టు శిఖరం కూడా చిన్న రాళ్ల గుట్టగా కనిపిస్తుంది కదా. అయితే మనం అనుకుంటున్నట్లేమీ తన కెరీర్‌తో, సేవాకార్యక్రమాలతో భవబంధాలనేమీ తెంచుకోలేదు. ప్రియాంక బాలీవుడ్లో సూపర్‌స్టార్. హాలీవుడ్లో ఇండియన్ సూపర్ స్టార్. అంత స్టార్‌డమ్‌ను కూడా ఆమె పక్కన పెట్టేసి కామన్ గర్ల్ అయిపోయింది. నిక్కే (నిక్ యే) ఆమె లోకం అయిపోయాడు. మంచి విషయమే. అయితే ప్రియాంక గురించి మనం మర్చిపోకూడనివి మంచి విషయాలు కొన్ని ఉన్నాయి. పెళ్లే జీవితంలా ఆమె ప్రస్తుతానికి కనిపించవచ్చు. మునుపటి ప్రియాంక ఆమెలోంచి ఎక్కడికీ పోలేదు. వారం క్రితం (పెళ్లయ్యాకే) ‘టైమ్స్’ ప్రతినిధి మొహువా దాస్‌కు ముంబై జుహు హోటల్లో కొంచెం టైమ్ ఇచ్చారు ప్రియాంక. కొత్త పెళ్లి కూతురులోని పాత ఉద్యమ నాయికను మొహువా బయటికి తీసుకొచ్చారు. కష్టపడినందుకే గుర్తింపు ‘‘వెళ్తానని నాకు తెలియదు. వెళ్లాలని నేను అనుకోలేదు. ప్రతి పనిలోనూ కష్టపడతాను. నన్నెవరో గుర్తుంచుకోవాలని, పెద్ద పేరు తెచ్చుకోవాలనీ దేశాలను పట్టుకుని వెళ్లలేదు. అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. ఏదైనా ఊరికే వచ్చేయదు. మనం ఇక్కడ కష్టపడుతుంటామా.. ఎక్కడో గుర్తింపు వస్తుంది’’ అంటున్న ప్రియాంక.. ప్రస్తుతం తన ప్రాజెక్టులన్నిట్లో తిరిగి నిమగ్నమయ్యే పనిలో ఉన్నారు. 1 ప్రియాక దశాబ్దకాలంగా ‘యునిసెఫ్’తో కలిసి బాలికల హక్కులు, బాలల రక్షణపై పని చేస్తున్నారు. ఇటీవలే బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ ఘోర పరిస్థితుల్లో బ్రతుకును ఈడుస్తున్న రొహింగ్యా పిల్లల్ని కలిశారు. పర్సు తియ్యక్కర్లేదు ‘‘పిల్లలు పిల్లలే. భవిష్యత్తు పిల్లల్దే. పిల్లల భవిష్యత్తే ప్రపంచ భవిష్యత్తు. దేశాల మధ్య ఏమైనా ఉండనివ్వండి. పిల్లల్ని సరిగా ఉంచాలి. సరిగా పెంచాలి. మంచి చదువు. మంచి ఆహారం. శుభ్రమైన జీవితం. వాళ్లను కనుక నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యంగానే పెరిగి పెద్దవారౌతారు. కోరుకున్నది పొందలేకపోతే ప్రపంచంపై కోపం, కసి, పగ పెంచుకుంటారు. హింసావాదులుగా, ఉగ్రవాదులుగా అవుతారు. అందుకే మనం విశాలంగా ఆలోచించాలి. వివక్షను మత దురాభిమానాలను పక్కనపెట్టి పిల్లలకు ప్రేమను అందించాలి. వాళ్లకు వసతులు, సదుపాయాలు కల్పించాలి. ఇందుకోసం మన పర్సు ఖాళీ చేసుకోనక్కర్లేదు. మన జీవితంలోంచి పరోపకారం కోసం ఏడాది కాలాన్ని త్యాగం చెయ్యనక్కర్లేదు. ఎవరికి వారు ఎక్కడికక్కడ సామాజిక బాధ్యతను నెరవేర్చగలిగితే చాలు. పిల్లలు హాయిగా బతికేస్తారు. చక్కటి పౌరులుగా ఎదుగుతారు.’’ అని చెప్తారు ప్రియాంక. 2 మన దేశంలో బాలికల పరిస్థితి, బాలల హక్కులు ఎలా ఉన్నాయన్న దానిపైన కూడా యూనిసెఫ్ ప్రతినిధిగా నిశిత పరిశీలనే చేశారు ప్రియాంక. ఇండియాను ‘డిఫరెంట్ బీస్ట్’ అంటా రు ఆవిడ. అంటే పూర్తి భిన్నమైన దేశం అని. పరాయి సొత్తా! ఇదేం మాట? ‘‘చూడండి ఎంత పెద్ద జనాభానో. మన ఆలోచనలు కూడా సనాతనంగా ఉంటాయి. ఐదు వేల ఏళ్ల నాగరికత. అప్పట్నుంచీ ఒకటే మాట వింటున్నాం.. ‘లడ్కీ పరాయా ధన్ హోతీ హై’ అని. ఆడపిల్ల పరాయి వాళ్ల సొత్తా! ఇదేం మాట? ఆమె జీవితం ఆమెది కాదా?! ఇంటిని చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. మరి తనను తాను చూసుకోడానికి ఇంకా ఎన్ని యుగాలు ఆగాలి? ఇంటినీ, పిల్లల్ని చూసుకోవడం తప్పని కాదు. తనకూ కొన్ని ఆశలు, కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే అవకాశాన్ని ఈ సమాజం కల్పించాలి కదా. ప్రభుత్వాలు బాలికల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. మనం వెనక్కు లాగకుండా ఉండాలి’’.. అంటారు ప్రియాంక. 3 ‘మీటూ’ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రియాంక ముక్కుసూటిగానే ఉన్నారు. ‘మీటూ’ అంటూ తనుశ్రీ దత్తా బయటికి వచ్చినప్పుడు మొదట ఆమెను సపోర్ట్ చేసింది ప్రియాంకే. తర్వాత ఒకరిద్దరు ఆమెను ఫాలో అయ్యారు. అక్కడితో బాలీవుడ్ మీటూ ఆగిపోయినట్లయింది! ఎందుకని బాలీవుడ్ స్టార్లు నోరెత్తడం లేదు? మహిళంటే మహిళే ‘‘నిజమే. కానీ మనం బాలీవుడ్ దగ్గరే ఎందుకు ఆగిపోతున్నాం. ఒక్క బాలీవుడ్లోనే వేధింపులు ఉన్నాయా? తక్కిన ఇండస్ట్రీలలో వేధింపులకు గురవుతున్న మహిళ తరఫున అక్కడి వాళ్లూ బయటికి రావడం లేదేం? మహిⶠంటే మహిళే. బాలీవుడ్ మహిళ, మీడియా మహిళా, ఐటీ మహిళ అని కాదు. అన్ని రంగాల్లోని మహిళలు, మహిళలకు మద్ధతుగా పురుషులు బయటికి రావలసిన అవసరం ఉంది’’ అని ప్రియాంక ఉద్దేశం. 4 సినిమాలు చెయ్యడం, సినిమాలు తియ్యడం, టెక్ కంపెనీలకు, కోడింగ్ (టెక్నికల్ టీచింగ్) ఎడ్యుకేషన్‌కు కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చెయ్యడం, ఒక డేటింగ్ యాప్‌ని నడపడం.. ఇన్ని ఎలా చేస్తున్నారు. చేస్తూ కూడా టెన్షన్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు! స్వేచ్ఛగా పెంచాలి ‘‘బహుశా మా పేరెంట్స్ పెంపకం’’ అంటారు ప్రియాంక. ‘‘నాకు ఏం కావాలంటే అది ఇచ్చారు. ఏం చేస్తానంటే అది చెయ్యనిచ్చారు. ‘నీకేం నచ్చుతుందో అందులో ముందుకు వెళ్లేందుకు భయపడకు’ అని చెప్పారు. మన దేశంలో చాలామంది అమ్మాయిలకు ఇంత అదృష్టం ఉండదు. వాళ్లసలు బయటికి కనిపించనేకూడదు. నలుగురికీ వినిపించేలా మాట్లాడకూడదు. నిండుగా బట్టలు వేసుకోవాలి. అణకువగా, బిడియంగా ఉండాలి.. ఇలా చెప్తారు ఇంట్లోని వాళ్లు. అయితే వాళ్ల గొంతును వాళ్లు వినిపించే అమ్మాయిలు ఇప్పుడు సమాజానికి కావాలి. కనుక ఆడపిల్లల్ని ధైర్యంగా, మాటకారిగా ఉండే లా పెంచాలి’’ అని ప్రియాంక అభిప్రాయం. 5 నిక్ కోసం, న్యూయార్క్ వెళ్లడం కోసం దేశంలోని సొంత మనుషులను, సొంత సినిమాలను వదులుకుని వెళ్లారని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు ప్రియాంక. ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుగా కాలిపై కాలు వేసుకుని కూర్చోవడంపైన కూడా నెటిజన్లు ఆమెను విమర్శించారు. నాకేం కోపం ఉండదు ‘‘మనది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కుంది. అలాగని కంప్యూటర్ల వెనుక నక్కి దొంగచాటుగా ట్రోల్ చెయ్యడం ధైర్యం లేని పని. ఇలాంటి పోస్ట్‌లను కూడా నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. ఫ్యాన్స్ నుంచి నాకు అభిమానం ఎలాగైతే లభిస్తోందో.. నేనంటే ఏ కారణం చేతనో గిట్టని వాళ్ల నుంచి ద్వేషమూ అలాగే లభిస్తుంది. ఇందులో ఆలోచించవలసింది, ఆగ్రహించవలసింది, తిరుగు పోస్ట్‌లతో ప్రతీకారం తీర్చుకోవలసిందీ ఏముంటుంది?’’ అని ప్రియాంక అంటారు. ‘హాలీవుడ్‌కు అంతగా అడిక్ట్ అయిపోయారా?’ అని కొందరు ఆమెను ట్రోల్ చేశారు. . -
నా పెళ్లికి ఈ కానుకలే తీసుకురండి..
బాలీవుడ్లో పెళ్లిల్ల సీజన్ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం బీటౌన్ అంతా దీప్‌వీర్‌ల పెళ్లి ముచ్చట్లలో మునిగిపోయింది. ఈ హాడావుడి కాస్తా తగ్గేలోపే మరో చక్కనమ్మ పెళ్లి పీటలెక్కనుంది. దాంతో బీటౌన్‌లో మరో పది రోజుల పాటు పెళ్లి వార్తలు తప్ప మరేం వినిపంచే అవకాశం లేదు. దీప్‌వీర్‌ల పెళ్లి సందడి ముగిసేలోపే ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్‌ల పెళ్లి సంబరాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే వీరి వివాహ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెలాఖరున సంగీత్, మెహందీ వేడుకలు, డిసెంబరు 3న పెళ్లి ఘనంగా జరగనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను ప్రియాంక - నిక్‌లు తమ వివాహానికి వేదికగా ఎంచుకున్నారు. నిన్నటి దాకా వీరి పెళ్లి కార్డ్‌కు సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తే.. నేడు ప్రియాంక రిలీజ్ చేసిన గిఫ్ట్ రిజిస్టరి హాట్ టాపిక్ అయ్యింది. తమ పెళ్లికి వచ్చే అతిథులు కానుకలు ఇవ్వాలనుకుంటే తాను సూచించిన జాబితాలోని వస్తువులను ఇస్తే సంతోషమని ప్రియాంక తెలిపింది. అందుకోసం అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో తాను కోరుకుంటున్న వస్తువుల జాబితాతో కూడిన ఓ లిస్ట్‌ని కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో కిచెన్‌లోకి అవసరమైన చెంచాలు, ఫోర్కులు, డిన్నర్ ప్లేట్లు, వైను గ్లాస్లు మొదలుకొని డంబెల్స్ లాంటి వ్యాయామ సామగ్రి, ట్రావెల్ బ్యాగులు, పరుపులు, తలగడలు, టూత్ బ్రష్ల్లాంటివి ఉన్నాయి. సుమారు రూ.1.70 లక్షల విలువైన ఓ ఎల్ఈడీ టీవీ కూడా ఈ కానుకల లిస్ట్‌లో ఉంది. వీటితో పాటు తన పెంపుడు కుక్క డయానా కోసం కూడా గిఫ్ట్‌లు తీసుకురావొచ్చని తెలిపింది ప్రియాంక. View this post on Instagram I had so much fun building a wedding registry guide with @amazon. They have everything that you need in one place! Amazon has also made a $100,000 donation to UNICEF, a charity that is extremely important to me!!! For wedding registry inspo, take a look at my guide (link in bio)! #AllOnAmazon #AmazonWeddingRegistry #ad @amazonhome A post shared by Priyanka Chopra (@priyankachopra) on Nov 19, 2018 at 6:33am PST డయానా కోసం గులాబీ రంగు నెక్ కాలర్, రెయిన్ కోట్, పెట్ బెడ్, పెట్ జీపీఎస్ ట్రాకర్లను కూడా కానుకలుగా తీసుకురావొచ్చని జాబితాలో పేర్కొంది. ఇలా అతిథుల కానుకల కోసం ముందే రిజిస్ట్రీ ప్రకటించడం మన దగ్గర కొత్త కానీ విదేశాల్లో మామూలు విషయమే. ఇంత గొప్ప స్టార్ అయి ఉండి ఇలా కానుకలు తీసుకురండి అని కోరడం ఏంటని ఆశ్యర్యపోకండి. ప్రియాంక ఇలా గిఫ్ట్‌లు అడగడం వెనుక ఓ సదుద్దేశం ఉంది. ప్రియాంక పెళ్లి కానుకల అమ్మకాల ద్వారా అమెజాన్‌కు ఆదాయం వస్తుంది కాబట్టి ఆ సంస్థ ఓ లక్ష డాలర్లను యునిసెఫ్‌కు విరాళంగా ఇవ్వనుందట. ఈ విషయం గురించి ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ప్రసుత్తం ప్రియాంక యునిసెఫ్‌కు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. -
ప్రతి ఒక్కరిని కదిలిస్తోన్న వీడియో!
-
ఇంటర్నెట్ను కదిలిస్తోన్న వైరల్ వీడియో
ఎయిడ్స్ / హెఐవీ పేరు పలకడానికే చాలా మంది అసహ్యించుకుంటారు, అలాంటిది ఇక ఈ వ్యాధి బారిన పడిన వారి పట్ల సమాజం తీరు ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల బాధ వర్ణానాతీతం. అటు తల్లిదండ్రులు ప్రేమకు దూరమయ్యి, ఇటు సమాజపు చీత్కారాలను ఎదుర్కొలేక ఆ పసి మనసులు పడే క్షోభ వర్ణనాతీతం. దీనికి ప్రధాన కారణం నేటికి ఈ వ్యాధి పట్ల ఎన్నో అనుమనాలు సమాజంలో వేళ్లునుకుపోవడమే. నేటికి దీన్నో అంటువ్యాధిలా భావించి, కనీసం చూసినా కూడా ఆ వ్యాధి తమకు అంటుకుంటుందేమోనని భావించేవారు కోకొల్లలు. ఈ అనుమానాలను దూరం చేసి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ముఖ్యంగా ఈ వ్యాధితో బాధపడే చిన్నారులకు బాసటగా నిలవడం కోసం యునిసెఫ్ ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఉజ్బెకిస్తాన్‌లో చిత్రీకరించిన ఈ వీడియోలో అజ్మా అనే పదహారేళ్ల యువతి రోడ్డు పక్కన నిల్చుని ఉంది. ఆమె పక్కనే ఒక ప్ల కార్డు ఉంది. దాని మీద ‘నాకు హెచ్ఐవీ ఉంది. నన్ను కౌగిలించుకోండి అని రాసి ఉంది. రోడ్డు మీద వెళ్లే వారు యువతిని, ఆమె పక్కన ఉన్న ప్ల కార్డును గమనించారు. తరువాత ఏం జరుగుతుందని భావిస్తున్నారు.. ఆశ్చర్యం వారంతా ఆమె దగ్గరకి వెళ్లి, ఆ యువతిని కౌగిలంచుకున్నారు. ఈ విషయం గురించి వీడియో చివరలో అజ్మా ‘పది సంవత్సరాల క్రితం నాకు హెచ్ఐవీ అని తెలిసింది. అయిన నాటి నుంచి నేటి వరకూ నేను బాగానే ఉన్నాను. నా జీవితాన్ని సంతోషంగానే గడుపుతున్నాను. కేవలం రక్త మార్పిడి వల్ల, తల్లి నుంచి బిడ్డకు, అసురక్షితమైన లైంగిక పద్దతుల వల్లనే హెచ్ఐవీ వ్యాపిస్తుంది. అంతే తప్ప ఈ వ్యాధి ఉన్న వారితో కరచాలనం చేసినా, మాట్లాడినా, కలిసి కూర్చున్నా, తిన్నా ఎయిడ్స్ రాదు’అని తెలిపారు. అంతేకాక ‘ఈ వీడియో చేయాలనుకున్నప్పుడు ఇంత మంచి స్పందన వస్తుందని నేను ఊహించలేదు. నన్ను ఆలింగనం చేసుకున్న ప్రతివారిని నా కుటుంబ సభ్యులుగా భావించాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలని’ తెలిపారు. యునిసెఫ్ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేల కొద్ది లైక్‌లు దాదాపు రెండు వేల రీ ట్వీట్లు పొందింది. చాలామంది అజ్మా చేసిన పనిని మెచ్చుకుంటూ, ఆశీర్వదిస్తున్నారు. An angel.Infinite love and virtual hugs from me and my kiddos to her. May God bless and protect her always. — 2016 (@ErNikGaJa2015) July 23, 2018 -
యువతకు ఆ దేశమే బెస్ట్
ఆమ్స్టర్డ్యామ్ : మంచి మార్కులు రాలేదనో.. కోరుకున్న కాలేజిలో సీటు రాదనో.. అమ్మ మందలించిందనో.. నాన్న కోప్పడ్డాడనో కారణాలేవైనా సరే.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటోంది నేటి యువత. అందరు ఇలానే ఉన్నారని చెప్పలేము. కానీ చాలా దేశాల్లో యువత మాత్రం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయం గురించి అధ్యాయనం చేసిన కొన్ని సంస్థలు మాత్రం నేటి యువతకు తగిన దేశం నెదర్లాండ్ అని ముక్త కంఠంతో తేల్చేశాయి. ఎందుకంటే నెదర్లాండ్ యువత తమ టీనేజ్‌ను చాలా సంతోషకరమైన పరిస్థితులు మధ్య గడుపుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. ప్రపంచ సంపన్న దేశాల్లో సంతోషం, ఆరోగ్యం, మంచి విద్య వంటి పలు అంశాల గురించి చేసిన సర్వేలో నెదర్లాండ్ మిగతా దేశాలను వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. యూనిసెఫ్ సర్వేలోనూ ప్రథమం... ఐక్యరాజ్యసమితి ముఖ్య విభాగం యూనిసెఫ్ 2017 సంవత్సరానికి గాను నిర్వహించిన సంతోషకరమైన దేశాల సర్వేలో నెదర్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లల పట్ల హింస పెరిగిపోతున్న ఈ కాలంలో, నెదర్లాండ్ ఆడపిల్లలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఏవో చిన్న చిన్న విషయాల్లో మాత్రమే బాధపడినట్లు సర్వేలో తెలిసింది. అలానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసిన సర్వేలో స్థూలకాయం బారిన పడుతున్న వారి సంఖ్య మిగతా సంపన్న దేశాలతో పోలిస్తే నెదర్లాండ్‌లో చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అసలు రహస్యం ఇదే... నెదర్లాండ్ దేశ ప్రజలు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం వారి పని వేళలు అంటున్నారు నిపుణులు. డచ్ ప్రజలు(నెదర్లాండ్ ప్రజలనే డచ్ ప్రజలు అంటారు) రోజులో 16 గంటల సమయాన్ని తినడం, నిద్రపోవడం, కుటుంబంతో గడపడం వంటి వాటికే కేటాయిస్తారు. వారంలో కేవలం 30.3 గంటలు మాత్రమే పనిచేస్తారు. కేవలం 0.5శాతం మంది మాత్రమే ఎక్కువ గంటలు పనిచేస్తారని నివేదికలు తెలుపుతున్నాయి. నెదర్లాండ్ ప్రజలు కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ ఇష్ట పడతారు. దాంతో అక్కడి యువత తల్లిదండ్రులతో చాలా మంచి అనుబంధాన్ని కల్గి ఉంటారు. వారి తల్లిదండ్రులతో అన్ని విషయాలు చర్చిస్తారని నివేదికలు తెలుపుతున్నాయి. ఇవే డచ్ యువత సంతోషానికి ప్రధాన కారణమంటున్నాయి సర్వేలు. -
మాట్లాడే పుస్తకాలు!
సాక్షి, పాన్‌గల్ (వనపర్తి) : కంటికి శ్రమ ఉండదు.. పెదవులు కదిలించాల్సిన అవసరం లేదు.. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆ పుస్తకాల్లో అక్షరాలపై డాల్ఫియా పెడితే చాలు.. భావయుక్తంగా స్పష్టంగా అర్థమయ్యేలా మాటల రూపంలో వినిపిస్తాయి. ఇది కోడింగ్, డీకోడింగ్ ద్వారా ముద్రించిన మాట్లాడే పుస్తకాల (టాకింగ్ బుక్స్) ప్రత్యేకత. దీంతో విద్యార్థులకు పదాలను ఎలా ఉచ్చరించాలో స్పష్టంగా తెలియడంతోపాటు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సరికొత్త పరిజ్ఞానం తో చదువుపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం సీసీఈ పద్ధతిలో విద్యార్థులు బట్టీ పట్టి చద వుతున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికేలా డిజిటల్ విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎలా మాట్లాడుతాయంటే.. యునిసెఫ్, సర్వశిక్ష అభియాన్ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కోడింగ్, డీకోడింగ్ విధానాన్ని అనుసరించి మాట్లాడే డాల్ఫియాను తయారు చేశారు. ఈ డాల్ఫియా లేదా డాల్ఫిన్ బొమ్మను ప్రతి పుస్తకం కవర్ పేజీపై ఉన్న గెట్ స్టార్ గుర్తుపై ఉంచాలి. తర్వాత పుస్తకంలోని పదాలపై డాల్ఫియాన్ కదిలిస్తూ ఉంటే డీకోడ్ విధానంలో పదాలు వినిపిస్తాయి. ఆ కథలో ఉన్న పాత్రలకు అనుగుణంగా మనకు మాటలు వినపడం వల్ల ఒక నాటికను చూస్తున్న అనుభూతిని విద్యార్థులు పొందుతారు. -
యుద్ధభూమిలో బాల్యం
పాఠశాలల్లో, ఆట మైదానాల్లో హాయిగా గడవాల్సిన బాల్యం కొన్ని దేశాల్లో యుద్ధోన్మాదుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోతోంది. ఉద్రిక్తతలు ఉండే కొన్ని ప్రాంతాల్లోని చిన్నారులు యుద్ధ సమస్యల్లో చిక్కుకుని నలిగిపోతున్నారు. తీవ్రవాదులు, సైనిక పక్షాలు పిల్లలను బాల సైనికులుగా, ఆత్మాహుతిదళ సభ్యులుగా, మానవకవచాలుగా మారుస్తున్నాయి. ఆడపిల్లలు తీవ్రమైన లైంగిక దాడులను, పీడనను ఎదుర్కొంటు న్నారు. చిన్నవయసులోనే వారంతా లైంగిక బానిసలుగా మారుతున్నారు. ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాల్లోని సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్రవాద గ్రూపుల కబంధహస్తాల్లో చిక్కుకున్న కొందరు పిల్లలు అక్కడి నుంచి బయటపడ్డాక భద్రతా బలగాల చేతుల్లో పడి మరోసారి అణచివేతకు, వేధింపులకు గురవుతున్నారు. యుద్ధ ఛాయలు కనిపిస్తున్న మరికొన్ని ప్రదేశాల్లోని చిన్నారులు తిండి, నీళ్లు, పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలకు నోచుకోక పోషకాహార లోపంతో రోగాల బారిన పడుతున్నారు. ఈ పిల్లల పాలిట 2017 క్రూరమైన ఏడాదిగా నిలుస్తోందని యూనిసెఫ్ తాజా నివేదిక ఆందోళన వెలిబుచ్చింది. అంతర్జాతీయ మానవ తా విలువలు, పిల్లల హక్కులకు ఏమాత్రం విలువనివ్వ కుండా ఒకవైపు సైన్యం, మరోవైపు సాయుధ సైనిక ముఠాలు వ్యవహరిస్తున్న తీరును యూనిసెఫ్ తప్పుబట్టింది. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాదాపు మూడుకోట్ల మంది పిల్లలు బలవంతంగా బడులకు దూరమైనట్లు తెలిపింది. ‘ఈ దేశాల్లోని పిల్లలు ఇళ్లు, పాఠశాలలు, ఆటస్థలాలు ఇలా అన్ని చోట్ల దాడులకు, క్రూరమైన హింసకు గురవుతున్నారు. ప్రతి ఏడాదీ ఈ దాడులు పెరగడం. ఇది ఎంతమాత్రం మంచిది కాదు’ అని యూనిసెఫ్ అత్యవసర కార్యక్రమా ల డైరెక్టర్ మాన్యువల్ చెప్పారు. దారుణాలివీ... ► నైజీరియా, ఛాద్, నైజర్, కేమరూన్‌లలో విస్తరించి ఉన్న ‘బోకో హరం’ ఉగ్రవాద సంస్థ 2016 కంటే 2017లో అయిదు రెట్లు ఎక్కువగా పిల్లలను ఆత్మాహుతి దళాలుగా మార్చింది. ► తిరుగుబాటు ద్వారా సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్లో బోకోహరం ఆధిపత్యంపెరిగాక ఎంతోమంది పిల్లలు హత్యాచారాలకు గురయ్యారు. బలవంతంగా సాయుధ ముఠాల్లో చేర్చారు. ► కాంగోలో రాజకీయ, సాయుధ హింస కారణంగా 8.5 లక్షల మంది పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు. ► సోమాలియాలో 2017 అక్టోబర్ కల్లా 1800 మంది పిల్లలను సాయుధగ్రూపుల్లో చేర్చుకున్నారు. దక్షిణ సూడాన్‌లో 19 వేల మంది పిల్లలు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నారు. ► మూడేళ్ల అంతర్గత సంక్షోభం కారణంగా యెమెన్‌లో 5,000 మంది అమాయక చిన్నారులు మరణించారు. 18 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ► ఇరాక్, సిరియాలో పిల్లలు మానవకవచాలుగా ఉపయోగపడుతున్నారు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌లో 700 మంది పిల్లలు చనిపోయారు ► రోహింగ్యాల పిల్లలను ఒక క్రమపద్ధతిలో మయన్మార్ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ఆ దేశంలోని సగానికి పైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయేలా అక్కడి ప్రభుత్వం దాడులు, హింసాకాండకు దిగింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బాలల హక్కుల రాయబారిగా త్రిష
సాక్షి, చెన్నై: యునిసెఫ్ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష సోమవారం నియమితులయ్యారు. కేరళ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘమైన యునిసెఫ్ సంస్థ సంయుక్తంగా చిన్నారులకు మీజిల్స్ టీకా ఆవశ్యకతపై యాడ్ ఫిల్మ్ రూపొందించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ తరఫున తమిళనాడు, కేరళ చిన్నారుల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిషను నియమించింది. దీని ద్వారా ఆమె బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక హింస వంటి వాటిపై వ్యతిరేకంగా పోరాడనున్నారు. బాలల విద్య కోసం కృషి చేయనున్నారు. ఈ మేరకు జరిగిన చెన్నైలో జరిగిన నియామక కార్యక్రమంలో త్రిష మాట్లాడుతూ ఇది తనకు లభించిన గౌరవమని, చిన్నారుల హక్కుల కోసం గళం విప్పుతానని ప్రకటించారు. బాలికలు 18 ఏళ్ల వరకు విద్యనభ్యసించితే బాల్య వివాహ వ్యవస్థను రూపుమాపవచ్చని తెలిపారు. -
2లక్షల 40 వేలు : మయన్మార్‌ను వీడిన చిన్నారులు
సాక్షి : మయన్మార్‌లో నెలకొన్న వివాద పరిస్థితుల నేపథ్యంలో భారీగా రోహింగ్యాలు బంగ్లా వలసబాట పట్టారు. గత మూడు వారాల్లోనే సుమారు 2 లక్షల 40 వేల మంది రోహింగ్యా చిన్నారులు బంగ్లాకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రకటించింది. మయన్మార్‌లో బౌద్ధులకు-రోహింగ్యాలకు మధ్య అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చిన్నారుల వలసలపై యూనిసెఫ్ అధికార ప్రతినిధి మారిక్సీ మెర్కాడో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 60 శాతం మంది రోహింగ్యాలు అంటే 3 లక్షల 91 వేల మంది వలస వెళ్లినట్లు చెప్పారు. ఇందులో ఏడాదిలోపు ఉన్న చిన్నారుల సంఖ్య 36 వేలు, అలాగే గర్భవతుల సంఖ్య 52 వేలు ఉందని మారిక్సీ అన్నారు. -
బిగ్‌బీకే మళ్లీ ఛాన్స్..
ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు గౌరవ బాధ్యతలు మరింత రెట్టింపయ్యాయి. యూనిసెఫ్(అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి)కి రాయబారిగా అమితాబ్ మరో రెండేళ్లు కొనసాగనున్నారు. పిల్లల్లో వచ్చే మీజిల్స్, రెబెల్లా వ్యాధుల నివారణపై ఆయన ఈ రెండేళ్లలో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే పోలియో, హెపటైటిస్ బి, క్షయ వ్యాధుల నివారణకు సంబంధించి పలు ప్రచార కార్యక్రమాల్లో బిగ్ బీ పాల్గొంటున్నారు. పోలియో మహమ్మారిపై చేస్తున్న యుద్దంలో విజయం సాధించినందుకు, పసిపిల్లలకు ఎంఆర్ వ్యాక్సినేషన్ వేయించేందుకు కృషి చేస్తున్నందుకు తనను యూనిసెఫ్ అంబాసిడర్‌గా మరో రెండేళ్లు పొడిగించినట్లు అమితాబ్ స్వయంగా ఆదివారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అలాగే, తన సంతోషాన్ని అభిమానులతో తన బ్లాగులో అమితాబ్ పంచుకున్నారు. -
నా జీవితంపై వాళ్లిద్దరి ప్రభావం ఎక్కువ: ప్రియాంక
తన జీవితంపై మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాల ప్రభావం ఎక్కువగా ఉందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తెలిపారు. చిన్నారులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా యూనిసెఫ్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై 6 లక్షల ర్యాండ్ల విరాళాన్ని సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మహాత్ముడు, మండేలా ఇద్దరూ చిన్నారుల హక్కుల కోసం పోరాడారన్నారు. 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్లో దక్షిణాఫ్రికాలో ప్రతి అయిదుగురు ఒకరు, జింబాంబ్వేలో ప్రతి ముగ్గురు లైంగిక దాడికి గురయ్యారని ప్రియాంక తెలిపారు. తాను ఎలాంటి దుస్తులు వేసుకున్నానో అని కాకుండా మీడియా ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాలని చురకలంటించారు. యూనిసెఫ్ చేపట్టే కార్యక్రమాలకు తనవైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ప్రియాంక హామీనిచ్చారు. చిన్నారులపై జరిగే హింసకు వ్యతిరేకంగా సినిమాలు ఎలాంటి ప్రచారం నిర్వహించకపోవడంపై ఆమె స్పందించారు. ఏ కళాత్మక రంగానికైనా ఈ విషయమై ఎటువంటి నైతిక బాధ్యత ఉండబోదని, సృజనాత్మకత దెబ్బతింటుందని వారు భావించడమే అందుకు కారణమని వివరించారు. ప్రియాంక ప్రస్తుతం యూనిసెఫ్ సౌహార్ద్ర రాయబారిగా ఉన్నారు. -
60 కోట్ల పిల్లలకు నీటి కొరత
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల మంది పిల్లలు 2040 లో తీవ్ర నీటి కొరత ఎదుర్కోనున్నారని యూనిసెఫ్ పేర్కొంది. ప్రతి నలుగురి పిల్లల్లో ఒకరు ఈ సమస్య ఎదుర్కొంటారని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలు తక్కువ నీటి వనరులతో జీవిస్తారని హెచ్చరించింది. మంగళవారం యూనిసెఫ్ విడుదల చేసిన రిపోర్ట్‌ను ఈఎఫ్ఈ న్యూస్ సంస్థ బుధవారం వెల్లడించింది. నీరు లేకుండా జీవించడం కష్టమని, కానీ ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు తీవ్ర మంచి నీటి కొరత ఎదుర్కుంటారని తెలిపింది. ఆరోగ్యంగా జీవించాలంటే తాగే నీరు ఎంతో ముఖ్యమని, కానీ భవిష్యత్తు తరాలకు హానీ కలుగుతుందని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోని లేక్ తెలిపారు. దీనికి కారణం నీటిని వృధా చేయడమేనన్నారు. జనాభా పెరుగుదలతో నీటి వాడకం పెరుగుతుందని, ఇది నీటి లభ్యతపై ప్రభావం చూపుతుందని యూనిసెఫ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇప్పడే 36 దేశాల్లో నీటి కొరత అధికంగా ఉందని, తక్కువగా నీటిని వాడుకోవాలని హెచ్చరించింది. తీవ్ర నీటి కొరతకు ప్రధాన కారణాలు వాతావరణం వేడెక్కడం, సముద్రాల విస్తీరణం పెరగడం, మంచు కరగడం, కరువులని తెలిపింది. ఇప్పటికే 66 కోట్ల మంది నీటి సమస్య ఎదుర్కుంటున్నారంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 800 మంది పిల్లలు డయేరియాతో మరణిస్తున్నారని యూనిసెఫ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎక్కువ మంది పిల్లలకు మంచి నీరు అందకపోవడం వల్లే డయేరియా భారిన పడుతున్నారని తెలిపింది. రాబోయే రోజులోనైనా ప్రభుత్వాలు నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని యూనిసెఫ్ సూచించింది. -
సిరియాలో చితికిపోతున్న బాల్యం
బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో చిన్నారులు సమిధలవుతున్నారని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) తేల్చిచెప్పింది. గతేడాది దాడుల్లో 652 మంది చిన్నారులు చనిపోయారని తెలిపింది. సిరియాలో సంక్షోభం మొదలై ఆరేళ్లు పూర్తైన సందర్భంగా యూనిసెఫ్ ఈ వివరాలను వెల్లడించింది. యుద్ధంలో ప్రభుత్వం, తిరుగుబాటుదారులు స్కూళ్లు, ఆసుపత్రులు, ఆట స్థలాలు, పార్కులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్యుద్ధం వల్ల దాదాపు 17 లక్షల మంది చిన్నారులు చదువుకు దూరమవగా, మరో 23 లక్షల మంది పిల్లలు పశ్చిమాసియాలో శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారని తెలిపింది. -
సార్వత్రిక కనీస వేతనం సాధ్యమేనా!
► యూబీఐ దిశగా అడుగులు ఫలించేనా? ► పౌరులందరికీ బేషరుతుగా నెలనెలా కనీస వేతనం చెల్లింపు ► ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పైలట్ప్రాజెక్టుల అమలు ► భారత్‌లో 2011లో మధ్యప్రదేశ్‌లో యూనిసెఫ్ ప్రయోగం ► పేదల ఆర్థిక, ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడినట్లు వెల్లడి ‘‘భూమి తన సహజ స్థితిలో మానవ జాతికి ఉమ్మడి ఆస్తి’ కనుక.. ప్రతి వ్యక్తికీ సమానమైన ప్రాధమిక జీవనభృతి హక్కు ఉంటుంది.’’ అమెరికా తత్వవేత్త థామస్ పెయిన్ ‘‘కనీస అవసరాలకు సరిపోయేంత నిర్దిష్ట స్వల్ప ఆదాయాన్ని అందరికీ బేషరతుగా అందించాలి’’ బ్రిటిష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రసెల్ మనందరికీ ఏ పని చేసినా చేయకున్నా.. నెల నెలా కనీస మొత్తం వేతనంగా లభించ గలదా? చిన్నా పెద్దా తేడా లేకుండా, పేద ధనిక తేడా లేకుండా, ఆడా మగా తేడా లేకుండా, ఉద్యోగీ నిరుద్యోగీ తేడా లేకుండా ఆ మొత్తం ప్రతి నెలా లభిస్తుంటే ఏం జరుగుతుంది? జీవించే హక్కులాగానే.. జీవితాంతం నెల వారీ కనీస వేతనం పొందే హక్కు ఉంటే జీవనం ఎలా ఉంటుంది? ఇలాంటి హక్కు సాధ్యమవుతుందా? ప్రపంచంలోని అత్యధిక దేశాల తరహాలోనే భారతదేశంలో కూడా ఎవరికైనా పని చేస్తేనే డబ్బు వస్తుంది. లేదంటే వివిధ ప్రభుత్వ పథకాల ప్రకారం దారిద్య్రరేఖకు దిగువున్న ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెల వారీ పింఛను లభిస్తుంది. అది సంపాదించుకోవడానికి వారు కూడా తమ ‘అర్హతల’ను నిరూపించుకోవాలి. అందుకు రకరకాల ధృవపత్రాలు, వివిధ అధికారులు, వైద్యుల ధృవీకరణలూ చూపించాలి. ఇక అధికారులు, సిబ్బందికి మామూళ్లు సమర్పించుకోవడం షరా మామూలే. అందులోనూ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే పెద్ద పీట వేస్తున్న దాఖలాలూ ఉన్నాయి. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో ప్రతి పౌరుడికీ ఏటా 2,000 డాలర్ల వరకూ నగదును ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.. ఎటువంటి ప్రశ్నలు అడగకుండా..! ఈ ప్రయోజనం పొందడానికి గల ఒకే ఒక్క షరతు ఏమిటంటే.. కనీసం ఏడాది కాలంగా ఆ రాష్ట్రంలో నివసిస్తున్న పౌరుడై ఉండడంతో పాటు.. రాష్ట్రంలోనే స్థిరనివాసం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేస్తే చాలు. ఆర్కిటిక్ సర్కిల్ నుంచి చమురు వెలికితీత మీద లభించే రాయలిటీపై డివిడెండ్లను ఇలా ప్రతి ఏటా పౌరులకు చెల్లించటం అలాస్కాలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రపంచంలో ఎంతకూ తరగని పేదరికాన్ని నిర్మూలించడానికి, పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి, వారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి బేషరతుగా సార్వత్రిక కనీస వేతనాన్ని అందించాలన్న డిమాండ్లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బలపడుతున్నాయి. దారిద్య్రం నిర్మూలనకే కాదు.. పేదలపై అధికార యంత్రాంగం ఆధిపత్యానికి, అంచెలంచెల పంపిణీ వ్యవస్థలో అవినీతి చీడలకు.. ఇదే సరైన మందన్న గళం బలం పుంజుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా యూబీఐ అమలు దిశగా యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూబీఐ పూర్వాపరాలపై సాక్షి సమగ్ర కథనం... ఏమిటీ యూబీఐ? సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ) అంటే.. ఎటువంటి నిబంధనలూ లేకుండా అవసరాల ప్రాతిపాదిక ఏదీ లేకుండా పని చేస్తున్నా చేయకున్నా ప్రతి ఒక్కరికీ నెల వారీ తరహాలో ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో అందించే కనీస జీవన భృతి. ► ఒకేసారి ఏక మొత్తంగా అందించటం కాకుండా.. నెల వారీగా నిరంతర ప్రాతిపదికన చెల్లిస్తారు. ► గ్రహీతలు తమ అవసరాలు, ఇష్టానుసారం ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ నగదు రూపంలో చెల్లిస్తారు. ► వ్యక్తి ప్రాతిపదికన చెల్లిస్తారు. గృహం లేదా కుటుంబం ప్రాతిపదికన కాదు. ► ప్రతి ఒక్కరికీ చెల్లిస్తారు. అవసరాలు, ఆర్థిక స్థాయి వంటి తేడాలేవీ ఉండవు. ► బేషరతుగా చెల్లిస్తారు. పని చేయాలన్న నిబంధన కానీ, పేదరికాన్ని నిరూపించుకోవాలన్న నిబంధన కానీ లేదు. యూబీఐతో లాభాలెన్నో..! స్వేచ్ఛ, సమానత్వం, సామర్థ్యం, సమాజం, భూమిపై సమాన యాజమాన్యం, సాంకేతిక ప్రగతి ప్రయోజనాల సమాన పంపిణీ, కార్మిక విపణి సరళీకరణ, పేదల ఆత్మగౌరవం, అమానవీయ పని పరిస్థితులపై పోరాటం, గ్రామీణ ప్రాంతాల విస్మరణపై పోరాటం, ప్రాంతీయ అసమానతలపై పోరాటం, వయోజన విద్యకు ప్రోత్సాహం, బాసులు, భర్తలు, అధికారుల నుంచి స్వయంప్రతిపత్తి వంటి ఎన్నో కారణాలను ఈ యూబీఐ అమలు అవసరం కోసం చూపుతున్నారు. ‘కనీస ఆదాయం’ అమలు వల్ల పూర్తిస్థాయిలో పారదర్శకత ఉంటుందని, సంక్షేమ వ్యవస్థ సరళమవుతుందని.. దీని అమలు కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తలు, సంస్థల వాదన. అనేక రకాల సంక్షేమ పథకాల కన్నా సార్వత్రిక బేషరతు ఆదాయం ఒక్కటే సంక్షేమ కార్యక్రమంగా ఉండగలదనే వారూ ఉన్నారు. అయితే.. యూబీఐ అమలు చేసే సమయంలో.. ఆహారం, ఆరోగ్యం, విద్య తదితర మౌలిక సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిందేననీ మరికొందరి వాదన. వ్యయం తక్కువే: ప్రస్తుతం అవసరాలు, ఆర్థిక స్థితి ప్రాతిపదికన అందిస్తున్న సంక్షేమ ప్రయోజనాల అమలుకు అయ్యే వ్యయం కన్నా.. యూబీఐ అమలు వ్యయం తక్కువగానే ఉంటుంది. పేదరిక నిర్మూలన: ప్రజలందరికీ యూబీఐ అమలుతో పేదరికం తగ్గిపోతుంది.. అసలు పేదరికన్నే ప్రపంచం నుంచి వేగంగా నిర్మూలించవచ్చు. నేరాలు తగ్గుతాయి: యూబీఐని విజయవంతంగా అమలు చేసినట్లయితే చోరీలు, దొంగతనాల వంటి నేరాలు గణనీయంగా తగ్గుతాయి. వాటి నియంత్రణ కోసం చేసే వ్యయప్రయాసలూ తగ్గుతాయి. అనారోగ్యాలు తగ్గుతాయి: కనీస వేతనం లభిస్తే.. పేదరికం కారణంగా, పోషకాహార లోపం కారణంగా అనారోగ్యాలు, మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు రావడం తగ్గుతుంది. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది: నెల వారీ లభించే కనీస ఆదాయాన్ని ప్రజలు ఉన్నత చదువుల కోసం వెచ్చించే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలరు. అది మొత్తంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. నిజమైన స్వాతంత్య్రం: రాజకీయ స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రం, మత స్వాతంత్య్రం ఉన్నా కూడా.. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోతే అవి పెద్దగా ఉపయోగపడవు. యూబీఐ వల్ల ప్రజలందరికీ ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు మిగతా స్వేచ్ఛలన్నిటినీ ఉపయోగించుకోవడం ద్వారా నిజమైన స్వాతంత్య్రం లభిస్తుంది. వ్యతిరేకుల వాదన ఏమిటి? యూబీఐని వ్యతిరేకించే వారిలో ప్రధానంగా రెండు వర్గాల వారు ఉన్నారు. ఒకరు.. పేదల సంక్షేమ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడంలో భాగంగా యూబీఐని చూస్తారు. మరొకరు.. ప్రజలకు ఉచితంగా, బేషరతుగా డబ్బు లభిస్తే వారు పెద్దగా పనిచేయరని, సోమరులుగా మారతారని విమర్శిస్తారు. పని చేయడం తగ్గిపోతే ప్రభుత్వాలకు పన్నుల రాబడి తగ్గిపోతుందని, ప్రభుత్వ ప్రాజెక్టులకు నిధుల కొరత తలెత్తుతుందని వారి వాదన. అధ్యయనాలు ఏం చెప్తున్నాయి? ఐదు శాతం తగ్గిన పని గంటలు: యూబీఐ అమలు కోసం అమెరికా, కెనడా వంటి పలు దేశాల్లో పైలట్ప్రాతిపదికన అధ్యయనాలు నిర్వహించారు. అందులో ఈ ప్రయోజనం తాత్కాలికమైనదే అయినప్పటికీ.. ఉచిత వేతనం అందుకుంటున్న వారిలో పని గంటలు ఐదు శాతం మేర తగ్గినట్లు గుర్తించారు. అందులోనూ ప్రధానంగా ఇద్దరు కుటుంబ సభ్యులు పనిచేస్తున్న ఇంట్లో ప్రధాన సంపాదకుడి పని గంటలు స్వల్పంగా తగ్గితే.. రెండో సంపాదకుడి పని ఎక్కువగా తగ్గింది. చదువుకు సమయం పెరిగింది: మనిటోబాలోని గ్రామీణ ప్రాంతమైన దౌఫిన్లో 1970లో నిర్వహించిన ‘మిన్కం’ ప్రయోగ అధ్యయనంలో.. కేవలం రెండు వర్గాలకు చెందిన వారిలోనే పని గంటలు తగ్గాయి. అందులో ఒకరు కొత్తగా తల్లులైన వారు, రెండో వారు చదువుకుంటున్న యుక్తవయస్కులు. కనీస వేతనం అందడం వల్ల కొత్త తల్లులు తమ పని గంటలు తగ్గించుకుని తమ పిల్లల సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయిస్తే.. తమ చదువులకు అవసరమైన ఖర్చు కోసం పనిచేస్తున్న యుక్తవయస్కులు పని గంటలు తగ్గించుకుని చదువులపై ఎక్కువ సమయం కేటాయించారు. ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి: నమీబియాలోని ఒమిటారా అనే గ్రామంలో 200809లో పేదరికంలో మగ్గుతున్న పౌరుల కోసం చేసిన పైలట్‌ప్రాజెక్టు అధ్యయనంలో.. ఈ పథకం అమలు వల్ల వాస్తవంగా ఆర్థిక కార్యకలాపాలు పెరిగినట్లు గుర్తించారు. చిన్న వ్యాపారాలను ప్రారంభించడం, కొనుగోలు శక్తి పెరగడం వల్ల స్థానిక మార్కెట్బలపడటం వంటి సానుకూల పరిణామాలు నమోదయ్యాయి. భారత్‌లో యూనిసెఫ్ప్రయోగం... భారతదేశంలో ‘సార్వత్రిక కనీస వేతనం’ ప్రభావాలు, సామర్థ్యాలు, పరిణామాలను అధ్యయనం చేయటం కోసం 2011లో యూనిసెఫ్నిధుల సహాయంతో మధ్యప్రదేశ్‌లోని 8 గ్రామాల్లో రెండు పైలట్ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆ గ్రామాల్లో ప్రతి వ్యక్తికీ పురుషులు, మహిళలు, పిల్లలు అందరికీ ఏడాదిన్నర కాలం పాటు నెల వారీ చెల్లింపులు చేశారు. ఆరంభంలో పెద్ద వారికి రూ. 200 చొప్పున, పిల్లలకు రూ. 100 చొప్పున (తల్లి లేదా సంరక్షకులకు చెల్లించారు) ప్రతి నెలా అందించారు. తర్వాత దీనిని పెద్దలకు రూ. 300, పిల్లలకు రూ. 150 మొత్తానికి పెంచారు. ఒక గిరిజన గ్రామంలో కూడా ఇదే పథకాన్ని అమలు చేశారు. ఈ మొత్తాన్ని వ్యక్తిగతంగా తొలుత మూడు నెలల పాటు నగదు రూపంలో అందించారు. అనంతరం వారి వారి బ్యాంకు లేదా సహకార సంఘాల ఖాతాలకు జమ చేశారు. ఆహార రాయితీలకు ఈ చెల్లింపులకు ముడి పెట్టలేదు. ఎటువంటి నిబంధనలూ విధించలేదు. ఈ అధ్యయనం ఫలితాలను 2013 మే 3031 తేదీల్లో ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో వెల్లడించారు. 1. చాలా మంది ఈ నగదును తమ ఇల్లు, మరుగుదొడ్లు, గోడలు, పైకప్పులను మెరుగుపరచుకోవడానికి, మలేరియా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగించారు. 2. పోషకాహారం మెరుగుపడింది. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి ఇళ్లలో ఈ మార్పు ప్రస్ఫుటంగగా ఉంది. చిన్న పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల సగటు బరువు మెరుగుపడింది. 3. చేతికి అందే నగదు కొంత పెరగడం వల్ల జనం రేషన్‌షాపుల నుంచి మార్కెట్కొనుగోలు వైపు మారారు. తాజా కూరగాయలు, పండ్లు, నాణ్యమైన ఆహార పదార్థాల స్వీకరణ వల్ల పిల్లల ఆరోగ్యం, శక్తి సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. 4. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల పాఠశాలకు హాజరవడం, ఉత్తమంగా కృషి చేయడం పెరిగింది. పిల్లలకు యూనిఫాం కొనుగోలు చేయడం, పాఠశాలకు రవాణా చెల్లింపులు చేయగలగడం కూడా ఇందుకు మరో కారణం. 5. తమ చేతిలో నగదు ఉండటం వల్ల ఇళ్లలో మహిళలు, వికలాంగుల సాధికారత మెరుగుపడింది. 6. నెల వారీ నగదు అందుతుండటంతో చిన్న మొత్తం పెట్టుబడులు పెరిగాయి. మంచి విత్తనాలు, కుట్టు మిషన్లు, చిన్న దుకాణాల ఏర్పాటు, రిపేరు పరికరాలు తదితరాలు కొనుగోలు చేశారు. దీని ద్వారా ఉత్పత్తి పెరగడం, ఆదాయం పెరగడం వంటి ఫలితాలు వచ్చాయి. 