సాధారణంగా ఇక కలిసి జీవించడం అసాధ్యం అనుకున్నపుడు మాత్రమే భార్యభర్తలు విడిపోయేందుకు నిర్ణయం తీసుకుంటారు. ఎపుడైనా, ఎక్కడైనా తారసపడినా కూడా ఒకర్నొకరు పట్టించుకోరు. అంటీ ముట్టనట్టే ఉంటారు. కనీసం పలకరించు కోరు కూడా (అయితే భార్యభర్తలుగా విడిపోయిన తరువాత కూడా, హుందాగా, స్నేహంగా ఉంటున్నజంటలు కూడా చాలానే ఉన్నాయి). కానీ విడాకులు తీసుకున్న పుష్కరకాలం తరువాత కలిసి మళ్లీ ఒక్కటయ్యారు. యూపీలోని రాంపూర్‌లో ఈ ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది.
యూపీలోని ఇమ్రతా గ్రామానికి చెందిన అధికారి అలీకి రాంపూర్‌కు చెందిన అమ్మాయితో 2004లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు పుట్టారు. అయితే వీరి మధ్య తలెత్తిన విబేధాలు తారా స్థాయికి చేరడంతో పెళ్లయిన 8 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. అమ్మాయి తల్లి వద్ద, కొడుకులిద్దరూ తండ్రి వద్ద పెరుగుతున్నారు. ఇద్దరూ మరో పెళ్లి చేసుకోకుండా, పిల్లలే ప్రాణంగా జీవితాన్ని సాగిస్తున్నారు.
అయితే దాదాపు 12 ఏళ్ల తరువాత, ఒక పెళ్లి వేడుక వారి జీవితాన్నే మార్చేసింది. ఈ పెళ్లిలో అనుకోకుండా ఒకరినొకరు ముఖాముఖి కలుసు కున్నారు. అలీ, అతని భార్య ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో తెలియని భావోద్వేగానికి లోనయ్యారు. భర్త కళ్లలో నుంచి నీళ్లు కారడం చూసిన భార్య కూడా చలించిపోయింది. తర్వాత ఇద్దరూ మాట కలిపారు. ఒకరి నంబర్లు మరొకరు తీసుకుని ఫోన్‌లో మాట్లాడుకోవడంమొదలెట్టారు. ఒకరి బాధల్ని మరొకరు మనస్ఫూర్తిగా పంచుకున్నారు.
తమ మధ్య ప్రేమ పదిలంగాగానే ఉందని, క్షణికావేశంతో వేసిన అడుగు తప్పని తొందర పడ్డామని పశ్చాత్తాపపడి మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఒక శుభముహూర్తాన ఇద్దరూ పెళ్లితో మళ్లీ ఒక్కటయ్యారు. అంతే కాదు ‘స్వీట్ ఫ్యామిలీ’ అనుకుంటూ ఉత్తరాఖండ్ పర్యటనకు చెక్కేసారు.
Comments
Please login to add a commentAdd a comment