లవ్వా... లక్ష్యమా... తేల్చుకునేదెలా?! | Yadamuri solutions | Sakshi
Sakshi News home page

లవ్వా... లక్ష్యమా... తేల్చుకునేదెలా?!

Published Sun, May 1 2016 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

లవ్వా... లక్ష్యమా... తేల్చుకునేదెలా?!

లవ్వా... లక్ష్యమా... తేల్చుకునేదెలా?!

జీవన గమనం
నేను ఎంబీబీఎస్‌కి లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం అయింది. అప్పటి నుంచీ తనతో మాట్లాడుతూనే ఉన్నాను. నాకు తెలియ కుండానే తన మీద ఇష్టం పెరిగిపోయింది. ఒక్కరోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేక పోతున్నాను. దాంతో చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఇలా అయితే నా లక్ష్యం దెబ్బ తింటుందేమోనని భయంగా ఉంది. తనతో మాట్లాడకుండా బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి?                                                                               
 - రాజేశ్, మెయిల్

 
ఇంటర్మీడియెట్ అంటే ల్యాటిన్ భాషలో ‘ఇన్-ది-మిడిల్’ అని అర్థం. విద్యార్థి జీవితం ఒక రైలు ప్రయాణం అనుకుంటే, ఇంటర్ ‘విజయవాడ ప్లాట్‌ఫామ్’ లాంటిది. అక్కడికి చాలా రైళ్లు (ఆకర్షణలు, అలవాట్లు) వస్తాయి. ‘సెల్లు, టీవీ’ నుంచి ‘ప్రేమ, మందు’ వరకూ రకరకాల ఆకర్షణలున్న రంగురంగుల బండి ఎక్కితే, అది మిమ్మల్ని జెసైల్మీరు ఎడారికి తీసుకెళ్లి దింపుతుంది. పదివేల రూపాయల జీతానికి స్థిరపడి అక్కడితో సంతృప్తిపడాలి. మంచి స్నేహితులు, పుస్తకాలూ ఉన్న బండి కాశ్మీరు ఉద్యానవనానికి తీసుకెళ్తుంది. ఏ రైలు ఎక్కుతారు?
 
ముక్కు, ముఖం తెలియని అమ్మాయితో ప్రేమలో పడటం... మీరన్నట్టు అది ప్రేమ కాదు, ఇష్టం. మరో భాషలో చెప్పాలంటే ఆకర్షణ. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘‘ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను’’ అని పాట కూడా రాశారు. మీ లక్ష్యం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా? చదువుకోవడమా? ఒకవేళ పెళ్లి చేసుకోవడమే అయితే ఇప్పుడేనా? అయిదేళ్లు పోయాకా? అప్పటివరకు ఆ అమ్మాయి మీకోసం ఆగుతుందా! వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అసలిన్ని గొడవలు కావాలా!
నేనేదో ప్రశ్న అడిగితే చాట భారతం రాస్తున్నాడేంటి అనుకోకండి. మీ ప్రశ్న ఆఖరి వాక్యంలోనే సమాధానం ఉంది. చదువుకోండి.

నేను మొదట్నుంచీ బాగా చదివేదాన్ని. జీవితంలో బాగా స్థిరపడి అమ్మానాన్నలకు పేరు తేవాలి అనుకునేదాన్ని. ఇంత వరకూ అన్నీ అను కున్నట్టుగానే జరిగాయి. కానీ తర్వాత నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సీఏలో చేర్పించారు. అయినా ఎలాగో కష్టపడేదాన్ని. నాన్న కోసమైనా బాగా చదవాలని ప్రయత్నించేదాన్ని. కానీ నా వల్ల కాలేదు. ఫెయిలైపోయాను. దాంతో తిరిగి డిగ్రీలో చేరాను. కానీ నా జూనియర్స్‌తో కలిసి డిగ్రీ చదవాలంటే బాధగా ఉంది. డిప్రెస్ అయిపోయాను. అంతలో పెళ్లి సంబంధాలు చూశారు. నన్ను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి నా ఫ్రెండ్. తనకు దూరం అవ్వడం ఇష్టం లేక పెళ్లి వద్దన్నాను. దాంతో అన్నిటికీ  ఆ అమ్మాయే కారణం అంటూ అమ్మ నా ఫ్రెండ్‌ను తిట్టింది. అది తట్టుకోలేక పెళ్లికి ఒప్పేసుకున్నాను. కానీ ఎందుకో మనసంతా అలజడిగా ఉంది. నాకిష్టం లేనివే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ఈ బాధను నేను ఎలా అధిగమించాలి?                                          
 - హరిత, ఊరు రాయలేదు

 
ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు, జరుగుతున్నవాటిని ఇష్టంగా చేసుకోవటాన్ని ‘పాజిటివ్ థింకింగ్’ అంటారు. నేను చదువుకునే రోజుల్లో, నాకూ ఇదే సమస్య ఎదురైంది. నాకు లెక్కలు చాలా ఇంట్రెస్ట్. జువాలజీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇంట్లో వాళ్ల బలవంతం మీద సైన్స్‌లో చేరాను. కానీ ఎంత బాగా చదివినా, మెడిసిన్లో సీట్ సంపా దించలేకపోయాను. అదృష్టవశాత్తూ కామర్సుతో డిగ్రీ చదివి, ఆ తర్వాత నాలుగేళ్ల సీఏ కోర్సును కేవలం మూడేళ్లలోనే పూర్తి చేశాను.
 
మన అభిరుచి పెద్దలు అర్థం చేసుకోలేక పోతే వచ్చే సమస్య 90 శాతం కుటుంబాల్లో ఉన్నదే! ఇక పోతే మీ జూనియర్స్‌తో కలిసి చదవాలనే బాధ మీకు ఎక్కువగా ఉంటే, ప్రైవేటుగా చదివే వెసులుబాటు ఉన్నదేమో ఆలోచించండి.
 
ఇక తర్వాతి సమస్య... మీ వివాహం. భవిష్యత్తులో మీరు వివాహం చేసుకుంటారా లేదా అనేది వేరే విషయం కానీ, కేవలం స్నేహితురాలికి దూరమవుతానన్న భయంతో వివాహం వద్దనుకుంటున్న మీ ఆలోచన మాత్రం అంత ఆరోగ్యమైనది కాదు. కొంత కాలానికి మీ ఫ్రెండ్ కూడా పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది కదా! కేవలం స్నేహితురాలి గురించి వివాహం మానుకోకండి. కొన్ని వాస్తవాల్ని భరించక తప్పదు. మీకు వివాహం చేసుకోవాలనే కోరిక ఉండి, అబ్బాయి నచ్చితే చేసుకోండి. లేదూ ఇంకా చదువుకోవా లనుంటే ప్రైవేట్‌గా మీ చదువును కొనసా గించండి. అదీ కాకపోతే, వివాహం చేసుకుని ఆ తర్వాత చదువును కొనసాగించండి. ఎందు కంటే... చదువుకు, వయసుకు సంబంధం లేదు.
 - యండమూరి వీరేంద్రనాథ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement