గత డిసెంబర్ నెలలో రష్యా నుంచి భారత్ చమరు దిగుమతులు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. అంతేకాదు వరుసగా భారత్‌కు చమురు దిగుమతి చేస్తున్న ప్రధాన తొలి దేశంగా రష్యా నిలిచింది.
దేశాల మధ్య జరిగే ఎగుమతులు- దిగుమతుల్ని ట్రాక్ చేసే సంస్థ వోర్టెక్సా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. తొలిసారి గతేడాది డిసెంబర్ నెలలో రోజుకు 1 మిలియన్ బ్యారెల్స్ రష్యా భారత్‌కు సరఫరా చేయగా.. ఆ మొత్తం 1.19 మిలియన్ బీపీడీ (బ్యారెల్స్ పర్ డే)కి చేరినట్లు తెలుస్తోంది.
పెరిగిపోతున్న దిగుమతి
రష్యా నుంచి భారత్‌కు క్రూడాయిల్ దిగుమతులు నెలనెలా పెరిగిపోతున్నట్లు వోర్టెక్సా హైలెట్ చేసింది. అక్టోబర్ నెల మొత్తంలో మాస్కో (రష్యా రాజధాని) నుంచి 935,556 క్రూడాయిల్ బ్యారెల్స్ దిగుమతి చేయగా..నవంబర్ నెలలో 909,403 క్రూడాయిల్ బ్యారెల్స్ ఉన్నాయి. కాగా, గతంలో భారత్‌కు రష్యా 2022 జూన్ నెలలో అత్యధికంగా 942,694 బీపీడీలు దిగుమతి చేసింది.
టాప్‌లో రష్యా
ఇతర దేశాల నుంచి భారత్ సముద్ర మార్గానా ఆయిల్ బ్యారెల్స్‌ను దిగుమతి చేసుకుంటుంది. అయితే రవాణాపై ఈయూ, అమెరికా దేశాలు పరిమితులు విధించాయి. దీంతో భారత్ రష్యా నుంచి భారీ ఎత్తున ఆయిల్ బ్యారెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఆయిల్ దిగుమతుల్లో మూడో స్థానం
పెట్రోల్, డీజిల్ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. అవసరాల దృష్ట్యా భారత్ 85 శాతం ఇతర దేశాల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఆ క్రూడాయిల్‌ను శుద్ది చేసి పెట్రోల్, డీజిల్‌గా మార్చి అమ్మకాలు జరుపుతుంది.
ఇతర దేశాల నుంచి బ్యారెల్స్ దిగుమతులు
ఇక రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు వోర్టెక్సా పేర్కొంది. గత డిసెంబర్ నెలలో ఇరాక్ నుంచి 803,228 బ్యారెల్స్, సౌదీ అరేబియా నుంచి 718,357 బ్యారెల్స్‌ను దిగుమతి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (uae) అమెరికాను అధిగమించి భారత్‌కు క్రూడాయిల్‌ను సరఫరా చేసే నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించింది. డిసెంబర్లో 323,811 బ్యారెల్ చమురును భారత్‌కు విక్రయించింది. కానీ యూఎస్ నుంచి భారత్‌కు సరఫరా అయ్యే క్రూడాయిల్ తగ్గుతుంది. నవంబర్‌లో 405,525 బ్యారెల్స్ ఉండగా డిసెంబర్‌లో 322,015 బ్యారెల్స్‌కు చేరింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని పశ్చిమ దేశాలు వ్యతిరేకించాయి. మాస్కోతో వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉన్నాయి. భారత్ మాత్రం రష్యాతో సన్నిహితంగా ఉంటూ.. క్రూడాయిల్ దిగుమతుల్లో రికార్డులు నమోదు చేస్తోంది.
ఉక్రెయిన్ దాడికి ముందు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ నుంచి 60శాతం కంటే ఎక్కువగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవగా, ఉత్తర అమెరికా నుంచి 14శాతం, పశ్చిమ ఆఫ్రికా నుంచి 12శాతం, లాటిన్ అమెరికా నుంచి 5శాతం, రష్యా నుంచి కేవలం 2శాతం మాత్రమే దిగుమతి చేసుకుంది.ఇప్పుడు రష్యా నుంచి దిగుమతులు చేసుకునే క్రూడాయిల్ బ్యారెళ్ల సంఖ్య రికార్డులు దాటుతున్నాయి.
60 డాలర్లు మాత్రమే
జలమార్గాన సరఫరా అవుతున్న రష్యా చమురు ధరపై ఐరోపా సమాఖ్య పరిమితి విధించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కో బ్యారెల్ ధర ఇప్పుడు భారత్‌కు 60 డాలర్ల కంటే తక్కువకే దొరుకుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి భారత్ దిగుమతుల్ని మరింత పెంచిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
జైశంకర్ దౌత్యం
రష్యాకు భారత్ మద్దతు ఇచ్చే విషయంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశంతో వ్యాపారం చేసేందుకు ఇతర దేశాలు వ్యతిరేకిస్తుంటే.. భారత్ మాత్రం గట్టిగా సమర్ధిస్తోంది. చమురు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో అక్కడ నుంచి సరఫరా చేసుకోవాలని నిర్ణయించుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతుల వస్తున్న విమర్శల్ని జై శంకర్ తిప్పికొట్టారు.
రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి అర్థం చేసుకోండి. ఇది మనం ఒక దేశం నుండి చమురును కొనుగోలు చేయడం మాత్రమే కాదు. ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తాం. కానీ భారతీయ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మనకు అనువైన దేశాలతో ఒప్పందం చేసుకోవడం సరైన విధానం. ఇప్పుడు మనం అదే చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment