Pace of life
-
తార్కిక ఆలోచన ముఖ్యం
సమస్య చిన్నదైనా... పెద్దదైనా... పరిష్కరించుకోవడానికి వ్యక్తిత్వమూ, తార్కిక ఆలోచనా ముఖ్యం. వ్యక్తిత్వం పెంచుకునే కొద్దీ బాధల నుంచి బయటపడొచ్చు జీవన గమనం ఈ శీర్షికలో ప్రశ్నలు చూస్తూ ఉంటే... ఇంత చిన్నచిన్న సమస్యల కోసం మనుషులు ఇంత వేదన అనుభవిస్తున్నారా అనిపిస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది ఇంతకన్నా పెద్ద సమస్యలతో బాధపడుతున్నారు. వాటికి పరిష్కారాలు చెబితే బాగుంటుందని నా ఉద్దేశం. - సోమశేఖర్, విశాఖపట్నం ఎవరి సమస్య వారికి పెద్దగానే తోస్తుంది. పద్నాలుగేళ్ల అమ్మాయి ప్రేమ సమస్య మనకు నవ్వు తెప్పించవచ్చు. అరవయ్యేళ్ల వృద్ధురాలికి మనవడితో ఆర్థిక సమస్య మనకి అసలు సమస్యే కాదనిపించవచ్చు. నల్లగా ఉన్నాను కాబట్టి పెళ్లి కావటం లేదన్న యువతి సమస్య మనకు చిన్నదిగా కనిపించవచ్చు. ‘‘సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. పరిష్కరించుకోవడానికి వ్యక్తిత్వమూ, తార్కిక ఆలోచనా ముఖ్యం. వ్యక్తిత్వం పెంచుకునే కొద్దీ ఇలాంటి బాధల నుంచి బయటపడొచ్చు’’ అని మోటివేట్ చెయ్యడమే ఈ శీర్షిక ఉద్దేశం. అయిదు నిమిషాల్లో చర్మ సౌందర్యాన్ని మార్చే క్రీముల బారి నుంచి, తాయెత్తు కట్టి కష్టాల నుంచి బయటకు తప్పిస్తాము... మంత్రం చదివి డబ్బు రెట్టింపు చేస్తాము అనే బాబాల బారి నుంచి రక్షించేదే వ్యక్తిత్వం. నేను ఎమ్.బి.ఏ చేశాను. పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నలభై వేలకు పైనే వస్తోంది. ఉద్యోగంలో చేరిన వెంటనే నా ఇంటర్ క్లాస్మేట్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. జీతం నాకంటే చాలా తక్కువ. దానికి నేనేం బాధపడటం లేదు. మొదట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ ఈ మధ్య తను లోలోపల కుమిలిపోతున్నాడని అనిపిస్తోంది. తనకంటే నాది మంచి ఉద్యోగం అని, ఎక్కువ జీతం అని చాలాసార్లు అనేస్తుంటాడు. అది మామూలుగా అనడం లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఇది మా ఇద్దరి మధ్య గ్యాప్‌ను పెంచుతుందేమో అని కూడా భయంగా ఉంది. తన మనసులో నుంచి ఆ ఫీలింగ్‌ను ఎలా తీసేయాలి? - ఉష, రాజమండ్రి మీ భర్త మనస్తత్వం ఎటువంటిది? సున్నిత మనస్కుడా? లేక ప్రాక్టికల్‌గా ఆలోచించేవాడా? అతడు ఎలాంటి వాడైనా, ముందు అతని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను పోగొట్టాలి. అంతకన్నా ముఖ్యంగా ముందు మీరు మీ బాధనీ, భయాన్నీ తనకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అతడు ప్రాక్టికల్ అయితే, ‘‘నాకన్నా నీకు జీతం తక్కువని నువ్వు బాధపడుతున్నావ్! నేనేం చేయాలో నువ్వే చెప్పు. ఉద్యోగం మానేయనా?’’ అనండి. కంగారుపడి వద్దు వద్దంటాడు. అతడు బాగా సున్నిత మనస్కుడైతే, ఒక పది రోజుల పాటు ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లండి. హాయిగా గడపండి. మెల్లిగా మీ భావాలను తనతో పంచుకోండి. ‘తన కన్నా మీ జీతం ఎక్కువన్న కారణం వల్ల మీరు కూడా బాధపడుతున్నారు’ అన్న సంగతిని అతనికి తెలిసేలా చేయండి. పనిలో పనిగా... (ప్రేమ వివాహం అంటున్నారు కాబట్టి) డబ్బు లేకపోవటం వల్ల వచ్చే కష్టనష్టాల గురించి కూడా అతనితో డిస్కస్ చేయండి. అతడు మీ బాధను, మీలో జరిగే సంఘర్షణను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కాబట్టి, మీ బాధను తప్పకుండా తీర్చడానికి ప్రయత్నిస్తాడు. ఖాళీగా ఉండి అనవసరపు ఆలోచనలతో సతమతమవ్వకుండా, తీరిక వేళల్లో ఏదైనా హాబీ పెంపొందించుకునేలా ప్రోత్సహించండి. చిత్రలేఖనం నుంచి పత్రికలకు వ్యాసాలు రాయటం వరకు ఏదైనా కావొచ్చు. ఏ మంచి హాబీ లేనివాళ్లకు నిరాశాపూరితమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఏమో ఎవరు చెప్పొచ్చారు... అతడి హాబీనే అతన్ని ఆర్థికంగా ఉన్నత శిఖరాల మీద నిలబెట్టవచ్చేమో! -
ఫ్రెండ్సే... కానీ...
జీవన గమనం నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మూడేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం చాలాకాలంగా ఫ్రెండ్స్. అందువల్ల ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతున్నాను. ఆమె చాలామంది జులాయి అబ్బాయిలతో తిరగడం నేను కళ్లారా చూశాను. అయినా ఆమెను ప్రేమించడం మానుకోలేక పోతున్నాను. ఆమె వాళ్లతో తిరగడం తట్టుకోలేక పోతున్నాను. ఏం చేయాలో చెప్పండి. - సురేశ్, హైదరాబాద్ మనకు దొరకనిది ఎప్పుడూ బాధగానే ఉంటుంది. మోహం ఎక్కువైతే, అది వ్యామోహం అవుతుంది. ఎనిమిదో క్లాసులో ఉండగా ప్రేమలో పడ్డ మీరు, ఏ గమ్యం ఊహించి ప్రేమిస్తున్నారు? కేవలం తిరగడం (ఈ పదం మీరు వాడిందే) కోసం అయితే, మీరు నచ్చకే కదా ఆమె మీతో తిరగటానికి ఒప్పుకోవడం లేదు. లేకపోతే పెళ్లి చేసుకుందామని ప్రేమిస్తే మాత్రం, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే భార్య అయిన తర్వాత తిరిగితే మరింత బాధ కదా. ఇలా పాజిటివ్‌గా ఆలోచించండి. జీవితంలో పైకి వస్తే, మిమ్మల్నే బోలెడు మంది ప్రేమిస్తారు. ఐన్‌స్టీన్ నుంచి అబ్దుల్ కలాం దాకా అందరూ ప్రేమించబడ్డారు. నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. నా వయసు 23 ఏళ్లు. డిగ్రీ తర్వాత అక్వాఫార్మాలో పని చేశాను. రెండేళ్లుగా వాళ్ల షాప్‌లో అకౌంట్స్ చూస్తున్నాను. కారణం మా ఇంట్లో వాళ్లు ఆ షాప్ వాళ్లకు అప్పు ఉండటం. అది ఇప్పుడు తీరిపోయింది. ఇప్పుడు నాకు మార్కెటింగ్‌లో జాబ్ వచ్చింది. మంచి జీతం కూడా. చేయగలనన్న నమ్మకం కూడా నాకుంది. అయితే, మా ఇంట్లో వాళ్లకు అది ఇష్టం లేదు. షాప్‌లో పని చేయమని పోరుపెడుతున్నారు. ఎంత చెప్పినా వినడం లేదు. ఇన్నాళ్లూ వాళ్లకు నచ్చినట్లు ఉన్నాను. ఇక నుంచైనా నాకు నచ్చినట్లు ఉండాలనుకుంటు న్నాను. వాళ్లు మాత్రం ‘నువ్వు మా కంట్రోల్లోనే ఉండాలి. బయటకు వెళితే మా మాట వినవు’ అంటున్నారు. జీవితంలో ఇలా బతకాల్సిందేనా? ఏం చేయాలో మీరే సలహా ఇవ్వండి. - రాకేశ్, నెల్లూరు ఒక చక్కటి సాయంత్రం మీరొక నావలో వ్యాహ్యాళి వెళ్తున్నారనుకుందాం. మీతో పాటు కుళ్లిన శవం ఒకటి ప్రవాహంతో పాటూ వస్తోంది. భరించలేని దుర్గంధంతో ఉన్న ఆ శవం నుంచి దూరంగా వెళ్దామనుకున్నారు. ప్రవాహవేగంతో మీరూ వేగంగా ముందుకుపోతారా? ఎదురు తెడ్డు వేసుకుంటూ వెనక్కి పయనిస్తారా? ఏది ఎక్కువ శ్రమతో కూడిన వ్యవహారం? ఈ ప్రశ్నకి రోవింగ్‌లో ఎంతో అనుభవం ఉన్నవారూ, నీటి మీద తరచూ ప్రయాణాలు చేసేవారు కూడా తప్పుడు సలహా ఇస్తారు. వేగంగా... ప్రవాహంతో పాటూ ముందుకు వెళ్లి పోవటమే మంచిదని అంటారు. విజ్ఞులు మాత్రం ముందుకు వెళ్లినా, వెనక్కి వెళ్లినా ఒకే శ్రమ అంటారు. నీటికి ఎదురు తెడ్డు వేసుకుంటూ వెళ్లాలంటే రెట్టింపు బలం అవసరం. చిత్రమేమిటంటే ముందుకు వెళ్లాలన్నా ‘రెట్టింపు శ్రమతోనే’ తెడ్డు వేయాలి. ఎందుకంటే, ప్రవాహశక్తి శవానికి, పడవకూ ఒకటే. ప్రవాహవేగంతో శవం కూడా మనతో ప్రయాణం చేస్తోంది...! అది తెలుసుకోవటమే విజ్ఞత. మరేం చెయ్యాలి? చుక్కాని ఉంటే, కాస్త దిశ మార్చి పట్టుకోవాలి. తెరచాప ఉంటే గాలివాటం చూసుకోవాలి. అప్పుడు ప్రవాహమే మనల్ని దుర్గంధానికి దూరంగా తీసుకెళ్తుంది. ఇదే జీవితసూత్రం. ఈ సూత్రం తెలియని వారు దుర్గంధంతో పాటు పయనిస్తూ, తెడ్డు ఎంత వేగంగా వేసినా ఫలితం రాలేదని వాపోతారు. ఇష్టం లేని షాపులో పని కొనసాగించమని మీ పెద్దలు ఎందుకు చెబుతున్నారు? అప్పు తీరిపోయింది కదా. దానివల్ల వారికిగానీ, మీకు గానీ ఏం లాభం? మీకు మంచి ఉద్యోగం వచ్చిందంటున్నారు. దానికి వారు ఎందుకు అడ్డుపడుతున్నారు? కొత్త ఉద్యోగం అంటే వారి నుంచి మీరు దూరంగా వెళ్లాలా? అది వారికి ఇష్టం లేదా? మార్కెటింగ్ అంటే బాగా తిరగాలా? అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వారి భయమా? ఇంట్లో వారికి మనపై ఉండే ప్రేమలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. కానీ వారు ఇచ్చే సలహాలు కేవలం ప్రేమతో/ స్వార్థంతో కూడుకున్నవా? తర్కంతో కూడుకున్నవా? అన్నది మనం ఆలోచించుకోవాలి. మన జీవితం మనది కదా. అయితే, మీ పెద్దవాళ్లు ఎందుకు వద్దంటున్నారో క్లియర్‌గా తెలుసుకోండి. మీ వాదనలు వినిపించండి. వారి వాదనలు వినండి. అప్పుడు లాభనష్టాలు బేరీజు వేసుకొని మీ నిర్ణయంతో వారిని ప్రభావితం చేయండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
ఆమెను మర్చిపోలేక పోతున్నాను...