7. కనీస ఆదాయం ఫలితంగా శ్రమించడం, పని చేయడం పెరిగింది. అయితే.. అది రోజు కూలీ పని వైపు నుండి స్వయం ఉపాధితో కూడిన వ్యవసాయం, వ్యాపార కార్యక్రమం వైపు మారింది. కరవు వంటి పరిస్థితులతో వలసలు వెళ్లడం తగ్గింది. మహిళలకు అధిక ప్రయోజనం లభించింది. 8. వెట్టి చాకిరి అనూహ్యంగా తగ్గిపోయింది. ఇది స్థానికంగా అభివృద్ధికి, సమానత్వానికి భారీ సానుకూల ప్రభావం చూపించింది. 9. కనీస వేతనం పొందిన వారు తాత్కాలిక అవసరాలకు అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో.. అప్పులు చేసి ఇబ్బందులు పడడం తగ్గిపోయింది. నిజానికి.. ఈ కనీస వేతనాన్ని వ్యతిరేకించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే.. అది స్థానిక వడ్డీ వ్యాపారులు మాత్రమే. 10. చాలా మంది కొంత నగదును దాచుకోవడం ద్వారా.. తీవ్ర అనారోగ్యం, ఇంట్లో మరణాలు వంటివి సంభవించినపుడు అప్పులు చేసి రుణ ఊబిలో కూరుకుపోకకుండా ఎదుర్కోగలిగారు. భారత్‌లో అమలుకు ప్రధాన సవాళ్లు ఏమిటి? మొదటి సవాలు జన సంఖ్య. దేశంలో దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీరందరికీ పూర్తి స్థాయిలో యూబీఐ అమలు చేయడానికి భారీ స్థాయిలో నిధులు అవసరం. ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 10,000 చొప్పున యూబీఐ ఇచ్చినా ఏటా 13 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. మొత్తం మీద స్థూల జాతీయోత్పత్తిలో 10 శాతం వరకూ వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా. ఇది ప్రస్తుతం మొత్తం సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న వ్యయం కన్నా దాదాపు రెట్టింపు. రెండో సవాలు ప్రభుత్వ పథకాలు. యూబీఐని అమలు చేస్తే ప్రస్తుతమున్న ఏ సంక్షేమ పథకాలను తగ్గించాలనేది ప్రశ్నార్థకమవుతుంది. కనీస వేతనం ఇస్తున్నామన్న పేరుతో ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాల వారి కోసం అమలు చేసే అత్యధిక పథకాలను తొలగిస్తే వారి పరిస్థితి మరింతగా దిగజారుతుందనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ---- సాక్షి నాలెడ్జ్సెంటర్ -
యెమెన్ లో ఆకలి చావులు
సరైన ఆహారం లేక ఎముకలు తేలిన శరీరంతో ఆసుపత్రి బెడ్‌పై దీనంగా కూర్చుని ఉన్న ఈ ఐదేళ్ల బాలుడి పేరు మొహన్నద్ అలీ. ఇతని రెండేళ్ల వయసున్న సోదరుడు ఈ మధ్యే ఆకలితో మృతిచెందాడు. ఇప్పుడు అలీ కూడా చావుకు దగ్గరగా ఉన్నాడనీ, కాపాడుకోడానికి తీవ్రంగా శ్రమిస్తున్నానని అతని 19 ఏళ్ల అన్న చెబుతున్నాడు. ఈ ఫొటోను 2016 డిసెంబరు 12న తీయగా యూనిసెఫ్ విడుదల చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం వల్ల యెమెన్ ప్రజలు ఆహారం కోసం పడుతున్న కష్టాలకు ఈ ఫొటో సాక్ష్యంగా నిలుస్తోంది. -
‘అలాంటప్పుడు నా స్టార్ డమ్ కూడా వేస్టే’
భోపాల్: తన స్టార్ డమ్‌ను ఉపయోగించుకొని చిన్నారులకు, దేశానికి మంచి చేస్తానని ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా చెప్పారు. అలా చేయాలేనప్పుడు స్టార్ డమ్ ఉన్నా కూడా పనికి రానిట్లేనని అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే పిల్లలతోనే సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. చాలాసార్లు పిల్లలే దేశ భవిష్యత్తు అని చెబుతామని, ఆ మేరకే వారిని ఇప్పటి నుంచే తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కోరారు. పిల్లలు అందించే సేవలను తప్పక గుర్తించాలని, లెక్కలోకి తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ యూనిసెఫ్‌కు సెలబ్రిటీ అడ్వకేట్‌గా కూడా పనిచేస్తున్న ఆమె ఇక్కడ జరుగుతున్న యూనిసెఫ్ 70వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ మాటలు అన్నారు. పిల్లల అవసరాలను తీర్చలేనప్పుడు, వారిని తీర్చి దిద్దలేనప్పుడు సమాజంలో ప్రగతిని సాధించడం అనేది కష్టమైన పని అని ఆమె అభిప్రాయపడ్డారు. పిల్లల మంచి కోసం తన స్టార్ డమ్, స్టాటస్ ఉపయోగపడకుండా అది ఉన్నా కూడా పనికిరానిదన్నట్లేనని చెప్పారు. యూనిసెఫ్‌లో భాగస్వామ్యం ఉండటం తన అదృష్టం అన్నారు. పిల్లల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. -
యునిసెఫ్ అంబాసిడర్‌గా ప్రియాంక
న్యూయార్క్: యునిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ కొత్త ప్రచారకురాలిగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నియమితులయ్యారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హామ్, బ్రిటిష్ బాలనటి మిల్లీ బాబీ బ్రౌన్‌లు కలసి సంయుక్తంగా ప్రియాంక నియామకాన్ని ప్రకటించారు. పీడిత బాలల విముక్తి కోసం, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు ప్రపంచ దేశాలు సంయుక్తంగా కలసిరావాలని ప్రియాంక కోరారు. -
కాలుష్యం కోరల్లో 200 కోట్ల మంది పిల్లలు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది పిల్లలు అత్యంత ప్రమాదకర కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వారిలో ఏటా ఆరు లక్షల మంది పిల్లలు కేవలం కాలుష్యం కారణంగా మరణిస్తున్నారని, వారంతా ఐదేళ్ల ప్రాయం లోపు పిల్లలేనని యునిసెఫ్ సంచలన ప్రకటన చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకన్నా ఆరేడు రెట్లు కాలుష్యం ఎక్కువున్న ప్రాంతాల్లో పిల్లలు నివసిస్తున్నారని, ఈ ప్రాంతాలు ఎక్కువగా దక్షిణాసియా దేశాల్లోనే ఎక్కువగా ఉన్నాయని యునిసెఫ్ వెల్లడించింది. కాలుష్యం కారణంగా ఆస్తమా, గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చి పిల్లలు మృత్యువాత పడుతున్నారని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. శిలాజ ఇంధనాలు ఉపయోగించే వాహనాల నుంచి, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కాలుష్యానికి తగులబెడుతున్న చెత్తా చెదారం, ధూళి తోడవడంతో కాలుష్యం తీవ్రమవుతోందని పేర్కొంది. బయటి వాతావరణ కాలుష్యానికి ఎంత మంది పిల్లలు బలవుతున్నారో అంచనా వేయడానికి యునిసెఫ్ మొట్టమొదటి సారిగా శాటిలైట్ చిత్రాలను ఉపయోగించింది. దక్షిణాసియా దేశాల్లో 62 కోట్ల మంది పిల్లలు కాలుష్యం బారిన పడుతుంటే వారిలో ఎక్కువ మంది ఉత్తర భారతానికి చెందిన వారేనని యునిసెఫ్ పేర్కొంది. ఆఫ్రికాలోని కాలుష్య ప్రాంతాల్లో 52 కోట్ల మంది పిల్లలు నివసిస్తున్నారని తెలిపింది. తూర్పు ఆసియా దేశాల్లో మరో 45 కోట్ల మంది పిల్లలు కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారట. కాలుష్యం కారణంగా పిల్లలు మృత్యువాత పడడమే కాకుండా వారి ఊపిరితిత్తులు, మెదడు ఎదగక పోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని యునిసెఫ్ హెచ్చరించింది. పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే వాతావరణం కాలుష్యాన్ని అరికట్టాల్సిందేనని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని యునిసెఫ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. సాధారణంగా చలికాలంలో వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుందని, వీచే గాలులు తగ్గిపోవడం, చెత్తా చెదారాన్ని తగులబెట్టడం ఎక్కువవడం వల్ల అలా జరుగుతుందని తెలిపింది. -
విషపు కోరల్లో 30 కోట్ల మంది బాలలు
వాషింగ్టన్: విషవాయువులు బాల్యాన్ని కబ ళిస్తున్నాయి. మానసిక, శారీరక ఎదుగుదల ను దె బ్బతీస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తం గా 30 కోట్ల మంది బాలలు విష వాయువులు పీలుస్తున్నారు. ప్రతి ఏడుగురు బాలల్లో ఒకరు కాలుష్య వాయువు పీలుస్తున్నారు. నిర్దేశిత అంతర్జాతీయ ప్రమాణాల కంటే ఆరు రెట్లు అది ప్రమాదకరం. ప్రతి ఐదేళ్లల్లో 6 లక్షల మంది బాలలు వాతావరణ కాలుష్యానికి బలవుతున్నారు. వాహన ఉద్గారాలు, ఇంధనం, దుమ్ము, వ్యర్థ పదార్థాల కాల్చివేత వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం బాలల పాలిట శాపంగా మారిందని యూనిసెఫ్ ప్రతినిధి ఆంథోనీ లేక్ తెలిపారు. ఈ పరిస్థితి దక్షిణాసియాలో దారుణం గా ఉందర్కొన్నారు. ఈ నెల 7-18 మధ్య మొరాకోలో జరిగే ఐరాస వార్షిక వాతావరణం- మార్పులపై చర్చల నేపథ్యంలో నివేదిక విడుదల చేశారు. -
జిల్లా ఆస్పత్రిలో మోడల్ లేబర్ రూం
ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో మోడల్ లేబర్ రూం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించడానికి బుధవారం యూనిసెఫ్ ప్రతినిధులు ప్రొద్దుటూరుకు వచ్చారు. యూనిసెఫ్ ప్రతినిధులు అభిషేక్, నితీష్‌లు ఆస్పత్రికి విచ్చేసి వసతులను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మాతా శిశుమరణాలను తగ్గించేందుకు మోడల్ లేబర్ రూంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ఆస్పత్రుల్లో ఉన్న వసతులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. జిల్లాలో ప్రొద్దుటూరుతోపాటు రాజంపేట, రిమ్స్ ఆస్పత్రులను పరిశీలించామని చెప్పారు. మోడల్ లేబర్ రూంలలో సుమారు రూ. 2 లక్షలు విలువ చేసే బెడ్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. ప్రసవం అనంతరం సుమారు 8 గంటల పాటు తల్లి, బిడ్డ ఇందులోనే విశ్రాంతి తీసుకుంటారని పేర్కొన్నారు. అంతేగాక ఇందులో భాగంగానే కంగారు మదర్ కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడి నుంచి కొన్ని కేసులను కడపకు తీసుకొని వెళ్లాల్సి వస్తోందని, దారిలో ఏదైనా జరిగి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వారు అభిప్రాయ పడ్డారు. అందువల్ల ఇక్కడ మోడల్ లేబర్ రూం అవసరమని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రాష్ట్రంలో మొదట కడప జిల్లాలోనే సర్వే చేస్తున్నామని తెలిపారు. సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో మోడల్ లేబర్ రూం చాలా అవసరమన్నారు. ప్రభుత్వం దీన్ని మంజూరు చేస్తే గర్భిణులకు ఇంకా మంచి వైద్యం అందుతుందని తెలిపారు. -
‘బాలల శ్రమను చట్టబద్ధం చేయొద్దు’
ఐరాస: కుటుంబం నిర్వహించే చిన్నతరహా పరిశ్రమలకు చిన్నారులు సహకరించవచ్చని భారత బాలకార్మిక చట్టం పేర్కొనడంపై యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల బలహీన వర్గాల పిల్లలు తరచుగా పాఠశాలలకు గైర్హాజరై డ్రాపౌట్లుగా మిగిలే ప్రమాదముందని అభిప్రాయపడింది. ఈ నిబంధనను బాలకార్మిక చట్టం నుంచి తొలగించాలని గట్టిగా సిఫారసు చేస్తున్నట్లు యునిసెఫ్ ఇండియా ఎడ్యుకేషన్ చీఫ్ యుఫరేట్స్ గోబినా పేర్కొన్నారు. భారత్‌లో డ్రాపౌట్లుగా మారిన చిన్నారులను, బలహీన వర్గాలకు చెందిన బాలకార్మికులను పాఠశాలలకు తిరిగి రప్పించే ప్రక్రియలో పెద్దగా పురోగతి కానరాలేదన్నారు. -
మల్కాపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్ బృందం
తూప్రాన్ : కలెక్టర్ దత్తత గ్రామమైన తూప్రాన్ మండలం మల్కాపూర్‌ను యూనిసెఫ్ బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. వీరిలో ఢిల్లీకి చెందిన ఫ్రాంక్ బధియాంబో వాష్ స్పెషలిస్ట్, లండన్‌కు చెందిన జెమ్స్కారీ, హైదరాబాద్‌కు చెందిన వాష్స్పెషలిస్టు సెలాధియత ఆర్ నల్టీ, మధుసూదన్‌రెడ్డి, కేశవరెడ్డి ఉన్నారు. వారికి స్థానికులు పూల దండలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సమష్టిగా చేపట్టిన వంద శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, మిషన్ భగీరథ, మొక్కల పెంపకం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం వారు గ్రామస్తుల తీరును అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఇతర గ్రామస్తులు ఐక్యంగా ఏర్పడితే ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రాఘవరావు, సర్పంచ్ స్వామి పాల్గొన్నారు. -
మెజీషియన్‌గా మారనున్న హీరోయిన్!
తిరువనంతపురం: మంజూ వారియర్ ఓ నటిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆమె త్వరలో ఓ ఇంద్రజాలికురాలిగా మారబోతోంది. అయితే ఈ అవతారం ఎత్తుతోంది డబ్బులు సంపాదించడానికి మాత్రం కాదండోయ్.. పిల్లల సంరక్షణ కోసం ఈ పని చేయనుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన బాలల అత్యవసర నిధి విభాగమైన యూనిసెఫ్ కోసం ప్రముఖ ఇంద్రజాలికుడు, యూనిసెఫ్ ప్రచారకర్త గోపీనాథ్ ముథ్కద్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి 1000 రోజుల లోపు వయసున్న చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించనున్నారు. సహజంగానే సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే మంజు కూడా ఇందులో తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. గోపీనాథ్‌తో కలిసి మ్యాజిక్ కూడా చేయనున్నారు. ఇందుకోసం అమె ఇంద్రజాల పాఠాలు కూడా నేర్చుకుంటున్నారట. మ్యాజిక్ ద్వారానే తల్లులకు అవగాహన కల్పిస్తానని మంజూ చెబుతున్నారు. -
చిన్నారుల మరణాల్లో భారత్@48
యూనిసెఫ్ వార్షిక నివేదికలో వెల్లడి వాషింగ్టన్/తియాన్జిన్: ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో (2014 వరకున్న వివరాల ప్రకారం) భారత్ 48వ స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. యునిసెఫ్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2015లో భారత్‌లో 2.57 కోట్ల మంది జన్మించగా ఇందులో 12 లక్షల మంది చిన్నారులు వివిధ కారణాలతో మరణించారు. 2030 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో సగానికి పైగా భారత్, నైజీరియా, పాకిస్తాన్, కాంగో, అంగోలాల్లోనే ఉంటాయని యునిసెఫ్ వెల్లడించింది. నివేదికలోని మరిన్ని అంశాలు ► చిన్నారుల మరణాలకు నెలలు నిండకముందే పుట్టడంతో వచ్చే సమస్యలు, న్యుమోనియా ప్రధాన కారణాలు. ► భారత్‌లో పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 48 మంది చనిపోతున్నారు. ► దేశంలో సగటు ఆయుర్దాయం 68 ఏళ్లు. ► డ్రాపవుట్ల సంఖ్యలో తగ్గుదల. పూర్వ ప్రాథమిక విద్యకు దూరంగా పేదలు. ► 2009-2014 గణాంకాల ప్రకారం అక్షరాస్యత పురుషుల్లో 90 శాతం, మహిళల్లో 82 శాతం(15-24ఏళ్లలోపు). ► వందమందిలో 74 మంది మొబైల్ వినియోగం, 18 మంది ఇంటర్నెట్ వినియోగం. ► వెయ్యిమందిలో 12 మంది బాల కార్మికులు. ► 21 లక్షల మందికి హెచ్ఐవీ. ఇందులో 1.3 లక్షల మంది చిన్నారులు. ► వరల్డ్ ఎకనమిక్ ఫోరం హ్యూమన్ క్యాపిటల్ (ఆర్థికాభివృద్ధికి కావాల్సిన సామర్థ్య నిర్మాణం, అభివృద్ధి, సరైన వినియోగం) సూచీలో భారత్‌కు 105 స్థానం. ► నాణ్యమైన విద్య విషయంలో 39, సిబ్బంది శిక్షణలో 46, నైపుణ్య ఉద్యోగుల విషయంలో 45వ స్థానంలో భారత్. -
బలవుతున్న బాల్యం..
ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి. 21వ శతాబ్దంలోనూ ఈ సమస్య ఇంకా అంతం కావడం లేదు. ఎందరో బాలల భవిష్యత్‌ను చిదిమేస్తున్న కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేస్తూనే ఉంది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా నేటి తరంలో బాలకార్మిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం.. 21 కోట్ల మంది.. కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు. కొన్నిదేశాల్లో 17 ఏళ్లలోపు బాలల్ని కూడా కార్మికులుగానే భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్ల మంది బాల కార్మికులుగా కొనసాగుతున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా. పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారు. కారణాలు.. పిల్లల తల్లిదండ్రుల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యతల కారణంగానే బాలకార్మికులు పెరిగిపోతున్నారు. కనీస అవసరాలకు సరిపడా ఆదాయం దొరకని అనేక కుటుంబాలు తమ పిల్లల్ని పనుల్లో చేర్పిస్తున్నాయి. ప్రపంచంలో పావుశాతం జనాభా కఠిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఆఫ్రికా, అసియా, లాటిన్ అమెరికాల్లో పేదరికం కారణంగా పిల్లలు కార్మికులుగా మారాల్సి వస్తోంది. కొన్ని దేశాల్లో పిల్లలు విద్యనభ్యసించేందుకు అనువైన వసతులు లేకపోవడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు ఉచిత విద్య అందించకపోవడం, ప్రైవేటు విద్య ఖరీదు కావడంతో బాలలు చదువుకు దూరమై కార్మికులుగా పని చేస్తున్నారు. వెట్టిచాకిరి, సామాజిక అంశాలు సైతం ఇందుకు కారణమవుతున్నాయి. ఇక కొందరు పిల్లలు వంశపారంపర్యంగా వస్తున్న పనుల్లోనే కొనసాగుతున్నారు. బాల్యం ఛిద్రం.. బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వీరిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్ధా్యనికి మించిన పనుల్ని చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్థితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి. భవిష్యత్ అంధకారం.. బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్‌లో ఉన్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీరికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యలేమి వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారు. ఇందుకు వ్యవస్థనే తప్పుబట్టాల్సి ఉంటుంది. నిర్మూలనకు మార్గం.. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలి. దీనికి అనుగుణమైన చట్టాలు రూపొందించాలి. బాలలతో పని చేయించుకునే యజమానులకు కఠిన శిక్షలు విధించాలి. బాలలందరికీ విద్య, పోషకాహారం అందేందుకు కృషి చేయాలి. ఈ పరిస్థితికి కారణమైన వ్యవస్థల్లో మార్పు తీసుకురావడం ద్వారానే ఇది సాధ్యం. పిల్లల్ని పనులు మాన్పించి, బడులలో చేర్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. వారి తల్లిదండ్రులు ఆర్థికంగా ఎదిగేందుకు సరైన అవకాశాల్ని కల్పించడం ద్వారా బాల కార్మికులు లేకుండా చూడొచ్చు. ఇలాంటి పిల్లలు చదువుకునేందుకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉచిత విద్య, భోజనం అందిచాలి. తల్లిదండ్రుల సంరక్షణ లేని వారికి ప్రత్యేక రక్షణ, వసతులు కల్పించాలి. మన దేశంలో.. ప్రపంచంలో ఎక్కువ మంది బాలకార్మికులు ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. మన దేశంలో దాదాపు కోటి వరకు బాల కార్మికులు ఉన్నట్లు అంచనా. ఈ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం కఠినమైన చట్టాల్ని అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించలేకపోతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు అమలవుతోంది. దీనిలో భాగంగా పనుల్లో మగ్గుతున్న బాలల్ని గుర్తించి, వారికి సరైన ఆవాసం కల్పించి, విద్య అందిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యాహక్కు చట్టం సత్ఫలితాల్నిస్తోంది. ఏ కారణం చేతనైనా బాలలు బడి బయట ఉండరాదని, ప్రతి ఒక్కరికి నిర్బంధ ప్రాథమిక విద్య అందాలని ఈ చట్టం చెబుతోంది. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లల్ని పనుల్లో పెట్టుకోకూడదు. దీన్ని అతిక్రమించిన వారికి జైలు శిక్షలతోపాటు జరిమానాలు విధిస్తారు. యునిసెఫ్ కృషి.. అంతర్జాతీయంగా బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న యునిసెఫ్ సంస్థ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు యత్నిస్తోంది. వివిధ దేశాలతో కలిసి ఈ సమస్య నివారణ కోసం చట్టాలు రూపొందించింది. 15 ఏళ్లలోపు పిల్లల్ని ఎక్కడా పనుల్లో చేర్చుకోకూడదని, 18 ఏళ్లలోపు వారిని కఠినమైన పనులకు వినియోగించకూడదని యునిసెఫ్ నిబంధనలు చెబుతున్నాయి. పిల్లలందరికీ కచ్చితంగా విద్య అందేలా చూస్తోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అవసరమైన చట్టాలను రూపొందించడంలో, ప్రాథమిక విద్య అందించడంలో యునిసెఫ్ కీలకపాత్ర పోషిస్తోంది. -
బాలల ఆరోగ్య పరిరక్షణకు కృషి
కాట్రేనికోన : అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న బాలల ఆరోగ్య పరిరక్షణకు కృషిచేస్తున్నట్టు మహిళా శిశు సంజీవిని మిషన్ (యూనిసెఫ్) జిల్లా కోఆర్డినేటర్, కలెక్టర్ భార్య శ్రీదేవి పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా శిశు సంజీవిని మిషన్ సభ్యుల బృం దం శనివారం దొంతికుర్రు పెదచెరువుపేట అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. బృం దాలుగా ఏర్పడి అంగన్వాడీ కేంద్రం పరిధిలోని పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ఆట వస్తువులు తదితర అంశాలను పరిశీలించారు. మరికొన్ని బృందాలు గ్రామంలో పర్యటించి సర్వే చేపట్టారు. అంగన్వాడీ కే ంద్రం గాలి వెలుతురు లేకుండా ఇరుకుగా ఉన్నాయి. పరిసరాలలో నీటి గుంత ఉండటంతో దోమలు పెరిగే పరిస్థితి ఉన్నట్టు గుర్తించారు. నీటిగుంత పూడ్చివేసేందుకు సహకరించాలని సర్పంచ్ పెయ్యల సత్యనారాయణను కోరారు. అనంతరం కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన దత్తత అంగన్వాడీ కేంద్రంలో బృంద సభ్యు లు పరిశీలించిన అంశాలను సమావేశంలో చర్చించారు. శ్రీదేవి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ,మహిళా శిశు సంజీవిని మిషన్ జిల్లా 11 సీడీపీఓల పరిధిలోని 50 కేంద్రాలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు దత్తత తీసుకున్నామన్నారు. ఆయా అంగన్వాడీ కేంద్రాలలో సమస్యలు, పిల్లల పౌష్టికాహారం తదితర అంశాలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీడీఓ కనకలింగేశ్వరరావు, కాకినాడ, తుని, సామర్లకోట సీడీపీఓలు సావిత్రి, మాధవి, శారద సంపత్‌కుమారి, యూనిసెప్ ప్రతినిధులు కె.దుర్గాప్రసాద్, ఎం.గణేష్ తదితరులు ఉన్నారు. -
తెలంగాణకు ‘కడుపు కోత’
♦ రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్న సిజేరియన్లు ♦ ప్రైవేటు ఆసుపత్రుల్లో 75 శాతం ప్రసవాలు ఇలానే ♦ ప్రజల్లో అవగాహన అవసరం: యునిసెఫ్ సాక్షి, హైదరాబాద్: దేశంలో సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యధిక ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని యునిసెఫ్ తెలిపింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆందోళనకరంగా 74.9 శాతం సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయన్న కేంద్ర సర్వే వివరాలను యునిసెఫ్ వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ శాతం 40.6గా ఉందని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 58 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే చేస్తున్నారంది. తెలంగాణ తరువాత పశ్చిమబెంగాల్లో 70.9 శాతం, త్రిపురలో 73.3 శాతం సిజేరియన్ ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయంది. ఇక ఇతర దేశాలు అమెరికాలో 33 శాతం, స్విట్జర్లాండ్‌లో 33 శాతం, చైనాలో 27 శాతం, బ్రెజిల్లో 56 శాతం, ఇథియోపియాలో 2 శాతం, జర్మనీలో 32 శాతం, ఉగాండాలో 5 శాతం, దక్షిణ సూడాన్‌లో ఒక శాతం కంటే తక్కువ, శ్రీలంకలో 31 శాతం, థాయిలాండ్‌లో 32 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయని వివరించింది. యునిసెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘పెరుగుతున్న సిజేరియన్లు... కారణాల’పై జరిగిన రెండు రోజుల సదస్సు బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, యునిసెఫ్ హైదరాబాద్ ప్రతినిధి సంజీవ్ ఉపాధ్యాయ, జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం (ఎన్హెచ్ఎస్ఆర్సీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సంజీవ్‌కుమార్, ప్రతినిధి హిమాంశు భూషణ్, ఫోగ్సి కార్యదర్శి శాంతకుమారి, కేంద్ర ప్రభుత్వ మాత ఆరోగ్య డిప్యూటీ కమిషనర్ దైనిష్ బస్వాల్ మాట్లాడారు. అవసరం లేకున్నా ఆపరేషన్లు... జ్యోతి బుద్ధ ప్రకాష్ మాట్లాడుతూ సిజేరియన్ ఆపరేషన్లకు సంబంధించి నియంత్రణకు ఎటువంటి చట్టం లేదన్నారు. గర్భిణి ఆరోగ్య, వైద్యపరంగా ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సిజేరియన్ల వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. దేశంలో అవసరం లేకున్నా ఈ ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లాల్లో 63 శాతం, నల్లగొండ జిల్లాలో 60 శాతం, మెదక్ జిల్లాలో 49 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ కేంద్రాలను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. వీటిపై ప్రజల్లోనూ అవగాహన పెరగాలన్నారు. ముహూర్తాలతో ప్రసవాలు... ముహూర్తాలు పెట్టి మరీ సిజేరియన్ ప్రసవాలు చేయించుకుంటున్నారని శాంతాకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ కానీ, గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు కానీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరన్నారు. అందుకే సిజేరియన్లు అధికమయ్యాయన్నారు. వైద్యపరమైన న్యాయ చిక్కుల వల్ల డాక్టర్లు కూడా భయాందోళనకు గురై సిజేరియన్లనే ఎంచుకుంటున్నారన్నారు. ప్రసవాల్లో సమస్యలుంటాయని... డాక్టర్లు దేవుళ్లేమీ కారన్నారు. -
'10 నెలల్లో 900 మంది చిన్నారులు మృతి'
ఐక్యరాజ్యసమితి : యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల్లో మొత్తం 900 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో 1300 మందికిపైగా చిన్నారులు మరణించారు. ఈ మేరకు యూనిసెఫ్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ మొత్తం 2015 మార్చి నాటి నుంచి ఇప్పటి వరకు మరణించిన చిన్నారుల సంఖ్య అని స్పష్టం చేసింది. యెమెన్‌లో నిబంధనలకు విరుద్ధంగా చిన్నారులపై 1,560 ఘటనలు చోటు చేసుకున్నాయని తమ సంస్థ పరిశీలనలో వెల్లడి అయిందని తెలిపింది. 2015, మార్చి నాటి నుంచి ప్రతి రోజు కనీసం ఆరుగురు చిన్నారులు మృతి చెందారని నివేదికలో పేర్కొంది. దేశంలోని తైజ్ సనా, సాద, అడెన్, హజ్హ్ గవర్నరేట్ల పరిధిలో అధిక మరణాలు చోటు చేసుకున్నట్లు వివరించింది. యెమెన్‌లో 2011 నాటి నుంచి అస్థిరత్వం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడు వర్గానికి, హూతీ షియా మిలిషియాలకు విధేయులుగా ఉన్న వర్గానికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఘర్షణలు జరుగుతున్న విషయం విదితమే. అయితే 2015 మార్చి నాటి నుంచి యెమెన్‌లో భద్రత క్షీణించిందని తెలిపింది. ఈ ఘర్షణల వల్ల 21.2 మిలియన్ల మంది ప్రజలు బాధితులుగా మారారని యూనిసెఫ్ చెప్పింది. సాధ్యమైనంత త్వరగా దేశంలో మానవతా సహాయం అవసరమని యూనిసెఫ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. -
పోషకాహారలోపం నివారణకు సహకరించాలి
యునిసెఫ్ ప్రతినిధులతో భేటీలో స్పీకర్ కోడెల సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలకు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. పోషకాహారలోపం నివారణకు అసెంబ్లీ త గిన సహకారం అందిస్తుందన్నారు. మంగళవారం కోడెలతో యునిసెఫ్ ప్రతినిధులు అసెంబ్లీ ఆవరణలో సమావేశమయ్యారు. వ్యవస్థపై ఈ సమస్య విభిన్న రూపాల్లో ప్రభావం చూపుతుందని, దీన్ని అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పౌష్టికాహారం విషయంలో మహారాష్ట్ర అనుసరిస్తున్న విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని ఈ సందర్భంగా యునిసెఫ్ ప్రతినిధులు లక్ష్మీ భవాని, ప్రోసన్సేన్ స్పీకర్‌కు సూచించారు. పౌష్టికాహారలోపంపై అంతర్జాతీయ సదస్సును విజయవాడలో నిర్వహిస్తామని వారు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు పదోన్నతులు, విభజన విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తానని ఉద్యోగ సంఘాల నేతలకు స్పీకర్ కోడెల హామీనిచ్చారు. -
ఇబ్రహీంపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్ బృందం
గ్రామంలో ఇటలీ, కెనడా ప్రతినిధులు సమగ్ర వివరాల సేకరణ పారిశుద్ధ్య గ్రామంపై కితాబు సిద్దిపేట జోన్ : యూనిసెఫ్ ప్రతినిధులు శనివారం సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో ఇంటింటికి తిరిగి అధ్యయనం చేశారు. దోమ రహిత గ్రామంగా, ఇంకుడు గుంతల నిర్మాణంతో రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు పొందిన ఇబ్రహీంపూర్‌ను ఇటలీకి చెందిన జూకోమో, కెనడాకు చెందిన గ్యాబీలు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంకుడు గుంతలను పరిశీలించారు. వీటి నిర్మాణానికి చేసిన వ్యయంపై ఆరాతీశారు. అదే విధంగా గ్రామంలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను గూర్చి వివరాలు సేకరించారు. వాటి వినియోగం స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణానికి పట్టిన వ్యయంపై గ్రామ ప్రజల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు, తీసుకున్న ప్రక్రియలను బృందం అడిగి తెలుసుకుంది. చేతులు శుభ్రం చేసుకునే విధానంపై గ్రామస్తుల ద్వారా ఆరా తీశారు. గ్రామంలోని మహిళలతో మాట్లాడారు. మంచి వాతావరణంతో కూడిన గ్రామంగా ఏర్పడడడాన్ని వారు అభినందించారు. ఇబ్రహీంపూర్ గ్రామంలో ప్రజలు సమష్టిగా తీసుకున్న నిర్ణయాలు, వాటి సత్ఫలితాలు గురించి అడిగారు. వ్యవసాయ స్థితిగతులను రైతుల ద్వారా తెలుసుకున్నారు. అంతకు ముందు గ్రామంలో వినూత్నంగా చేపట్టిన పలు ప్రక్రియలను వీడియో ద్వారా డాక్యుమెంటరీ చిత్రీకరించారు. వారి వెంట హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెంట్లు సుధాకర్‌రెడ్డి, అవినాష్, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, సర్పంచ్ లక్ష్మి, గ్రామ నాయకులు ఎల్లారెడ్డి, నగేష్‌రెడ్డి తదితరులున్నారు. -
వీరు చదువులకు దూరం..
‘యునిసెఫ్’ ప్రకారం, ఘర్షణాత్మక వాతావరణం ఉన్న దేశాల్లోని లక్షలాది మంది పిల్లలు బడులకు దూరమవుతున్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పూర్తి ప్రతికూల పరిస్థితులున్న దేశాల్లో ఈ సంఖ్యలు ఇలా ఉన్నాయి: సూడాన్ 31 లక్షలు, ఇరాక్ 30 లక్షలు, యెమెన్ 29 లక్షలు, సిరియా 24 లక్షలు, లిబియా 20 లక్షలు -
యెమెన్‌లో 279 మంది చిన్నారుల మృతి
యూనైటెడ్ నేషన్స్ : యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల్లో 279 మంది చిన్నారులు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ (యూనిసెఫ్) బుధవారం వెల్లడించింది. మరో 402 మంది చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. గడిచిన 10 వారాల కాలవ్యవధిలో వీరంతా మృతి చెందారని పేర్కొంది. అయితే గతేడాది దేశంలో జరిగిన ఘర్షణల్లో 74 మంది చిన్నారులు మరణించగా... మరో 244 మంది గాయపడ్డారని వివరించింది. యెమెన్‌లో 2011 నాటి నుంచి అస్థిరత్వం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడు అబెడ్రాబోహాదీ, హూతీ షియా మిలిషియాలకు విధేయులుగా ఉన్న వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్న విషయం విదితమే. -
ఆరుబయటే పని కానిచ్చేస్తున్నారు
-
పాపం పసివాళ్లు.. యెమెన్‌లో 62 మంది మృతి
న్యూయార్క్: యెమెన్‌లో జరుగుతున్న ఘర్షణల్లో గత వారం రోజుల్లో 62 మంది చిన్నారులు ప్రాణాలుకోల్పోయినట్లు యూనిసెఫ్(అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ) ప్రకటించింది. మరో 30 మంది చిన్నారులు గాయాలపాలయినట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా యెమెన్‌లో సుస్థిర పాలనకు భంగం వాటిల్లి ఉద్రిక్త పరిస్థితులతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని ప్రపంచ దేశాలతోపాటు ఐక్యరాజ్య సమితిలోని పలు విభాగాలు గమనిస్తున్నాయి. ఈ సందర్భంగా యూనిసెఫ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ' యెమెన్‌లో జరుగుతున్న ఘర్షణల కారణంగా విద్యా, ఆరోగ్య సంస్థల సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడ ఏ బాంబులు పడతాయో తెలియని పరిస్థితుల మధ్య ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళుతుండగా చిన్నారులు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు. మానవత రాహిత్యం చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ఆ దేశంలో చిన్నారులు ఆహారలేమి, పోష్టికహారలోపంవంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏం జరిగినా చిన్నారలను రక్షించాల్సిన బాధ్యత వారి భవిష్యత్‌కు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రతిఒక్కరికి ఉంది' అంటూ అందులో పేర్కొంది. -
హమ్మయ్య.. 250 మంది చిన్నారులకు విముక్తి
న్యూయార్క్: దక్షిణ సుడాన్‌లోని ఓ సాయుధ బలగాల గ్రూపు నుంచి 250 మంది బాల సైనికులకు విముక్తి కలిగింది. మరో రెండు రోజుల్లో 400 మంది చిన్నారులను విడిపించాల్సి ఉందని ది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ (యూనిసెఫ్) ప్రకటించింది. దక్షిణ సుడాన్‌లోని డెమొక్రటిక్ ఆర్మీ కోబ్రా ఫ్యాక్షన్ అనే సాయుధ సంస్థ దాదాపు 12,000 మంది బాలబాలికలను బలవంతంగా తమ గ్రూపులో చేర్చుకుంది. అప్పటి నుంచి వారికి కఠిన శిక్షణ ఇస్తూ సైనికులుగా మార్చే పనిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వారికి విముక్తి కలిగించేందుకు పూనుకున్న యూనిసెఫ్.. అప్పటి నుంచి ఆ సంస్థతో పలు దఫాలుగా శాంతి చర్చలు జరిపింది. చర్చలు ఫలించడంతో విడతల వారిగా తమ వద్ద ఉన్న బాల సైనికులను సౌత్ సుడాన్ డెమొక్రటిక్ ఆర్మీ కోబ్రా ఫ్యాక్షన్ విడుదల చేస్తోంది. తాజాగా విడుదల చేసిన 250 మంది చిన్నారి సైనికుల్లో బాలికలు కూడా ఉన్నారు. విడుదలైన వారితో యూనిసెఫ్ బుధవారం ప్రత్యేకంగా బహిరంగ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో బాధితులైతున్న చిన్నారుల గురించే చర్చించనున్నారు. -
'స్వచ్ఛ భారత్' కు యూనిసెఫ్ ప్రశంస
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ పథకానికి యూనిసెఫ్ ప్రశంస లభించింది. అంతేకాదు ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు భారత ప్రభుత్వానికి అవసరమైన మద్దతు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అండదండలు అందిస్తామని యూనిసెఫ్ భారత్ ప్రతినిధి లూయిస్-జార్జెస్ ఆర్సెనాల్ట్ ప్రకటించారు. 'స్వచ్ఛ భారత్ పథకాన్ని స్వాగతిస్తున్నాం. దీనికి మా వంతు మద్దతు ఇస్తాం' అని లూయిస్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పరిసరాల పరిశుభ్రతపై భారతీయుల్లో చైతన్యం పెరుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
భారత్ లో77 శాతం యువతులపై లైంగిక హింస!
ఐక్యరాజ్యసమితి: భారతదేశంలోని టీనేజ్ ఆడపిల్లల్లో 77 శాతం మంది లైంగిక హింసకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఆడపిల్లల్లో 77 శాతం మంది తమ భర్త లేదా భాగస్వామి వల్ల బలవంతంగా లైంగిక చర్యలకు అంగీకరించాల్సి వస్తోందని వెల్లడించింది. వీరిలో సగం మంది తమ తల్లిదండ్రుల వల్ల శారీరక హింసకు గురవుతున్నారని పేర్కొంది. యునిసెఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ విషయాలను ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. చిన్నారులపై లైంగిక హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో పెళ్లైన ప్రతి ఐదుగురిలో ఒకరు భాగస్వాముల వల్ల లైంగిక వేధింపులకు గురవుతున్నారని వెల్లడించింది. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్‌ల్లో ఈ పరిస్థితి అధికంగా ఉందని పేర్కొంది. -
కేరళలో పెరుగుతున్న బాల్యవివాహాలు
కోల్కత్తా: కేరళ రాష్ట్రం అనగానే దేశంలో సంపూర్ణ అక్షరాస్యత, అత్యధిక విద్యావంతులు గల రాష్ట్రం అంటూ టక్కున చెప్పేస్తాం. కానీ అలాంటి రాష్ట్రంలో బాల్య వివాహాలు ఇటీవల కాలంలో అధికమవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో కేరళ రాష్ట్రంలో బాల్య విహహాలు జరిగిన దాఖలాలు లేవు.... కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బాల్య వివాహాలు సంఖ్య రోజురోజూకు పెరుగుతుందని భారత్‌లో యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రత్యేక అధికారి దొర గీస్టీ వెల్లడించారు. దేశంలోని కొన్ని మతాలు, తెగలలో బాల్య వివాహాలు సర్వసాధారణమని ఆమె గుర్తు చేశారు. అయితే దేశంలోని ఉత్తరాది ప్రాంతాల ప్రజలు దక్షిణాది రాష్ట్రాలకు వలస వస్తున్నారు. దాంతో కేరళకు వలస ప్రజల సంఖ్య మరింత పెరిగిందని చెప్పారు. దాంతో బాల్య వివాహాలు జరుగుతున్నాయని దోర గీస్టీ వివరించారు. సర్వే ప్రకారం బాల్య వివాహాలలో మొదటి స్థానం బీహార్ అక్రమించగా, చిట్ట చివరి స్థానాన్ని హిమాచల్ ప్రదేశ్ ఉందని చెప్పారు. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయని ఆమె తెలిపింది. పట్టణాలలో కంటే గ్రామాలలోనే బాల్యవివాహాల సంఖ్య అధికంగా జరుగుతుందని దోర గీస్టీ విశదీకరించారు. -
దాడుల్లో 469 మంది చిన్నారులు మృతి
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయిల్ దాడుల వల్ల గాజాలో గత 48 గంటల్లో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారని యూనిసెఫ్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ దాడుల వల్ల ఇప్పటి వరకు మొత్తం 469 మంది మరణించారని చెప్పారు. దాడులతో గాజాలో పరిస్థితి దారుణంగా తయారైందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులే కొనసాగితే స్థానికంగా ఉన్న చిన్నారులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. గాజాలో చిన్నారుల మిగలక పోయినా అశ్చర్యపడవలసిన పని లేనదని అన్నారు. దాడులతో తీవ్ర గాయాలవుతున్నవారి సంఖ్య కూడా అధికంగా ఉందని వివరించారు. -
మెడికల్ రిఫ్రిజిరేషన్‌లోకి గోద్రెజ్
న్యూఢిల్లీ: గోద్రేజ్ అప్లయెన్సెస్ సంస్థ మెడికల్ రిఫ్రిజిరేషన్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇంగ్లాండ్‌కు చెందిన ష్యూర్ చిల్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ రంగంలోకి అడుగిడుతున్నామని గోద్రేజ్ అప్లయెన్సెస్ సీఓఓ జార్జి మెనెజెస్ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ కల్లా వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం రెండు మోడళ్లను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఒకటి వంద లీటర్ల కెసాపిటీ ఉన్న మోడల్ అని, దీంట్లో 3,000 నుంచి 3,500 వరకూ వ్యాక్సిన్లను స్టోర్ చేసుకోవచ్చని, ధర రూ.1.35 లక్షల నుంచి రూ.1.5 లక్షల రేంజ్లో ఉంటుందని వివరించారు. మరొకటి 50 లీటర్ల కెపాసిటీ ఉన్న మోడల్ అని, దీంట్లో 1,500 నుంచి 1,750 వరకూ వ్యాక్సిన్లను స్టోర్ చేసుకోవచ్చని, ధర రూ.65,000 నుంచి రూ.75,000 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రిఫ్రిజిరేటర్లలో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్లను 8 నుంచి 10 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వ ఏజెన్సీలకు విక్రయించడం, ప్రైవేట్ రంగ ఆసుపత్రులు, ఫార్మసీ చెయిన్లు, బ్లడ్ బ్యాంకులు లక్ష్యాలుగా వీటిని అందిస్తామని పేర్కొన్నారు. ప్రారంభంలో ముంబైలోని విక్రోలి ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పుణేలో రూ. 30 కోట్ల పెట్టుబడులతో కొత్తగా నిర్మించే ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తామని జార్జి వివరించారు. -
వీరబాలికలకు పురస్కారాలు
ముంబై: బాల్యవివాహాలను ఎదురించి చిరుప్రాయంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచిన తొమ్మిది మంది మహారాష్ట్ర మారుమూల ప్రాంతాలకు బాలికలకు నవజ్యోతి పురస్కారాలు దక్కనున్నాయి. ఐక్యరాజ్య సమితి చిన్నారుల నిధి (యూనిసెఫ్) వీటిని అందజేయనుంది. సమాజంలో సానుకూల మార్పులు తెచ్చి, తోటివారికి ఆదర్శంగా నిలిచే బాలికలకు రాష్ట్రస్థాయిలో ఈ పురస్కారాలు అందజేస్తామని యూనిసెఫ్ ముంబై విభాగానికి చెందిన రాజేశ్వర్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. తమ జీవితాలను సమూలంగా నాశనం చేసే బాల్యవివాహాలను ధైర్యంగా అడ్డుకున్న చిన్నారుల వివరాలను ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. మావోయిస్టుల ప్రాబల్యం గల గడ్చిరోలి జిల్లాలోని కుగ్రామానికి చెందిన 15 ఏళ్ల సునితా వచామీకి ఐపీఎస్ అధికారి కావాలని ఆశ. పెళ్లి చేసుకోవడం లేదా మావోయిస్టుగా మారిపోవడం.. ఈ రెంటిలో ఏదోఒకదాన్ని ఎంచుకోవాలన్న కుటుంబ సభ్యుల సూచనను ఆమె తిరస్కరించింది. తాను చదువుకుంటానని స్పష్టం చేసింది. భామ్రాగఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సునిత ఇప్పుడు విద్యాభాస్యం చేస్తోంది. పర్భణిలోని కేదార్బస్తి వాసి, 10వ తరగతి విద్యార్థిని ఆశా టోండేది కూడా ఇదే కథ. తన అక్కలంతా బాల్యంలోనే పెళ్లి చేసుకొని పడుతున్న ఇబ్బందులతో చలించిన ఈ 16 ఏళ్ల యువతి మెజారిటీ వచ్చాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లోవాళ్లు తెచ్చిన పెళ్లిసంబంధాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించానని ఈ ఔత్సాహిక రెజ్లర్ తెలిపింది. వీరిలో కొందరు బాల్యవివాహాలను తిరస్కరించడమే కాదు.. తోటివారు కూడా ఈ ఊబిలో పడకుండా నిరోధించగలిగారు. జాల్నా జిల్లా నివ్దుంగా గ్రామవాసి, 17 ఏళ్ల మాధురి పవార్ తన గ్రామానికి రోడ్డు, బస్సు సదుపాయం కల్పించగలిగింది. గ్రామస్తుల పోరాటానికి నాయకత్వం వహించి జిల్లా అధికారులతో మాట్లాడడంతో ఆమె ఊరికి బస్సు మంజూరైంది. ఫలితంగా బాలికలంతా చదువుకోవడానికి పక్క గ్రామాలకు వెళ్తున్నారు. అంతేకాదు బాల్యవివాహం బారి నుంచి కూడా తప్పించుకున్నారని మాధురి సంతోషంగా చెప్పింది. యావత్మాల్ జిల్లా హివార్దారాకు చెందిన 18 ఏళ్ల రోష్నా మరాస్కోల్హే స్వయంగా తన వివాహాన్ని నిరోధించడమే కాదు అక్కడి బాలికలను కూడా బాల్యవివాహాల నుంచి రక్షించింది. కుటుంబ సభ్యులు గత ఏడాది తన పెళ్లి చేయడానికి యత్నించగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వరుడు జైలుపాలయ్యాడు. ఇలా ఒక్కొక్కరూ తమ జీవితాలను తాము సరిద్దుకోవడమేగాకుండా సమాజం నుంచి ఇంకా కనుమరుగవని బాల్య వివాహ వ్యవస్థను ధైర్యంగా ఎదుర్కొని, తమ తోటివారికి మంచి జీవితాన్నిచ్చారు. తల్లిదండ్రులను ఆలోచింపజేశారు. -
యూనిసెఫ్ ప్రచారకర్తగా సచిన్
-
యూనిసెఫ్ ప్రచారకర్తగా సచిన్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవలే వీడ్కోలు తీసుకున్న సచిన్ టెండూల్కర్- యూనిసెఫ్ దక్షిణాసియా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. రెండేళ్ల పాటు అతడీ హోదాలో కొనసాగుతాడు. ఈ హోదాలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాల్లో సచిన్ పాల్గొననున్నాడు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లో యూనిసెఫ్ ప్రతినిధి కరీన్ హల్షోఫ్ నుంచి సచిన్ నియామకపత్రం స్వీకరించాడు. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సచిన్ ఈ సందర్భంగా అన్నాడు. -
యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్
ముంబై: యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల నిధి) బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. దక్షిణాసియా విభాగానికి సచిన్ ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు యూనిసెఫ్ గురువారం ప్రకటించింది. పిల్లల హక్కులతో పాటు వారి పౌష్టికాహారం అంశాలపై ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం వివిధ దేశాల నుంచి సెలబ్రిటీలు ఎంపిక కాగా, ఈ సంవత్సరం భారత్ నుంచి సచిన్ ఎంపికయ్యాడు. యూనిసెఫ్ తరుపున రెండు సంవత్సరాల పాటు సేవలు అందించేందుకు సచిన్ సన్నద్ధమయ్యాడు. తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. క్రికెట్ కెరీర్‌ను ముగించిన అనంతరం తన రెండో ఇన్నింగ్స్ నుఈ రకంగా ఆరంభించడం చాలా ఆనందంగా ఉందన్నాడు. దేశంలోని 36 శాతం మంది సురక్షితమైన మరుగుదొడ్లు లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. సామాన్యునికి కనీస అవసరమైన మరుగుదొడ్లపై సరైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరమన్నాడు. ఈ అంశాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టతరమైందిగా పేర్కొన్నాడు. శక్తి సామర్థ్యల మేర తనకు లభించిన ఈ అవకాశానికి వంద శాతం న్యాయం చేస్తానని సచిన్ తెలిపాడు చాలా కుటుంబాల్లో పిల్లల అవసరాల్ని తీర్చడంలో తల్లి కీలక పాత్ర పోషింస్తుదన్నాడు. పిల్లల విసర్జించిన మల మూత్రాల గురించి దేశంలోని చాలా మంది తల్లులకు సరైన అవగాహన లేక వారి ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందన్నాడు. పిల్లల మల మూత్రాలను తీసివేసిన అనంతరం తల్లులు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని అందించకూడదన్నాడు. చిన్నారులు బంగారు భవిత ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్లే భారంగా మారుతుందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశాడు. రకరకాల వ్యాధులతో ప్రతీరోజూ 1600 పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని మాస్టర్ తెలిపాడు.