న్యూఢిల్లీ: వర్షాకాలంలో డిమాండ్ తగ్గిన నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. ఆగస్టులో 7 నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇంధనాల కార్గో ట్రాకింగ్ సంస్థ వర్టెక్సా గణాంకాల ప్రకారం రష్యా నుంచి భారత్ గత నెలలో రోజుకు 1.46 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. ఇది అంతక్రితం నెలలో రోజుకు 1.91 బీపీడీగా నమోదైంది. రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు తగ్గడం ఇది వరుసగా మూడో నెల. ఇతర దేశాల నుంచి కూడా భారత్ చమురు దిగుమతులను తగ్గించుకుంది.
ఇరాక్ క్రూడ్‌ను 8,91,000 బీపీడీ నుంచి 8,66,000 బీపీడీకి, యూఏఈ ఆయిల్‌ను 2,90,000 బీపీడీ నుంచి 2,73,000 బీపీడీకి, అమెరికా క్రూడ్‌ను 2,19,000 బీపీడీ నుంచి 1,60,000 బీపీడీకి తగ్గించుకుంది. అయితే, సౌదీ అరేబియా నుంచి మాత్రం పెంచుకుంది. జులైలో సౌదీ అరేబియా నుంచి క్రూడాయిల్ దిగుమతులు జులైలో 4,84,000 బీపీడీగా ఉండగా ఆగస్టులో 8,20,000 బీపీడీకి పెరిగాయి. ‘పలు రిఫైనింగ్ సంస్థలు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్లాంట్ల మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నాయి. దీంతో క్రూడాయిల్ దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. అయితే క్యూ4లో పండుగ సీజన్ వల్ల దేశీయంగా డిమాండ్ పెరిగితే ముడి చమురు దిగుమతులు పుంజుకోగలవు‘ అని వర్టెక్సా అనాలిసిస్ హెడ్ (ఆసియా పసిఫిక్) సెరెనా హువాంగ్ తెలిపారు.
గతేడాది ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌కు మార్కెట్ రేటు కన్నా చౌకగా క్రూడాయిల్‌ను రష్యా ఆఫర్ చేసింది. అప్పటివరకు భారత్ దిగుమతి చేసుకునే మొత్తం క్రూడాయిల్ వాటా 2 శాతం లోపే ఉండేది. ఆ తర్వాత పరిణామాలతో ఇది ఏకంగా 33 శాతానికి ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment