
న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ
మామిడికుదురు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించి, ఇప్పుడు పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదంటూ మొహం చాటేసిన వ్యక్తితో తనకు పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట నిరసన చేపట్టింది. ఈ ఘటన మంగళవారం పాశర్లపూడిబాడవ చింతలమెరకలో చోటు చేసుకుంది. కాట్రేనికోన మండలం చెయ్యేరు పండువారిపేటకు చెందిన గుంట్రు ప్రమీల (25) కాకినాడలో నర్సింగ్ చదువుతోంది.
పాశర్లపూడిబాడవ చింతలమెరకకు చెందిన అంబాజీపేట ఎంఈఓ–2 మోకా ప్రకాష్ తనయుడు మోకా ప్రవర్ష తనను ప్రేమించాడని ప్రమీల పేర్కొంది. నాలుగేళ్ల నుంచి ఇద్దరం ప్రేమించుకున్నామని, తమ మధ్య ప్రేమ విషయం అతని ఇంట్లో అందరికీ తెలుసని చెప్పారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటానని తనను నమ్మించాడని యువతి వివరించారు. ఈ విషయంపై రెండు, మూడు పర్యాయాలు పెద్దల సమక్షంలో చర్చలు కూడా జరిగాయని పేర్కొన్నారు.
రెండు నెలల నుంచి ప్రవర్ష తనకు అందుబాటులో లేకపోవడంతో గత నెల చివరి వారంలో కాట్రేనికోన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. ప్రవర్ష తండ్రి ఎంఈఓ మోకా ప్రకాష్ పోలీసుల సమక్షంలో పెళ్లికి అంగీకరించారన్నారు. ఈ ఒప్పందం జరిగిన తర్వాత మళ్లీ ప్రవర్షను కుటుంబ సభ్యులు కట్టడి చేశారని ఆమె ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందని, అతనితో తనకు పెళ్లి చేయాలని, లేదంటే తాను పెట్రోలు పోసుకుని అతని ఇంటి ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రమీల హెచ్చరించారు. ప్రహర్ష ఇంటి ఎదుట తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో ఆందోళన చేపట్టారు.
నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ అక్కడకు చేరుకుని యువతికి, ఆమె కుటుంబ సభ్యులకు సర్ది చెప్పారు. యువకుడిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పెళ్లి విషయం పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. ఈ దశలో ప్రమీల మద్దతుదారులు, ప్రహర్ష మద్దతుదారుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఎస్సై చైతన్యకుమార్ రెండు వర్గాలను సముదాయించారు. మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెద్దలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని, నిరసన విరమించాలని కోరారు. సుదీర్ఘ మంతనాల అనంతరం యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, మద్దతుదారులు నిరసనను విరమించి అక్కడి నుంచి వెళ్లి పోయారు.
Comments
Please login to add a commentAdd a comment