న్యూఢిల్లీ: భారత్‌కు ముడిచమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి రష్యా రెండో స్థానానికి చేరింది. మే నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి 25 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను కొనుగోలు చేసినట్లు గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం చమురు దిగుమతుల్లో ఇది 16 శాతం పైగా ఉంటుంది. సముద్రమార్గంలో భారత్ చేసుకునే మొత్తం దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చే ఉత్పత్తుల వాటా ఏప్రిల్‌లో తొలిసారిగా 5 శాతానికి చేరింది.
2021 సంవత్సరం ఆసాంతం, 2022 తొలి త్రైమాసికంలోనూ ఇది 1 శాతం కన్నా తక్కువే నమోదైంది. ప్రస్తుతం భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాక్ అగ్రస్థానంలో ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు రష్యా భారీ డిస్కౌంటుపై చమురు సరఫరా చేస్తోంది. గతంలో రవాణా చార్జీల భారం కారణంగా రష్యా చమురును భారత్ అంతగా కొనుగోలు చేయలేదు. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు ఆకాశాన్నంటుతున్న తరుణంలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుని రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment