అందరూ తిడుతున్నారు | Yandamuri Veerendranath solutions | Sakshi
Sakshi News home page

అందరూ తిడుతున్నారు

Published Sun, May 15 2016 12:00 PM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM

అందరూ తిడుతున్నారు - Sakshi

అందరూ తిడుతున్నారు

జీవన గమనం
నేను అబౌ యావరేజ్ స్టూడెంట్‌ని. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. నిజానికి ఫైనలియర్ లో ఉండాలి. కానీ మొదటి సంవత్సరం ప్రిపరేషన్ హాలీడేస్‌లో యాక్సిడెంట్ అవడం వల్ల ఆ సెమిస్టర్ సరిగ్గా రాయలేదు. దాంతో బ్యాక్‌లాగ్స్ ఉండటం వల్ల నన్ను ఫైనలియర్‌కు ప్రమోట్ చేయలేదు.  మాది జాయింట్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఇంట్లో చిన్నవాళ్లందరితోనూ పోల్చి నన్ను తిడుతున్నారు. ఎమ్‌ఎన్‌సీ లో జాబ్ చేయాలన్నది నా గోల్. కానీ అది సాధించగలనన్న కాన్ఫిడెన్స్ నాకిప్పుడు లేదు. నేను నా గోల్ సాధించాలంటే ఏం చేయాలి?
 - శిక్ష, మెయిల్

 
సుదూరంలో ఎక్కడో పెద్ద గోల్స్ పెట్టుకుని, వాటిని సాధించటానికి ప్రయత్నించటం కన్నా, దగ్గర్లో చిన్న గోల్స్ పెట్టుకుని, వాటిని పూర్తి చేసుకుంటూ గమ్యం చేరటం ఉత్తమమైనది. ఎమ్‌ఎన్‌సీ లో ఉద్యోగంలాంటి గొప్ప గమ్యం ఉండటం మంచిదే కానీ, బ్యాక్‌లాగ్స్ ఉన్న వారికి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు రావటం కష్టం. సరే ఆ విషయం పక్కన పెడదాం. మీ యాక్సిడెంటు ఎంత ప్రమాదకరమైంది? రెండేళ్లుగా దాన్నించి బయటపడలేకపోయేటంత తీవ్రమైనదా? లేక మీరు వరుసగా పరీక్షలు ఫెయిల్ అవటానికి దాన్ని ఓ సాకుగా తీసుకుంటున్నారా?

లేకపోతే మీ యాక్సిడెంటు గురించి తెలిసీ, మీ పెద్దలు మిమ్మల్ని ఎందుకు తిడతారు? తన అపజయాలకు కారణాలు వెతుక్కోవటం మనిషి ఓటమికి మొదటి మెట్టు. మనిషి జీవితం ఒక పుస్తకమైతే, దాని ముఖ్య కథాంశం (స్టోరీలైన్) ఆనందం. అప్పుడప్పుడు కొన్ని ట్విస్టులూ, విషాదాలూ ఉంటాయి. అవి లేకపోతే కథలో ఇంటరెస్టే ఉండదు. అయితే అక్కడే ఏడుస్తూనో, భయపడుతూనో ఆగిపోకూడదు. ఏడుపూ, భయమూ ఉన్న పేజీల దగ్గర పుస్తకం చదవటం ఆపెయ్యము కదా. అలా అన్న మాట. ముందు ఏకాగ్రత పెంచుకుని చదువు పూర్తి చేసి, తర్వాత గోల్ గురించి ఆలోచించండి.
 
నేనొక అమ్మాయిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాను. తను సింగర్. మా ఇద్దరి పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ అంతలో ఏమైందో ఏమో నన్ను చేసుకోనని చెప్పేసింది. తన పేరెంట్స్‌తో మాట్లాడి ఓ మ్యూజిక్ డెరైక్టర్‌తో పెళ్లి కుదుర్చుకుంది. నేను తనని టార్చర్ చేస్తున్నందుకే అలా చేశానని అంటోంది. అది నిజం కాదు. అతణ్ని చేసుకోవడానికే తను అలా చెబుతోందని అర్థమైంది. మా విషయాన్ని ఆ మ్యూజిక్ డెరైక్టర్‌తో కూడా చెప్పాను. కానీ అతను తనకవన్నీ అనవసరమన్నాడు. నేనా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను. తను మళ్లీ నన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి?
 - శశి, మెయిల్


ప్రేమించినవారి చేత విదిలించుకోబడ్డామన్న అవమానంకన్నా ఘోరమైన నరకం మరొకటి లేదు..! కానీ బాధపడకండి. మంచి స్నేహితులు మిమ్మల్ని ఎప్పుడూ వదిలెయ్యరు. అలా వదిలేసినవారు మంచి స్నేహితులు కారు. అలాంటివారు మిమ్మల్ని వదిలేసినందుకు అదృష్టవంతులని అనుకోండి. ఒక కుర్రవాడు కౌన్సెలర్ దగ్గరకు వెళ్లాడట. ‘‘ఒక అమ్మాయి నాతో కొంతకాలం స్నేహం చేసి మానేసింది, కలిసినప్పుడు మొహం తిప్పుకుంటుంది. ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడదు. నేను చదువు మీద ఏకాగ్రత నిలపలేకపోతున్నాను.

కనీసం స్నేహంగానైనా బై చెప్పి విడిపోవచ్చుగా..’’ అంటూ తన బాధను చెప్పుకున్నాడు. ‘‘బై చెప్పినప్పుడు, మీలాంటి వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో ఎదుటివారికి తెలియదు. కొందరు లైట్‌గా తీసుకుని ’సర్లే’ అనొచ్చు. మరి కొందరు వివాహ సమయంలో వెళ్లి గొడవ చెయ్యవచ్చు. వివాహం అయ్యాక పాత మెసేజీలు చూపించి బ్లాక్ మెయిల్ చెయ్యవచ్చు. ఇంకా దుర్మార్గులైతే యాసిడ్ పోయొచ్చు’’. అబ్బాయి ఏదో అడగబోయే లోపే, వారి సంగతి వదిలిపెట్టు. నీ విషయం ఆలోచించు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెందుకు వదిలేసింది? నువ్వు నచ్చకో, నీ కన్నా తల్లిదండ్రులు ముఖ్యమనో అనుకోవటం వల్లే కదా మరెవరినో పెళ్లాడింది. నీ ప్రేమ నిజమైనదైతే ఆమె తృప్తిగా ఉండటం కన్నా నీకేమి కావాలి? బాధ దేనికి?
 
‘‘నేను అమ్మాయినై, నా బాయ్‌ఫ్రెండ్ నన్ను వాడుకుని వదిలేసినా ఇలాగే తృప్తిగా ఉండమని సలహా ఇస్తారా?’’ ఉక్రోషంగా అడిగాడు కుర్రాడు.
 ‘‘చెప్పను. అమ్మాయిలకైతే మరోలా చెప్తాను. ఇష్టం తగ్గిపోయో, ఎక్కువ కట్నం వస్తుందనో, తల్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం వల్లనో నిన్ను వదిలేశాడనుకుందాం. అలా ప్రేమలో లాభనష్టాలు బేరీజు వేసుకునేవాడు దూరమైనందుకు సంతోషించాలని చెప్తాను’’ అని నవ్వి, ‘‘మరీ వితండ వాదనలా ఉందా?’’ అని అడిగాడు. ‘‘లేదు. మీరు చెప్పేది అర్థమైంది’’ అన్నాడు కుర్రవాడు.
 
‘ప్రేమ ఒక కళ’ అన్న పుస్తకంలో వ్రాసిన పై ఉదాహరణ మీ విషయంలో సరిగ్గా సరిపోతుంది. తన మంచి భవిష్యత్ కోసం మిమ్మల్ని వదిలేసి, మరో మార్గం చూసుకుంది. అది స్వార్థమే అయ్యుండొచ్చు. కానీ పెళ్లయ్యాక వదిలెయ్యలేదు కదా. ఇక్కడ అమ్మాయిని సపోర్ట్ చెయ్యటం కాదు.

మిమ్మల్ని ఛీ కొట్టి వెళ్లిపోయిన అమ్మాయిని మళ్లీ మీ జీవితంలోకి అహ్వానించాలని ఎలా అనుకుంటున్నారు? ’స్వాభిమానం’ లేదా మీకు? పైగా మీ ప్రేమ విషయం కాబోయే పెళ్లికొడుక్కి చెప్పి ఆ వివాహం చెడగొట్టాలని చూస్తారా? ఇది శాడిజం కాదా? ఇటువంటి మనస్తత్వం ఉంది కాబట్టే మిమ్మల్ని బహుశా ’టార్చరర్ ’ అని ఉంటుంది. ఇక మీ విషయానికొస్తే, జరిగింది మర్చిపోయి, కెరీర్ మీద దృష్టి పెట్టండి. టీ-20 లో ఒక బంతి మిస్ అయితే ఆటగాడు బాధపడుతూ కూర్చోడు. తరువాతి బంతితో ఎలా సిక్సర్ కొట్టాలా అని ఆలోచిస్తాడు. ఈ సూత్రాన్నే జీవితానికీ అన్వయించుకోవాలి.
- యండమూరి వీరేంద్రనాథ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement