నా కన్నా రెండు నెలలు పెద్దది...
జీవన గమనం
నేను బీటెక్ ఫైనలియర్ చదువున్నాను. నా జూనియర్ మీద నాకు చాలా ఇష్టం పెరిగింది. తనని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తోంది. కానీ తనకి చెప్పలేదు. ఎందుకంటే చదువులో జూనియర్ అయినా ఆమె నాకంటే రెండు నెలలు పెద్దది. పైగా వేరే క్యాస్ట్. అయితే మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నాకు వాళ్ల ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. నా ప్రేమ విషయం తెలిస్తే ఆ అనుబంధం పాడవుతుందేమోనని భయంగా ఉంది. నిజానికి నాకు లవ్ అన్నా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నా పెద్దగా ఇష్టం లేదు.
వాటి వల్ల పెద్దల్ని బాధపెట్టినట్టు అవుతుందని భయం. కానీ అనుకోకుండా తనపైన ప్రేమ పెరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? తనతో నా ప్రేమని చెప్పాలా? లేదంటే మా కుటుంబాల స్నేహం కోసం మనసు మార్చుకోవాలా? సలహా ఇవ్వండి.
- సందీప్, ఊరు రాయలేదు
రెండు కుటుంబాలు విడిపోకుండా ఉండటం కోసం మీ త్యాగం... ఒక మంచి బాక్సాఫీస్ చిత్రానికి సరిపోయేలా ఉంది. ‘అక్కడ లేని నల్ల పిల్లిని చీకట్లో వెతకటం’ అన్న సామెత బహుశా ఇక్కడి నుంచే పుట్టి ఉంటుంది. అంచెలంచెలుగా మీ సమస్యను విశ్లేషించుకుంటూ వెళ్దాం. ఒకవైపు ప్రేమ అంటే ఇష్టం లేదని అంటూనే, మరోైవైపు ’ప్రేమిస్తున్నానేమో అ..ని..పి..స్తుం..ది’ అన్నారు. ముందు మీది ప్రేమా? ఆకర్షణా? అన్న విషయం తేల్చుకోండి.
వ్యక్తిని ప్రేమించటం ప్రేమ. ప్రేమ భావాన్ని ప్రేమించటం ఆకర్షణ. ప్రేమలో ఆలోచన, అవగాహన, స్పష్టత, భద్రతభావం ఉంటాయి. ఆకర్షణలో ఆవేశం, ఉద్వేగం, అస్పష్టత, అయోమయం ఉంటాయి. ప్రేమ అనుభూతి కోసం, ఆకర్షణ అనుభవం కోసం..! భవిష్యత్ తెలియటం ప్రేమ. కాలం తెలియకపోవటం ఆకర్షణ. ప్రేమలో రోజు రోజుకి ఎదుటి వారి గురించి ఆలోచన, నమ్మకం పెరుగుతుంది. ఆకర్షణలో రోజురోజుకీ అనుమానం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఈ విధంగా విశ్లేషించుకున్న తర్వాత, ఆ అమ్మాయిని తన అభిప్రాయం అడగండి.
ఆమె, ‘‘అసలు నాకా భావమే లేదు. నువ్వు నా కన్నా చిన్నవాడివి’’ అంటే అసలు గొడవే లేదు. మీకు కూడా వర్ణాంతర వివాహాలు ఇష్టం లేవు కదా. ఒకవేళ ఆ అమ్మాయి యస్సంటే, ఇరువైపుల పెద్దల్ని సంప్రదించండి. వారు కూడా యస్ అంటే సమస్యే లేదు. కాదంటే, పెద్దవారిని ఎదిరించి వెళ్లిపోయి వివాహం చేసుకునేటంత తీవ్రమైనదా, పెద్దల్ని బాధ పెట్టి చేసుకోవడం అవసరమా (ఈ విషయం కూడా మీరే రాశారు) అనేది ఆలోచించుకోండి. మనసులోని అస్పష్టతతో బాధ పడటం కంటే, ఏదో ఒకటి తేల్చేసుకోవటమే మంచిది కదా. పరీక్షలు దగ్గర్లోనే ఉన్నాయి కాబట్టి ముందు చదువు మీద ఏకాగ్రత నిలపండి. పరీక్షలు ఫెయిలయ్యే కుర్రాళ్లని, కాస్త ముందు చూపున్న ఏ అమ్మాయీ ప్రేమించదు.
నా వయసు 21. ఎంసీఏ చేస్తున్నాను. నిజానికి నాకు మీడియా రంగంలోకి వెళ్లాలని ఉంది. కానీ కుటుంబ సమస్యల కారణంగా, త్వరగా సెటిలైతే మంచిదని అందరూ బలవంతపెట్టడంతో ఎంసీఏలో చేరాను. కానీ చదువు ఎక్కడం లేదు. ఆసక్తి కలగడం లేదు. మానేయాలని ఉంది. కానీ మరో మంచి రంగంలో సెటిలైతేనే.. ఇది మానేసినా మావాళ్లు ఏమీ అనరు. పీజీ చేస్తే మీడియాలో సెటిలయ్యే మార్గం ఉంటే చెప్పండి.
- రాజేశ్, విజయనగరం
ఇష్టం లేని చదువుకన్నా నరకం ఇంకొకటి ఉండదు. కానీ మీ వాళ్లు చెప్పింది కూడా నిజమే కదా. మీడియా రంగంలో ఒక స్థాయి వచ్చేవరకూ ఆర్థికంగా నిలదొక్కుకోవటం కష్టం. అన్నిటికన్నా ముందు కొన్ని విషయాల్లో ఒక కచ్చితమైన నిర్ధారణకు రండి. 1. మీరు ఏ మీడియాలో స్థిరపడాలనుకుంటున్నారు? పత్రికా రంగమా? టీవీ ఛానెల్సా? 2. పత్రికా రంగం అయితే తెలుగా? ఇంగ్లీషా? 3. ఆ రచనా రంగంలో మీకు భాషాప్రవేశం ఉందా? లేక కేవలం ఉత్సాహమేనా? 4. టీవీ ఛానెల్స్‌లో అయితే, కెమెరా ముందు ఉండాలనుకుంటున్నారా? రిపోర్టింగ్ సైడా?
మీ అభిరుచి కెమెరా ముందైతే... ఉచ్చారణ, అందం అవసరం. మీ కోరిక రిపోర్టింగ్ అయితే... భాష, అవగాహన అవసరం. ఏ వృత్తిలో రాణించాలన్న, కేవలం ఇష్టమే కాదు. అర్హత, కృషి, నైపుణ్యమూ కావాలి. మొదట అభిరుచిగా ప్రారంభించి వృత్తిగా మార్చుకోండి. తమ వృత్తి చేసుకుంటూ సైడుగా పత్రికా రిపోర్టింగ్ చేస్తున్న ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులు కోకొల్లలు. ఆ విధంగా ముందు ఆర్థికంగా నిలదొక్కుకోండి. మీడియాలో పని చేస్తూనే ప్రైవేటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యవచ్చు కదా. లేదా జర్నలిజం కోర్సులో జాయినవ్వండి.
- యండమూరి వీరేంద్రనాథ్