ఐక్యరాజ్యసమితి: అదేమి అరికట్టలేని భయంకరమైన వ్యాధి కాదు. చికిత్స లేని ప్రాణాంతకమైన జబ్బు కూడా కాదు. కానీ భారత్ మాత్రం ఆ వ్యాధిని నియంత్రించడంలో చతికిలపడిపోతోంది. అదే న్యుమోనియా. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే ఈ వ్యాధి సోకి ఐదేళ్లలోపు వయసు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా ప్రతీ 39 సెకండ్లకు ఒక చిన్నారి ఉసురు తీస్తున్నట్టు యూఎన్ అధ్యయనంలో వెల్లడైంది.
2018లో న్యుమోనియా వ్యాధి సోకి ఎందరు చిన్నారులు బలయ్యారో యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను సేకరించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అయిదేళ్లలోపు చిన్నారులు అత్యధికంగా న్యుమోనియో సోకి మరణిస్తున్నారు. ఆ దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉండడం ఆందోళన పుట్టిస్తోంది. 2018లో ప్రపంచ దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 8 లక్షల మందికి పైగా న్యూమోనియా వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయారు. మొదటి నెలలోనే ప్రాణాలు కోల్పోయిన పసివారు లక్షా 53 వేలుగా ఉంది.
పేదరికమే కారణం
అసలు న్యుమోనియా అన్న వ్యాధి ఉందన్న సంగతి కూడా ఎన్నో దేశాలు మర్చిపోయిన వేళ హఠాత్తుగా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత పెరగడంపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయిదేళ్ల కంటే తక్కువ వయసున్న వారి మృతుల్లో 15 శాతం న్యుమోనియా కారణంగా నమోదవుతున్నాయని చెప్పింది. పేదరికానికి, ఈ వ్యాధికి గల సంబంధాన్ని కొట్టి పారేయలేమని పేర్కొంది. సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు తక్కువ సంఖ్యలో ఉండడం, పౌష్టికాహార లోపాలు పెరిగిపోవడం, కాలుష్యం కాటేయడం వంటివి న్యుమోనియా పెరిగిపోవడానికి కారణాలుగా యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది.
న్యుమోనియా మరణాల్లో ఆ దేశాలే టాప్
న్యుమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో సగానికి పైగా అయిదు దేశాల్లోనే నమోదవుతున్నాయి. నైజీరి యా, భారత్, పాకిస్తాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా దేశాలే దీనికి బాధ్యత వహించాలని యూఎన్ వెల్లడించింది
గత ఏడాది మృతుల సంఖ్య
నైజీరియా 1,62,000
భారత్ 1,27,000
పాకిస్తాన్ 58,000
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 40,000
ఇథియోపియా 32,000
న్యుమోనియానూ ఎదుర్కోలేకపోతున్నాం
Published Sat, Nov 16 2019 3:44 AM | Last Updated on Sat, Nov 16 2019 5:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment