నేనది తట్టుకోలేక పోతున్నాను...
జీవన గమనం
నేను పీజీ చేస్తున్నాను. నాకొక వివాహితతో పరిచయం అయ్యింది. తనకి మూడేళ్ల బాబు ఉన్నాడు. బాబు పుట్టగానే భర్త చనిపోయాడట. వాళ్ల పుట్టింట్లో ఉంటోంది. అనుకోకుండా నాకు దగ్గరైంది. వాళ్ల ఇంట్లోవాళ్లు తనకి వేరే సంబంధం చూస్తున్నారు. కానీ ఆమె చేసుకోనంటోంది. అలా అని నేను తనని చేసుకోలేను. మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోరు. ఆ విషయం చెబితే పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు, నీ కోసం బతుకుతాను అంటోంది. వేరే అమ్మాయిని చేసుకో, తనతో కాపురం చెయ్యి, కానీ నాతో మాట్లాడుతూ ఉంటే చాలు అంటోంది. తనకి నేనంటే చాలా ఇష్టం. నాక్కూడా తనంటే చాలా ఇష్టం. ఆమె నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టదని నాకు నమ్మకం ఉంది. అయినా ఏదో భయం. నేనేం చేయాలి?
- వివరాలు రాయలేదు
మొదటిరాత్రి మీ భార్య తన జీవితానికి సంబంధించిన ఇదే సంఘటన మీతో చెప్పి, ఆయన చాలా మంచివారు. భార్య పోయింది. అనుకోకుండా నాకు దగ్గరయ్యారు. మనల్ని ఇబ్బంది పెట్టరు. నువ్వు వేరే అబ్బాయిని చేసుకో, తనతో కాపురం చెయ్యి అని ప్రోత్సహించారు. నేను కేవలం ఆయనతో మాట్లాడుతూ ఉంటే చాలట... అని చెప్తే, మీకు ఎలా ఉంటుందో అలోచించండి. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
నేను డిగ్రీ చదివాను. పోలీస్ అవ్వాలన్నది నా లక్ష్యం. కానిస్టేబుల్ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యాను. ట్రెయినింగ్‌కు కూడా వెళ్లాను. నెల రోజుల తర్వాత మెడికల్ టెస్ట్ జరిగినప్పుడు నాకు కిడ్నీ సమస్య ఉందని తేలింది. దాంతో రిజెక్ట్ చేశారు. చాలా బాధేసింది. ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. కానీ ఎక్కువ కష్టపడకూడదని డాక్టర్స్ అంటున్నారు. దాంతో ఇక పోలీస్ అవ్వలేనని అర్థమైంది. నా లక్ష్యం దెబ్బ తినేసింది. నేనది తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడేళ్లుగా ఇదే పరిస్థితి. ఏ చేయమంటారు?
- నందు, కాకినాడ
ఈ ఏడు సంవత్సరాలూ డిప్రెషన్ లోనే ఉన్నారా? బాధపడుతూ కూర్చుంటే వయసు పైబడిపోతుంది కదా. అద్భుతంగా ఆపరేషన్లు చేసే డాక్టరుకి అకస్మాత్తుగా నరాలు వణికే వ్యాధి వస్తే ఏం చేస్తాడు? ఒక గమ్యం చేరటం అసాధ్యమని తెలిసినప్పుడు, గమ్యాన్ని మార్చుకోవటం తప్ప మరో మార్గం ఏమున్నది? పోలీసు ఉద్యోగంలో మీకు ఏ ఆకర్షణ కనపడిందో, అవే లక్షణాలున్న మరో వృత్తి ఎన్నుకోండి.
ఒకరు తన స్నేహితుణ్ని డిన్నర్‌కి పిలిచి, తిరిగి వెళ్తూండగా టార్చిలైట్ ఇచ్చాడట. ‘‘ఇదెందుకు? నాకు రాత్రిళ్లు కళ్లు కనపడవు కదా’’ అంటూ ఆ స్నేహితుడు బాధపడ్డాడు.
‘‘ఇది నీకోసం కాదు మిత్రమా! ఎదుటి వ్యక్తి నిన్ను గుర్తించటానికి...’’ అన్నాడు హోస్టు.
అతిథి ఆ టార్చి తీసుకుని వీధిలో వెళ్తూ వుండగా ఒక సైకిలిస్టు ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. ‘‘నా చేతిలో టార్చి కనపడటం లేదా? నేను గుడ్డివాడిని’’ అని అతడు కోపంగా అరిచాడు.
ఆ మాటలకి కన్‌ఫ్యూజ్ అయిన సైకిలిస్టు ‘‘అయ్యో! క్షమించండి. కానీ... మీరు టార్చి ఆన్ చెయ్యలేదు’’ అన్నాడట. ప్రతీ మనిషిలోనూ ఒక టార్చి వుంటుంది. తనలోని టార్చిలైటుని వెలిగించి, ఆ వెలుగులో తన గమ్యాన్ని గుర్తించటమే ఆత్మపరిశీలన.
నా వయసు 25. మావాళ్లు మాకు తెలిసిన కుటుంబంలోని అబ్బాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అతను యూఎస్‌లో ఉంటాడు. చాలా మంచివాడు. అతణ్ని చేసుకోవడం నాకూ ఇష్టమే. కానీ నేను యూఎస్‌లో ఉండగలనా లేదా అన్నదే నాకు భయం. అందుకే చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. కానీ తెలిసినవాళ్ల అబ్బాయి, మంచివాడు, తనని వదిలేసుకుంటే అలాంటి మంచి సంబంధం మళ్లీ దొరకదు అని ఇంట్లోవాళ్లు అంటున్నారు. నాకూ నిజమే అనిపిస్తోంది. కానీ భయంగా ఉంది. ఏం చేయమంటారు?
- ఓ సోదరి
కేవలం భయంతో మాత్రం వదులుకోవద్దు. కొన్ని భయాలు నిర్హేతుకాలు. నా మిత్రుడు చాలా పెద్ద మ్యూజిక్ డెరైక్టర్. విమానం ఎక్కడమంటే భయం. లండన్‌లో రికార్డింగ్‌కి భయపడి అసిస్టెంట్‌ని పంపాడు. కారణం లేని భయాల వల్ల అవకాశాలని పోగొట్టుకోకూడదు కదా. కొంతమంది అమెరికా సంబంధం అంటే కారూ ఇల్లూ ఉంటుందనీ, అత్తగారూ ఆడపడుచుల తాకిడి ఉండదని, ఎగిరి గంతేస్తారు.
మరి కొందరికి దగ్గర వాళ్లనీ, పుట్టిన ప్రాంతాన్నీ వదిలి దూర దేశాల్లో స్థిరపడటం; తమ సంతానాన్ని తమ తల్లిదండ్రులకి స్కైప్ లో పరిచయం చేయడం ఇష్టం ఉండదు. ఆర్థిక ఉన్నతి కోసం, తరువాతి తరాల భవిష్యత్ కోసం ఆ మాత్రం త్యాగం తప్పదని వాదిస్తారు మరి కొందరు. ఎవరి అభిప్రాయాలు వారివి. మీరు ఎటువైపు మొగ్గుతారో లోతుగా అలోచించుకోండి. కేవలం కొత్త వాతావరణంలో ఇమడలేను అన్న భయం వల్ల వివాహం మానుకోవద్దు.
- యండమూరి వీరేంద్రనాథ్