వాళ్లు మాటిస్తే...నేను మనువాడాలా? | Pace of life | Sakshi
Sakshi News home page

వాళ్లు మాటిస్తే...నేను మనువాడాలా?

Published Sun, Feb 7 2016 1:00 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

వాళ్లు మాటిస్తే...నేను మనువాడాలా?

వాళ్లు మాటిస్తే...నేను మనువాడాలా?

  జీవన గమనం
  నేనో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిని. ఒక్కడే కొడుకు. వాడు ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లాడి విదేశాలకు వెళ్లిపోయాడు. మొదట్లో ఫోన్ చేసేవాడు. తర్వాత అదీ మానేశాడు. వాణ్ని చూసుకోకుండానే కన్ను మూస్తానేమో అని నా భార్య కుమిలిపోతోంది. తన బాధ చూడలేకున్నాను. ఏం చేయాలి?
 - వి.శ్రీరామచంద్రమూర్తి, ఏలూరు
 
 ప్రేమ హద్దులు దాటితే మోహం అవు తుంది. మోహం ముదిరితే వ్యామోహం. మితిమీరిన వ్యామోహమే తాపత్రయం. అది ఓ అనారోగ్యకరమైన అటాచ్‌మెంట్. ఏది ఎంతవరకూ కావాలో, ఏది ఎప్పుడు వదులుకోవాలో తెలుసుకోలేకపోవడమే దాని లక్షణం. బంధాన్ని సరైన స్థాయిలో పెంచుకుని, అవసరమైనప్పుడు తెంచుకో గలిగే వారిని విషాదాలు దరి చేరవు. బంధం వల్ల విషాదం వస్తుందని తెలుసు కోవడమే జ్ఞానం. చాలా విషాదాలను మనం కొని తెచ్చుకుంటాం. పెంపుడు కుక్క చనిపోతే భోజనం మానెయ్యడం, భర్త తనతో కాకుండా తన తల్లితో ఎక్కువ చనువుగా ఉంటాడని ఈర్ష్య చెందడం, కొడుకు విదేశం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు పంపలేదని బాధపడటం కూడా బంధాలకి ఉదాహరణే. ప్రేమ వేరు, బంధం వేరు.

బాధకి మూలకారణం ప్రేమ కాదు. ఎక్కడైతే బంధం లేని ప్రేమ ఉంటుందో అక్కడ బాధ లేదు. విదేశాల్లో సెటిలైన సంతానం గురించి దుఃఖించే వారు ఒక విషయం పాజిటివ్‌గా ఆలోచిం చాలి. పోటీ ప్రపంచంలో ఇది తప్పదు అన్న ఆలోచనతో పిల్లల్ని రాత్రింబవళ్లు ప్రోత్సహించి చదివించింది మీరే కదా! డబ్బు సంపాదించే యంత్రంగా తయారుచేద్దామని నిద్రాహారాలు మాని పించి, ఆరో క్లాసులోనే ఐఐటీ కోచింగ్ కోసం చేర్చి, వారి బాల్యాన్ని నాశనం చేసి, సరస్వతీదేవి కాళ్లకు పారాణిగా పూశారు.

 వారు వెళ్తుంటే ‘మా సంతానం అమెరికా’ అని గర్వంగా చెప్పుకున్నారు. జీవితంలో పైకి రావడమంటే అమెరికా వెళ్లి సంపాదించడం అని నమ్మివుంటే ఇంక దుఃఖం దేనికి? వారి జీవితాన్ని ఆర్థికంగా బాగుపరచానన్న సంతోషంతో ఉండండి.‘మనసుండే వారికే తెలుస్తుందా బాధ, మెట్ట వేదాంతులకీ మెటీ రియలిస్టులకీ సెంటిమెంట్లు, బాధలు ఉండవు’ అంటారా? అయితే కోరికను త్యజించమన్న బుద్ధుడి కన్నా గొప్ప వేదాంతి, ఫలితం ఆశించకుండా పని చెయ్యమన్న కృష్ణుడి కన్నా పెద్ద మెటీరియలిస్టు లేరు. ‘బంధాలే ఉండకూడదు’ అని నేను చెప్తున్నాననుకోవద్దు. దుఃఖ కారణమైన బంధాలుండకూడదని చెప్తున్నానంతే.
 
  నేనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. నాకో మరదలుంది. తనని నాకివ్వాలని మావయ్య ఆలోచన. అమ్మ కూడా మావయ్యకు ఎప్పుడో మాటిచ్చిందట. కానీ నేను మోడ్రన్. పల్లెటూరి అమ్మాయిని చేసుకోవడం నాకిష్టం లేదు. అదే అంటే అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఎలా?
 - ఆకాశ్, కుకట్‌పల్లి
 
 మీరు మోడ్రనా, మీ మరదలు పల్లెటూరిదా అన్నది పక్కన పెడితే... మేనరికంలో మొదటి తరం సంతానం బాగున్నా, రెండు మూడు తరాలకొచ్చే సరికి ఎక్కడో ఒకచోట దెబ్బ కొడుతుందని పరిశోధకులు తేల్చారు. మీ సంతానానికి ఎంత ప్రమాదమో ఆ తరువాతి వారసు లకి కూడా అంతే ప్రమాదాన్ని కొనితెచ్చిన వారవుతారు. ఆ బాధతో పోలిస్తే ఇప్పుడు కాదనుకుని పడే బాధ చిన్నదే అన్న విషయం మీ పెద్దలకి వివరించండి. ఇంకా వివరాలు కావాలంటే మెండల్ థియరీ ఓసారి చదవండి.                   
       
  నాకు ఇటీవలే పెళ్లయ్యింది. కానీ నేను గతంలో నాతోపాటు పని చేసిన ఓ టీచర్‌ని ప్రేమించి, అన్ని విధాలుగా దగ్గరయ్యాను. అతడు నన్ను మోసగించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా భర్త ప్రేమ చూస్తుంటే చాలా బాధగా ఉంటోంది. నిజం చెప్పేద్దామా అనిపిస్తోంది. కానీ ఆయన ఎక్కడ దూరమవుతారోనని భయం. ఏం చేయాలి?
 - ఓ సోదరి, దేవీపట్నం
 
 మన దగ్గరివాళ్లు మన పట్ల అమా యకంగా, ఆప్యాయంగా ప్రేమ చూపిస్తూ ఉంటే... గతం తాలూకు గిల్ట్ బాధపెడ్తూ ఉండటం సహజం. కానీ ప్రాక్టికల్‌గా ఆలో చించండి. ఈ విషయం మీవారికి చెబితే ఆయన దాన్ని రెండు విధాలుగా స్వీకరించ వచ్చు. నవ్వేసి, జరిగినదంతా మర్చిపో అనొచ్చు. లేదా మిమ్మల్ని దగ్గరకు తీసు కున్నప్పుడల్లా మీ మాజీ స్నేహితుడు గుర్తొచ్చి బాధపడొచ్చు. సాధారణంగా రెండోదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి లేనిపోని కలతలు తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి! ఈ రోజుల్లో వివాహత్పూర్వ పరిచయాలు లేనివాళ్లు చాలా తక్కువ అంటే విమర్శకులు నామీద దాడి చేయవచ్చు. పరిచయం ఎంతవరకూ వచ్చిందన్నది సమస్య కాదు. మీరీ విషయాన్ని వెల్లడి చేస్తే రాబోయే పరిణామాలే సమస్య. పాత జ్ఞాపకాలని తుడిచి పెట్టేయండి. మనసారా మీ శ్రీవారికి దగ్గరవ్వండి. అదే మీరు మీ భర్తకి చేసే గొప్ప ఉపకారం.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement