నచ్చనిది చేయలేను... నచ్చినట్టు బతకలేను... ఎలా? | Yandamuri Veerendranath solutions! | Sakshi
Sakshi News home page

నచ్చనిది చేయలేను... నచ్చినట్టు బతకలేను... ఎలా?

Published Sun, Feb 21 2016 3:03 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

నచ్చనిది చేయలేను... నచ్చినట్టు బతకలేను... ఎలా?

నచ్చనిది చేయలేను... నచ్చినట్టు బతకలేను... ఎలా?

జీవన గమనం
నా వయసు 24. మంచి ఆడిటర్‌ని కావాలని సీఏని ఓ పవిత్రమైన వృత్తిగా భావించి ఎంచు కున్నాను. కానీ ఆర్టికల్‌షిప్ చేస్తున్న సమయంలో ఆ వృత్తిమీద అసహ్యం ఏర్పడింది. 2013లో నేను మా గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యాను. అందులో మద్యం, డబ్బు కూడా భాగమయ్యాయి. మా నాన్న నేను వద్దన్నా వాటిని పంచారు. నిజాయతీగా బతకాలని, వచ్చింది రూపాయి అయినా దాన్ని నీతిగానే సంపాదించాలనేది నా అభిలాష. కానీ చుట్టూ అవినీతే. సేంద్రియ వ్యవసాయం, ఆధ్యాత్మిక అంశాలంటే నాకు చిన్నప్పట్నుంచీ పిచ్చి. కానీ అమ్మానాన్నలకు ఇష్టం లేదు. దర్జాగా బతక మని పోరుతుంటారు. దాంతో నచ్చినట్టు చేయలేకపోతున్నాన్న బాధ నన్ను నలిపే స్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
 - ఓ సోదరుడు

 
ప్రతి మనిషికీ గమ్యం (ఉ॥బాగా చదవడం), కోరిక (ఉ॥సినిమాలు చూడటం) అని రెండు ఉంటాయి. ఆ రెంటికీ తేడా ఎక్కువయ్యే కొద్దీ మనిషి కలత పడతాడు. విజయం అంటే ‘బతుకుతున్న జీవిత విధానం పట్ల పూర్తి సంతృప్తితో ఉండటం’. ఇంతకన్నా గొప్ప నిర్వచనం నాకింతవరకూ దొరకలేదు.
 
మీరు ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు మీ యజమాని అవలం బించే విధానాలు చూసి సీఏ వృత్తిమీద అసహ్యం ఏర్పడి ఉండ వచ్చు. లేదంటే అంత కష్టమైన కోర్సు చదవలేని మీ అశక్తతకి అసహ్యం అని పేరు పెట్టుకుని ఉండ వచ్చు. ఏది నిజమో మీరే మీ మనస్సాక్షిని అడగండి. కేవలం మీకు నచ్చలేదు కాబట్టి సీఏ అనేదే ఒక అపవిత్రమైన వృత్తి అనడం తగదు. నేనూ చార్టెడ్ అకౌం టెంట్‌నే. లంచాలు సంపాదించడానికి ఎన్నో అవకాశాలున్న ప్రభుత్వ ఆర్థిక సంస్థల్లో పదిహేను సంవత్సరాలు పని చేసి, ఇప్పుడు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తు న్నాను.

ఇంతకాలం లంచాలకు దూరం గానే ఉంటూ వచ్చాను. ఎన్ని అవకాశాలు వచ్చినా నయాపైసా స్వీకరించలేదు. కాబట్టి సీఏ అంటే తప్పకుండా లంచంతో కూడిన వృత్తి అనే అభిప్రాయాన్ని మార్చు కోండి. నిజాయతీగా బతకాలి, నీతిగా సంపాదించాలి అన్నదే మీ అభిలాష అయితే కాదన్నది ఎవరు? మీ చుట్టూ అవినీతి కనిపిస్తూ ఉండొచ్చు. కానీ మీరు నిజాయతీగా బతకవచ్చు కదా!
 ఇక మీ అభిరుచుల గురించి.

సేంద్రియ వ్యవసాయం, ఆధ్యాత్మిక విష యాలంటే మీకు అభిరుచి అని రాశారు. మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నంతకాలం వారు తమ అభిప్రాయా లకు అనుగుణంగా బతకమనే మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంటారు. ‘చెరువులో నీళ్లు నచ్చకపోతే బయటకు వచ్చి చచ్చిపో. కానీ జీవితాంతం ఆ నీళ్లలోనే ఈదొద్దు’ అని చేప పిల్లకి సలహా ఇచ్చినట్టు నేను మీకు సలహా ఇవ్వలేను కానీ... వీలైనంత వరకూ వ్యక్తిత్వాన్ని పెంచుకోడానికి ప్రయత్నించండి.

ఎవరి ట్యూన్‌కో నాట్యం చేస్తున్నంతకాలం జీవితం మన చేతుల్లో ఉండదు. జీవి తంలో అన్నిటికన్నా దౌర్భాగ్య కరమైన విషయం తనకు నచ్చినట్టు బతకలేకపోవడం. ముందు ఆర్థిక స్వాతంత్య్రం సంపాదించండి. పరస్పర విరుద్ధమైన అభిరుచులు, కోరికలు పెట్టుకోకుండా ఒకే గమ్యం వైపు సాగండి.
 
నేనొక అమ్మాయిని ప్రేమించాను. నా ప్రేమను తనకు చెప్పినప్పుడు తన గతం చెప్పింది. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతనికి అన్ని రకాలుగానూ దగ్గరయ్యానని, ఇద్దరూ విడిపోయారని చెప్పింది. తన నిజాయతీ కారణంగా నేను తనని యాక్సెప్ట్ చేశాను. కానీ తను ఈ మధ్య సడెన్‌గా మారిపోయింది. నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది, నువ్వు నాకు మంచి స్నేహితుడిగానే ఉండు అంటోంది. కారణం అర్థం కాక ఆరా తీస్తే... తన పాత లవర్‌కి మళ్లీ దగ్గరయ్యిందని తెలిసింది. నేనేం చేయాలి? తను కోరుకున్నట్టు స్నేహితుడిగా ఉండాలా లేక తనతో అన్ని సంబంధాలూ తెంచేసుకుని నా పని నేను చేసుకోవాలా?
 - కె.కె.రెడ్డి, మెయిల్

 
మీరు చెప్పినట్టు మీకు రెండే ఆప్షన్లు. తనతో స్నేహంగా ఉండటం... తనతో సంబంధాలన్నీ తెంచేసుకోవడం. స్నేహితుడిగా ఉండటం వల్ల మీకొచ్చే లాభనష్టాలు బేరీజు వేసుకోండి. ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? లేక కేవలం స్నేహితుడిగానే ఉందామను కుంటున్నారా? సంబంధాలన్నీ తెంచేసు కుంటే మీరు మరింత మనఃస్థిమితంగా ఉంటారేమో ఆలోచించండి. స్నేహితు రాలు ఎవరితో ఉంటోంది, ఎక్కడికి వెళ్తోంది లాంటి ఆరాలు తీయడం, డిటెక్టివ్‌లను పెట్టడం వంటి పత్తేదారు పనులు ఎప్పుడూ మనసులను కలచి వేస్తూ ఉంటాయి.

ఆమెను మీరు వివాహం చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఆమె జీవితం ఆమెది, మీ జీవితం మీది. లేదూ కేవలం ఆమెను స్నేహితురాలిగానే చూసే పక్షంలో... ఆమె జీవితంలో మీరు ఒక చిన్న భాగం మాత్రమే. మిగతా భాగంలో ఎవరుంటే మీకు ఎందుకు? ఈ విధంగా ఆలోచిస్తే మనశ్శాంతి దొరుకుతుంది.
- యండమూరి వీరేంద్రనాథ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement