ఈ వయసులో... అవసరమా?
జీవన గమనం
నేను ఇంటర్ చదువుతున్నాను. నాతో పాటే కాలేజీలో చేరిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియదు. అయితే, ఆమె నన్ను ప్రేమిస్తోందని నా క్లాస్‌మేట్స్ చెబుతున్నారు. అలాగని ఆమెకు ప్రపోజ్ చేయాలంటే భయంగా ఉంది. దీనివల్ల చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. సలహా చెప్పండి.
- ఫయాజ్, ఈ-మెయిల్
ముందు మీ స్నేహితుల ద్వారా మీ ప్రేమని వ్యక్తపరచండి. ఆ అమ్మాయి ఒప్పుకున్నట్లయితే మీరు వెళ్లి కలవండి. ఒక వేళ నిరాకరించినట్టుగా మాట్లాడితే... నాకేమీ సంబంధం లేదు, మా స్నేహితులే ఆటపట్టించటానికి అలా అన్నారని తప్పించుకోండి. అయితే మరో విషయం. ఇప్పుడు మీరు ఇంటర్‌లో ఉన్నారు. జీవితం ఎటు వెళ్లాలో నిర్ధారించుకోవలసిన ఈ వయసులో, ఈ ప్రేమలు అవసరమా? ఒకసారి ఆలోచించుకోండి.
నేను పీహెచ్‌డీ స్కాలర్‌ని. ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమె బీఎస్సీ చేసింది. ఆమె ఒప్పుకుంటే తన ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. తనకు ఈ విషయం చెబితే ముందు తనకు ఇష్టం లేదని చెప్పింది. దాంతో నేను నిరాశలో పడ్డాను. తను నిరాకరించినా నేను నా ప్రయత్నం మానుకోలేదు. ఒకరోజు నేనంటే తనకు ఇష్టమేనని చెప్పింది. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అయితే, మా కులాలు వేరు. తను వాళ్ల ఇంట్లో ఇంకా విషయం చెప్పలేదు. చెప్పినా వాళ్లు ఒప్పుకుంటారా అనేది అనుమానమే. అలాగని ఇద్దరం ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేం. ఈ పరిస్థితిలో ఏం చేయాలి?
- శివ, మదనపల్లె
భయం సమస్య కాదు. బలహీనత. భయం వల్ల వచ్చేది సమస్య..! పిల్లలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించకుండా దాచటానికి కారణం భయం. చాలా విషయాల్లో మనం కూడా అలాగే ప్రవర్తిస్తుంటాం. ఇది నేటి సమస్యని రేపటికి వాయిదా వేసేలా చేస్తుందే తప్ప సమస్యకు పరిష్కారం చెప్పదు. మీరు కూడా వెళ్లి అడిగి చూడండి. వాళ్లు కాదంటే ఏమి చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం.
నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. చిన్నప్పట్నుంచీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ విషయం ఎప్పుడూ తనకు చెప్పలేదు. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. తను కూడా నాతో చాలా బాగా మాట్లాడుతుంది. కానీ నేను తనని ప్రేమించినట్టుగా తను నన్ను ప్రేమిస్తుందో లేదో మాత్రం నాకు తెలీదు. పోనీ నేనే ప్రపోజ్ చేద్దామంటే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయమేస్తోంది. ఎటూ తేల్చుకోలేక మిమ్మల్ని సలహా అడుగుతున్నాను.
- జ్యోతిప్రకాశ్, మెయిల్
అజ్ఞాతవాసం ముగించి ధర్మరాజు తిరిగి తన రాజ్యానికి వెళ్లబోతున్న సమయంలో, ముందు రోజు, ఒక బిచ్చగాడు బిక్షం అడిగాడట. రేపు రా! అన్నాడట ధర్మజుడు. అది విని భీముడు ఒక డప్పు తీసుకొని కొండపై కెక్కి నాలుగు దిక్కులు వినపడేలా ‘సత్యవంతుడు నా అన్నయ్య తొలిసారి అబద్ధం చెప్పాడు’ అని గట్టిగా అరిచాడట. అతడి చాటింపు అర్థం కాని ధర్మరాజు వివరణ అడిగితే భీముడు ఇలా అన్నాడట. ‘‘అన్నా! రేపటి వరకూ ఆ బిచ్చగాడు బతికుంటాడో లేదో నీకు తెలియదు. నీవు ఉంటావో లేదో అతడికి తెలియదు. మనం వెళ్లాక రాజ్యం దక్కుతుందో లేదో మనకు తెలియదు. రాజ్యం వచ్చాక కూడా నీ మనసు ఇటువంటి దయాగుణంతో ఉంటుందో లేదో ఎవరికీ నమ్మకం లేదు. అయినా నువ్వు ఈ వాగ్దానం చేశావంటే, అది అనృతం కాక మరేమిటి?’’
ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. మీరు లైఫ్‌లో సెటిలయ్యే సరికి మీ మనసులో ఆ అమ్మాయి పట్ల ఇంకా అంత ప్రేమ ఉంటుందో లేదో మీకు తెలియదు. మీరు పూలదండ పట్టుకు వెళ్లేసరికి అప్పటికింకా ఆ అమ్మాయి అవివాహితగానే ఉంటుందో లేదో ఆమెకు తెలియదు. ఇంకో కుర్రాడి ప్రేమలో పడకుండా ఉంటుందో లేదో మనకు నమ్మకం లేదు. కాబట్టి, మీరు మీ ప్రేమ భావాన్ని వెంటనే వెళ్లి ఆ అమ్మాయికి చెప్పండి. అయితే దానికి ముందు మీరు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసుకోండి:
మీ పెద్దలు, ఆమె పెద్దలు మీ వివాహానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోక పోయినా మీరు వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారా? అలా చేసుకుంటే ఇంజినీరింగ్ చదివే మీకు, సంసారం నిలబెట్టేటంత ఆర్థిక స్తోమత ఉందా? లేక మీ కాళ్ల మీద నిలబడే వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి తిని, ప్రేమ విషయం రహస్యంగా ఉంచి, ఆ తర్వాత వాళ్లు కాదంటే, ఎదిరించి వెళ్లి పోదామని అనుకుంటున్నారా? అది అన్నింటికన్నా నీచమైనది.
- యండమూరి వీరేంద్రనాథ్