డాల్ఫిన్ పరికరం
సాక్షి, విద్యారణ్యపురి(వరంగల్) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని కస్తూర్బాగాంధీ బాలికలు మాట్లాడే బొమ్మలతో కూడిన పుస్తకాలు, మాట్లాడే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొంత కాలం క్రితమే మాట్లాడే ఈ పుస్తకాలు కేజీబీవీలకు చేరగా తాజాగా డాల్ఫిన్ పరికరాలు అందాయి. వీటి వినియోగం, ఉపయోగాలపై హన్మకొండలోని డీఈఓ కార్యాలయంలో కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు యునిసెఫ్ రాష్ట్ర సలహాదారు సదానంద్ శిక్షణ ఇచ్చారు.
యూనిసెఫ్ ఆధ్వర్యంలో..
2006 సంవత్సరంలో యూనిసెఫ్ ‘స్విస్’ ప్లస్ కార్యక్రమం కింద విద్యార్థుల్లో మార్పు కోసం మాట్లాడే వంద రకాల పుస్తకాలను రూపొందించింది. ఇందులో పర్యావరణ సమస్యలు, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ, బాలికల సమస్యలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, బాలల హక్కులు తదితర అంశాలు ఉంటాయి. పల్లెల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలను సులభశైలిలో చెప్పేలా ఉంటాయి.
వీటిని చదివితే వారిలో తప్పకుండా మార్పు వస్తుందనటంలో సందేహం లేదు. దీంతో విద్యార్థు«ల్లో చైతన్యం మార్పు వస్తుందని యూనిసెఫ్ సలహాదారు సదానంద్, అర్బన్ జిల్లా సెక్టోరియల్ అధికారి డి.రమాదేవి అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాల్లో ఉన్న అంశంపై ప్రత్యేకంగా రూపొందించిన డాల్ఫిన్ రూపంలో పరికరాన్ని ఉంచడం ద్వారా ఆ కథనం బయటకు వినిపిస్తుంది.
విద్యార్థుల్లో చైతన్యం.. జీవన నైపుణ్యాలు
కేజీబీవీల్లోని 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు మాట్లాడే పుస్తకాల్లోని అంశాలు చైతన్యం కలిగిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 63 కేజీబీవీలు ఉండగా.. మాట్లాడే పుస్తకాలు అందజేసిన అధికారులు తాజాగా డాల్ఫిన్ పరికరాలను కేజీబీవీకి ఒక్కటి చొప్పున పంపిణీ చేశారు. అలాగే జిల్లాకో ప్రభుత్వ పాఠశాలకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారని సమాచారం.
కొంచెం నవ్వండి బాబు, సైలెంట్ హీరోస్, పని మంతురాలు ప్రతిమ, సిల్లీ సాంబయ్య, బిల్లీగోట్ వంటిç కథనాలతో కూడిన పుస్తకాలు ఉన్నాయి. చదువులో కొత్త విధానంతో మరింతగా మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment