కాలుష్యం కోరల్లో 200 కోట్ల మంది పిల్లలు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది పిల్లలు అత్యంత ప్రమాదకర కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వారిలో ఏటా ఆరు లక్షల మంది పిల్లలు కేవలం కాలుష్యం కారణంగా మరణిస్తున్నారని, వారంతా ఐదేళ్ల ప్రాయం లోపు పిల్లలేనని యునిసెఫ్ సంచలన ప్రకటన చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకన్నా ఆరేడు రెట్లు కాలుష్యం ఎక్కువున్న ప్రాంతాల్లో పిల్లలు నివసిస్తున్నారని, ఈ ప్రాంతాలు ఎక్కువగా దక్షిణాసియా దేశాల్లోనే ఎక్కువగా ఉన్నాయని యునిసెఫ్ వెల్లడించింది.
కాలుష్యం కారణంగా ఆస్తమా, గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చి పిల్లలు మృత్యువాత పడుతున్నారని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. శిలాజ ఇంధనాలు ఉపయోగించే వాహనాల నుంచి, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కాలుష్యానికి తగులబెడుతున్న చెత్తా చెదారం, ధూళి తోడవడంతో కాలుష్యం తీవ్రమవుతోందని పేర్కొంది. బయటి వాతావరణ కాలుష్యానికి ఎంత మంది పిల్లలు బలవుతున్నారో అంచనా వేయడానికి యునిసెఫ్ మొట్టమొదటి సారిగా శాటిలైట్ చిత్రాలను ఉపయోగించింది.
దక్షిణాసియా దేశాల్లో 62 కోట్ల మంది పిల్లలు కాలుష్యం బారిన పడుతుంటే వారిలో ఎక్కువ మంది ఉత్తర భారతానికి చెందిన వారేనని యునిసెఫ్ పేర్కొంది. ఆఫ్రికాలోని కాలుష్య ప్రాంతాల్లో 52 కోట్ల మంది పిల్లలు నివసిస్తున్నారని తెలిపింది. తూర్పు ఆసియా దేశాల్లో మరో 45 కోట్ల మంది పిల్లలు కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారట. కాలుష్యం కారణంగా పిల్లలు మృత్యువాత పడడమే కాకుండా వారి ఊపిరితిత్తులు, మెదడు ఎదగక పోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని యునిసెఫ్ హెచ్చరించింది.
పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే వాతావరణం కాలుష్యాన్ని అరికట్టాల్సిందేనని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని యునిసెఫ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. సాధారణంగా చలికాలంలో వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుందని, వీచే గాలులు తగ్గిపోవడం, చెత్తా చెదారాన్ని తగులబెట్టడం ఎక్కువవడం వల్ల అలా జరుగుతుందని తెలిపింది.