జీవన గమనం మూడేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏడాది కిందట ప్రపోజ్ చేస్తే తను అప్పటికే వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు చెప్పింది. అయితే, ఆమెను మర్చిపోలేక పోతున్నాను. తను లేకపోతే జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. ఆమెను కన్విన్స్ చేయాలా? మర్చిపోవాలా? అర్థం కావట్ల్లేదు. పరిష్కారం చెప్పండి. - ప్రసాద్, హైదరాబాద్ ప్రేమ గుడ్డిదా? కాదు. నిజమైన ప్రేమ నాలుగు వైపులా చూస్తుంది. ఆకర్షణ మాత్రమే గుడ్డిది. కేవలం గుడ్డిదే కాదు. మూగది, చెవిటిది, పిచ్చిది కూడా..! ఆకర్షణ బలమైనది. ఎక్కడలేని శక్తీ ఇస్తుంది. ఒకరి మీద ఆకర్షణ ఎందుకు కలుగుతుందో ఏ సైకాలజిస్ట్ వివరించలేరు. మరెవరినో ప్రేమించిన అమ్మాయిని ప్రేమించారు. మీది ప్రేమే అయితే నిశబ్దంగా ప్రేమిస్తూ ఉండండి. ఆకర్షణ అయితే అంతకన్నా బలమైన మరో ఆకర్షణలో పడండి. కౌన్సెలింగ్‌కి వెళ్లేముందు.. 1. నా సమస్యకు పరిష్కారం ఉందా, 2. ఆ పరిష్కారం నాకు తెలుసా లేక ఇంకొకరి సలహా కావాలా, 3. వారిచ్చిన సలహా నేను అమలు జరపగలనా... అన్న మూడు విషయాలు ఆలోచించుకోవాలి. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. మా ఎండీకి నేనంటే అసలు పడదు. మా కొలీగ్స్ నా మీద చెప్పే చాడీలు నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండానే నన్ను అనవసరంగా వేధిస్తుంటాడు. నాకు ఒక పాప ఉంది. జాబ్ మానేసే పరిస్థితుల్లో లేను. దయచేసి మంచి సలహా చెప్పగలరు. - అరుణ్‌కుమార్, హైదరాబాద్ వింధ్యారణ్య ప్రాంతంలో పులులు గుంపులుగా వచ్చి ఆవుల్నీ, గేదెల్నీ పొట్టన పెట్టుకుంటున్నప్పుడు, గిరిజనులు వెళ్లి ద్రోణాచార్యుణ్ని శరణు వేడారు. ముందుగా ఆయన ధర్మరాజును పంపాడు. అతడు వెళ్లి కొన్నిటిని చంపి, మిగతా వాటిని పారద్రోలాడు. గిరిజనులు సంతోషించారు కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నెల తిరిగేసరికి ఆ క్రూర మృగాలు మరింత పెద్ద గుంపుగా వచ్చి గ్రామం మీద పడ్డాయి. ఈ సారి ద్రోణుడు భీముణ్ని పంపాడు. అతడి ఆయుధం ప్రపంచంలోకెల్లా గొప్ప ఆయుధాల్లో ఒకటైన గద..! అయితే అది చురుకైన పులుల మీద ఏ ప్రభావమూ చూపించలేక పోయింది. అప్పుడు అర్జునుణ్ని పంపగా, అతను వెళ్లి తన విలువిద్యా నైపుణ్యంతో అన్ని పులుల్నీ చంపి వచ్చాడు. అయితే ఏడాది తిరిగేసరికి యవ్వనంతో బలసిన తరువాతి తరం పులులు గ్రామం మీద భయంకరంగా దాడి చేశాయి. ద్రోణుడు ఈసారి ఆఖరి ఇద్దర్నీ పంపించాడు. నకులసహదేవులు వెంటనే రంగంలోకి దిగలేదు. ముందు గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గ్రామం చుట్టూ కందకాలు తవ్వించే పని నకులుడు చేపడితే, సహదేవుడు పులులతో ఎలా యుద్ధం చేయాలో గ్రామస్థులకు నేర్పి సంసిద్ధం చేశాడు. ఈసారి పులులు దండెత్తినప్పుడు గ్రామస్థులే ధైర్యంగా ఎదుర్కొని ఏ మాత్రం ప్రాణ నష్టం లేకుండా వాటిని తరిమికొట్టారు. తిరిగివచ్చిన నకులసహదేవుల్ని ‘‘ఇది నిశ్చయంగా మీ విజయం’’ అంటూ ద్రోణుడు పొగిడాడు. ఈ కథ రెండు సూత్రాల్ని చెబుతుంది. 1. ఒక సమస్య తాలూకు కొమ్మల్ని కత్తిరిస్తే, తాత్కాలిక విజయం దొరుకుతుందేమో తప్ప పరిష్కారం దొరకదు. మీలో మీరు ఎంతకాలం ఇలా కుమిలిపోయినా పరిష్కారం దొరకదు. సమస్య మీలో ఉందా? చెప్పుడు మాటలు వినే అలవాటు ఉన్న మీ బాస్‌లో ఉందా అన్నది ముందు శోధించండి. మీ బాస్‌లో ఉంటే సమయం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నం చెయ్యండి. మీలో ఉంటే మీ వీక్ పాయింట్లను సరిదిద్దుకోండి. 2. సమస్యని ఎదుర్కోవడానికి ముందు దాన్ని నిశితంగా పరిశీలించి, ఏ ఆయుధం వాడాలో తెలుసుకుంటే మీ సమస్య సగం తీరినట్టే. మన ఆయుధం ఎంత గొప్పదైనా, అది సమస్యను పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన లాభం లేదు. కాస్త లౌక్యం నేర్చుకుని, మీ యజమానికి దగ్గరవటానికి ప్రయత్నం చెయ్యండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
నన్నే... ఎందుకు?
జీవన గమనం నేను ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాను. కాలేజీలో మా మేడమ్‌తో సమస్యగా ఉంది. ఆమె కోర్ సబ్జెక్ట్ చెబుతారు. క్లాస్‌లో ఆమె పాఠం చెప్పేటప్పుడు మిగిలిన క్లాస్మేట్స్ అందరిలాగే నేనూ నువ్వుతూ ఉంటాను. ఇతరులు నవ్వినప్పుడు ఏమీ అనని మేడమ్ నేను నవ్వినప్పుడు మాత్రమే తిడుతూ ఉంటారు. దాంతో క్లాస్‌లో నవ్వడమే మానేశాను. క్లాస్‌లో నేను నవ్వకపోయినా, వేరే వాళ్లెవరో నవ్వినా ఆమె నన్నే తిడుతున్నారు. ఆమె తరచూ నన్నే తిడుతుండటంతో చదువు మీద శ్రద్ధ చూపలేకపోతున్నాను. ఇదే పరిస్థితి కొనసాగితే నా చదువు ఏమైపోతుందోనని బెంగగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు - గంగాధర్, ఏలూరు ఆమె మనస్థితి, గృహపరిస్థితి తెలీదు కాబట్టి తరచూ పిల్లల్ని ఎందుకు తిడుతోందో, తిట్టడానికి ఎప్పుడూ మిమ్మల్నే ఎందుకు ఎన్నుకుంటుందో వదిలేద్దాం. మీ నవ్వు ఎలా ఉందో పరిశీలించుకోండి. వెటకారంగా ఉందా? ఆమె లెక్చరర్ని పరిహసిస్తున్నట్టు ఉందా? అలా ఉంటే ఎవరికైనా ఒళ్లు మండుతుంది కదా. రెండో విషయం ఏమిటంటే, నవ్వుతూ ఉండటం వేరు. ఆహ్లాదంగా ఉండటం వేరు. మేము తరచూ క్లాసుల్లో విద్యార్థులకు ’సీరియస్‌గా ఉండొద్దనీ, పాఠాలను ఆహ్లాదంగా వినండి’ అని చెబుతూ ఉంటాం. చాలామంది టీచర్లు క్లాసులో పిల్లల్ని ‘నవ్వకు, శ్రద్ధగా విను’ అని తిడుతూ ఉంటారు. శ్రద్ధగా వినటం అంటే సీరియస్‌గా వినటం కాదు. ప్రశాంతంగా వినటం. అదే విధంగా పెద్దలు కూడా పిల్లల్ని ‘హార్డ్‌వర్క్ చెయ్యి, పైకి వస్తావు’ అంటారు. హార్డ్‌వర్క్ అంటే కష్టపడి పని చెయ్యటం...! మనసుకు గానీ, శరీరానికి గానీ ఒక పని సాధ్యం కానప్పుడు అది హార్డ్‌వర్క్ అవుతుంది... హార్డ్‌వర్క్ చేస్తూ టీవీ చూడు. హార్డ్ వర్క్ చేసి క్రికెట్ ఆడు అని మాత్రం అనరు. చదువుకే ఈ పనిని ఆపాదిస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే... పెద్దలే పిల్లలకు చిన్నతనం నుంచి చదువంటే ఒక రకమైన విరక్తిభావం కలుగ చేస్తున్నారన్న మాట. ఈ సమాధానం ఆమె చదివేలా చెయ్యండి. మీ సమస్య తొలగిపోతుంది. నేను ఇటీవలే ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయ్యాను. మా పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే. మా పేరెంట్స్ కోరుకుంటున్నట్లుగా నాకు ఎంబీబీఎస్‌లో చేరాలని లేదు. ఎంబీబీఎస్‌లో చేరే బదులు క్రియేటివ్‌గా ఏదైనా చేయాలని ఉంది. ఏదైనా ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే నాకు ఇష్టం. ఎంబీబీఎస్ నాకు తగిన కోర్సు కాదని బలంగా అనిపిస్తోంది. అలాగని, ఏ కోర్సులో చేరితే రాణించగలనో అనే దానిపై ఎంతగా ఆలోచించినా ఇంకా ఒక స్పష్టతకు రాలేకపోతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి. - అమూల్య, ఊరు రాయలేదు ’ప్రాక్టికల్‌గా నేర్చుకోవటం’ అంటూ వ్రాసిన మీ ఉత్తరం అస్పష్టంగా ఉంది. మెడిసిన్‌లో ప్రాక్టికాలిటీ గానీ, మెడికల్ రీసెర్చ్‌లో క్రియేటివిటీ గానీ లేవని ఎలా అనుకుంటున్నారు? మీకు మరో రకమైన రీసెర్చ్ కావాలనుకుంటే ఫార్మసీలో గానీ, అగ్రికల్చర్ రంగంలో గానీ చేరండి. నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. పాలిటిక్స్‌లో చేరితే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. అయితే, పాలిటిక్స్‌లో రాణించగలనా? లేదా? అనే మీమాంసలో పడి ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. పాలిటిక్స్‌లో రాణించడానికి ఏం చేయాలో నాకు తెలియదు. అయితే, ఎలాగైనా పాలిటిక్స్‌లోకి రావాలని ఉంది. దానికి నేను ఏం చేయాలి? - పేరు రాయలేదు 1. ‘ఒక నాయకుడి కింద ఎంత కాలం నిజాయతీగా ఉండాలి? ఎప్పుడు అతణ్ని అధిగమించాలి’ అన్న విచక్షణాజ్ఞానం. 2. ఎప్పుడు వినాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అన్న సంయమనం. 3. అనుచరుల్నీ, హితుల్నీ ఊరు పేరుతో సహా గుర్తుపెట్టుకోగలిగే జ్ఞాపక శక్తి. 4. తర్వాత వచ్చే ఎన్నికలకు డబ్బు సంపాదించగలిగే ఆర్థిక ప్రణాళిక. 5. కార్యకర్తలను ఆకట్టుకునే నైపుణ్యం, నిరంతరం అధిష్టానం కనుసన్నల్లో మెలిగే చాతుర్యం... ఈ అయిదూ రాజకీయ విజయానికి అయిదు మెట్లు. ఈ అర్హతలు మీకెంత వరకు ఉన్నాయో... ఎంతవరకు పెంచుకోగలరో అలోచించుకోండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
నా కన్నా రెండు నెలలు పెద్దది...
జీవన గమనం నేను బీటెక్ ఫైనలియర్ చదువున్నాను. నా జూనియర్ మీద నాకు చాలా ఇష్టం పెరిగింది. తనని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తోంది. కానీ తనకి చెప్పలేదు. ఎందుకంటే చదువులో జూనియర్ అయినా ఆమె నాకంటే రెండు నెలలు పెద్దది. పైగా వేరే క్యాస్ట్. అయితే మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నాకు వాళ్ల ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. నా ప్రేమ విషయం తెలిస్తే ఆ అనుబంధం పాడవుతుందేమోనని భయంగా ఉంది. నిజానికి నాకు లవ్ అన్నా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నా పెద్దగా ఇష్టం లేదు. వాటి వల్ల పెద్దల్ని బాధపెట్టినట్టు అవుతుందని భయం. కానీ అనుకోకుండా తనపైన ప్రేమ పెరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? తనతో నా ప్రేమని చెప్పాలా? లేదంటే మా కుటుంబాల స్నేహం కోసం మనసు మార్చుకోవాలా? సలహా ఇవ్వండి. - సందీప్, ఊరు రాయలేదు రెండు కుటుంబాలు విడిపోకుండా ఉండటం కోసం మీ త్యాగం... ఒక మంచి బాక్సాఫీస్ చిత్రానికి సరిపోయేలా ఉంది. ‘అక్కడ లేని నల్ల పిల్లిని చీకట్లో వెతకటం’ అన్న సామెత బహుశా ఇక్కడి నుంచే పుట్టి ఉంటుంది. అంచెలంచెలుగా మీ సమస్యను విశ్లేషించుకుంటూ వెళ్దాం. ఒకవైపు ప్రేమ అంటే ఇష్టం లేదని అంటూనే, మరోైవైపు ’ప్రేమిస్తున్నానేమో అ..ని..పి..స్తుం..ది’ అన్నారు. ముందు మీది ప్రేమా? ఆకర్షణా? అన్న విషయం తేల్చుకోండి. వ్యక్తిని ప్రేమించటం ప్రేమ. ప్రేమ భావాన్ని ప్రేమించటం ఆకర్షణ. ప్రేమలో ఆలోచన, అవగాహన, స్పష్టత, భద్రతభావం ఉంటాయి. ఆకర్షణలో ఆవేశం, ఉద్వేగం, అస్పష్టత, అయోమయం ఉంటాయి. ప్రేమ అనుభూతి కోసం, ఆకర్షణ అనుభవం కోసం..! భవిష్యత్ తెలియటం ప్రేమ. కాలం తెలియకపోవటం ఆకర్షణ. ప్రేమలో రోజు రోజుకి ఎదుటి వారి గురించి ఆలోచన, నమ్మకం పెరుగుతుంది. ఆకర్షణలో రోజురోజుకీ అనుమానం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఈ విధంగా విశ్లేషించుకున్న తర్వాత, ఆ అమ్మాయిని తన అభిప్రాయం అడగండి. ఆమె, ‘‘అసలు నాకా భావమే లేదు. నువ్వు నా కన్నా చిన్నవాడివి’’ అంటే అసలు గొడవే లేదు. మీకు కూడా వర్ణాంతర వివాహాలు ఇష్టం లేవు కదా. ఒకవేళ ఆ అమ్మాయి యస్సంటే, ఇరువైపుల పెద్దల్ని సంప్రదించండి. వారు కూడా యస్ అంటే సమస్యే లేదు. కాదంటే, పెద్దవారిని ఎదిరించి వెళ్లిపోయి వివాహం చేసుకునేటంత తీవ్రమైనదా, పెద్దల్ని బాధ పెట్టి చేసుకోవడం అవసరమా (ఈ విషయం కూడా మీరే రాశారు) అనేది ఆలోచించుకోండి. మనసులోని అస్పష్టతతో బాధ పడటం కంటే, ఏదో ఒకటి తేల్చేసుకోవటమే మంచిది కదా. పరీక్షలు దగ్గర్లోనే ఉన్నాయి కాబట్టి ముందు చదువు మీద ఏకాగ్రత నిలపండి. పరీక్షలు ఫెయిలయ్యే కుర్రాళ్లని, కాస్త ముందు చూపున్న ఏ అమ్మాయీ ప్రేమించదు. నా వయసు 21. ఎంసీఏ చేస్తున్నాను. నిజానికి నాకు మీడియా రంగంలోకి వెళ్లాలని ఉంది. కానీ కుటుంబ సమస్యల కారణంగా, త్వరగా సెటిలైతే మంచిదని అందరూ బలవంతపెట్టడంతో ఎంసీఏలో చేరాను. కానీ చదువు ఎక్కడం లేదు. ఆసక్తి కలగడం లేదు. మానేయాలని ఉంది. కానీ మరో మంచి రంగంలో సెటిలైతేనే.. ఇది మానేసినా మావాళ్లు ఏమీ అనరు. పీజీ చేస్తే మీడియాలో సెటిలయ్యే మార్గం ఉంటే చెప్పండి. - రాజేశ్, విజయనగరం ఇష్టం లేని చదువుకన్నా నరకం ఇంకొకటి ఉండదు. కానీ మీ వాళ్లు చెప్పింది కూడా నిజమే కదా. మీడియా రంగంలో ఒక స్థాయి వచ్చేవరకూ ఆర్థికంగా నిలదొక్కుకోవటం కష్టం. అన్నిటికన్నా ముందు కొన్ని విషయాల్లో ఒక కచ్చితమైన నిర్ధారణకు రండి. 1. మీరు ఏ మీడియాలో స్థిరపడాలనుకుంటున్నారు? పత్రికా రంగమా? టీవీ ఛానెల్సా? 2. పత్రికా రంగం అయితే తెలుగా? ఇంగ్లీషా? 3. ఆ రచనా రంగంలో మీకు భాషాప్రవేశం ఉందా? లేక కేవలం ఉత్సాహమేనా? 4. టీవీ ఛానెల్స్‌లో అయితే, కెమెరా ముందు ఉండాలనుకుంటున్నారా? రిపోర్టింగ్ సైడా? మీ అభిరుచి కెమెరా ముందైతే... ఉచ్చారణ, అందం అవసరం. మీ కోరిక రిపోర్టింగ్ అయితే... భాష, అవగాహన అవసరం. ఏ వృత్తిలో రాణించాలన్న, కేవలం ఇష్టమే కాదు. అర్హత, కృషి, నైపుణ్యమూ కావాలి. మొదట అభిరుచిగా ప్రారంభించి వృత్తిగా మార్చుకోండి. తమ వృత్తి చేసుకుంటూ సైడుగా పత్రికా రిపోర్టింగ్ చేస్తున్న ఎల్ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులు కోకొల్లలు. ఆ విధంగా ముందు ఆర్థికంగా నిలదొక్కుకోండి. మీడియాలో పని చేస్తూనే ప్రైవేటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యవచ్చు కదా. లేదా జర్నలిజం కోర్సులో జాయినవ్వండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
నేనది తట్టుకోలేక పోతున్నాను...
జీవన గమనం నేను పీజీ చేస్తున్నాను. నాకొక వివాహితతో పరిచయం అయ్యింది. తనకి మూడేళ్ల బాబు ఉన్నాడు. బాబు పుట్టగానే భర్త చనిపోయాడట. వాళ్ల పుట్టింట్లో ఉంటోంది. అనుకోకుండా నాకు దగ్గరైంది. వాళ్ల ఇంట్లోవాళ్లు తనకి వేరే సంబంధం చూస్తున్నారు. కానీ ఆమె చేసుకోనంటోంది. అలా అని నేను తనని చేసుకోలేను. మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోరు. ఆ విషయం చెబితే పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు, నీ కోసం బతుకుతాను అంటోంది. వేరే అమ్మాయిని చేసుకో, తనతో కాపురం చెయ్యి, కానీ నాతో మాట్లాడుతూ ఉంటే చాలు అంటోంది. తనకి నేనంటే చాలా ఇష్టం. నాక్కూడా తనంటే చాలా ఇష్టం. ఆమె నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టదని నాకు నమ్మకం ఉంది. అయినా ఏదో భయం. నేనేం చేయాలి? - వివరాలు రాయలేదు మొదటిరాత్రి మీ భార్య తన జీవితానికి సంబంధించిన ఇదే సంఘటన మీతో చెప్పి, ఆయన చాలా మంచివారు. భార్య పోయింది. అనుకోకుండా నాకు దగ్గరయ్యారు. మనల్ని ఇబ్బంది పెట్టరు. నువ్వు వేరే అబ్బాయిని చేసుకో, తనతో కాపురం చెయ్యి అని ప్రోత్సహించారు. నేను కేవలం ఆయనతో మాట్లాడుతూ ఉంటే చాలట... అని చెప్తే, మీకు ఎలా ఉంటుందో అలోచించండి. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను డిగ్రీ చదివాను. పోలీస్ అవ్వాలన్నది నా లక్ష్యం. కానిస్టేబుల్ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యాను. ట్రెయినింగ్‌కు కూడా వెళ్లాను. నెల రోజుల తర్వాత మెడికల్ టెస్ట్ జరిగినప్పుడు నాకు కిడ్నీ సమస్య ఉందని తేలింది. దాంతో రిజెక్ట్ చేశారు. చాలా బాధేసింది. ట్రీట్మెంట్ తీసుకున్నాను. కానీ ఎక్కువ కష్టపడకూడదని డాక్టర్స్ అంటున్నారు. దాంతో ఇక పోలీస్ అవ్వలేనని అర్థమైంది. నా లక్ష్యం దెబ్బ తినేసింది. నేనది తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడేళ్లుగా ఇదే పరిస్థితి. ఏ చేయమంటారు? - నందు, కాకినాడ ఈ ఏడు సంవత్సరాలూ డిప్రెషన్ లోనే ఉన్నారా? బాధపడుతూ కూర్చుంటే వయసు పైబడిపోతుంది కదా. అద్భుతంగా ఆపరేషన్లు చేసే డాక్టరుకి అకస్మాత్తుగా నరాలు వణికే వ్యాధి వస్తే ఏం చేస్తాడు? ఒక గమ్యం చేరటం అసాధ్యమని తెలిసినప్పుడు, గమ్యాన్ని మార్చుకోవటం తప్ప మరో మార్గం ఏమున్నది? పోలీసు ఉద్యోగంలో మీకు ఏ ఆకర్షణ కనపడిందో, అవే లక్షణాలున్న మరో వృత్తి ఎన్నుకోండి. ఒకరు తన స్నేహితుణ్ని డిన్నర్‌కి పిలిచి, తిరిగి వెళ్తూండగా టార్చిలైట్ ఇచ్చాడట. ‘‘ఇదెందుకు? నాకు రాత్రిళ్లు కళ్లు కనపడవు కదా’’ అంటూ ఆ స్నేహితుడు బాధపడ్డాడు. ‘‘ఇది నీకోసం కాదు మిత్రమా! ఎదుటి వ్యక్తి నిన్ను గుర్తించటానికి...’’ అన్నాడు హోస్టు. అతిథి ఆ టార్చి తీసుకుని వీధిలో వెళ్తూ వుండగా ఒక సైకిలిస్టు ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. ‘‘నా చేతిలో టార్చి కనపడటం లేదా? నేను గుడ్డివాడిని’’ అని అతడు కోపంగా అరిచాడు. ఆ మాటలకి కన్ఫ్యూజ్ అయిన సైకిలిస్టు ‘‘అయ్యో! క్షమించండి. కానీ... మీరు టార్చి ఆన్ చెయ్యలేదు’’ అన్నాడట. ప్రతీ మనిషిలోనూ ఒక టార్చి వుంటుంది. తనలోని టార్చిలైటుని వెలిగించి, ఆ వెలుగులో తన గమ్యాన్ని గుర్తించటమే ఆత్మపరిశీలన. నా వయసు 25. మావాళ్లు మాకు తెలిసిన కుటుంబంలోని అబ్బాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అతను యూఎస్‌లో ఉంటాడు. చాలా మంచివాడు. అతణ్ని చేసుకోవడం నాకూ ఇష్టమే. కానీ నేను యూఎస్‌లో ఉండగలనా లేదా అన్నదే నాకు భయం. అందుకే చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. కానీ తెలిసినవాళ్ల అబ్బాయి, మంచివాడు, తనని వదిలేసుకుంటే అలాంటి మంచి సంబంధం మళ్లీ దొరకదు అని ఇంట్లోవాళ్లు అంటున్నారు. నాకూ నిజమే అనిపిస్తోంది. కానీ భయంగా ఉంది. ఏం చేయమంటారు? - ఓ సోదరి కేవలం భయంతో మాత్రం వదులుకోవద్దు. కొన్ని భయాలు నిర్హేతుకాలు. నా మిత్రుడు చాలా పెద్ద మ్యూజిక్ డెరైక్టర్. విమానం ఎక్కడమంటే భయం. లండన్‌లో రికార్డింగ్‌కి భయపడి అసిస్టెంట్‌ని పంపాడు. కారణం లేని భయాల వల్ల అవకాశాలని పోగొట్టుకోకూడదు కదా. కొంతమంది అమెరికా సంబంధం అంటే కారూ ఇల్లూ ఉంటుందనీ, అత్తగారూ ఆడపడుచుల తాకిడి ఉండదని, ఎగిరి గంతేస్తారు. మరి కొందరికి దగ్గర వాళ్లనీ, పుట్టిన ప్రాంతాన్నీ వదిలి దూర దేశాల్లో స్థిరపడటం; తమ సంతానాన్ని తమ తల్లిదండ్రులకి స్కైప్ లో పరిచయం చేయడం ఇష్టం ఉండదు. ఆర్థిక ఉన్నతి కోసం, తరువాతి తరాల భవిష్యత్ కోసం ఆ మాత్రం త్యాగం తప్పదని వాదిస్తారు మరి కొందరు. ఎవరి అభిప్రాయాలు వారివి. మీరు ఎటువైపు మొగ్గుతారో లోతుగా అలోచించుకోండి. కేవలం కొత్త వాతావరణంలో ఇమడలేను అన్న భయం వల్ల వివాహం మానుకోవద్దు. - యండమూరి వీరేంద్రనాథ్ -
లవ్వా... లక్ష్యమా... తేల్చుకునేదెలా?!
జీవన గమనం నేను ఎంబీబీఎస్‌కి లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో ఓ అమ్మాయితో పరిచయం అయింది. అప్పటి నుంచీ తనతో మాట్లాడుతూనే ఉన్నాను. నాకు తెలియ కుండానే తన మీద ఇష్టం పెరిగిపోయింది. ఒక్కరోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేక పోతున్నాను. దాంతో చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఇలా అయితే నా లక్ష్యం దెబ్బ తింటుందేమోనని భయంగా ఉంది. తనతో మాట్లాడకుండా బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి? - రాజేశ్, మెయిల్ ఇంటర్మీడియెట్ అంటే ల్యాటిన్ భాషలో ‘ఇన్-ది-మిడిల్’ అని అర్థం. విద్యార్థి జీవితం ఒక రైలు ప్రయాణం అనుకుంటే, ఇంటర్ ‘విజయవాడ ప్లాట్‌ఫామ్’ లాంటిది. అక్కడికి చాలా రైళ్లు (ఆకర్షణలు, అలవాట్లు) వస్తాయి. ‘సెల్లు, టీవీ’ నుంచి ‘ప్రేమ, మందు’ వరకూ రకరకాల ఆకర్షణలున్న రంగురంగుల బండి ఎక్కితే, అది మిమ్మల్ని జెసైల్మీరు ఎడారికి తీసుకెళ్లి దింపుతుంది. పదివేల రూపాయల జీతానికి స్థిరపడి అక్కడితో సంతృప్తిపడాలి. మంచి స్నేహితులు, పుస్తకాలూ ఉన్న బండి కాశ్మీరు ఉద్యానవనానికి తీసుకెళ్తుంది. ఏ రైలు ఎక్కుతారు? ముక్కు, ముఖం తెలియని అమ్మాయితో ప్రేమలో పడటం... మీరన్నట్టు అది ప్రేమ కాదు, ఇష్టం. మరో భాషలో చెప్పాలంటే ఆకర్షణ. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘‘ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను’’ అని పాట కూడా రాశారు. మీ లక్ష్యం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా? చదువుకోవడమా? ఒకవేళ పెళ్లి చేసుకోవడమే అయితే ఇప్పుడేనా? అయిదేళ్లు పోయాకా? అప్పటివరకు ఆ అమ్మాయి మీకోసం ఆగుతుందా! వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అసలిన్ని గొడవలు కావాలా! నేనేదో ప్రశ్న అడిగితే చాట భారతం రాస్తున్నాడేంటి అనుకోకండి. మీ ప్రశ్న ఆఖరి వాక్యంలోనే సమాధానం ఉంది. చదువుకోండి. నేను మొదట్నుంచీ బాగా చదివేదాన్ని. జీవితంలో బాగా స్థిరపడి అమ్మానాన్నలకు పేరు తేవాలి అనుకునేదాన్ని. ఇంత వరకూ అన్నీ అను కున్నట్టుగానే జరిగాయి. కానీ తర్వాత నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సీఏలో చేర్పించారు. అయినా ఎలాగో కష్టపడేదాన్ని. నాన్న కోసమైనా బాగా చదవాలని ప్రయత్నించేదాన్ని. కానీ నా వల్ల కాలేదు. ఫెయిలైపోయాను. దాంతో తిరిగి డిగ్రీలో చేరాను. కానీ నా జూనియర్స్తో కలిసి డిగ్రీ చదవాలంటే బాధగా ఉంది. డిప్రెస్ అయిపోయాను. అంతలో పెళ్లి సంబంధాలు చూశారు. నన్ను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి నా ఫ్రెండ్. తనకు దూరం అవ్వడం ఇష్టం లేక పెళ్లి వద్దన్నాను. దాంతో అన్నిటికీ ఆ అమ్మాయే కారణం అంటూ అమ్మ నా ఫ్రెండ్‌ను తిట్టింది. అది తట్టుకోలేక పెళ్లికి ఒప్పేసుకున్నాను. కానీ ఎందుకో మనసంతా అలజడిగా ఉంది. నాకిష్టం లేనివే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ఈ బాధను నేను ఎలా అధిగమించాలి? - హరిత, ఊరు రాయలేదు ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు, జరుగుతున్నవాటిని ఇష్టంగా చేసుకోవటాన్ని ‘పాజిటివ్ థింకింగ్’ అంటారు. నేను చదువుకునే రోజుల్లో, నాకూ ఇదే సమస్య ఎదురైంది. నాకు లెక్కలు చాలా ఇంట్రెస్ట్. జువాలజీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇంట్లో వాళ్ల బలవంతం మీద సైన్స్‌లో చేరాను. కానీ ఎంత బాగా చదివినా, మెడిసిన్‌లో సీట్ సంపా దించలేకపోయాను. అదృష్టవశాత్తూ కామర్సుతో డిగ్రీ చదివి, ఆ తర్వాత నాలుగేళ్ల సీఏ కోర్సును కేవలం మూడేళ్లలోనే పూర్తి చేశాను. మన అభిరుచి పెద్దలు అర్థం చేసుకోలేక పోతే వచ్చే సమస్య 90 శాతం కుటుంబాల్లో ఉన్నదే! ఇక పోతే మీ జూనియర్స్తో కలిసి చదవాలనే బాధ మీకు ఎక్కువగా ఉంటే, ప్రైవేటుగా చదివే వెసులుబాటు ఉన్నదేమో ఆలోచించండి. ఇక తర్వాతి సమస్య... మీ వివాహం. భవిష్యత్తులో మీరు వివాహం చేసుకుంటారా లేదా అనేది వేరే విషయం కానీ, కేవలం స్నేహితురాలికి దూరమవుతానన్న భయంతో వివాహం వద్దనుకుంటున్న మీ ఆలోచన మాత్రం అంత ఆరోగ్యమైనది కాదు. కొంత కాలానికి మీ ఫ్రెండ్ కూడా పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది కదా! కేవలం స్నేహితురాలి గురించి వివాహం మానుకోకండి. కొన్ని వాస్తవాల్ని భరించక తప్పదు. మీకు వివాహం చేసుకోవాలనే కోరిక ఉండి, అబ్బాయి నచ్చితే చేసుకోండి. లేదూ ఇంకా చదువుకోవా లనుంటే ప్రైవేట్‌గా మీ చదువును కొనసా గించండి. అదీ కాకపోతే, వివాహం చేసుకుని ఆ తర్వాత చదువును కొనసాగించండి. ఎందు కంటే... చదువుకు, వయసుకు సంబంధం లేదు. - యండమూరి వీరేంద్రనాథ్ -
నేను చేస్తోంది తప్పేమో?
జీవన గమనం నేను బీటెక్ చేశాను. తర్వాత రెండేళ్లు కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ చేశాను. ఎంటెక్ చేయడానికి ఆ జాబ్ మానేశాను. మరో మంచి ఉద్యోగం రావడంతో మధ్యలోనే ఎంటెక్ ఆపేశాను. ఆ జాబ్‌లో జాయిన్ అయిన నెల రోజులకు ఎక్కడో గ్రూప్స్ గురించి చూశాను. వెంటనే ఉద్యోగం మానేసి గ్రూప్స్ కోచింగ్‌లో చేరాను. కానీ నాకిప్పుడు అనిపిస్తోంది... నేను చేస్తోంది తప్పేమో అని. దేని మీదా దృష్టి పెట్టలేకపోతున్నాను. ఒకదాని నుంచి ఒకదానికి మారుతూనే ఉన్నాను. ఇలా అయితే నేను ఏం సాధించగలను? ఇలా మాటిమాటికీ మనసు మారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? - కె.రమణ, ఊరు రాయలేదు ‘రోలింగ్ స్టోన్స్‌కు ద్రవ్యరాశి (మాస్) సమకూరదు’ అని ఒక సామెతుంది. అదెంత నిజమో, మరోవైపు దానికి వ్యతిరేకంగా.. ‘మురికి నీటికి సుగంధం ఉండదు’ అన్నది కూడా అంతే నిజం. ఎవరి పరిస్థితిని బట్టి వారు మెలగాలి. మనస్తత్వాన్ని బట్టి కెరీర్‌ని నిర్ణయించుకోవాలి. నేను పదిహేను సంవత్సరాలు ఒకే సంస్థలో మారకుండా పని చేశాను. మా అబ్బాయి పదేళ్లలో పదిహేను సంస్థలు మారి ఒక స్థాయికి వచ్చాడు. కాబట్టి ఏది కరెక్ట్ అనేది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే... మంచి ఉద్యోగం రావడంతో మీరు ఎంటెక్ ఆపేశారు. తర్వాత మళ్లీ గ్రూప్స్ కోసం ఎంటెక్ మానేశారు. ఇందులో తప్పేముంది? అయితే మీరు చేస్తున్న ఉద్యోగం, గ్రూప్స్ పాస్ అవ్వడం వల్ల వచ్చే ఉద్యోగం కన్నా మంచిదా కాదా అన్న విషయం మీరు నిర్ణయించుకోవాలి. కొన్ని లక్షలమంది గ్రూప్స్‌కి చదువుతున్నారు. పాసయ్యేది చాలా తక్కువ శాతం. మీకా సామర్థ్యం ఉన్నదా అన్న విషయం ముందు నిర్ణయించుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ వయసెంత, మీ కుటుంబ ఆర్థిక స్తోమత ఎంత, మీ మీద ఎవరైనా ఆధారపడి ఉన్నారా, మీకు వయసు మీరిపోతుందా... ఇవన్నీ ఆలోచించి, ఉద్యోగం (జీవితం)లో స్థిరపడాలా, రిస్క్ తీసుకోవాలా అనే నిర్ణయం తీసుకోండి. నేను ఎమ్మెస్సీ చేశాను. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ముప్ఫై వేల పైనే వస్తోంది. నా ఎమ్మెస్సీ క్లాస్మేట్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మొదట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ తనకి నాకు వచ్చినట్టుగా వెంటనే ఉద్యోగం రాలేదు. దాంతో ఏదో ఒక చిన్న కంపెనీలో చేరాడు. జీతం కూడా నా కంటే తక్కువే. దానికి నేనేం బాధపడటం లేదు. కానీ తను మాత్రం కుమిలిపోతున్నాడని అనిపిస్తోంది. తనకంటే నాది మంచి ఉద్యోగం అని, ఎక్కువ జీతం అని చాలాసార్లు అనేస్తుంటాడు. అది మామూలుగా అనడం లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఇది మా ఇద్దరి మధ్య గ్యాప్‌ను పెంచుతుందేమో అని కూడా భయంగా ఉంది. తన మనసులో నుంచి ఆ ఫీలింగ్‌ను ఎలా తీసేయాలి? - సౌజన్య, హైదరాబాద్ మీ భర్త మనస్తత్వం ఎటువంటిది? సెన్సిటివా? లేక ప్రాక్టికలా? అతడు ఎలాంటి వాడైనా, ముందు అతని కాంప్లెక్స్‌ను పోగొట్టాలి. అంతకన్నా ముఖ్యంగా ముందు మీరు మీ బాధనీ, భయాన్నీ తనకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అతడు ప్రాక్టికల్ అయితే, ‘‘నాకన్నా నీకు జీతం తక్కువని నువ్వు బాధపడుతున్నావ్! నేనేం చేయాలో నువ్వే చెప్పు. ఉద్యోగం మానేయనా?’’ అనండి. కంగారుపడి వద్దు వద్దంటాడు. అతడు బాగా సెన్సిటివ్ అయితే, ఒక వారం రోజుల పాటు ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లండి. నెమ్మది నెమ్మదిగా మీ భావాల్ని ఎక్స్‌ప్రెస్ చేయండి. ‘తన కన్నా మీ జీతం ఎక్కువన్న కారణం వల్ల మీరు కూడా బాధపడుతున్నారు’ అన్న సంగతిని అతనికి తెలిసేలా చేయండి. పనిలో పనిగా... (ప్రేమ వివాహం అంటున్నారు కాబట్టి) డబ్బు లేకపోవటం వల్ల వచ్చే కష్టనష్టాల గురించి కూడా అతడికి తెలియచెప్పండి. అతడు మీ బాధను, మీలో జరిగే సంఘర్ణణనీ తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఖాళీగా ఉండి అనవసరపు ఆలోచనలతో సతమతమవ్వకుండా, తీరిక వేళల్లో ఏదైనా హాబీ పెంపొందించుకునేలా ప్రోత్సహించండి. చిత్రలేఖనం నుంచి పత్రికలకు వ్యాసాలు రాయటం వరకు ఏదైనా కావొచ్చు. ఏ మంచి హాబీ లేనివాళ్లకు నిరాశాపూరితమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఏమో ఎవరు చెప్పొచ్చారు... అతడి హాబీనే అతన్ని ఆర్థికంగా ఉన్నత శిఖరాల మీద నిలబెట్టవచ్చేమో! - యండమూరి వీరేంద్రనాథ్ -
నా కూతురి మనసు మార్చేదెలా?
జీవన గమనం నేను ఓ స్కూల్లో రిసెప్షనిస్టుగా పని చేస్తున్నాను. మా స్కూల్లో పనిచేసే ఓ మాస్టారు నన్ను పెళ్లి చేసు కోవాలనుందని అన్నారు. ఈ విషయం నేను నాతో స్నేహంగా ఉండే మరో టీచర్‌తో చెబితే... అతనికి ఆల్రెడీ పెళ్లైపోయిందని ఆవిడ చెప్పారు. కోపం వచ్చి అడిగేశాను. పెళ్లయ్యింది కానీ భార్య మంచిది కాదని, తనని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటానని చెబు తున్నారు. మాది పేద కుటుంబం. నా సంపాదనే మా కుటుంబానికి ఆధారం. నాకు పెళ్లి చేసే స్తోమత కూడా అమ్మా నాన్నలకు లేదు. కాబట్టి అతను చెప్పేది నిజమైతే నేనతణ్ని పెళ్లి చేసుకోవచ్చా? తన మాటలు నమ్మొచ్చా? - ఓ సోదరి, గుంటూరు ఇందులో నమ్మకాలు, అపనమ్మకాల ప్రసక్తి ఏముంది? చీకట్లో ఉన్నప్పుడు అక్కడే ఉండి పోవడం కన్నా కనబడుతున్న వైపునకు మళ్లడం అభిలషణీయం కాదా? కానీ అది వెలుగా మిణుగురు పురుగా అనేది ముందు తెలుసు కోవాలి. వెళ్తున్న దారిలో ముళ్లపొదలు, సుడి గుండాలు ఉన్నాయేమో గమనించి జాగ్రత్త పడాలి. వివాహం గురించి అతడు ప్రపోజల్ పెట్టినప్పుడు తన మొదటి భార్య సంగతి ఎందుకు చెప్పలేదో ముందు మీరు కన్విన్స్ అవ్వండి. అతడు చెప్పిన కారణం నిజమనిపిస్తే, మీ తండ్రిగారిని వెళ్లి ఆ మాస్టారితో మాట్లాడమని చెప్పండి. మొదటి భార్యతో విడాకులు ఎంతవరకూ వచ్చాయో కనుక్కోండి. ఆమెతో ఆయనకు సంతానం ఉందో లేదో, విడాకులిస్తున్న సమయంలో కోర్టు ఏ రకమైన ఆంక్షలు పెడుతుందో, ఆయన ఆస్తిలో ఎవరికి ఎంత వాటా చెందుతుందో మొదలైన వివరాలన్నీ సేకరించిన తర్వాతే ఓ నిర్ణయానికి రండి. ముఖ్యంగా... మీ వివాహం జరిగిన తర్వాత కూడా మీరు ఉద్యోగం చేస్తానని, ఆ జీతం మీ బీద తల్లిదండ్రులకే చెందుతుందనీ ఆయన్ని ఒప్పించండి. మగాళ్లు మొగుళ్లయ్యాక పెళ్లికి ముందున్నంత దయాగుణంతో ఉండరు. ఆ విషయం గుర్తు పెట్టుకుని, పక్కాగా పెద్దల సమక్షంలో ఏర్పాట్లు చేసుకోండి. మేం బ్రాహ్మణులం. మాకంటూ ఓ గుర్తింపు, గౌరవం ఉన్నాయి. కానీ నా కూతురు ఒక తక్కువ కులం కుర్రాడిని ప్రేమించింది. తననే పెళ్లి చేసు కుంటాను అంటోంది. అబ్బాయి మంచివాడు, బాగా చూసుకుంటాడు అని కచ్చితంగా చెప్పేస్తోంది. కానీ ఈ పెళ్లి వల్ల మా బంధువులు, స్నేహితుల మధ్య మా గౌరవం పోతుంది. అలాగే ఆ అబ్బాయి కుటుంబం, మా కుటుంబం ఎప్పటికీ కలవలేవు. రకరకాల స్పర్థలు వస్తాయి. తారతమ్యాలు కనిపిస్తాయి. కాబట్టి జీవితాంతం ఇబ్బందే. అందుకే వద్దంటున్నాను. కానీ నా కూతురు వినడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను అనుకున్నదే చేయాలా లేక తన జీవితం తన ఇష్టం అని పెళ్లికి ఒప్పుకోవాలా? - శర్మ మీ ప్రశ్న తాలుకు చివరి వాక్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ‘‘ నేను చేసుకోవద్దంటు న్నాను. కానీ నా కూతురు వినటం లేదు. నేననుకున్నదే చేయాలా? లేక పెళ్లికి ఒప్పు కోవాలా?’’ అని రాశారు. మీరు ఏమనుకుంటు న్నారు? ‘పెళ్లి జరగడానికి వీల్లేదు’ అనుకుంటు న్నారు. అవునా? కానీ మీ కూతురు వినటం లేదు. మరేం చేస్తుంది? ఇంట్లోంచి వెళ్లిపోయి ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటుందా? ఎలాగూ మీ మాట విననన్నప్పుడు ఇక మీకు వేరే పరిష్కార మార్గం ఏముంది? లేదూ, మీరు ఎమోషనల్‌గా బలవంతం చేస్తే, మీ అమ్మాయి ఆ కుర్రవాడిని మరచిపోయి మీరు చెప్పిన వివాహం చేసుకుంటుందనుకుందాం! ఆ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిది? గతం గత: అనుకుని భర్తతో సుఖంగా కాపురం చేయగలు గుతుందా, లేక డిప్రెషన్‌కు గురై ఒక కుర్రవాడి (భర్త) జీవితం నాశనం చేసే మనస్తత్వమా? తండ్రిగా మీరే దాన్ని బాగా గుర్తించగలరు. మీరు ప్రశ్నలో మరికొన్ని వివరాలు ఇవ్వలేదు. అతడు ఉద్యోగం చేస్తున్నాడా? ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఈ పెళ్లికి సుముఖంగా ఉన్నారా? లేదా పెద్దల నుంచి దూరంగా వెళ్లిపోయి విడిగా సంసారం పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడా? మీ అమ్మాయి ఆ అబ్బాయి గురించి, ‘‘ చాలా మంచివాడు. బాగా చూసుకుంటాడు అంటోంది’’ అన్నారు. ప్రేమించిన కొత్తలో ప్రతివాళ్లూ అలాగే అనుకుంటారు. కౌన్సిలింగ్‌కి వచ్చే కేసుల్లో సగం పైగా ప్రేమ వివాహాలే! ఇవన్నీ మీ అమ్మాయికి చెప్పి చూడండి. దానికన్నా ముందు ఆ అబ్బాయిని కలుసుకుని మాట్లాడండి. అతడి ఆర్థిక స్థాయి గురించిన వివరాలు సేకరించండి. అన్నీ మీ అమ్మాయికి చెప్పి, తర్వాత నిర్ణయం ఆమెకే వదిలిపెట్టండి. మీ కుటుంబం, ఆ అబ్బాయి కుటుంబం ఎప్పటికీ కలవక పోవచ్చు. వాళ్లిద్దరూ పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అయి సామరస్యంగా సంసారం చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్లేనా? నిజంగా వాళ్లకు అలా సంసారం చేసుకునే స్థైర్యం, నిబద్ధత, సామర్థ్యం ఉంటే, మీరు మీ కుటుంబ గౌరవం గురించి గానీ, మీ స్నేహితుల గురించి గానీ, ఏ మాత్రం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కులాంతర వివాహాల గురించి ఎవరూ ఎక్కువ పట్టించుకోవడం లేదు. అలా కాకుండా, మీ కుటుంబంలో మిగతా వారి వివాహాలకు మీ అమ్మాయి తీసుకున్న నిర్ణయం అడ్డొస్తుంది అనుకుంటే... మీ నుంచి విడిపోవలసి వస్తుంది అని అమ్మాయిని హెచ్చరించండి. చివరగా ఒక మాట! మీ కులం కాని వారందరిదీ ‘తక్కువ కులం’ అనే అభిప్రాయం మార్చుకోండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
కాబోయే భార్యకి... చెప్పాలా? వద్దా?
జీవన గమనం నా వయసు 26. మూడేళ్ల క్రితం నాకు ప్రభుత్వోద్యోగం వచ్చింది. పబ్లిక్ రిలేటెడ్ జాబ్. అయితే నేను మొదట్నుంచీ సెలైంట్ కావడం వల్ల ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేకపోతు న్నాను. దాంతో కొందరు నన్ను ఆ జాబ్‌కి అన్‌ఫిట్ అంటున్నారు. అది బాధ కలిగిస్తోంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతోంది. ఈ బలహీనతను ఎలా అధిగమించాలో చెప్పండి. - బి.ప్రియదర్శిని, మెయిల్ ఇంట్రావర్ట్‌గా ఉండటం వేరు, రిజర్వ్డ్గా ఉండటం వేరు. అవసరమైన ప్పుడు మాట్లాడటాన్ని రిజర్వ్‌డ్‌నెస్ అంటారు. అవసరమున్నా మాట్లాడకపోవడాన్ని ఇంట్రా వర్షన్ అంటారు. ఉద్యోగ రీత్యా పదిమందితో మాట్లా డాల్సి వచ్చినప్పుడు తప్పని సరిగా మాట్లాడాలి. ఈ కళను పెంపొందించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈ మూడే ళ్లలో మీరు ఇందులో ఎంతవరకూ సఫలీకృత మయ్యారో చెప్పలేదు. కమ్యునికేషన్ అనేది చదవడం, రాయడం, మాట్లాడటం, వినడం, హావభావాలు, సంజ్ఞల మీద ఆధారపడి ఉంటుంది. సంభాషణల్ని రెండు రకాలుగా విడగొట్టవచ్చు. ప్రైవేట్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్. ప్రైవేట్ కమ్యుని కేషన్లో నాలుగు అంశాలు దృష్టిలో పెట్టు కోవాలి. 1.మన మూడ్ మాట్లాడటానికి తగిన విధంగా ఉందా? 2. అవతలివారి మూడ్ వినడానికి సరైన స్థితిలో ఉందా? 3.అవతలివారి మూడ్‌ని మన మాటలతో మార్చగలిగే పరిస్థితి ఉందా? 4.అవతలి వారి పరిస్థితిని బట్టి మన మూడ్ మార్చు కునే అవకాశం ఉందా? అదే విధంగా ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడు తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనే మరో నాలుగు విషయాలూ గుర్తుంచు కోవాలి. సరిగ్గా మాట్లాడలేక పోవడం వల్ల వచ్చే నష్టాలు మీకీపాటికే అవగతమై ఉంటాయి. ముందు దగ్గరి వారితో మాట్లా డటం ప్రారంభించండి. స్నేహితులతో గ్రూప్‌గా ఏర్పడి, ఆసక్తికరమైన చర్చల్లో పాల్గొంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. తెలివితో పాటు వాగ్ధాటి పెరుగుతుంది. ఆ తరువాత ఆ విద్యని మీ వృత్తిలో అమలు జరపండి. ఫలితాలు మీకే విస్మయం కలిగించేటంతగా ఉంటాయి. నాకు పదమూడేళ్లుగా నిద్రలో నడిచే అలవాటు ఉంది. బాగా కలవరిస్తాను కూడా. ఇంతవరకూ దానివల్ల ఏ ఇబ్బందీ కలగలేదు. కానీ నాకు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయితో నా సమస్య నేను చెప్పలేదు. చెప్పకుండా మోసగించడమూ ఇష్టం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? - కె.శ్రీనివాస్ గౌడ్, మెయిల్ స్లీప్ వాకింగ్ శారీరక సమస్యా మానసిక సమస్యా అన్నది తేల్చి చెప్పడం కష్టం. దీన్ని సోమ్నాబ్లిజం అంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. కానీ మొదటి పన్నెండేళ్లూ మీకు ఈ సమస్య రాలేదంటున్నారు. విపరీతమైన మానసిక సమస్యలుంటే.. ఆ ఒత్తిడి వల్ల కూడా కొన్నిసార్లు ఈ సమస్య రావొచ్చు. ఏ విషయమూ మీకు డాక్టరే చెబుతారు. అయితే మీరు దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఆయనకు తెలపాలి. మీరు నిద్రలో ఎంతసేపు నడుస్తూంటారో తెలపలేదు. నిద్రలో నడవడం అనేది కేవలం నిమిషంపాటే జరుగుతుంది. కొన్ని కేసుల్లో అరగంట వరకూ కూడా ఉండొచ్చు కానీ అది చాలా అరుదు. నవలల్లోనూ సినిమాల్లోనే ఈ ప్రక్రియని అరగంట వరకూ ఉపయోగించడం జరుగుతుంది. అయితే నిజానికీ సమస్య వయసుతో పాటు తగ్గిపోతుంది. కానీ పాతికేళ్లు వచ్చినా మీకింకా తగ్గలేదంటే మీరు సైకాలజిస్ట్/ సైకియాట్రిస్ట్‌ను కలుసుకోవడం మంచిది. దాని కంటే ముందు మీ అంతట మీరు కొన్ని ప్రయత్నాలు చేయండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసు కోండి. పడుకోబోయే ముందు మనసును కలచివేసే భయంకరమైన న్యూస్ చూడ వద్దు. శుభ్రమైన బెడ్రూమ్, ఆహ్లాదకర మైన మ్యూజిక్, గాలిలో రవంత పరిమళం మెదడు మీద మంచి ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా గది నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. గాఢంగా గాలి పీలుస్తూ, నెమ్మదిగా వదులుతూ, కండ రాల్ని కూడా అదే విధంగా బిగించి లూజ్ చేస్తే, సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోడానికి ప్రయత్నించండి. ఇవన్నీ ఫలించని పక్షంలో సైకాలజిస్ట్/సైకియాట్రిస్ట్‌ను కలవడం మంచిది. అలాగే కలవరించే అలవాటుందని రాశారు. కొందరికి ఇది అస్సలు నచ్చదు. కాబట్టి మీ భార్యకి ముందే చెప్పండి. ఆమెకు దీనిపట్ల ఏహ్య భావం ఉంటే తర్వాత ఇబ్బంది కదా! చివరిగా ఒక విషయం. స్లీప్ వాకింగ్ అనేది సినిమాల్లోనో కథల్లోనో చెప్పేటంత భయంకర మైనది కాదు. ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోయే అవకాశం ఉంది. దీనికి డాక్టర్లు కొన్ని మందులు (డీజపీన్స్) ఇస్తున్నారు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వారిని సంప్రదించండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
నచ్చనిది చేయలేను... నచ్చినట్టు బతకలేను... ఎలా?
జీవన గమనం నా వయసు 24. మంచి ఆడిటర్‌ని కావాలని సీఏని ఓ పవిత్రమైన వృత్తిగా భావించి ఎంచు కున్నాను. కానీ ఆర్టికల్‌షిప్ చేస్తున్న సమయంలో ఆ వృత్తిమీద అసహ్యం ఏర్పడింది. 2013లో నేను మా గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యాను. అందులో మద్యం, డబ్బు కూడా భాగమయ్యాయి. మా నాన్న నేను వద్దన్నా వాటిని పంచారు. నిజాయతీగా బతకాలని, వచ్చింది రూపాయి అయినా దాన్ని నీతిగానే సంపాదించాలనేది నా అభిలాష. కానీ చుట్టూ అవినీతే. సేంద్రియ వ్యవసాయం, ఆధ్యాత్మిక అంశాలంటే నాకు చిన్నప్పట్నుంచీ పిచ్చి. కానీ అమ్మానాన్నలకు ఇష్టం లేదు. దర్జాగా బతక మని పోరుతుంటారు. దాంతో నచ్చినట్టు చేయలేకపోతున్నాన్న బాధ నన్ను నలిపే స్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ఓ సోదరుడు ప్రతి మనిషికీ గమ్యం (ఉ॥బాగా చదవడం), కోరిక (ఉ॥సినిమాలు చూడటం) అని రెండు ఉంటాయి. ఆ రెంటికీ తేడా ఎక్కువయ్యే కొద్దీ మనిషి కలత పడతాడు. విజయం అంటే ‘బతుకుతున్న జీవిత విధానం పట్ల పూర్తి సంతృప్తితో ఉండటం’. ఇంతకన్నా గొప్ప నిర్వచనం నాకింతవరకూ దొరకలేదు. మీరు ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు మీ యజమాని అవలం బించే విధానాలు చూసి సీఏ వృత్తిమీద అసహ్యం ఏర్పడి ఉండ వచ్చు. లేదంటే అంత కష్టమైన కోర్సు చదవలేని మీ అశక్తతకి అసహ్యం అని పేరు పెట్టుకుని ఉండ వచ్చు. ఏది నిజమో మీరే మీ మనస్సాక్షిని అడగండి. కేవలం మీకు నచ్చలేదు కాబట్టి సీఏ అనేదే ఒక అపవిత్రమైన వృత్తి అనడం తగదు. నేనూ చార్టెడ్ అకౌం టెంట్నే. లంచాలు సంపాదించడానికి ఎన్నో అవకాశాలున్న ప్రభుత్వ ఆర్థిక సంస్థల్లో పదిహేను సంవత్సరాలు పని చేసి, ఇప్పుడు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తు న్నాను. ఇంతకాలం లంచాలకు దూరం గానే ఉంటూ వచ్చాను. ఎన్ని అవకాశాలు వచ్చినా నయాపైసా స్వీకరించలేదు. కాబట్టి సీఏ అంటే తప్పకుండా లంచంతో కూడిన వృత్తి అనే అభిప్రాయాన్ని మార్చు కోండి. నిజాయతీగా బతకాలి, నీతిగా సంపాదించాలి అన్నదే మీ అభిలాష అయితే కాదన్నది ఎవరు? మీ చుట్టూ అవినీతి కనిపిస్తూ ఉండొచ్చు. కానీ మీరు నిజాయతీగా బతకవచ్చు కదా! ఇక మీ అభిరుచుల గురించి. సేంద్రియ వ్యవసాయం, ఆధ్యాత్మిక విష యాలంటే మీకు అభిరుచి అని రాశారు. మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నంతకాలం వారు తమ అభిప్రాయా లకు అనుగుణంగా బతకమనే మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంటారు. ‘చెరువులో నీళ్లు నచ్చకపోతే బయటకు వచ్చి చచ్చిపో. కానీ జీవితాంతం ఆ నీళ్లలోనే ఈదొద్దు’ అని చేప పిల్లకి సలహా ఇచ్చినట్టు నేను మీకు సలహా ఇవ్వలేను కానీ... వీలైనంత వరకూ వ్యక్తిత్వాన్ని పెంచుకోడానికి ప్రయత్నించండి. ఎవరి ట్యూన్కో నాట్యం చేస్తున్నంతకాలం జీవితం మన చేతుల్లో ఉండదు. జీవి తంలో అన్నిటికన్నా దౌర్భాగ్య కరమైన విషయం తనకు నచ్చినట్టు బతకలేకపోవడం. ముందు ఆర్థిక స్వాతంత్య్రం సంపాదించండి. పరస్పర విరుద్ధమైన అభిరుచులు, కోరికలు పెట్టుకోకుండా ఒకే గమ్యం వైపు సాగండి. నేనొక అమ్మాయిని ప్రేమించాను. నా ప్రేమను తనకు చెప్పినప్పుడు తన గతం చెప్పింది. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతనికి అన్ని రకాలుగానూ దగ్గరయ్యానని, ఇద్దరూ విడిపోయారని చెప్పింది. తన నిజాయతీ కారణంగా నేను తనని యాక్సెప్ట్ చేశాను. కానీ తను ఈ మధ్య సడెన్‌గా మారిపోయింది. నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది, నువ్వు నాకు మంచి స్నేహితుడిగానే ఉండు అంటోంది. కారణం అర్థం కాక ఆరా తీస్తే... తన పాత లవర్‌కి మళ్లీ దగ్గరయ్యిందని తెలిసింది. నేనేం చేయాలి? తను కోరుకున్నట్టు స్నేహితుడిగా ఉండాలా లేక తనతో అన్ని సంబంధాలూ తెంచేసుకుని నా పని నేను చేసుకోవాలా? - కె.కె.రెడ్డి, మెయిల్ మీరు చెప్పినట్టు మీకు రెండే ఆప్షన్లు. తనతో స్నేహంగా ఉండటం... తనతో సంబంధాలన్నీ తెంచేసుకోవడం. స్నేహితుడిగా ఉండటం వల్ల మీకొచ్చే లాభనష్టాలు బేరీజు వేసుకోండి. ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? లేక కేవలం స్నేహితుడిగానే ఉందామను కుంటున్నారా? సంబంధాలన్నీ తెంచేసు కుంటే మీరు మరింత మనఃస్థిమితంగా ఉంటారేమో ఆలోచించండి. స్నేహితు రాలు ఎవరితో ఉంటోంది, ఎక్కడికి వెళ్తోంది లాంటి ఆరాలు తీయడం, డిటెక్టివ్‌లను పెట్టడం వంటి పత్తేదారు పనులు ఎప్పుడూ మనసులను కలచి వేస్తూ ఉంటాయి. ఆమెను మీరు వివాహం చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఆమె జీవితం ఆమెది, మీ జీవితం మీది. లేదూ కేవలం ఆమెను స్నేహితురాలిగానే చూసే పక్షంలో... ఆమె జీవితంలో మీరు ఒక చిన్న భాగం మాత్రమే. మిగతా భాగంలో ఎవరుంటే మీకు ఎందుకు? ఈ విధంగా ఆలోచిస్తే మనశ్శాంతి దొరుకుతుంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
మనసు మనసులో ఉండేదెలా?!
జీవన గమనం నేను దైవ సంబంధిత ఆచారాల వ్యతిరేకిని. మనిషి సంతోషంగా బతకాలంటే ఆత్మ విశ్వాసం, తార్కిక జ్ఞానం ముఖ్యమని నమ్ముతాను. గుళ్లూ గోపురాలకు వెళ్లను. ప్రస్తుతం ఓ అకాడెమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఓ ప్రొఫెషనల్ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నాను. మంచి స్థాయికి వెళ్తాననే నమ్మకం ఉంది. కానీ నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. పూజలు చేసి పుణ్యం సంపాదించకపోవడం వల్ల నాకు మంచి జరగట్లేదు, సరైన ఉద్యోగం దొరకట్లేదంటూ ఉపయోగం లేని మాటలు చెప్తున్నారు. అలాంటప్పుడు నా ఆత్మవిశ్వాసం దెబ్బ తింటోంది. ఈ మధ్య తెలిసిన వ్యక్తి ఒకరు నా జాతకంలో దోషముందని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి వాళ్లని ఎదుర్కోవడం ఎలా? - వెంకట్, శ్రీకాకుళం దైవం, ఆచారం, గుళ్లూ గోపురాలూ, విగ్రహారాధన... వీటిపట్ల బలమైన అభి ప్రాయాలు ఉన్నవారు మరొక అలవాటు కూడా చేసుకోవాలి. తమ అభిప్రాయాలకి వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్నవారితో చర్చించడం, వాదించడం తగ్గించాలి. భిన్న ధృవాలు ఎప్పుడూ ఒకటి కావు. మీ అభిప్రాయాల పట్ల మీకు బలమైన నమ్మకం ఉన్నప్పుడు మీ బంధువులు, స్నేహితులు వాటిని అర్థం చేసుకోకపోతే మీకొచ్చే నష్టమేంటి? అసలీ చర్చలన్నీ ఎందుకు? ఎప్పుడైతే మీ జాతకం మరొకరికి చూపించారో... వారు దానిపట్ల తమ అభిప్రాయాలు చెప్తూనే ఉంటారు. వాటిని నమ్మనప్పుడు చర్చ ఎందుకు? మీరు నమ్మిన సిద్ధాంతాలను బలపర్చేవారి గ్రూప్స్ ఫేస్బుక్లో కొన్ని ఉంటాయి. వాళ్లతో చేరితే మీ అభిప్రాయాల పట్ల మీకు నమ్మకం ఇంకా బలంగా పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, అవతలివారి అభిప్రాయం కూడా విని నిర్ణయం తీసుకోండి. తన నమ్మకాలు తప్పని తెలిసినప్పుడు వాటిని మార్చుకోనివాడు మూర్ఖుడు. మార్చుకునేవాడు జ్ఞాని. ‘అందరూ నిన్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు, నాతో సహా. నేను చెప్పినా, మతగ్రంథాల్లో రాసినా అది నీ తర్కానికి, ఇంగిత జ్ఞానానికి, హేతువుకి సరిపోతేనే దాన్ని నమ్మి ఆచరించు’ అన్నాడు బుద్ధుడు. కాబట్టి అనవసరమైన చర్చల ద్వారా సమయం వృథా చేసుకోకుండా, ప్రొఫెషనల్ కోర్సుకి బాగా ప్రిపేరవ్వండి. నా వయసు 18. నా మనసు అధీనంలో ఉంచుకోవడం నాకు చేతకావడం లేదు. ముఖ్యంగా శృంగారపరమైన ఆలోచనలు నన్ను కుదురుండనివ్వడం లేదు. దాంతో చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. ఇలా అయితే ఫెయిలైపోతానేమోనని భయంగా ఉంది. ఏం చేయాలి? - వికాస్, మెయిల్ పద్దెనిమిదేళ్ల వయసులో శృంగార పరమైన ఆలోచనలు రాకపోతే తప్పు కానీ వస్తే తప్పులేదు. అయితే చదువు మీద శ్రద్ధ, శృంగారపరమైన ఆలోచనలు... రెండూ భిన్నమైనవి. ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయకూడదు. చానలైజ్ చేయాలి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒకచోట... ‘ఇలాంటి ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తి చిత్రకారుడై, తన కోరికలకి ఒక చానెల్ చూపించి గొప్ప విజయాన్ని సాధించాడు’ అని రాశాడు. కాబట్టి మీరు ఏదైనా ఒక హాబీని అలవర్చుకోండి. సాధారణంగా ఇలాంటి ఆలోచనలు తెల్లవారుజామున లేదా రాత్రిళ్లు వస్తాయి. కాబట్టి మెలకువ రాగానే పక్కమీద నుంచి లేచిపోవడం, సాయంత్రం గేమ్స్‌తో బాగా అలసిపోయి, నిద్ర ముంచుకువచ్చే వరకూ పక్క మీదికి చేరకపోవడం వంటి అలవాట్లు చేసుకోండి. కీప్ యువర్సెల్ఫ్ ఆల్వేజ్ బిజీ. అదొకటే మంత్రం దీన్నుంచి బయట పడటానికి. చదువుకునే వాతావరణాన్ని తగిన విధంగా సృష్టించుకోవడం, పొద్దున్న లేవగానే కాసేపు ప్రార్థన, ఆపై మరికాసేపు యోగా మొదలైన ప్రక్రియల ద్వారా మనసును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. గమ్యంవైపు దృష్టిపెట్టి భవిష్యత్తులో నేనెలాగూ దాన్ని అనుభవించబోతున్నాను కదా అనే ఆశతో చదువు మీద శ్రద్ధ నిలపండి. సినిమాలు తగ్గించండి. ఇంటర్నెట్లో ఇటువంటి సైట్ల జోలికి అస్సలు వెళ్లకండి. తరచూ సెక్స్ గురించి మాట్లాడే ఫ్రెండ్స్‌ని దూరం పెట్టండి. అప్పటికీ మార్పు రాకపోతే మంచి సైకాలజిస్టును సంప్రదించండి. నేను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. బాగా చదువుతాను. కానీ హాస్టల్లో నా రూమ్మేట్ పద్ధతి బాలేదు. ఎప్పుడూ ఫోన్లో గట్టిగట్టిగా మాట్లాడుతుంది. ల్యాప్ టాప్‌లో సినిమాలు చూస్తుంది. ప్రశాంతంగా చదువుకోవడానికి, నిద్రపోవడానికి ఉండట్లేదు. భరించి భరించి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా అని వార్డెన్‌కి చెప్పాను. ఆవిడ మందలించడంతో తను మరీ రెచ్చిపోతోంది. ఇంతకుముందు కంటే ఎక్కువ గొడవ చేస్తోంది. ఆ అమ్మాయిది పెద్ద బ్యాగ్రౌండ్ కావడంతో వార్డెన్ రూమ్ మార్చడం లేదు. నా సమస్య ఎలా తీరుతుంది? - మంజరి, హైదరాబాద్ హాస్టల్లో ఉండే చాలామంది విద్యార్థులకు (ముఖ్యంగా విద్యార్థినులకు) ఇది పెద్ద సమస్య. బాగా చదువుకునే విద్యార్థినులకు ఒక గదిలోను, అల్లరి చిల్లరిగా ఉండేవారిని మరొక గదిలోనూ వేయాలనే స్పృహ వార్డెన్లకు ఉండదు. అయితే వారి సమస్యలు, కారణాలు వారికుంటాయి. మీరింకా మొదటి సంవత్సరమే కాబట్టి నాలుగేళ్ల పాటు ఈ డిస్టర్బెన్స్‌ని భరించడం కష్టం. అందుకే మీ తల్లిదండ్రులని వెళ్లి అధికారులతో కానీ ప్రిన్సిపల్‌తో కానీ మాట్లాడమని చెప్పండి. సమస్య పరిష్కారమవుతుంది. లేదంటే నేరుగా కాలేజీ కరెస్పాండెంట్తోనే మీ పేరెంట్స్‌ని మాట్లాడమని చెప్పండి. అదొక్కదే దీనికి పరిష్కారం. -
వాళ్లు మాటిస్తే...నేను మనువాడాలా?
జీవన గమనం నేనో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిని. ఒక్కడే కొడుకు. వాడు ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లాడి విదేశాలకు వెళ్లిపోయాడు. మొదట్లో ఫోన్ చేసేవాడు. తర్వాత అదీ మానేశాడు. వాణ్ని చూసుకోకుండానే కన్ను మూస్తానేమో అని నా భార్య కుమిలిపోతోంది. తన బాధ చూడలేకున్నాను. ఏం చేయాలి? - వి.శ్రీరామచంద్రమూర్తి, ఏలూరు ప్రేమ హద్దులు దాటితే మోహం అవు తుంది. మోహం ముదిరితే వ్యామోహం. మితిమీరిన వ్యామోహమే తాపత్రయం. అది ఓ అనారోగ్యకరమైన అటాచ్మెంట్. ఏది ఎంతవరకూ కావాలో, ఏది ఎప్పుడు వదులుకోవాలో తెలుసుకోలేకపోవడమే దాని లక్షణం. బంధాన్ని సరైన స్థాయిలో పెంచుకుని, అవసరమైనప్పుడు తెంచుకో గలిగే వారిని విషాదాలు దరి చేరవు. బంధం వల్ల విషాదం వస్తుందని తెలుసు కోవడమే జ్ఞానం. చాలా విషాదాలను మనం కొని తెచ్చుకుంటాం. పెంపుడు కుక్క చనిపోతే భోజనం మానెయ్యడం, భర్త తనతో కాకుండా తన తల్లితో ఎక్కువ చనువుగా ఉంటాడని ఈర్ష్య చెందడం, కొడుకు విదేశం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు పంపలేదని బాధపడటం కూడా బంధాలకి ఉదాహరణే. ప్రేమ వేరు, బంధం వేరు. బాధకి మూలకారణం ప్రేమ కాదు. ఎక్కడైతే బంధం లేని ప్రేమ ఉంటుందో అక్కడ బాధ లేదు. విదేశాల్లో సెటిలైన సంతానం గురించి దుఃఖించే వారు ఒక విషయం పాజిటివ్‌గా ఆలోచిం చాలి. పోటీ ప్రపంచంలో ఇది తప్పదు అన్న ఆలోచనతో పిల్లల్ని రాత్రింబవళ్లు ప్రోత్సహించి చదివించింది మీరే కదా! డబ్బు సంపాదించే యంత్రంగా తయారుచేద్దామని నిద్రాహారాలు మాని పించి, ఆరో క్లాసులోనే ఐఐటీ కోచింగ్ కోసం చేర్చి, వారి బాల్యాన్ని నాశనం చేసి, సరస్వతీదేవి కాళ్లకు పారాణిగా పూశారు. వారు వెళ్తుంటే ‘మా సంతానం అమెరికా’ అని గర్వంగా చెప్పుకున్నారు. జీవితంలో పైకి రావడమంటే అమెరికా వెళ్లి సంపాదించడం అని నమ్మివుంటే ఇంక దుఃఖం దేనికి? వారి జీవితాన్ని ఆర్థికంగా బాగుపరచానన్న సంతోషంతో ఉండండి.‘మనసుండే వారికే తెలుస్తుందా బాధ, మెట్ట వేదాంతులకీ మెటీ రియలిస్టులకీ సెంటిమెంట్లు, బాధలు ఉండవు’ అంటారా? అయితే కోరికను త్యజించమన్న బుద్ధుడి కన్నా గొప్ప వేదాంతి, ఫలితం ఆశించకుండా పని చెయ్యమన్న కృష్ణుడి కన్నా పెద్ద మెటీరియలిస్టు లేరు. ‘బంధాలే ఉండకూడదు’ అని నేను చెప్తున్నాననుకోవద్దు. దుఃఖ కారణమైన బంధాలుండకూడదని చెప్తున్నానంతే. నేనో సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. నాకో మరదలుంది. తనని నాకివ్వాలని మావయ్య ఆలోచన. అమ్మ కూడా మావయ్యకు ఎప్పుడో మాటిచ్చిందట. కానీ నేను మోడ్రన్. పల్లెటూరి అమ్మాయిని చేసుకోవడం నాకిష్టం లేదు. అదే అంటే అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఎలా? - ఆకాశ్, కుకట్పల్లి మీరు మోడ్రనా, మీ మరదలు పల్లెటూరిదా అన్నది పక్కన పెడితే... మేనరికంలో మొదటి తరం సంతానం బాగున్నా, రెండు మూడు తరాలకొచ్చే సరికి ఎక్కడో ఒకచోట దెబ్బ కొడుతుందని పరిశోధకులు తేల్చారు. మీ సంతానానికి ఎంత ప్రమాదమో ఆ తరువాతి వారసు లకి కూడా అంతే ప్రమాదాన్ని కొనితెచ్చిన వారవుతారు. ఆ బాధతో పోలిస్తే ఇప్పుడు కాదనుకుని పడే బాధ చిన్నదే అన్న విషయం మీ పెద్దలకి వివరించండి. ఇంకా వివరాలు కావాలంటే మెండల్ థియరీ ఓసారి చదవండి. నాకు ఇటీవలే పెళ్లయ్యింది. కానీ నేను గతంలో నాతోపాటు పని చేసిన ఓ టీచర్ని ప్రేమించి, అన్ని విధాలుగా దగ్గరయ్యాను. అతడు నన్ను మోసగించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా భర్త ప్రేమ చూస్తుంటే చాలా బాధగా ఉంటోంది. నిజం చెప్పేద్దామా అనిపిస్తోంది. కానీ ఆయన ఎక్కడ దూరమవుతారోనని భయం. ఏం చేయాలి? - ఓ సోదరి, దేవీపట్నం మన దగ్గరివాళ్లు మన పట్ల అమా యకంగా, ఆప్యాయంగా ప్రేమ చూపిస్తూ ఉంటే... గతం తాలూకు గిల్ట్ బాధపెడ్తూ ఉండటం సహజం. కానీ ప్రాక్టికల్‌గా ఆలో చించండి. ఈ విషయం మీవారికి చెబితే ఆయన దాన్ని రెండు విధాలుగా స్వీకరించ వచ్చు. నవ్వేసి, జరిగినదంతా మర్చిపో అనొచ్చు. లేదా మిమ్మల్ని దగ్గరకు తీసు కున్నప్పుడల్లా మీ మాజీ స్నేహితుడు గుర్తొచ్చి బాధపడొచ్చు. సాధారణంగా రెండోదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి లేనిపోని కలతలు తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి! ఈ రోజుల్లో వివాహత్పూర్వ పరిచయాలు లేనివాళ్లు చాలా తక్కువ అంటే విమర్శకులు నామీద దాడి చేయవచ్చు. పరిచయం ఎంతవరకూ వచ్చిందన్నది సమస్య కాదు. మీరీ విషయాన్ని వెల్లడి చేస్తే రాబోయే పరిణామాలే సమస్య. పాత జ్ఞాపకాలని తుడిచి పెట్టేయండి. మనసారా మీ శ్రీవారికి దగ్గరవ్వండి. అదే మీరు మీ భర్తకి చేసే గొప్ప ఉపకారం.