బాలీవుడ్ భామ, హీరోయిన్ అతియా శెట్టి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌లో కొద్ది సినిమాలే చేసినా.. గతేడాది క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో పెళ్లి తర్వాత మరింత ఫేమస్ అయింది. అయితే తాజాగా తన భర్తతో కలిసి ఓ ఛారిటీని స్థాపించింది ముద్దుగుమ్మ. విప్లా ఫౌండేషన్ కోసం నిధులను సేకరించేందుకు 'క్రికెట్ ఫర్ ఎ కాజ్' పేరుతో ఛారిటీని ప్రకటించారు. కాగా... ముంబయిలో సేవ్ ది చిల్డ్రన్ ఇండియాగా పిలువబడే సంస్థను ఆ తర్వాత విప్లా ఫౌండేషన్‌గా మార్చారు. మరికొందరు క్రికెటర్లతో కలిసి ఛారిటీ తరఫున నిధులు సమీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అతియా మాట్లాడుతూ.. 'విప్లా ఫౌండేషన్ నా చిన్నతనంలోనే ఓ ముఖ్యమైన భాగం. నేను స్కూల్ అయిపోయిన తర్వాత చాలా రోజుల పాటు ఇక్కడ పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారితో గడిపేదాన్ని. మేము నిర్వహించే వేలం ద్వారా వినికిడి లోపం, వైకల్యం ఉన్న పిల్లల అవసరాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. విప్లా ఫౌండేషన్‌ను ప్రారంభించిన నాని వారసత్వాన్ని కొనసాగించాలనేదే నా ఆశయం'అని తెలిపారు.
కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..' ఇలాంటి పాఠశాలకు మొదటిసారి రావడం చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. అతియా కుటుంబం భాగమైన ఈ గొప్ప పనికి సహకరించడానికి ఈ పిల్లలే నన్ను ప్రేరేపించారు. వీరికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించడంలో విప్లా ఫౌండేషన్ చేస్తున్న అద్భుతమైన పనికి మద్దతు ఇవ్వడానికి వేలం నిర్వహిస్తున్నాం. నేను నాతోటి క్రికెట్ సోదరులను సంప్రదించినప్పుడు.. వారు తమ విలువైన క్రికెట్ వస్తువులను వేలం ద్వారా వచ్చే డబ్బును విరాళం ఇచ్చేందుకు సహకరించారు. వేలంలో పాల్గొని ప్రత్యేకమైన ఈ పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం మాతో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు.
కాగా.. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ జనవరి 23, 2023న వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అతియా చివరిసారిగా 2019 చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె 2015లో వచ్చిన 'హీరో'లో మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' చిత్రంలోనూ నటించింది.
Comments
Please login to add a commentAdd a comment