శిథిలాల దిబ్బగా మారిన ఇరాక్‌లోని మోసుల్ సిటీ నుంచి వలసవెళ్తున్న చిన్నారులు (ఫైల్)
పాఠశాలల్లో, ఆట మైదానాల్లో హాయిగా గడవాల్సిన బాల్యం కొన్ని దేశాల్లో యుద్ధోన్మాదుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోతోంది. ఉద్రిక్తతలు ఉండే కొన్ని ప్రాంతాల్లోని చిన్నారులు యుద్ధ సమస్యల్లో చిక్కుకుని నలిగిపోతున్నారు. తీవ్రవాదులు, సైనిక పక్షాలు పిల్లలను బాల సైనికులుగా, ఆత్మాహుతిదళ సభ్యులుగా, మానవకవచాలుగా మారుస్తున్నాయి. ఆడపిల్లలు తీవ్రమైన లైంగిక దాడులను, పీడనను ఎదుర్కొంటు న్నారు. చిన్నవయసులోనే వారంతా లైంగిక బానిసలుగా మారుతున్నారు. ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాల్లోని సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది.
తీవ్రవాద గ్రూపుల కబంధహస్తాల్లో చిక్కుకున్న కొందరు పిల్లలు అక్కడి నుంచి బయటపడ్డాక భద్రతా బలగాల చేతుల్లో పడి మరోసారి అణచివేతకు, వేధింపులకు గురవుతున్నారు. యుద్ధ ఛాయలు కనిపిస్తున్న మరికొన్ని ప్రదేశాల్లోని చిన్నారులు తిండి, నీళ్లు, పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలకు నోచుకోక పోషకాహార లోపంతో రోగాల బారిన పడుతున్నారు. ఈ పిల్లల పాలిట 2017 క్రూరమైన ఏడాదిగా నిలుస్తోందని యూనిసెఫ్ తాజా నివేదిక ఆందోళన వెలిబుచ్చింది.
అంతర్జాతీయ మానవ తా విలువలు, పిల్లల హక్కులకు ఏమాత్రం విలువనివ్వ కుండా ఒకవైపు సైన్యం, మరోవైపు సాయుధ సైనిక ముఠాలు వ్యవహరిస్తున్న తీరును యూనిసెఫ్ తప్పుబట్టింది. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాదాపు మూడుకోట్ల మంది పిల్లలు బలవంతంగా బడులకు దూరమైనట్లు తెలిపింది. ‘ఈ దేశాల్లోని పిల్లలు ఇళ్లు, పాఠశాలలు, ఆటస్థలాలు ఇలా అన్ని చోట్ల దాడులకు, క్రూరమైన హింసకు గురవుతున్నారు. ప్రతి ఏడాదీ ఈ దాడులు పెరగడం. ఇది ఎంతమాత్రం మంచిది కాదు’ అని యూనిసెఫ్ అత్యవసర కార్యక్రమా ల డైరెక్టర్ మాన్యువల్ చెప్పారు.
దారుణాలివీ...
► నైజీరియా, ఛాద్, నైజర్, కేమరూన్‌లలో విస్తరించి ఉన్న ‘బోకో హరం’ ఉగ్రవాద సంస్థ 2016 కంటే 2017లో అయిదు రెట్లు ఎక్కువగా పిల్లలను ఆత్మాహుతి దళాలుగా మార్చింది.
► తిరుగుబాటు ద్వారా సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్‌లో బోకోహరం ఆధిపత్యంపెరిగాక ఎంతోమంది పిల్లలు హత్యాచారాలకు గురయ్యారు. బలవంతంగా సాయుధ ముఠాల్లో చేర్చారు.
► కాంగోలో రాజకీయ, సాయుధ హింస కారణంగా 8.5 లక్షల మంది పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు.
► సోమాలియాలో 2017 అక్టోబర్ కల్లా 1800 మంది పిల్లలను సాయుధగ్రూపుల్లో చేర్చుకున్నారు. దక్షిణ సూడాన్‌లో 19 వేల మంది పిల్లలు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నారు.
► మూడేళ్ల అంతర్గత సంక్షోభం కారణంగా యెమెన్‌లో 5,000 మంది అమాయక చిన్నారులు మరణించారు. 18 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
► ఇరాక్, సిరియాలో పిల్లలు మానవకవచాలుగా ఉపయోగపడుతున్నారు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌లో 700 మంది పిల్లలు చనిపోయారు
► రోహింగ్యాల పిల్లలను ఒక క్రమపద్ధతిలో మయన్మార్ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ఆ దేశంలోని సగానికి పైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయేలా అక్కడి ప్రభుత్వం దాడులు, హింసాకాండకు దిగింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment