
‘అలాంటప్పుడు నా స్టార్ డమ్ కూడా వేస్టే’
భోపాల్: తన స్టార్ డమ్‌ను ఉపయోగించుకొని చిన్నారులకు, దేశానికి మంచి చేస్తానని ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా చెప్పారు. అలా చేయాలేనప్పుడు స్టార్ డమ్ ఉన్నా కూడా పనికి రానిట్లేనని అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే పిల్లలతోనే సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. చాలాసార్లు పిల్లలే దేశ భవిష్యత్తు అని చెబుతామని, ఆ మేరకే వారిని ఇప్పటి నుంచే తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కోరారు. పిల్లలు అందించే సేవలను తప్పక గుర్తించాలని, లెక్కలోకి తీసుకోవాలని అన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ యూనిసెఫ్‌కు సెలబ్రిటీ అడ్వకేట్‌గా కూడా పనిచేస్తున్న ఆమె ఇక్కడ జరుగుతున్న యూనిసెఫ్ 70వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ మాటలు అన్నారు. పిల్లల అవసరాలను తీర్చలేనప్పుడు, వారిని తీర్చి దిద్దలేనప్పుడు సమాజంలో ప్రగతిని సాధించడం అనేది కష్టమైన పని అని ఆమె అభిప్రాయపడ్డారు. పిల్లల మంచి కోసం తన స్టార్ డమ్, స్టాటస్ ఉపయోగపడకుండా అది ఉన్నా కూడా పనికిరానిదన్నట్లేనని చెప్పారు. యూనిసెఫ్‌లో భాగస్వామ్యం ఉండటం తన అదృష్టం అన్నారు. పిల్లల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు.