జీవితంలో పైకి రావాలంటే..?!
జీవన గమనం
నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. ఉద్యోగ రీత్యా ‘స్వయం సంఘాల్లో’ మాట్లాడాల్సి ఉంటుంది. కానీ మాట్లాడలేకపోతున్నాను. ఈ భయాన్ని పోగొట్టుకోవడం ఎలా?
- జె.రామ్, మెయిల్
మెదడులో ఉత్పన్నమయ్యే నెగెటివ్ కార్టిజాల్ వల్ల స్టేజ్ ఫియర్ కలుగుతుంది. ఇది మొదట్లో నాకూ ఉండేది. చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా దీన్ని అధిగమించవచ్చు.
1. మీరు మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏమిటో క్షుణ్నంగా ఆలోచించి పెట్టు కోండి. చెప్పదలుచుకున్నది (కొన్నాళ్లు) పాయింట్లుగా రాసుకుని మనసులో పెట్టుకోండి. ‘మీమీద మీకున్న నమ్మకం’ కార్టిజాల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
2. కొంతమంది ఇచ్చిన సమయానికి చాలా రెట్లు ఎక్కువ మాట్లాడతారు. వినే వాళ్ల సహనాన్ని పరీక్షించవద్దు. మీరు చెప్ప దలుచుకున్నది అవతలివారికి అర్థమ య్యేలా ఎంతసేపు మాట్లాడితే చెప్పగల రన్న విషయాన్ని అంతేసేపు మాట్లాడండి.
3. బాడీ లాంగ్వేజ్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఎదురుగా ఉన్నవాళ్లందరినీ చూస్తూ మాట్లాడండి. ఒకరిమీదే దృష్టి నిలపవద్దు.
4. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింటు హితం, ప్రియం..! చెప్ప దలుచుకున్నదాన్ని సీరియస్‌గా చెప్పాలా, కామెడీగా చెప్పాలా అనేది వినే ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుంది.
ఈరకంగా నాలుగైదుసార్లు మాట్లా డిన తర్వాత మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది. మరింత ఉత్సాహం వస్తుంది. భమిడిపాటి రాధాకృష్ణగారి నాటకం ‘కీర్తిశేషులు’లో ‘అవిగో వినరా చప్పట్లు. అవే గదరా ఆకలిగొన్న కళా జీవికి పంచభక్ష్య పరమాన్నాలు’ అని ఒక డైలాగ్ ఉంది. ఆ విధంగా కాలక్రమేణా మీరు మంచి వక్త అవుతారు. బెస్టాఫ్ లక్.
జీవితంలో పైకి రావాలంటే ఏమి చెయ్యాలో సింపుల్‌గా చెప్పండి సార్.
- రంగారావు, అనంతపూర్
భగవద్గీతని చదివి ఆచరించాలి. ఇంత కన్నా సింపుల్‌గా చెప్పటం కష్టం. పిల్లి అంటే మార్జాలం అన్నట్టు ఉన్నదా? కాస్త వివరంగా చర్చిద్దాం. అసలు జీవితంలో పైకి రావటం అంటే ఏమిటి? ఆరోగ్యం బాగా చూసుకుంటూ, డబ్బు సంపాదన, కీర్తి సంపాదన, ఆర్థికపరమైన సుఖానికి లోటు లేకుండా, వీలైనన్ని తక్కువ సమస్యలతో; దానం, దయ, గాఢమైన ఆత్మీయ సంబంధాలతో, జీవితపు ఆఖరి రోజువరకూ ఉత్సాహం కోల్పోకుండా, జ్ఞానం పెంచుకుంటూ గడపటం. అంతేగా..!
బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమ ఆశిం చటం నుంచీ, వృద్ధాప్యంలో వారిని బాగా చూసుకోవటం వరకూ చేసే జీవన పయనం కూడా విజయమే. మరోలా చెప్పాలంటే, ‘అజ్ఞానం’ నుంచి ‘ప్రజ్ఞానం’ వరకూ పయనించటమే విజయం. ఈ ప్రయాణాన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను.
ఒక కుర్రవాడు ఆడుతూ పాడుతూ బాల్యం గడిపేస్తాడు (అమాయకత్వం). విద్యార్థి దశలో ‘ఇంగ్లిష్ ఆవశ్యకత’ని గుర్తించడు (అజ్ఞానం). డిగ్రీ పూర్తయ్యేసరికి ఏదోలా మ్యానేజ్ చేయగల ననుకుంటాడు (విశ్వాసం). నాలుగైదు ఇంటర్వ్యూల తరువాత దాని ప్రాముఖ్యత తెలుస్తుంది (జ్ఞానం). కోచింగ్ సెంటర్‌లో చేరి భాషా సామర్ధ్యాన్ని పెంచుకుని ఉద్యోగం సంపాదిస్తాడు (పరిజ్ఞానం). అద్భుతంగా మాట్లాడలేకపోయినా, మ్యానేజ్ చేయగలుగుతాడు (అభ్యాసం). బయట కూడా ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతూ దానికి అలవాటుపడిపోతాడు (విజ్ఞానం). ఆ విధంగా ఆంగ్లంలో అద్భుతమైన ప్రావీణ్యత సాధిస్తాడు (ప్రజ్ఞానం).
నేను ఒక కంపెనీలో ప్రొడక్షన్ ఇన్‌చార్జిని. ఎంత శ్రద్ధగా పని చేసినా పై వారి నుంచి మెచ్చుకోలు లేదు. పని శ్రద్ధగా చేయాలన్నది నా విశ్వాసం. దాన్ని వాళ్లు ఆలస్యం అంటారు. ఏం చేయాలో తెలియట్లేదు.
- శేఖర్, నల్లకుంట
మీరు తయారుచేసే ప్రొడక్ట్ ఏమిటో చెప్పలేదు. ఒక పనిని ఫలవంతంగా చేయటం వేరు, సమర్థవంతంగా చేయటం వేరు. కిలో మైదాపిండితో ఒక గంటలో వంద కేకులు తయారుచేయడం ఫల వంతం (ఎఫీషియెన్సీ). ఒక రోజుపాటు శ్రమపడి ఎవరూ చేయలేనంత అద్భు తంగా ఒక కేకు తయారు చేయడం సమర్థ వంతం (ఎఫెక్టివ్‌నెస్). ఏ పని సమర్థ వంతంగా చేయాలి, దేన్ని ఫలవంతంగా చేయాలి అన్నది తెలుసు కోవడమే వృత్తిలోను, వ్యాపారంలోను విజయం.
దురదృష్టవశాత్తూ మనం ఫలవంతంగా చేయవలసిన పనిని సమర్థవంతంగాను, సమర్థవంతంగా చేయవలసిన చోట ఫలవంతంగానూ చేసి పేరు పోగొట్టు కుంటూ ఉంటాం. ఈ ఇబ్బంది నాకు కూడా ఉంది. కర్త, కర్మ, క్రియల్ని మాటిమాటికీ అటూ ఇటూ మార్చడం, రాసినదాన్నే మళ్లీ మళ్లీ చెక్కడం వగైరా! అవసరం లేకపోయినా ఈ విధంగా మెరుగులు దిద్దేవారిని ‘పెరఫెక్షనిస్టులు’ అంటారు. కొన్ని వృత్తులకి ఇది పనికి రాదు. మీరు మీ పై అధికారుల చెప్పుల్లో కాళ్లు పెట్టి ఆలోచిస్తే, మీ పొరపాటు ఎక్కడుందో తెలుస్తుంది.
- యండమూరి వీరేంద్రనాథ్