ఆమెను మర్చిపోలేక పోతున్నాను...
జీవన గమనం
మూడేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏడాది కిందట ప్రపోజ్ చేస్తే తను అప్పటికే వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు చెప్పింది. అయితే, ఆమెను మర్చిపోలేక పోతున్నాను. తను లేకపోతే జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. ఆమెను కన్విన్స్ చేయాలా? మర్చిపోవాలా? అర్థం కావట్ల్లేదు. పరిష్కారం చెప్పండి.
- ప్రసాద్, హైదరాబాద్
ప్రేమ గుడ్డిదా? కాదు. నిజమైన ప్రేమ నాలుగు వైపులా చూస్తుంది. ఆకర్షణ మాత్రమే గుడ్డిది. కేవలం గుడ్డిదే కాదు. మూగది, చెవిటిది, పిచ్చిది కూడా..! ఆకర్షణ బలమైనది. ఎక్కడలేని శక్తీ ఇస్తుంది. ఒకరి మీద ఆకర్షణ ఎందుకు కలుగుతుందో ఏ సైకాలజిస్ట్ వివరించలేరు. మరెవరినో ప్రేమించిన అమ్మాయిని ప్రేమించారు. మీది ప్రేమే అయితే నిశబ్దంగా ప్రేమిస్తూ ఉండండి. ఆకర్షణ అయితే అంతకన్నా బలమైన మరో ఆకర్షణలో పడండి. కౌన్సెలింగ్‌కి వెళ్లేముందు.. 1. నా సమస్యకు పరిష్కారం ఉందా, 2. ఆ పరిష్కారం నాకు తెలుసా లేక ఇంకొకరి సలహా కావాలా, 3. వారిచ్చిన సలహా నేను అమలు జరపగలనా... అన్న మూడు విషయాలు ఆలోచించుకోవాలి.
నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. మా ఎండీకి నేనంటే అసలు పడదు. మా కొలీగ్స్ నా మీద చెప్పే చాడీలు నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండానే నన్ను అనవసరంగా వేధిస్తుంటాడు. నాకు ఒక పాప ఉంది. జాబ్ మానేసే పరిస్థితుల్లో లేను. దయచేసి మంచి సలహా చెప్పగలరు.
- అరుణ్‌కుమార్, హైదరాబాద్
వింధ్యారణ్య ప్రాంతంలో పులులు గుంపులుగా వచ్చి ఆవుల్నీ, గేదెల్నీ పొట్టన పెట్టుకుంటున్నప్పుడు, గిరిజనులు వెళ్లి ద్రోణాచార్యుణ్ని శరణు వేడారు. ముందుగా ఆయన ధర్మరాజును పంపాడు. అతడు వెళ్లి కొన్నిటిని చంపి, మిగతా వాటిని పారద్రోలాడు. గిరిజనులు సంతోషించారు కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నెల తిరిగేసరికి ఆ క్రూర మృగాలు మరింత పెద్ద గుంపుగా వచ్చి గ్రామం మీద పడ్డాయి. ఈ సారి ద్రోణుడు భీముణ్ని పంపాడు.
అతడి ఆయుధం ప్రపంచంలోకెల్లా గొప్ప ఆయుధాల్లో ఒకటైన గద..! అయితే అది చురుకైన పులుల మీద ఏ ప్రభావమూ చూపించలేక పోయింది. అప్పుడు అర్జునుణ్ని పంపగా, అతను వెళ్లి తన విలువిద్యా నైపుణ్యంతో అన్ని పులుల్నీ చంపి వచ్చాడు. అయితే ఏడాది తిరిగేసరికి యవ్వనంతో బలసిన తరువాతి తరం పులులు గ్రామం మీద భయంకరంగా దాడి చేశాయి. ద్రోణుడు ఈసారి ఆఖరి ఇద్దర్నీ పంపించాడు. నకులసహదేవులు వెంటనే రంగంలోకి దిగలేదు. ముందు గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
గ్రామం చుట్టూ కందకాలు తవ్వించే పని నకులుడు చేపడితే, సహదేవుడు పులులతో ఎలా యుద్ధం చేయాలో గ్రామస్థులకు నేర్పి సంసిద్ధం చేశాడు. ఈసారి పులులు దండెత్తినప్పుడు గ్రామస్థులే ధైర్యంగా ఎదుర్కొని ఏ మాత్రం ప్రాణ నష్టం లేకుండా వాటిని తరిమికొట్టారు. తిరిగివచ్చిన నకులసహదేవుల్ని ‘‘ఇది నిశ్చయంగా మీ విజయం’’ అంటూ ద్రోణుడు పొగిడాడు. ఈ కథ రెండు సూత్రాల్ని చెబుతుంది.
1. ఒక సమస్య తాలూకు కొమ్మల్ని కత్తిరిస్తే, తాత్కాలిక విజయం దొరుకుతుందేమో తప్ప పరిష్కారం దొరకదు. మీలో మీరు ఎంతకాలం ఇలా కుమిలిపోయినా పరిష్కారం దొరకదు. సమస్య మీలో ఉందా? చెప్పుడు మాటలు వినే అలవాటు ఉన్న మీ బాస్‌లో ఉందా అన్నది ముందు శోధించండి. మీ బాస్‌లో ఉంటే సమయం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నం చెయ్యండి. మీలో ఉంటే మీ వీక్ పాయింట్లను సరిదిద్దుకోండి.
2. సమస్యని ఎదుర్కోవడానికి ముందు దాన్ని నిశితంగా పరిశీలించి, ఏ ఆయుధం వాడాలో తెలుసుకుంటే మీ సమస్య సగం తీరినట్టే. మన ఆయుధం ఎంత గొప్పదైనా, అది సమస్యను పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన లాభం లేదు. కాస్త లౌక్యం నేర్చుకుని, మీ యజమానికి దగ్గరవటానికి ప్రయత్నం చెయ్యండి.
- యండమూరి వీరేంద్రనాథ్